Jun2010
ఈదురుగాలి
ప్రకృతికి ఉదయం అంటే ఇష్టమేమో…. ప్రశాంతంగా తనలోని అందాల్ని పలకరిస్తోంది…..మూగ జీవాల్ని పరశీలిస్తోంది…… పచ్చని చెట్లని హెచ్చరిస్తోంది….ఒక్క గంటాగితే తనకు ఇంతటి మౌనం దొరకదనేమో…. కాలాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని దాచుకుంటోంది…… తనివి తీరా అనుభవిస్తోంది….కోయిల తన కుహూ…కుహూ రావాలతో మనుషులు లేచేలోగా మనం మన పనిలో పడదామంటూ తన జాతిని మేల్కొలుపుతోంది. ఒక వేళ మేము ఆహార వేటకు వెళ్ళినపుడు మీకు నడక వస్తే బయటకు రావద్దని తల్లి పక్షులు పిల్ల పక్షులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. ఇలాప్రపంచంతో సంబంధంలేని ఈ మూగ జీవాలు తమ పనిలో తాము నిమగ్నమవుతున్నాయి… వీటికి ఆదివారాలు లేవు…వీటి పనికి సెలవు రోజులుండవు… నిరంతర పోరాటం వీటికి తెలిసిన విద్య… వాతావరణం ఇలావుండగా…
అదే చెట్టు కింద అవే పక్షుల్ని గమనిస్తూ…ఆ మౌనాన్ని అనుభవిస్తూ..కిలకిలరావాలకు స్పందిస్తూ… వాటి క్రమశిక్షణకు ముగ్దురాలవుతూ…చల్లని గాలి అనుభవిస్తూ… పాతకాలపు కుర్చీ ఒకటి వేసుకుని కూర్చుండిపోవటం నిత్యం నీలిమకు అలవాటైనా…ఈరోజెందుకో కొత్తగావుంది…ప్రశాంతంగా వుంది…గుండె తేలికగావుంది…అందుకు కారణం లేకపోలేదు…దాదాపు ముప్ఫైఏళ్ళుగా సంసారం అనే ఒక కూపంలోకి తీసుకువచ్చి… కాపురాన్ని ఒక కాకి గోలగా మార్చినభర్త రాజారావు తనను వదిలి వెళ్ళిపోవడం…అదీ అలా ఇలా కాదు చట్టబద్ధంగా విడాకులనే తెల్ల కాగితాల్ని నింపి మరీ వెళ్ళిపోవడం..ఇపుడు అంతా ప్రశాంతతే…ఉదయం లేచిన వెంటనే కాస్సేపు ఎక్కువ నిద్రపోతే “ఏమంత అలసి పోయావని నీకానిద్ర” అనే వారులేరు…తనకంటే ముందుగా ఆఫీసు టైము అయిపోతుందని టిఫిన్ తింటే…”నువ్వు తినగా మిగిలిన పదార్థాలు నా ముఖాన పడేయటం నీకు అలవాటైపోయింది… అవునులే… అసలు భర్తంటే కాస్తయినా గౌరవం వుంటేగా…” అనే ఎత్తి పొడుపు మాటలు అనేవారు లేరు..ఆఫీసు నుండి ఆలస్యంగా వస్తే “ఎవరితో ఉన్నావు ఇంత సేపు ? వేళకు ఇంటికి రావాలని లేదా ? అవునులే మీవారే నీతి లేని వారు” అంటూ నిరంతరం తన పుట్టింటివారిని వేలెత్తి చూపే వారు లేరు…అలాగని అంతా ప్రశాంతతా…. అంటే అదీ కాదు… ఒంటరితనం…భరించలేనంత ఒంటరితనం… తనకోసం ఎవ్వరూ లేనితనం….!!
“నిత్యం ఈ చెట్టుకింద ఎందుకు కూర్చుంటావే నీలూ…ఏముందని ? కొంపదీసి ఆ చెట్టు ఏమైనా మాట్లాడుతోందా ఏమిటి ? ” అంటూ అక్కడే వున్న చెట్టు మొదట్లో కూర్చుంది… రమణి.
“నువ్వెపుడొచ్చావు రమా….?ఈ చెట్టుతో నా అనుబంధం ఈ రోజుది కాదు.. నేను ఆనందపడినా ఇక్కడే కూర్చునేదాన్ని… ఆవేదన పడినా,వెక్కి వెక్కి ఏడ్చినా కూడా నేను ఇక్కడే కూర్చునేదాన్ని.. నామనసు దీనికి తెలుసు..ఎన్నోసార్లు నా ఆవేదనను పోగొట్టింది….తన గాలి ద్వారా ఓదార్చింది.. తన నిశ్శబ్దం ద్వారా నా బాధల పై చర్చించింది… నన్ను లాలించింది…ప్రతి ఉదయం చూశావా నీలిమా నన్ను నమ్ముకుని ఎన్ని పక్షులున్నాయో…రాత్రి ఆ పక్షుల్ని,తెల్లవారితే వాటికి పుట్టిన పిల్లల్ని లాలిస్తూ కనకపోయినా కన్నతల్లిలా కాపాడుకోవాలి…పాపం వాటికి మాత్రం ఎవరున్నారు? నేను, నా లాంటి వృక్షాలు తప్ప!!అయినా ఎక్కడ్నించి వస్తాయో సర్పాలు పక్షి గుడ్లను తినేస్తాయి… కొందరికి నేను రాల్చే ఆకుల్ని శుభ్రం చేయలేక, నానుండి నా కొమ్మల్ని వేరుచేస్తూ… నన్ను చిత్రహింసలు చేస్తుంటారు.. ఏ నిమిషంలో ఏ విపత్తు వస్తుందో .. ఏ మానవుడికి పైశాచిక ఆలోచన వస్తుందో.. నన్ను నమ్ముకున్న పక్షిపిల్లలు ఎన్ని వుంటాయో.. ఇలా ఎన్నో ఆలోచనలతో నిలబడిన చోటునుండి కదలలేక .. అలాగని భరించలేక నిత్యం యాతన అనుభవిస్తున్నాను.. అంటూ చెబుతున్నట్లు అనిపిస్తుంది రమా…
“అయ్యబాబోయ్ .. ఇంతలా అనిపిస్తుంటే ఆలోచించాల్సిందే .. ఒక చెట్టు నీకిన్ని చెప్పినట్లు అనిపిస్తోందంటే ఆశ్చర్యంగానే వుంది.. నీలూ.. ఎన్నో బాధలు పడ్డావు… కాదనను… నీకు పిల్లలు లేకపోవడం మరో సమస్యగా మారింది .. కానీ .. ఈ రోజు నువ్వు ఎవరికి బందీవి కావు… ఎవ్వరి మాటను వినక్కర్లేదు.. ప్రశాంతంగా వుండూ… నీ ఇష్టమొచ్చినట్లు వుండు .. నీక్కావాల్సింది తిను .. సరేనా .. నువ్విలాగే చెట్టుమాట్లాడుతోంది… పుట్ట మాట్లాడుతోంది… నాకేదో చెబుతున్నట్టుంది… అనడం మొదలుపెట్టవనుకో.. నీకు ఈ ఒంటరితనంలో పిచ్చిపట్టిందని అనుకుని నాలాంటి వాళ్ళు నిన్ను పలకరించడానికి కూడా భయపడతారు…” అంటూ వెళ్ళిపోయింది.
నీలిమకు నవ్వు వచ్చింది.. మనుషులకంటే ఈ చెట్టుపుట్టలే మనతో తెలియని అనుబంధాన్ని పెంచుకుంటాయని చాలామందికి తెలియదు… నిజమే .. నిత్యం మనుషులతో మాట్లాడుతూ నిత్యం సమస్యల్ని తెచ్చుకునే కంటే .. ఇలా ఒంటరిగా వుండటమే అన్ని విధాలా మంచిదని భావించే తనలాంటి వాళ్ళకు ఒంటరితనమే తోడుగా నిలుస్తుంది అనుకుంది.. లోపలికి వచ్చింది. టీవీ ఆన్ లో వుంది ఏదో పుట్టినరోజును పురస్కరించుకుని ఫోనులో కార్యక్రమం వస్తోంది … ఏంటో వాళ్ళ వుద్దశ్యమేమిటో అర్థం కాదు.. ఆ యాంకర్ కు తెలుగు రాదో? తెలుగు వచ్చినా రానట్లు ప్రవర్తిస్తుంటారో అర్థం కాదు.. తెలుగును మాత్రం ఎన్ని విధాల హింసించాలో వాళ్ళకు తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలియదు.. అనుకుని .. అఫీసుకు టైమ్ అవ్వటంతో ఆ పనిలో నిమగ్నమైంది….
“నమస్తే సార్ ”
” ఆ నమస్తే .. బావున్నావా నీలిమా ? ఈ మధ్య చాలా బావున్నట్లున్నావు..” అన్నాడు మేనేజర్ .. వెకిలిగా నవ్వుతూ…
ఇక అతనికి సమాధానంగా ఏమనాలో తెలియక ” ఏదో లేండిసార్ అది చూసే దృష్టిని బట్టి వుంటుంది అనుకుంటాను” అంది నవ్వుతూనే…
అంతలోఎకౌంటెంట్ రాజేష, కంప్యూటర్ ఆపరేటర్ ప్రసాద్ ఇలా ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ ఫ్యూన్ తో సహా పలకరించే తీరు ఒకరకంగా చులకనగా అనిపించింది నీలిమకు.. అదే మాట తన కొలీగ్ శృతితో లంచ్ టైమ్ లో అంది కూడా….
“ఊరుకో నీలిమా.. ఈ లోకం తీరే అంత.. ఆడవారంటే ఏ మాత్రం విలువలేని సమాజం ఇది .. అదీ ఏ కారణంతోనో భర్త నుండి దూరం అయిన నీలాంటి వారంటే మరింత లోకువ అసలేందుకు మనం వారినుండి విడిపోతామో.. మన మనసుల్ని అర్థం చేసుకునేటంత తీరిక, ఓపిక ఎవ్వరికీ అక్కరలేదు .. ప్రపంచంలో తన తల్లి, చెల్లి, భార్య తప్ప అందరూ ఆడవారు పిలిస్తే వచ్చేస్తారని మంచివారు కారని వారి అభిప్రాయం.. ఏం చేద్దాం మనం బతకాలంటే ఉద్యోగాలు కావాలి… ఉద్యోగంలో నిలబడాలంటే ఇలాంటి బాధలు చూసి చూడకుండా వినీవినకుండా ఊరుకోవాలి… అంది..
అంతా విన్న నీలిమా నిజమే అనుకుంది.. తనకు భర్తతో కలిసి వుండాలని వుండదా ? అనుకుంది..మళ్ళీ నిస్సత్తువగా.. నిస్సారంగా ఇంటి దారి పట్టి ఇంటికెళ్ళి ఏం వండుకునే ఓపిక లేక , దారిలోనే టిఫిను కొనుక్కుని బయలుదేరింది…
శృతి జీవితం గురించి ఎంత చక్కగా చెప్పింది? తనకన్నా చిన్నదయినా ఎంత పెద్దరికంగా ప్రవర్తించింది…? తనకు మంచి భర్త , ఇద్దరు పిల్లలు వున్నా ఎంత చక్కగా అర్థం చేసుకుంది? అయినా తనకేం తక్కువయిందని ? శరీరంలో కుళ్ళిపోయిన భాగాన్ని తొలగించినట్లు తనకు నిత్యం ఆవేదన కల్గిస్తున్న భర్తను దూరంగా వుంచింది అంతేగా… అంతమాత్రం తనెందుకు తలొంచుకు బతకాలి? తనకోసం బతకాలి అదీ నవ్వుతూ బతకాలి… అనుకుని నిశ్చింతగా నిద్రపోయింది.
* * * * * * * ఏంటి నీలిమా… ఈ రోజు మరీ ఫ్రెష్ గా కనిపిస్తున్నావు ? ” అన్నాడు ..మేనేజర్ అదే వెకిలి నవ్వుతో..
“మీ ఆవిడ మరీ ముసలిదానిలా కనబడుతుందా సార్..” అంది నవ్వుతూ…
“మరి ఇంత అందమైన దానివి , నీ భర్త ఎందుకు వదిలేసాడో ” ఎద్దేవా చేసాడు.
“ఆ విధంగా చూస్తే మీరు కూడా మీ భార్యను వదిలేసినట్లే .. ఎందుకంటే మీరు ఇంట్లో భార్యను వుంచుకుని ఇలా వేరే ఆడవారిని చూస్తూ అసహ్యమైన మాటలు అంటూ… వారిని మానసికంగా హింసిస్తూ .. వుండటం అంటే మీ భార్యను ఒక విధంగా తప్పనిసరిగా వుంటున్నారే తప్ప అమె పై మీకు ప్రేమ లేనట్లే.. అంది కాస్త కోపంగానే .. నీలిమ
“అంటే నీకు నీ భర్తమీద ప్రేమలేదని ఒప్పుకుంటున్నావనేగా”
“లేదుసార్ .. నేను వ్యక్తిత్వం లేని అతనితో కాపురం చేసే కన్నా ఒంటరిగా ఉండిపోవడమే మేలనే నా అభిప్రాయం..” ప్రపంచం కోసం సర్ధుకునో లేక నటించే అవసరం నాకులేదు.. ఒక్కసారి ఆలోచించండి.. నా స్థానంలో మీ అమ్మ వుండి వుంటే ఇలానే అనేవారా? మానాన్న ఎంత బాధపెట్టాడో మా అమ్మ నాన్నను వదిలేసిందని అనుకునేవారు కాదా? ఏం సార్ .. నేనేం పాపం చేసాను? నాకు నచ్చని జీవితాన్ని నేను కాదనుకున్నాను.. అందులో మీకేంటి అభ్యంతరం ? అంటూ దాదాపు గట్టిగానే ఒక అరగంట సేపు తన బాధను వెళ్ళగక్కింది.. ఆ అరుపులు మాటలు ఆ పక్కనే వున్న రాజేష్ కు, ప్రసాద్ చెవిలో పడనే పడ్డాయి…
“మరి ఇపుడు పవర్స్ అన్నీ నా చేతుల్లో వున్నాయి,… నేను నీ ప్రవర్తన బాగోలేదని పైకి రాస్తే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? అన్నాడు అక్కడున్న పేపర్ వెయిట్ తిప్పుతూ.. నిర్లక్ష్యంగా…
” మీరేం చెయ్యగలరు కేవలం నా ఉద్యోగం పోగొట్టగలరు.. అంతే కానీ నా వ్యక్తిత్వాన్ని కాదు కదా..! ప్రపంచం చాలా విశాలం.. అందరూ మీలాంటివారే వుండరు.. మంచితనం ఇంకా వుంది.. అక్కడే బతకగలను .. బతకడమంటే మీ దృష్టిలో సొంత ఇల్లు , కారు ఖరీదయిన బట్టలు కాదు నా దృష్టిలో ప్రశాంతత.. అయినా మీరేంటి నన్ను తీసేది… నేనే రిజైన్ చేస్తున్నాను అంటూ బేగ్ లో అప్పటికే రాసి పెట్టుకున్న రిజిగ్నేషన్ లెటర్ తీసి అక్కడున్న టేబుల్ మీద పడేసింది కోపంగా..నీలిమ.”సరే…. నీకిష్టంలేకపోతే వెళ్ళిపో.. ఇక్కడ నిన్నెవ్వరూ బతిమిలాడరు.. గుర్తుంచుకో.. అయినా నీలాంటి అందమైన అమ్మాయికి ఉద్యోగం ఎందుకులే… అని పూర్తిగాకుండానే చెంపచెళ్ళుమంటూ … నీలిమ అరచేతి వేళ్ళు సదాశివంను తాకాయి….
ఉలిక్కిపడ్డ మేనేజర్ “నీకెంత ధైర్యం ? అందుకే నీకిలాంటి బతుకు మిగిలింది.. గెటవుట్ ఫ్రం హియర్” అంటూ గట్టిగా అరిచాడు…
“నాకు ఇప్పుడు ఎంతో ప్రశాంతమైన బతుకు వుందిసార్ … మీలాంటి వాళ్ళు భర్తలుగా కాదుకదా మగవారుగా కూడా వుండడానికి అనర్హులు… ప్రతి మగవాడికి తల్లి చాలా ముఖ్యం సార్… బహుశా మీరు అక్కడే ఏదో దెబ్బతిన్నారనిపిస్తుంది.” అంటూ బయటికి దారితీసింది….
అయినా సదరు మేనేజర్ సదా శివం ఒక స్త్రీ ని బయటకు పంపాననే గర్వంతో కాస్సేపు తన గొప్పదనాన్ని తన మాట కాదన్నవారి జీవితాన్ని నామ రూపాలు లేకుండా ఎలా చేస్తాడో లెక్చరిచ్చాడు…అంతా విన్న స్టాఫ్ లో కొందరు తప్పంత నీలిమదే అంటూ … మరికొందరు పాపం నీలిమ అంటూ రెండు విధాలుగా అనుకున్నారు..
* * * * * * *
నీలిమకు దిక్కుతోచలేదు …. ఇదేంటి ఇలా జరిగింది ? అయినా ఎందుకిలా మాట్లాడతారు ఈ మగవాళ్ళు ? ఏం ? నేనేం పాపం చేశానని … ఇలా చులకనగా మాట్లాడతారు ? రేపు వీరి చెల్లికో అక్కకో ఇలాంటి పరిస్థితి వస్తే కూడా వీళ్ళు ఇలానే వుంటారా.. వీళ్ళు మారరా? అనుకుంటూ ఆలోచిస్తూ వుండిపోయింది… ఇంతలో ఎదురుగా ఒక బస్సురావడం..ఒక స్కూలుపాప మీదకు రాబోయేంతలో.. ప్రాణాలకు తెగించి నీలిమ కాపాడటం నిమిషంలో జరిగిపోయింది.. దాంతో ఇద్దరూ హాస్పిటల్ లో చేరారు.. ఒకరోజంతా గడిచే వరకు కోలుకోలేక పోయారు…. ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు… స్నేహితురాలు రమ ఇంట్లో చేర్చింది.. “అనవసరమైన ఆలోచనల్తోఒంటరిగా వుండిపోకు నీలిమా.. ఈ సమాజం అంతే .. వినీ విననట్లు .. చూసీ చూడనట్లు వెళ్ళిపోవాలి అంతే… పోనీలే.. సమయానికి నిన్ను రోడ్డుమీద వుండేలా చేసి ఆ పాపనేవరో బతికించేలా చేసాడు.. వాళ్ళు నీ గురించి అడుగుతుంటే అసలు కలవకుండా ఎందుకొచ్చావు ?” అంది రమ చిరుకోపంతో..
‘ఏదోలే రమా… ఏదో చిన్నపిల్లని సహాయం చేసాను … ఇక వారు రావడం కృతఙ్ఞతలు చెప్పడమంతా అనసరం అనిపిస్తుంది.. నా స్థానంలో ఎవరున్నా కాపాడేవారు.. పాప బాగుంది కదా అంతే చాలు ఎవరి జీవితం ఎలా వుంటుందో ఎవరు నిర్ణయించగలరు అంటూ పడుకున్న తాను కాస్త దిండును గోడకు ఆనించుకుని కూర్చుంది…
ఇక నీలిమను, తన మనస్థితిని మార్చడం తన తరం కాదని ఎప్పటికప్పుడు అనిపిస్తూనే వుంటుంది… రమకు ..అయినా ఎప్పటికప్పుడు మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది….అంతలో .. ఎదురుగా ఆఫీసు స్టాఫ్ అంతా హాస్పిటల్ కు రావడం ఎంతో ఆశ్చర్యమేసింది… వారి మాటల్లో అర్థమైంది ఆ పాప సదా శివం మనవరాలని .. అందరూ ఎంతో అన్నారు.. సదాశివంకు బుద్ధి వస్తుంది ఇప్పటికైనా .. ఆమె విలువేంటో తెలిసి వస్తుందంటూ కొందరు మాట్లాడుకున్నారు.. తెలిసే సాయం చేసుంటుందని కూడా కొందరు మానవాకారాలు అనుకున్నాయి.. ఇవేవి నీలిమను ఆనంద పెట్టలేదు.. సాయంత్రానికల్లా హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యింది….
“నువ్వెన్నయినా చెప్పు నీలూ .. ఆ రాస్కెల్ సదా శివం నీకు కనీసం ధ్యాంక్స్ అయినా చెప్పకపోవడం నాకు నచ్చలేదు..” అంది రమ కోపంగా….
“ఎందుకు చెప్పాలి ధ్యాంక్స్ ..? నీ మాటల్లో అర్థంలేదు రమా.. అసలు ఆ పాప అతని మనవరాలని నాకు తెలియదు… అయినా ఏంటి రమా.. ఎవరో ధ్యాంక్స్ చెబితే నాకేం ఒరుగుతుంది చెప్పు…” అంది నిదానంగా…
“నువ్వూరుకో నీలూ.. నీ ఆలోచనలు నీ మాటలు వ్యతిరెకంగా వుంటాయి.. మనం మనుషులం నీలూ.. ఒకచోట నుండి కృతఙ్ఞతలు మరో చోట నుండి అభినందనలు అందుకుంటాము… అవితప్పదు.. నీ పాటికి నువ్వు ఏవీ వద్దనుకుంటుంటే.. అని రమ పూర్తి చేసే లోపే..
” ఊరుకో రమా.. కృతఙ్ఞతలు అభినందనలు ఎదురు చూస్తే రావు.. అవి వాటంతట అవే రావాలి అంది నవ్వుతూ.. అంతలో..
“మేడమ్….”
“ఎవరూ… గణేష్… నువ్వా .. రా కూర్చో అంటూ అక్కడున్న కుర్చివేసింది…
“బావున్నారా మేడమ్ ..”
” బావున్నాను.. నువ్వు అంతదూరం నుండి వచ్చేవా ? చాలా ధ్యాంక్స్ గణేష్ ” అంది మంచినీళ్ళు అందివ్వమని రమకు చెబుతూ.. నీలిమా..
“మేడమ్ .. సదాశివం సార్ .. మిమ్మల్ని ఉద్యోగంలోకి రమ్మన్నారమ్మా… మీ రిజిగ్నేషన్ లెటర్ తీసుకోలేదట… మీ ఆరోగ్యం బాగయ్యాక వచ్చి చేరమన్నారమ్మా.. అన్నాడు వినయంగా…
” చూడు గణేష … నేను ఎంతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను.. ఈ రోజు ఏదో జరిగిందని మళ్ళీ పిలిచినంతమాత్రాన ఇంత వరకు జరిగింది మరిచిపోయి రావడం నా వల్ల కాదు.. అంటూ తిప్పి పంపింది నీలిమ..
“అదేంటి నీలూ.. ఇలా చేస్తున్నావు … ఇప్పటికైనా అతనికి బుద్దివచ్చి నిన్ను పిలుస్తుంటే…?”
“నాకిష్టం లేదు ” రమా.. అని మాత్రం అనగల్గింది…..
* * * * * * *
ఇప్పుడు నీలిమా స్థానంలో వాసంతి చేరింది.. తాను తనలాగే మేనేజర్ ప్రవర్తన తో ఎంతో బాధపడుతోందని నీలిమకు శృతి ద్వారా తెలిసింది.. తనకు అక్కడ పనిచేయ్యాలని లేదని … నీలిమ ముఖంలో తెలిసీ తెలియని చిరునవ్వు ఒకటి విరిసింది.. ఆ నవ్వులో జీవితాన్ని చదివిన వేదన వుంది. తాను తప్పించుకుంది కానీ,, మరో స్త్రీ అక్కడ బాధపడుతోంది .. అంటే మార్పు ఆ మనిషిలో రాలేదు..
June 26th, 2010 at 2:29 am
the total story is run in first person, what the job of neelima is not stated, the neelima was established as escapist, since she is not facing the problems at office, just given resignation, but where as she given diverse to her husband, what are the forceble reasons pushed her to get diverse is not established in the story. whereas the conversation in between neelima and manager is not in natural, why the manager behaved that much rudelesly with neelima is in artificial, at present what the neelima is doing , how she get liverly hood, without doing job. what the neelima wants to say to the readers living lonely and enjoy the nature. where as in sentense formation, in starting of the story the poetry is seems to be attached to the story. the struggle of the neelima inner side is not exposed strongly by the writer.