Jun2010
ఎండ
రాముడు నందికొట్కూరులో బయల్దేరే సరికి తెల్లారిపోయింది.
అక్కడికీ, కాస్త చీకట్లోనే నిద్ర లేచాడు.
రమణ వాళ్లమ్మ తినడానికి ఏమైనా ఇస్తుందేమో అనుకుని బయటరుగు మీద కూర్చున్నాడు. ఆమె నిదానంగా లేచి, వాళ్ల పిల్లలతో పాటు ఒక గ్లాసు కాఫీ ఇచ్చింది. తినడానికి ఏమీ ఇవ్వదని రాముడికి అర్థమైపోయింది. వాళ్ల కోసం వాళ్లు ఏమైనా చేసుకుంటే, తనకూ కొంచెం పెట్టే వారు. పొద్దున్నే తనకు చేసిపెట్టాలనే ఊహ రమణ వాళ్లమ్మకు రాలేదు. చనువుగా వంటింట్లోకి వెళ్లి అడగడానికి, తను వాళ్ల బంధువు కాదు.
పోగా పెద్ద కులం వాళ్లు. ధనవంతులు.
‘ఇప్పుడు ఊరికి వొయ్యి ఏం జేస్తావు, మద్యాన్నం భోంచేసి, సల్లవన్న్యాక పోదువులె’మ్మని రమణ అనలేదు. అనబోవడం లేదని రాముడికి అర్థమయ్యింది. ‘అయితే, ఇక బయల్దేరుతావా’ అన్నట్లుంది అతడి ప్రవర్తన. ఇంకాసేపుంటే అ మాట అన్నా అనొచ్చు.
ఇదంతా పద్ధానుగేళ్ల రాముడికి అనుభవంలో లేని విషయం. దీనికి తను సిద్ధమై లేడు. ఊరికే అంగలార్చడం కన్న తొందరగా బయల్దేరి ఊరికెళ్లడం మేలు అనుకున్నాడు. ఇంటి బయట బోరింగ్ నీళ్లతో ముఖం కడుక్కుని, చేత్తో తుడుచుకున్నాడు. తడి వేళ్లతో తల దువ్వుకున్నట్లు చేసి బయట పడ్డాడు.
బస్టాండు మీదుగా నడుస్తూ మిడ్తూరు రోడ్డుకు వచ్చేశాడు.
తను తెచ్చుకున్న డబ్బులు రాత్రి నాటకం టికెట్టుకు సరిపోయాయి. జేబులు ఖాళీ. దార్లో ఏమీ తింటానికి లేదు, తాగడానికి లేదు.
రాముడు నిదానంగా నడవసాగాడు. ఎండా కాలం పొద్దుటి గాలి. శరీరం మీద పూలు రాలినట్టుగా వుంది. ఆ హాయికి నిద్ర మత్తు పూర్తిగా పోయింది. రమణా వాళ్ల మీద కోపం కూడా పోయి, మనస్సు తాజాగా తయారయింది. రాత్రి చూసిన పాండవోద్యోగ విజయాలు నాటకం దృశ్యాలు మనస్సులో తిరుగుతున్నాయి. తను అర్జునుని వేషం వేసి ఆఆఆఆఆ అని ఆపకుండా రాగం తీస్తుంటే వాళ్ల నాన్నా, చిన్నాన్న వాళ్లు ‘ఈంది బలె కంట్లం రా’ అని మెచ్చుకుంటున్నట్టు కలలు కంటూ నడుస్తున్నాడు.
రాముడు వాళ్ల ఊరి పేరు గని. అలా చెబితే అక్కడ బొగ్గు గనులో ఇనుప ఖనిజం గనులో ఉంటాయనుకుంటారు. అలాంటివేమీ లేవు. ఊరికి దక్షిణంగా కొండల్లో సుద్ద గనులున్నాయి. సుద్ద అంటే తక్కువ రకం సున్నం. ఆ చుట్టు పక్కల ఊళ్లలో ఇళ్ల గోడలకు వెల్ల వేయడానికి సున్నం బదులు సుద్ద వాడుతారు. ‘మీ ఊరికి అదేం పేరు’ అని ఎవరైనా అడిగితే ఆ సుద్ద గనుల గురించే చెబుతాడు రాముడు. అది తనకు ఎవరో చెప్పిన మాట కాదు. తనే ఊహించాడు. రాముడు మహా ఊహాశాలి. ఊహలు చేయడం, ఊహలు వినడం చాల ఇష్టం తనకు.
వేరే ఊరిలో వున్న బడికి నడిచిపోతూ ఉండగా ఒకసారి రాముడికి భలే ఊహ తట్టింది. నందికొట్కూరు లాంటి పట్నాల్లో ఎలక్ట్రిక్ లైట్లు ఉంటాయి. ‘అవి మా ఊర్లో ఎందుకు లేవు, నేనెందుకు కిర్సనాయిలు బుడ్డి దీపం కాడ సదువుకోవాల’ అని ఆలోచించే వాడు. ఒకసారి బడికి వెళుతున్నప్పుడు, రాముడికి ‘ఎలక్ట్రిసిటీ’ అంటే ‘ఎ లక్ ట్రిక్ ఇన్ సిటీ’ అనే వూహ తట్టింది. అది తనకు చాల గొప్పగా అనిపించింది. ఆ పదం అర్థం అంతకు ముందు ఎవరికీ తెలియకుండా వుండిందనీ, మొదటి సారి తానే కనిపెట్టానని గట్టిగా నమ్మాడు. తను కనిపెట్టిందాన్ని సావాసగాళ్లతో చెబితే వాళ్లు పట్టించుకోలేదు. పదార్థం లేకుండా పదం ఎందుకని అనుకుని వుంటారు. రాముడికి మాత్రం పదాలు, ఊహలు, కథలు అంటే ప్రాణం.
ఊర్లో ఎవరు ఎక్కడ కథ చెబుతున్నా రాముడు పరిగెత్తే వాడు. భిక్షుక గాయకుడు, ‘కత జెప్పే పుల్లన్న’ భుజం మీద పేద్ద తాంబూర మీటుతూ ‘అరెరే బుగుల్ బుగుల్ రంగంపేటా శివారెడ్డిరా సై’ అని కథ చెబుతుంటే, పక్కన ఆయన భార్య డక్కి కొడుతూ ‘ఆహా’, ‘సై సై’ అని వంత పలుకుతుంటే మైమరిచిపోయే వాడు. రాత్రి ఊర్లో ఏ మూలన డక్కి మోగినా రాముడు పుట్టలోంచి సర్రున బయటికొచ్చే పాము మాదిరి, దుప్పటి తన్నేసి, మంచం దూకి పరిగెట్టాల్సిందే. పుల్లన్నకు దగ్గరగా కూర్చుని కథ వింటూ, కథ పూర్తి కాక ముందే నిద్ర పోతే, ఎవరో ఎత్తుకు పోయి, ‘సుబ్బమ్మో, నీ కొడుకు జూడు, కత ఇనుకుంట నిద్రవొయినాడు’ అని తనను తన మంచం మీద పడుకోబెట్టి పోవలిసిందే.
రాముడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వాళ్లూరి నుంచి మరో ఐదు మంది పిల్లలతో కలిసి బాగా పొద్దున్నే బయల్దేరి పది కిలో మీటర్ల దూరాన మరో ఊరిలో హైస్కూలుకు నడిచి పోతాడు. సాయంత్రం పిల్లలంతా గుంపుగానో, బడి ఆలస్యమైతే వేర్వేరుగానో నడిచి ఇంటికి వస్తారు.
రాముడికి నడక అలవాటే. ఇప్పడు కూడా నడవడం గురించి భయపడ్డం లేదు. చల్లని గాలి హాయిగా వుంది. ఇప్పుడిప్పడే కొంచెం అకలి వేస్తోంది. పన్నెండు కిలోమీటర్లు నడిస్తే తన వూరొస్తుంది. అంతవరకు ఆకలి గురించి ఆలోచించ దల్చుకోలేదు.
“యా ఊరు సిన్నా, ఒంటిగ వోతొండావూ” అంది, నందికొట్కూరులో అమ్ముకోడానికి కట్టెల మోపు మోసుకుపోతున్న పేదరాలెవరో, కళ్ల నిండా దయతో, రోడ్డుకు అటువైపు నుంచి.
రాముడు బిడియంగా తన ఊరి పేరు గొణిగాడు.
“వాయమ్మో, శాన దూరం గద నాయ్నా, ఇంకొంచెం సేపుంటే ఎండ నెత్తి మీదికొచ్చాది. మిడ్తూరు కాడ ఎవుర్తోనన్న సెంబెడు నీల్లిప్పిచ్చుకోని తాగి, సెట్టు కింద కూకో. మల్ల, సల్ల వన్న్యాక పో” అని సలహా ఇచ్చి ఆమె వెళ్లిపోయింది. రాముడికి ఆ వుద్దేశం లేదు. ఊర్నేతల వూపి ముందుకు నడిచాడు.
రమణ ప్రోద్బలం లేకపోతే రాముడు నిన్న నందికొట్కూరుకు వచ్చే వాడు కాదు. ఇప్పుడు ఈ నడక అవసరమూ వుండేది కాదు.
రమణ వాళ్ల నాన్న పేరు పెద్దింటి కృష్ణమూర్తి. వాళ్లది గని గ్రామమే. పేరుకు తగ్గట్టు కాస్త ఉన్నోళ్లే. వాళ్లింటికి ఒక గేటు, గోడ మీద పాకిన బోగెన్‍విల్లా చెట్టు చాల బాగుంటాయి. కృష్ణమూర్తికి నలుగురు ఆడపిల్లల మధ్యన ఒక్కడే కొడుకు, రమణ. చిన్నప్పట్నించీ గారాబంగా పెరిగాడు. రమణతో రాముడుకి చిన్న నాటి నుంచీ సావాసం. వట్టి సావాసం కాదు. ఆరాధన.
రమణ వాళ్లింట్లో ఎప్పుడూ సందడి సందడిగా వుండేది. రమణతో, అతని నలుగురు అక్కచెల్లెళ్లతో ఆడుకోడం రాముడికి చాల ఇష్టమయ్యేది. చాల ఎక్కువగా నాటకం ఆట అడుకునే వాళ్లు. మందం అట్టలను వెడల్పు త్రిభుజాకారంలో కత్తిరించే వారు. అటు ఇటు కొసలకు దారమో తాడో ముడేసే వారు. వాటిని నెత్తికి కట్టుకుంటే అచ్చం కిరీటాల్లా వుండేవి. రంగు కాగితాలు, తగరం ముక్కలు అంటిస్తే ఇంకా బాగుండేవి. ముఖాలకు పౌడర్ దట్టంగా రాసుకునే వారు. నువ్వు రాజు అంటే నువ్వు రాజకుమారి అని పేర్లు పెట్టుకునే వారు. నాటకం చాల సీరియస్ గా నడిచేది. తనకు ఎప్పుడూ చెలికాడు, ద్వార పాలకుడు వేషాలే. కిరీటమూ లేదు, పౌడరు లేదు. తనకు కాస్త బాధేసినా బయట పడే వాడు కాదు. ఆటలోకి రానివ్వరని భయం.
కృష్ణమూర్తి వాళ్లకు నందికొట్కూరులో, కర్నూల్లో చుట్టాలు వుండే వారు. చుట్టాలిండ్లకు వెళ్లినప్పుడు రమణ సినిమాలు చూసే వాడు. సాయంత్రాలు మద్దిలేటి వాగు ఇసుకలో ఆ సినిమా కథలు భలే బాగా చెప్పే వాడు. పిల్లలు పొద్దు మునిగి, చీకటి పరుచుకోడం కూడా గమనించకుండా వినే వాళ్లు. రాముడు కథ వింటూ సినిమా దృశ్యాలు ఊహించుకునే వాడు. పాడువడిన కోట, దానిలో సాలె గూళ్లు, ఆడపిల్ల రూపంలో కారుకు అడ్డం వచ్చిన దయ్యం, రాజకుమారుడు పేద్ద గాలి పటం పట్టుకుని గాల్లో ఎగురుతూ పోవడం… అన్నీ రాముని కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేవి. సినిమా కథ చెప్పే రమణ తనకు చాల గొప్పవాడిలా కనిపించేవాడు.
అంతే కాదు. రమణ ఎప్పుడూ మంచి మంచి చొక్కాలు, రాముడు ఎప్పుడు చూడని ఫాషన్లవి, వేసుకునే వాడు. బడికి వెళ్లేటప్పుడు, మద్దిలేటి వాగు ఇసుక ఆటల్లో తను ఎప్పుడూ రమణ జట్టే. తనే కాదు చాల మంది వేరే పిల్లలు కూడా అంతే. రమణ ఎంత చెబితే అంత. రమణ లాగే, కాస్త ఉన్నోళ్ల పిల్లలు, పట్నంలో చుట్టాలున్నోళ్లు ఇంకా ఒకరిద్దరు ఉండే వారు. వాళ్ల మధ్య ఎన్టీవోడు గొప్పనా నాగేశ్వర్రావా అని అప్పుడప్పుడు కొట్లాటలయ్యేవి. రాముడు ఎప్పుడూ రమణనే సమర్థించే వాడు. రమణ అంటే తనకు గట్టి అభిమానం. ఆరాధన. క్లాసు లీడర్ మాదిరిగా, ఊరిలో ఎప్పుడూ పది మందిని వెంటేసుకుని తిరిగే గ్రామ ప్రసిడెంటు రేగటి పుల్లా రెడ్డి మాదిరిగానే రమణ తన లీడర్.
మూడేండ్ల కిందట, రమణ వాళ్ల నాన్న మరెవరితోనో కలిసి నందికొట్కూరులో ఒక వేరుశనగ నూనె మిల్లు పెట్టాడు. తొందర్లోనే వాళ్లు నందికొట్కూరుకు వెళ్లిపోయారు. గని గ్రామంలో పొలాల గుత్త డబ్బులు తీసుకుపోవడానికి, బంధువులను చూసిపోవడానికి బాగానే వచ్చే వాళ్లు. అలా వచ్చినప్పుడు రమణ కొత్త కొత్త సినిమాల కబుర్లు చెప్పే వాడు. రాజకీయాలు మాట్లాడే వాడు. తను తొందర్లోనే మద్రాసు వెళ్లి, సినిమాల్లో వేషాలు వేస్తానని తోటి పిల్లలకు చెప్పేవాడు. లేదా రాజకీయాల్లో చేరి ఏ ఎమ్మెల్యేనో అయిపోతాననే వాడు. రాముడు, మిగతా పిల్లలు చెవులు బోడగించి వినే వాళ్లు.
మొన్న ఎవరో చెప్పారు రమణ ఊరికి వచ్చాడని. రాముడికి ఎట్టాగూ బడి లేదు. తొమ్మిదో తరగతి పరీక్షలు అయిపోయాయి. ఎండా కాలం సెలవులు. పరిగేట్టుకు వెళ్లాడు. చాల సేపు కబుర్లు చెప్పుకున్నారు. “రేపు నందికొట్కూరులో పాండవోద్యోగ విజయాలు డ్రామా” అన్నాడు రమణ. “పెద్ద పెద్దోల్లు వచ్చొండారు. కత శాన బాగుంటాది. పద్యాలు బలె పాడుతార్లె” అన్నాడు. శాంపిల్ గా ‘అలుగుటయే యెరుంగని మహా మహితాత్ముడజాత శతృవే అలిగిన నాడు….’ అని రాగం తీసి వినిపించాడు.
తనకు రమణతో పాటు డ్రామా చూడాలని ఉన్నా, ఏంచేస్తాం అన్నట్టు దిగులుగా ఉండిపోయాడు.
“నేను నందికొట్కూరు కాన్నుంచి సైకిలు మింద వచ్చినా. నా సైకిలు మింద పోదాం. మీ నాయిన్నడిగి టిక్కెట్టుకు దుడ్లు దెచ్చుకో” అన్నాడు రమణ. “వచ్చెటప్పుడు నడ్సిరావొచ్చు. మీ బడి కన్న దగ్గెర” అని రెట్టించాడు.
రాముడు వాళ్లమ్మను అడిగి రెండు రూపాయలు సంపాదించాడు. ఇద్దరూ సాయంత్రం సైకిలు మీద బయల్దేరారు. తనకు సైకిలింగ్ రాదు. మామూలుగా వెనుక సీటు మీద అడ్డంగా కూర్చోబోయాడు. “అట్ట గాదు, రెండు పక్కల కాల్లేసి కూర్చో. పెడల్ మీద , నా కాల్ల పక్కన్నె కాల్లు పెట్టి తొక్కు. దీన్ని డబుల్ పెడల్ అంటారు” అని వివరించాడు. ‘డబుల్ పెడల్’, కొత్త పదం, బాగుందనిపించింది.
రాముడు సీటు వెనుక రింగుల కడ్డీలు పట్టుకుని రమణతో పాటు పెడల్ తొక్కుతుంటే సైకిలు రయ్ మని దూసుకుపోయింది. ఒక కిలో మీటరు పోయే సరికి రాముడుకి బరువు అనిపించింది.
రమణ కాళ్లైతే పెడల్ మీద ఉన్నాయి గాని, తను తొక్కడం లేదు. పోగా, సైకిలు వేగం తగ్గితే కోప్పడుతున్నాడు.
తను ఏమంటాడు? రమణ మీద తనకున్న అరాధన భావం మాట్లాడనీయదు. ‘డబుల్ పెడల్’ అనే మాటే తనకు కొత్త. కాళ్లు నొప్పెడుతుంటే, ‘హాండిల్ పట్టుకుని సైకిల్ నడిపిస్తూ తనతో పాటు పెడల్ తొక్కడం కష్టంలే’ అని సర్ది చెప్పుకున్నాడు.
నందికొట్కూరులో రమణ వాళ్లిల్లు చేరే సరికి చీకటి పడింది. అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది. రమణ డ్రామా చూడ్డానికి రావడం లేదు. తను చాల సార్లు చూసినాడంట. ఎనిమిది గంటలప్పుడు రమణ వాళ్లమ్మ ఇంట్లో పిల్లలకు భోజనం పెడుతూ తనను బయటరుగు మీద విస్తరాకు వేసి అన్నం పెట్టింది.
రాముడు వెళ్లే సరికి నాటకం ఇంకా మొదలు కాలేదు. మయసభ దుర్యోధనుని ఏక పాత్రాభినయం చేయడానికి వచ్చిన సినిమా నటుడు ధూళిపాళ బయట కూర్చుని వుంటే, అందరితో పాటు తనూ వెళ్లి చూశాడు. వేషం కోసం మీసాలు, కన్బొమలు తీసేసి కొంచెం చిత్రంగా, చాల అందంగా కనిపించాడాయన.
రాముడు తడికల కిటికీ దగ్గర టిక్కెట్టు తీసుకుని లోపలికి వెళ్లాడు. రెండు రూపాయలకు బెంచి టిక్కెట్టు. అక్కడ బెంచీలు ఏమీ లేవు. ఐదారు వరుసలుగా పొడుగ్గా గుంతలు తవ్వారు. గుంత గట్టు మీద కూర్చుని కాళ్లు కిందికి విడుచుకోవాలి. అదే బెంచీ. చాల సేపు గాలికి కదిలే రంగుల తెర చూస్తూ కూర్చున్నాడు. తెర వెనుక నుంచి ‘పరాబ్రహ్మ పరమేశ్వర…’ అని ప్రార్థన వినిపించడంతో ఎక్కడ లేని ఉత్సాహం.
నాటకం చాల బాగుంది. సీన్ల మధ్యలో ఆడవాళ్ల డాన్సులు రాముడికి పెద్దగా నచ్చ లేదు. కృష్ణుడు, ధర్మరాజు, అర్జునుడు మాటలు చెబుతూ, పద్యాలు పాడుతుంటే రాముడి మనసు ఎటో వెళ్లిపోయింది. నాటకం దాదాపు తెల్లారు ఝాము దాకా నడిచింది. చివర్లో నిద్రకు తట్టుకోలేక, కూర్చునే నిద్ర పోయాడు. ఎవరో భుజం తడితే లేచి, కలలో నడుస్తున్నట్టు ఇల్లు చేరి, బయటరుగు మీద చాప పరుచుకుని వాలిపోయాడు.
రాత్రి నిద్ర లేకపోయినా, నడవడం మొదట బాధగా అనిపించ లేదు మొదట. పొద్దెక్కే కొద్దీ అలసట తెలిసి వస్తోంది. ఎండ చుర్రుమంటోంది.
రోడ్డు మీద గడివేముల నుంచి నందికొట్కూరు వెళ్లే బస్సు ఎదురయ్యింది. రాముడు రోడ్డు దిగి పక్కకు నడిచాడు. నందికొట్కూరు నుంచి వాళ్ల ఊరికి నేరుగా బస్సు లేదు. గడివేములకు వెళ్లి అక్కడి నుంచి కర్నూలుకి పోయే బస్సు పట్టుకుని, చుట్టు తిరిగి ఊరు చేరాలి. అలా చేద్దామన్నా ఇప్పుడు రాముడి దగ్గర డబ్బుల్లేవు. రోడ్డు వదిలేసి కుడి వేపు బండ్ల రస్తాలోకి తిరిగాడు. ఫారం కంప చెట్ల మధ్య బండ్ల బాటలో నడుస్తూ, మిడ్తూరు లోకి నడిచాడు.
ఊరి మధ్య దేవాలయం దగ్గర చింత చెట్టు అరుగు మీద ఐదారు కోతులు ఆడుకుంటున్నాయి. ఒక తల్లి కోతి తన పాపాయి తలను ఒళ్లో పెట్టుకుని పేలు చూస్తోంది. పక్కన హోటల్లో ఇద్దరు మనుషులు కూర్చుని కాఫీ తాగుతున్నారు. తన జేబులో ఒక అర్ధణా కూడా లేదు. ఏం తినకుండా, తాగకుండా నీళ్లు అడిగితే ఏమనుకుంటారో, దార్లో కాశిపేట వాగులో తాగొచ్చులే అనుకుని కోతుల వైపు చూస్తూ ముందుకు నడిచాడు.
మిడ్తూరు దాటే సరికి బాగా ఎండ పడింది. నడక వేగం తగ్గింది. కొద్ది కొద్దిగా చెమట పడుతోంది. చేత్తో ముఖం తుడుచుకున్నాడు. కాళ్లు కాలుతున్నాయి. చెప్పుల్లేని కాళ్లు. వాళ్ల ఊర్లో బాగా వున్నోళ్ల ఇళ్లలో తప్ప ఎవరూ చెప్పులు వేసుకోరు. పెద్దవాళ్లు కూడా చేలకు వెళ్లినప్పుడు మాత్రమే ఊరిలో కుట్టించుకున్న ముతక చెప్పులు వేసుకుంటారు; చేలల్లో జొన్న కొయ్యకాళ్లు, ముళ్లు విరిగితే పని భంగమవుతుందని.
రాను రాను ఎండ ముదురుతోంది. రాముడు ఒకటి రెండు సార్లు అంగీ పైకెత్తి ముఖం తుడుచుకున్నాడు. అ తరువాత అది కూడా మానేశాడు. ఎలాగూ కాసేపట్లో తిరిగి చెమట పడుతుంది. చెమట వల్ల కొంచెం చల్లగా ఉంటుంది కూడా.
రాముడికి మొదటి సారి తన మీద తనకు జాలేసింది. జుట్టు సర్దుకోడానికి చెయ్యి పెడితే, తల మీద వేడిగా అనిపించింది. ఎండ నేరుగా నెత్తి మీద పడుతుండడం గమనించాడు. చేయగలిగిందేమీ లేదు. తల మీద కప్పుకోడానికి ఏమీ లేదు. ఎండకు నెత్తి మాడడం అంటే ఇదేనా అనుకున్నాడు. కొత్త సంగతి తెలిసిందనే ఊహ ఒక్క క్షణం గిలిగింతలు పెట్టింది.
అది ఊహ కాదు. నిజంగానే నెత్తి మాడిపోతోంది. ఎంత నడిచినా దారి తరగడం లేదు. ఆకలి వేస్తోంది. బాగా దప్పికేస్తోంది. దారిలో చెట్లు ఎక్కువగా లేవు. ఒకటి రెండు చిన్న చిన్న చెట్లు కనిపించాయి. వాటి మొదళ్ల దగ్గర కొంచెం నీడ. కూర్చుందామా అనుకున్నాడు. కూర్చుంటే దప్పిక తీరేదెలా? బలవంతంగా నడవ సాగాడు.
దగ్గర్లో ఏదో వాగు కనిపించింది. కడుపు నిండా నీళ్లు తాగొచ్చు అని సంతోషం వేసింది. అంతలోనే ఆశ ఆవిరైపోయింది. ఇప్పుడు కాదు, ఆ వాగు చాల సేపటి నుంచి కనిపిస్తోంది. దగ్గర్లో ఉన్నట్టనిపిస్తోంది. ఎంత నడిచినా అంతే దూరం. అప్పుడు గుర్తొచ్చింది. అది వాగు కాదు. అవి ఎండ గుర్రాలు. నీళ్ల మాదిరి కనిపిస్తాయి గాని నీళ్లు కావు. వట్టి వేడి గాలి అలలు.
రాముడికి భయమేసింది. తను ఈరోజు ఇంటికి చేరుతాడా? వళ్లు తేలిపోతున్నట్లుంది. నడుస్తూ నిద్రలోకి జారి పోతున్నట్టుగా వుంది. రాత్రి నాటకంలోని మాటలు మెదడులో తిరుగుతున్నాయి. భీముడు రంగు బట్ట కప్పిన కుర్చీ లోంచి లేచి, గద భుజానికి ఎత్తుకుంటూ ‘శాంతి, శాంతించి చిరకాలమైనది’ అంటున్నాడు. అంతవరకు తల కింద చెయ్యి పెట్టుకుని నిద్ర పోతున్న కృష్ణుడు, నోటి మీద చిటిక వేసుకుంటూ లేచి, అర్జునున్ని చూసి ‘బావా ఎప్పుడు వచ్చితీవు…’ అని రాగం తీస్తున్నాడు.
రాముడు ముఖం చేత్తో రుద్దుకుని కళ్లు చికిలించి చూశాడు. దూరంగా ఏవో గోడలు కనిపించాయి. అది కాశిపేట. పాత ఊరు. ఒకప్పుడు ఉండి ఇప్పడు లేని ఊరు. అవన్నీ పడిపోయిన గోడలు. ఇప్పుడు అక్కడ ఊరు లేదని రామునికి తెలుసు. ఎందుకో గాని, నాలుగైదేళ్ల కిందటనే, ఆ ఊరి వాళ్లందరూ ఇక్కడి ఇళ్లు వదిలేసి, దూరంగా మరో ఊరు కట్టుకున్నారు. అక్కడ ఇప్పుడు ఊరు లేదు గాని, అక్కడికి వెళ్లే ముందు ఒక వాగు వస్తుంది. వాగులో కావలిసినన్ని నీళ్లు తాగి పోవచ్చు అనుకున్నాడు.
దగ్గరికి పోతే, అది కూడా అడియాసే అయ్యింది. వాగు ఎండిపోయి ఉంది. అది వానలకు పారే వాగు. ఎండా కాలం ఎండిపోతుంది. ఇట్టాంటప్పుడు జనం బాగా ఎగువకు మైలు దూరం పోయి, లోతు మడుగు ఉండిన చోట చెలిమలు తవ్వి నీళ్లు తెచ్చుకునే వారు. ఇప్పుడు కొత్తూర్లో ఏం చేస్తున్నారో తెలియదు.
రాముడికి తన కథ అయిపోయిందని అర్థమయిపోయింది. వాళ్లమ్మ, నాన్న జ్ఙాపకం వచ్చారు. ఏడుపొచ్చింది. ఇసుకలో కాళ్లీడ్చుకుంటూ ఎండిపోయిన వాగు దాటి ముందుకు నడిచాడు. పాడువడిన ఊరి మొగదల ఒక దర్గా ఉంది. దాని గోడలు కూడా పడిపోయి ఉన్నాయి. దర్గా ముందు, వేపమాను కింద ఒక అరుగు. వేపమాను మీద త్రికోణాకృతిలో ఆకుపచ్చ జెండాలు వేడి గాలికి కొంచెం కొంచెం కదుల్తున్నాయి.
రాముడు జెండా మాను దగ్గరికి వెళ్లి అరుగు మీద ఒరిగిపోయాడు. వేపమాను నీడలో ఉండడం వల్ల అరుగు బండలు రాముడి బుగ్గలకు చల్లగా తగిలాయి. కళ్లు మూతలు పడుతుండగా పడిపోయిన దర్గా గోడల మధ్య ఏదో నీడ కదిలినట్లైంది. ఆ అపస్మారక స్థితిలోనూ రాముడుకి భయంతో కాళ్లు వణికాయి. కళ్లు మరింత గట్టిగా మూసుకుని అరుగు మీద బోర్లా పడుకున్నాడు.
తనను భయపెట్టిన ఆకారాన్ని తెలివిలో ఉండి చూస్తే మరింత భయపడే వాడు. జనం వదిలేసిన ఊరు. పడిపోయిన గోడలు. వాటి మధ్య చిరిగిన బట్టలు, రేగిన జుట్టు, సన్నగా, ఎముకలు తేలినట్లున్న, నల్లని ఆకారం. ఆ ఆకారం దర్గా గోడ నీడల్లో లేచి నిలబడింది. పక్కన కుండ లోంచి ఒక పెద్ద తాబేటి చిప్పలో నీళ్లు పోసుకుని ముందుకు వచ్చింది. అరుగు మీద తాబేటి చిప్పను జాగ్రత్తగా ఉంచి, ఒక బట్ట పేలికను నీళ్లలో తడిపి, అంతే జాగ్రత్తగా పిల్లవాడి ముఖం తుడిచింది.
రాముడు కళ్లు తెరిచి చూశాడు. ఆకారం పెదిమల మీద చిరునవ్వు లాస్యమాడింది.
రాముడు నీళ్లు తాగుదామని తాబేటి చిప్పను తీసుకోబోయాడు. “ఉండు. నిదానం. గొంతు ఎండిపొయ్యింటాది. కొంచెం కొంచెం తాగాల” అన్నాడు ఫకీరు. ఆయన లేచి, దర్గా గోడ నీడలోకి వెళ్లి జొన్న సంకటితో ఉన్న సత్తు గిన్నె పట్టుకొచ్చాడు. ‘మజ్జిగ కలిపినేటిది. బలమొచ్చాది. రెండు ముద్దలు తిను’ అన్నాడు. రాముడుకి ఆ చల్లని చిరునవ్వు చూసే సరికి, ఆయన ఆకారాన్ని చూసినప్పుడు కలిగిన భయమంతా పోయింది. అరుగు మీద సర్దుకుని కూర్చుని మజ్జిగ కలిపిన సంకటి పరమాన్నంలా తిన్నాడు. అంత రుచికరమైన తిండి తాను ఎన్నడూ తిని ఎరగడు. ఫకీరు చెప్పకపోయినా నాలుగయిదు ముద్దలు మింగేశాడు. మధ్య మధ్యలో దేవ గంగా జలంలా, చల్లగా కడుపులోనికి దిగే నీళ్లు.
“యాన్నుంచి వొచ్చొండావు బేటా. ఇంగా నయ్యం. ఎండ సొర గొట్టింటే… మీ అమ్మనాయినకు కరువయి పోదువు…” అన్నాడు ఫకీరు.
రాముడు, తుంపులుగా తుంపులుగా, నిన్న రమణతో సైకిలు ప్రయాణం మొదలు ఈ రోజు బయల్దేరడం వరకు చెప్పాడు. ఆయన అడిగాడని చెప్పడం కాదు. తనకు చెప్పుకోవాలని అనిపించి చెప్పాడు.
“అట్టా ఎనక ముందు సూడకుండ పోడమేనా? మీ అమ్మ నాయ్న అంటే, పేదోల్లు, సదువు సందె లేనోల్లు. సదుకునే పిల్లోనివి, నీకు తెల్దా అనుకోనింటారు. పెద్దింటి స్నేయినితోని పోతొండాడులే… అని ఉర్కోనింటారు. నువ్వన్న సూసుకోవాల గద” అన్నాడాయన.
రమణ అంటే తనకు ఎంత అభిమానమో చెబితే, ఆయన మళ్లీ ప్రేమగా నవ్వాడు.
“నీ సావాసకాడు దురుమార్గుడని నేను అనడం ల్యా లే. తన అవుసరం తను సూసుకున్న్యాడు. తనకు ఆయాసమయితాదని, సైకిలు తొక్కనీకి నిన్ను దీస్కపొయినాడు. డ్రామా అనెతాలకు నువ్వు ఉర్కి పొయినావు. ఆయ్న తన సంగతి తను సూసుకున్న్యాడు. నీ సంగతి నువ్వు జూసుకోవాల. ఇంతే లోకం. పెద్దోల్లైన ఇంతే. పిల్లోల్లైన ఇంతే. ఈన్నైన ఇంతే. యాన్నయినా ఇంతే” అన్నాడు ఫకీరు.
రాముడు దర్గా దగ్గరే ఎండ తగ్గే వరకు ఉండిపోయాడు. చల్లబడిన తరువాత ఫకీరు కూడా తనతో పాటు బయల్దేరాడు, “నాకు యా ఊరైన ఒగటే. ఈ రేత్రికి మీ ఊరు” అంటూ.
ఈ కథ జరిగి సుమారు యాభయ్యేళ్లవుతుంది. ఫకీరు పుణ్యమా అని బతికి బట్ట కట్టిన రాముడికి అంతకంటె పెద్ద ఆనుభవాలెన్నో ఎదురయ్యాయి. ఆ తరువాత తనకు రమణ చాల సార్లు తారసపడ్డాడు. కాకపోతే వేరే వేరే పేర్లతో, వేరే వేరే ముఖాలతో.
రాముడికి ఫకీరు కూడా చాల సార్లు తారసపడ్డాడు, వేరే వేరే పేర్లతో వేరే వేరే ముఖాలతో.
28-3-2010
9652979201 (mobile)
June 8th, 2010 at 7:20 am
ఫకీరిచ్చిన అమృతంలా ఎంత కమ్మగా వుందీ కథ! కవిత్వమే ఆసాంతం!
June 9th, 2010 at 7:28 am
హెచ్చార్కె గారూ, కథ చాలా బాగుంది. చిన్నప్పుడు చూసిన నాటకాలు గుర్తొచ్చాయి. ఎండల్లో నడిచిన రోజులూ గుర్తొచ్చాయి.
June 10th, 2010 at 11:06 pm
HRK,
You shared this story with me several times and I always marvelled at the way you told the story. I felt the same pain while reading it here in print too .. narration is very good and I could hear your voice in these words :). Just glad that there at least a few fakiers in the world for many Ramanas.
Now I need to go drink a glass of water.
June 10th, 2010 at 11:46 pm
అబ్బ!
తెలుగు భాష ఇంత తీయగా ఉంటుందా?
కొత్తగా కథలు రాసేవారు మీలాంటి వారిని చూసి కథలు ఎలా రాయాలో నేర్చుకోవాల్సిన
అవసరమున్నది..
June 11th, 2010 at 12:02 am
you are not establishing any hope or even a open space to hope. everybody knows this society is such a cruel society. a writer should search and bring hopes to the people. this story is good for nothing except its native language.
June 12th, 2010 at 12:39 am
విటల్ రావు గారు,
*కరిగిపోతున్న సైకత శిల్పం*
కథలో ఆశావాదం ఉందా?
June 14th, 2010 at 12:01 am
“రాముడికి ఫకీరు కూడా చాల సార్లు తారసపడ్డాడు, వేరే వేరే పేర్లతో వేరే వేరే ముఖాలతో.”
ఇది ఆశావాదం కాదా?
June 15th, 2010 at 6:59 am
మీ కథ చాల బాగుంది. నన్ను కదిలించింది. ముఖ్యంగా ఈ వాక్యాలు…
** ఆ తరువాత తనకు రమణ చాల సార్లు తారసపడ్డాడు. కాకపోతే వేరే వేరే పేర్లతో, వేరే వేరే ముఖాలతో. రాముడికి ఫకీరు కూడా చాల సార్లు తారసపడ్డాడు, వేరే వేరే పేర్లతో వేరే వేరే ముఖాలతో.**
గొప్పగా ఉంది.
June 18th, 2010 at 4:52 am
చక్కని కథ. చివరి వరకూ చదివింపజేసింది.
June 26th, 2010 at 4:26 am
nice wording, simple sentences, good readability, but its a memory, i think its not a story. it is not containing the symptoms of story i think,
June 30th, 2010 at 12:03 am
కథంతా ఒక యెత్తు. ఆఖరి రెండు వాక్యాలూ ఒక ఎత్తూ! చాలా గొప్ప కథ.
శారద
August 22nd, 2010 at 7:12 am
కథ చాలా చాలా బాగుంది హెచ్చార్కెగారూ, అందరూ అన్నట్లు, కథంతా ఒక ఎత్తు, చివరి రెండు వాక్యాలూ ఒక ఎత్తు.
September 3rd, 2010 at 5:32 pm
meeku e vurla perlanni elaa thelusu?idi katha laaga ledu,paatha jnaapakamu laaga vundi.kaani chaalaa bhaaga raasaaru.pakirlu,ramullu,ramanalu,bireddylu,gouruvenkatareddylu,labbivenkataswamilu ila andaru kalistene jeevithamu.
September 15th, 2010 at 5:03 am
మితృలు అందరికీ కృతజ్ఙతలు. నాకు చాల ఇష్టమైన మార్క్వెజ్ మాటొకటి వుంది. కథల్రాయడానికి వున్న కిటుకులన్నిట్లోకీ గొప్ప కిటుకు నిజం చెప్పడమే అని. మార్క్వెజ్ ‘హండ్రెడ్ ఇయర్స్ అఫ్ సాలిట్యూడ్’ వుండనే వుంది.
‘ఎండ’ కథలో నిజం/అనుభవం వుంది. కాని చాల కల్పన కూడా వుంది. కల్పన నిజం అంచుల మీద నడుస్తుంది. అది కథకు మంచి లక్షణమే అనుకుంటాను. అదీ గాక, నా అనుభవంలో లేని పెయిన్, ప్లెజర్ చెప్పాలంటే భయం. అబద్ధం చెబుతానని.
September 30th, 2010 at 9:07 am
హెచ్చార్కె గారూ.. మీ గురించి నెట్ లొ నె కాస్తా చదివాను. మీరు కొన్ని కథలపై చెసిన విశ్లెషణలను చదివాను. అవి మీ సాహితీ శక్తి పై నమ్మకాన్ని పెంచాయీ. కాని ఈ కథ, కథారచనపై ఎమాత్రం అవగాహన లేని వ్యక్తి రాసినట్టుగా ఉంది. లోకంలొ మంచి, చెడు ఉంటాయనో, లేకపోతే కులం, మతాన్ని బట్టీ మనుషుల్నీ చూడోద్దనొ… ఒక వేళ అది అనుకున్నా… అదీ సరిగ్గా చెప్పలేదు. ఇక మిగిలిన కథంతా … పరమ బోరు. కథాగమనంలో ఆసక్తీ శూన్యం. కథనంలో పుట్టు కొచ్చిన ఏన్నో పాత్రలు పరమార్థం లేనివె. అర్థం, పర్థం లేని వర్ణన. కథకు చదివించె గుణం ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్నీ మరిచారు. మీ పేరు చూసి కథ చదివిన పాపానికి మీకు అభిప్రాయాన్ని మనసు ఉండబట్ట లేక్ చెప్పాల్సీ వచ్చింది.