Jun2010
ఎర్రమన్ను – ముగ్గు పిండి
నాగలకుంట లో తెల్లవారింది.
నరసింహులు సైకిల్ బెల్లు గణగణ లాడిస్తూ వీధిలోకి వచ్చాడు. అప్పటికింకా ఆరు కాలేదు సమయం.
ఎంత బలంగా బెల్లు నొక్కుతున్నా కుడిచేతి బోటనవేలు నొప్పి పెడుతోంది గాని బెల్లు అంతగా మోగడం లేదు. అక్కడక్కడా పిల్లలు బిగ్గరగా పాఠాలు చదువుకుంటున్న చప్పుడు వినిపిస్తోంగ్. దిన పత్రికలు వేసే కుర్రాళ్ళు ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడుతూ రివ్వున దూసుకు వెడుతున్నారు సైకిళ్ళ పైన.
తనూ కదులుతూ వాళ్ళ కొత్త సైకిళ్ళని చూసి, తన సైకిల్ వైపు తేరిపారా చూసుకున్నాడు. సైకిల్ మరీ పాతబడిపోయింది. ముందులాగా వేగంగా, చురుగ్గా తను కదల్లేక పోతున్నాడు. తన సైకిల్ కూడా కదల్లేక పోతోంది. మొన్ననే యాభై రూపాయలు పెట్టి మస్తాన్ సైకిల్ షాప్ లో ఓవర్ ఆయిలింగ్ చేయించాడు. అయినా సైకిల్ మిట్టాల్లో ఇంకా మూలుగుతూనే వుంది.
ఎప్పటికప్పుడు కొత్త సైకిల్ కాకపోయినా, అయిదారు వందలు జమ చేసుకుని, ఈ పాత సైకిల్ ను అమ్మేసి మరో మంచి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనాలనుకున్నాడు. కానీ అదసలు కుదరటమే లేదు.
ఇంట్లో అవసరాలు గుర్తొచ్చాయి. సంవత్సరంగా అనుకుంటున్నాడు. పెద్ద కూతురింటికి ఓ సారి వెళ్ళి ఒక చీర జాకెట్టు పెట్టి రావాలని. పలమనేరు నుండి ఆయమ్మ వుండే అంబూరుకు పోయి రావాలంటే రెండు బస్సులు మారాలంతే. రెండు మూడు గంటలు ప్రయాణమే. అయినా ఉత్త చేతుల్తో పొకూడదని ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూనే ఉన్నాడు. బిడ్డను చూసి రావల్లని రాధమ్మ ఒకటే పోరు పెడతా వుంటే ఆమెకేదో సర్ది చెప్పుకుని నెట్టుకొస్తున్నాడు.
రెండు మూడు వీధులు దాటాడు. మసీదు దగ్గర సైకిల్ ఆపి బన్ను తిని టీ తాగి, అక్కడి నుంచి కదిలాడు. పాతపేట దాటి బెంగుళూరు రోడ్డు కూడా దాటి కొత్తపేటలోకి ప్రవేశించాడు.
“ఎర్రమన్ను అమ్ముతాం, ముగ్గుపిండి అమ్ముతాం… ఎర్రమన్ను, ఎర్ర్రమన్ను ముగ్గుపిండమ్మా… ముగ్గుపిండి ఎర్రమన్ను… ఎర్రెర్రెన్ని ఎర్రమన్ను ముగ్గుపిండి… తెల్లతెల్లని ముగ్గుపిండి…” రాగయుక్తంగా అరచుకుంటూ వీధుల్ని తిరుగుతూ వున్నాడు. సైకిల్ ని తోసుకుని నడుచుకుంటూ…
ముత్తాచారిపాళెం వీధిలో ఒకామె ముగ్గులేయటం ఆపి ఎర్రమన్ను, ముగ్గుపిండి బేరం చేస్తుంటే “మా లక్ష్మీ… ఈ రోజు మంచి బోణి, యాపారం చల్లగా జరిగిపోతుంది.” మనసులోనే ఒకసారి అనుకుని గట్టిగా పైనే అనేసాడు.
ఆయమ్మ నవ్వుకుంటూ వెళ్లి డబ్బు తీసుకొచ్చింది. ఆమె తెచ్చిన చాట లోకి తన సైకిల్ వెనుక క్యారియర్ పై ఒడుపుగా కట్టిన రెండు ప్లాస్టిక్ సంచుల్ని విప్పి ఇనుప డబ్బాతో కొలిచి ఎర్రమన్ను, ముగ్గుపిండి వంచాడు.
ఆమె ఇచ్చిన ఇరవై రూపాయల్ని కళ్లకద్దుకుని మళ్లీ పాడిన పాటే పాడుకుంటూ ముందుకు కదిలాడు.
రాధమ్మది రాయచోటి దగ్గర టి. సుండుపల్లి. నరసింహులుది పలమనేరు దగ్గర నూనెవారిపల్లె. పెండ్లయిన ఐదారేళ్ళు పల్లెలోనే వుండిపోయారు. కానీ రాధమ్మ బిడ్డల్ని బాగా చదివించాలని, పల్లెలో వుంటే ఏండ్లు గడిచినా ఎక్కడుంటే వాళ్లు అట్టే వుండిపోతామని పోరితే టౌన్ కు వచ్చి చేరి పదిహేడు సంవత్సరాలవుతోంది.
ముందు నరసింహులు పందుల వ్యాపారమే చేసేవాడు. పందుల్ని కొనటంలో, అమ్మటంలో మంచి నేర్పరి. టౌన్ కు వచ్చినాక కూడ ఈ పక్క కదిరి నుండి ఆ పక్క శ్రీ కాళహస్తి దాకా పందుల వ్యాపారం కోసం తిరిగాడు. కానీ పిల్లలు పెద్దవాళ్లయ్యే కొద్దీ, ఊరు పెద్దదయ్యే కొద్దీ పందుల పెంపకం పైన ఆంక్షలు ఎక్కువయ్యే కొద్దీ రాధమ్మ శతవిధాలా నచ్చచెప్పి ఆ వ్యాపారం మాన్పించింది.
నాగుల కుంటలో ఎరుకుల కాలనీ ఏర్పడ్డాక నరసింహలు ఎట్లాగో ఇల్లు కట్టుకోగలిగాడంటే అతడు చేసిన పందుల వ్యాపారమే కారణమని ఇప్పటికీ రాధమ్మ తో అంటుంటాడు.
“ఎవడి బతుకు తెరువు వాడిది లేమ్మే ! ఎవడి మానం మర్యాద వాడిదే. నా మాటిను ఇన్నేండ్లూ మనం బతకతా ఉండేడి ఈ యాపారంలోనే. మనకు కూడు గూడు ఇచ్చిండేదాన్ని కాలదన్నుకున్నామంటే మల్లింకా లేని బాధలు పడాల్సివస్తుంది” – అని ఎంతెంతో చెప్పిచూసాడు కాని…
” మనం గానా ఇంకా పందుల్ని మేపతా ఊరికి దూరంగా వుండిపోయామంటే మన పిలకాయలకు విలువేముంటాదబ్బా, మీ నాయినేం చేస్తాడని పిలకాయల్ని ఎవరైనా అడిగితే వాళ్లేం చెప్పుకుంటారో చెప్పు? నువ్వీ పనిచేస్తావుంటే మనపిలకాయల్ని ఎవరైనా దగ్గరకు చేరస్తారా? నలుగుర్లో మనకైనా వాళ్ళకైనా ఏం మర్యాదుంటుంది చెప్పు. గుడిసెలో వుండేటప్పుడూ పందులు పెంచినా, గాడిదలు పెంచినా సరిపోతుందబ్బా, కాలనీ ఇంట్లోకి సిమెంటు కాంక్రీటింట్లోకి చేరినంక కూడా పందులు గిందులు అన్నావంటే నేను పిలకాయల్ని తీసుకుని మాదేశం వెళ్ళిపోతా!” అని రాధమ్మ గట్టిగా బెదిరించే సరికి నరసింహులు దిగిరాక తప్పలేదు.
ప్రాణప్రదంగా పెంచుకుంటున్న జీవాల్ని దాంతో నరసింహులు అమ్మెయ్యక తప్పలేదు.
సైకిల్ బెల్ మూగబోవడంతో దాని నెత్తిన అరచేత్తో చరిచాడు నరసింహులు. పైన బెల్లు చుట్టూ అరచేత్తో తట్టి చూసాడు. కానీ బెల్లు పనిచెయ్యనేలేదు.
దీనెమ్మ ఎంత నూనె పోసినా… బెల్లు పనికి రాకుండా పోతాండాది. ఈ సైకిలు మారిస్తే తప్ప ఈ దరిద్రం వదిలేటట్లు లేదు. దీన్ని ఒదలాలన్నా మనసురాదు, పెట్టుకోవాలనుకున్నా పనికి కుదరదు అనుకుంటూ తన పాటను రాగ యుక్తంగా ఆలపిస్తూ, సైకిల్ ను తోసుకుంటూ రంగాపురంలోకి వచ్చాడు.
సైకిల్ పైనా, స్కూటర్ల పైన పిల్లల్ని కూర్చోబెట్టుకుని కొందరు తండ్రులు వాళ్ళని స్కూళ్ళకు తీసుకువెడుతున్నారు.
ఉన్నట్లుండి ఎడమ మోకాలు కలుక్కమనటంతో షాక్ కొట్టినట్లై అక్కడే ఆగిపోయాడు. ఆ నొప్పికి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కొడుకులు గుర్తొచ్చారు.
సైకిల్ తొక్కి తొక్కి మోకాళ్ళు అరిగిపోయాయి. ఒంట్లో పటుత్వం తగ్గి నీరసం పెరిగిపోయినది. మోకాళ్ళు కళుక్కమన్నప్పుడల్లా అతనికి తన ఇద్దరు కొడుకులు గుర్తొస్తారు. సిమెంటు చప్టాపైన కూర్చొని సైకిల్ కు స్టాండు వేశాడు.
నరసింహులుకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. తొలిబిడ్డ, చివరి బిడ్డ ఆడపిల్లలు. రాధమ్మ ఆడపిల్లల్ని ఏనాడూ గారాబంగా పెంచకపోయినా మగపిల్లల్ని బాగానే ముద్దు చేసింది. ఆమె ముద్దూ, మురిపాలూ, ముచ్చట్లూ, కబుర్లూ ఆశలూ అన్నీ మగపిల్లలతోటే.
దబ్బలు అల్లి, వెదురు బుట్టలు చెయ్యటంలో ఎరుకల ఇండ్లల్లో రాధమ్మవి గొప్ప చేతులు. కొంగు బిగించి, చీర మడిచి కట్టి జుట్టు ముడివేసుకుని, వక్కాకు నములుతూ వెదురు దబ్బల్ని మచ్చుకత్తితో ఒడుపుగా తనకు కావలిసిన విధంగా పొట్టు తీస్తావుంటే వీధిలో జనం విచిత్రపోయి చూస్తా నిలబడేవాళ్ళు.
గంపలు, చాపలు, బుట్టలు తయారుచేసేది. పక్కనే జగమర్ల దాకా వెళ్ళి ఏరుకొచ్చేది. శుక్రవారం పలమనేరులో, శనివారం బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యంలో, గురువారం చౌడేపల్లి సంతల్లో వాటిని ఆమె ఆమ్ముకిచ్చేది.
రూపాయి, రూపాయి దాచి పెట్టేది. ఆమె ద్యాసంతా కొడుకుల పైనే. ఎప్పుడూ ఒక కొత్త చీర అయినా కొనుక్కునేది కాదు. పాత చీరల్ని ఊర్లో అడిగి తెచ్చుకునేది. అడివిలోకి వెళ్ళి ఎలక్కాయలు, చింతపండు, నేరేడు పండ్లు, సీతాఫలాలు తెచ్చి బజార్లు తిరిగి తిరిగి అమ్ముకొచ్చేది.
పిల్లల్ని మురిపెంగా సాకేది. పదవ తరగతి దాటి, ఇంటర్మీడియెట్ లో చేరిన తర్వాత వాళ్ళు అడిగిందంతా కొనిచ్చింది. డిగ్రీ చదువులు అయిపోయే సరికి ఆమె ఒంట్లో శక్తంతా ఆవిరైపోయింది. విపరీతమైన దగ్గు, ఆయాసం, నరాల బలహీనత ఆమెకు తోడయ్యాయి.
అంత పరిస్థితుల్లోనూ ఒక రోజు కూడా ఆయమ్మ ఇంట్లో పడుకుంది లేదు.
“పడుకుంటే ప్రానం పోతుంది కానీ బ్రతుకు గడిసేది ఎట్లబ్బా. కొడుకుల చదువులు అయిపోయేంత వరకే మనకీ గాచ్చారం మళ్ళింక వాళ్ళే మనల్ని చూసుకుంటార్లే. వాళ్ళ సదువులు అయిపోనీ, ఉద్యోగాలు రానీ, మనకీ మంచి రోజులు వస్తాయి.” అనేది రాధమ్మ వెలిగే కళ్ళతో…
ఆమె అన్నట్లే రోజులు గడిచాయి.
కొడుకులిద్దరికీ యస్. టీ కోటాలో గవర్నమెంటు ఉద్యోగాలే వచ్చాయి.
మదనపల్లి ఇరిగేషన్ ఆఫీసులో ఒకడు, తిరుపతి రైల్వేకోడూరు ఇంకొకడు గుమాస్తాలుగా చేరి నాలుగేళ్లు అవుతోంది.
వస్తున్న దగ్గు తెరని ఆపుకుంటూ లేచి సైకిల్ ను తోసుకుంటూ రెండో సందు తిరిగాడు. ఇద్దరు ఆడవాళ్ళు బేరమాడి, బేరమాడి ఎర్రమన్ను కొనుక్కున్నారు.
వాళ్ళ బేరసారాల్ని చూస్తుంటే రాధమ్మ గుర్తొచ్చింది.
సంతలో కూరగాయలు కొన్నా బేరమాడి బేరమాడి కొనేది. బజార్లో బట్టలు కొన్నా, సరుకులు కొన్నా బాగా బేరమాడేది. ఎందుకే అంతగా బేరమాడతావు అని అడిగితే.. ఎట్లనో నాలుగు రూపాయలు మిగిలిస్తేనే కదబ్బా మనపిలకాయలకి ఏదో అవసరానికి పనికొస్తుంది అనేది నవ్వుతూ.
కొడుకులిద్దరికీ ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళే దొరికారు. ఎవరూ సాటి కులమోళ్ళు కాదు. కొడుకులిద్దరూ ఇంటికొచ్చి రెండేండ్లు దాటితోంది.
రాధమ్మ కు బిడ్డల్ని చూడాలనిపించి చిన్న కూతుర్ని వెంటబెట్టుకుని కొడుకుల ఇండ్లకు వెళ్ళొచ్చింది. అట్లా ఊర్లు తిరిగొచ్చినాక ఆమె అనారోగ్యం ఇంకా ముదిరిపోయింది.
“ఎప్పుడూ ఈ పక్క రాబోకమ్మా… మనం ఎరుకలోళ్ళం అని ఈ పక్క ఎవరికీ తెలీదు. మమ్మల్ని అగుడు చెయ్యొద్దు. మాకుండే మానం మర్యాద పోగొట్టడానికి ఎప్పుడూ మాఇండ్లకు రాబోకమ్మా- నీకు పుణ్యం ఉంటుంది” అనేసిన కొడుకుల్ని ఆమె అసహ్యించుకోలేదు.
పెద్దకూతురి పెండ్లికి, కాన్పుకి అయ్యిండే అప్పులింకా అట్లే ఉన్నాయి. ఇద్దరు కొడుకులకి, వాళ్ళ భార్యా పిల్లలకి ఇక్కడి నుండి తీసుకుపోయిన కొత్తబట్టల తాలూకా అప్పు కూడా దానికి తోడయ్యింది. చిన్న కూతురికి పెండ్లి చెయ్యడం కోసం ఇంకా ఈ ముసలితనంలో కూడా వెదుర్లు చీలుస్తూనె వుంది, దబ్బలు అల్లుతూనే ఉంది.
“ఇద్దరు మొగపిల్లల్ని సాకే బదులు గమ్మునా నాలుగు పందుల్ని పెంచుంటే బావుండే రాధమ్మ”… అవన్నా మనల్ని సాకుంటాయి అంటాడు నరసింహులు.” వొద్దబ్బా కొడుకిలకి తెలిస్తే బాధ పడాతారు” అంటుంది రాధమ్మ నొచ్చుకుంటూ.
June 26th, 2010 at 2:15 am
what the writer wants to tell, i unable to understand. all the story is writeres narration, the rolls of two persons are not even established properly. radamma roll is not at all established. the acent of chittoor is partially used in the voice of the rolls.I think some part of story is missing due to typing or in communication, since, i read the stories of the wirter previously, he is a good writer.
June 29th, 2010 at 1:03 pm
పలమనేరు బాలాజీ గారు,
” మనం పేదవాళ్ళం – ఈ పక్క రాబోకమ్మా “…
అంటే బాగుండేదేమో ?..
కుల ప్రస్తావన అవసరమా?.. అనిపిస్తోంది….
PUTLhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=3LG4Fvdoc-Tad891yL_P38_3sHkYW7mil8oCzDCRtx0=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@YAHOO.COM
.
August 1st, 2010 at 3:36 am
The very idea of presenting one particular community which was hardly represented in the short story is very much appreciable.One of the main purposes of creative literature is that only.He was very successful in recording the change in the thought process of current times, focussing on the hypocrcratic behaviour.The second geneartion, the offspring of the lead roll is in state of confusion.Definitely I recommend the story as a good attempt.Congrats Balaji.
Regards,
upender
October 8th, 2010 at 12:20 am
[...] ఎర్రమన్ను – ముగ్గు పిండి – పలమనేరు బ… [...]