Jun2010
గుర్తొస్తే చిత్రమే అనిపిస్తుంది
కవిత్వానికీ పరిసరాలకీ చాలా చుట్టరికమే వుంది. కవిత్వానికీ చుట్టూ కమ్ముకున్న వివిధ సంఘటనల కారు మబ్బులకి చాలా చుట్టరికమే వుంది. కళ్ళు మూసుకొని నడి రోడ్డు మీద నడవలేము. కళ్ళు తెరుచుకొని వున్నంత కాలం చుట్టూ జరిగే వాటికి అంధులుగా వుండలేము. కళ్ళలో పడిన దృశ్యాన్ని అక్షరానికి బట్వాడా చెయ్యడం అంత తేలికా కాదు! ఆ కష్టాన్ని భరించలేక కాసేపు ఆకుపచ్చ కవిత్వం రాసుకుంటాం. అడివిలో నడుస్తున్నప్పుడు కూడా పక్షి పాట తీయదనాన్నే కాదు, ఆ పక్షిని వెంటాడే తుపాకి చేతుల్ని కూడా చూసే వాడి చూపు కవిది. ఆకుపచ్చదనంలోని అందంతో పాటు ఆ పత్ర హరితాన్ని హరిస్తున్న కర్కశత్వాని చూసే సున్నితమయిన చూపు కవిత్వం. జూడీ జోర్డాన్ అలాంటి కవిత్వం రాస్తోంది. అమెరికాలోని కరోలినాలో వొక చిన్న రైతు కుటుంబంలో పుట్టిన జూడీ జోర్డాన్ నానా కష్టాలూ పడి వర్జీనియా యూనివర్సిటీలో కవిత్వంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది. 2000 లో ఆమె మొదటి కవిత్వ సంపుటి “కారొలినా ఘోస్ట్ వూడ్స్” అనే పేరుతో వెలువడింది. కవిత్వంలో స్థానికత వొక బలమయిన గుణంగా ఎలా మారుతుందో చెప్పడానికి ఆమె కవిత్వం మంచి వుదాహరణ. ఒక దీర్ఘ కవితకి ఇది స్వేచ్చానువాదం ……
గుర్తొస్తే చిత్రమే అనిపిస్తుంది
ఎక్కడో వో మూలన
వో ఇంట్లో వో గదిలో వో పక్క మీద-
ఎందుకో ఇప్పటికీ
ఆ 1863
ఆ బానిస నెత్తుటి కేక
వినిపిస్తూ వుంటుంది.
అది 1976 అనిపిస్తూ వుంటుంది
కాని
ఇప్పుడీ క్షణమే అనిపిస్తుంది.
వో నల్ల పిల్లాడితో
టెన్నిస్ ఆడి వచ్చాక
ఎవరో నా వేపు తుపాకి గురి పెట్టి
నన్ను గోడకి బాదీ బాదీ
“ఆ నల్లాడి పేరు చెపూ చెప్పూ”
అని గద్దిస్తున్నట్టే వుంది ఇంకా.
కాదు, కాదులే, అది 1969.
అమ్మ వొక మైనపు బొమ్మలా
చావులోకి కరిగిపోయినప్పుడు
ఆమె అంత్య క్రియల అంతిమ వాసనలు
నన్ను తాకినప్పుడు
చంద్రుడు వో ఆకుపచ్చ వెన్న ముద్దయి
చేతికి చిక్కినప్పుడు
అప్పటికేమీ తెలియదులే నాకు,
ఎవరు ఎవరి మీద తుపాకులు గురిపెడ్తున్నారో
కొందరి దేహాలు మాత్రమే
నెత్తుటి ముద్దలు ఎందుకవుతున్నాయో
బీచి కెళ్ళిన వొకామె
మూడో రోజు శవమయి ఎందుకు వచ్చిందో
ఏమీ తెలియనప్పుడు
అప్పుడు కూడా కావచ్చు
ఎప్పుడో ఏదో గుర్తుంటే
ఇక లేనిదేముంది?
ఆ గొంతులన్నీ
నా దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి ఈ క్షణాన్న!
తెలిసినవన్నీ అబద్ధాలనీ
తెలుస్తూనే వుంది.
*
ఇంకా ఏ ఏ అబద్ధాలు
ఈ కాలం గోడలో దిగబడి వున్నాయో!
మేకులు ఇంకా గోడ వొంటిని సలుపుతున్నాయి.
7 అభిప్రాయాలు »అనువాదాలు, కవితలు, దర్వాజ
June 7th, 2010 at 2:07 am
చాలా బాగుంది,
June 10th, 2010 at 9:25 pm
కాదు, కాదులే, అది 1969.
అమ్మ వొక మైనపు బొమ్మలా
చావులోకి కరిగిపోయినప్పుడు
ఆమె అంత్య క్రియల అంతిమ వాసనలు
నన్ను తాకినప్పుడు
చంద్రుడు వో ఆకుపచ్చ వెన్న ముద్దయి
చేతికి చిక్కినప్పుడు
ఈ వాక్యాలు గుండెను పట్టేసాయి.
మేకులు ఇంకా గోడ వొంటిని సలుపుతున్నాయి.
ధాష్టీకం ఎక్కడైనా ఒకే రకమైన వేదనను మిగులుస్తాదని ఇంతకంటే తార్కాణం అక్కర్లేదు.
అఫ్సర్ గారికి మరో మారు కృతజ్ఞతలు..
June 12th, 2010 at 2:41 am
అనువాదం…
చాలా బాగుంది..
rputhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=HKxsJQVpM2Cqpq8x5AKrByhaAZSFxc9U-Kjq_Ae0iBA=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.com
.
June 15th, 2010 at 4:02 am
Very good poem. It would have enhanced the experience had Mr. Afsur provided the original with the translation.
regards,
M
June 15th, 2010 at 12:03 pm
సార్ మంచి కవిని,కవితని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
ఇక్కడ మన పరిస్థితి కూడా అంతేగా?
అబద్ధాల మధ్య గొంతులు పూడ్చుకుంటున్న మనం…
August 14th, 2010 at 10:13 pm
“ఇంకా ఏ ఏ అబద్ధాలు
ఈ కాలం గోడలో దిగబడి వున్నాయో!
మేకులు ఇంకా గోడ వొంటిని సలుపుతున్నాయి.”
భ్రిలియంట్ అఫ్సర్ !
October 22nd, 2010 at 11:48 am
అఫ్సర్ గారు
చక్కని కవిత
బాగుంది.
మాడిశెట్టి గోపాల్ సాహితీ గౌతమి, కరీంనగర్