Jun2010
జానపద గేయాల్లో మానవీయ విలువలు
ఆదిమ మావవుడు అవతరించినప్పటి నుండి నాగరికత ఎన్నో మలుపులు తిరిగింది.మానవీయ విలువలకు ప్రాధన్యమిచ్చి సంస్కృతీ, సంప్రదాయాలు రూపొందాయి.నాడున్న మానవీయ విలువలు నేడు మసకబారుతున్నాయి.పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావం వల్ల మనిషిలో స్వార్థం వేళ్ళూనికొని పోతోంది. తోటివారిని చిన్న చూపు చూడడం, పక్కవారికి ఏమి జరిగినా స్పందించకపోవడం నేడు అంతటా కనిపిస్తోంది. దిగజారి పోతున్న మానవీయ విలువలను గురించి భవిష్యత్తు తరాలవారికి బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మానవీయ విలువలు నగరాలలో ఉండే వారికన్నా, పల్లెల్లో ఉండే వారికే ఎక్కువగా ఉన్నాయి. పట్టణాలలో ఎవరి జీవితం వారిది. తోటి మనిషిని గూర్చి పట్టించుకోవడమే లేదు. అదే పల్లెల్లో పక్కనుండేవాడు తిన్నాడో ? లేదో ? నిద్రపోయాడో ?లేదో? విచారిస్తారు. కష్టాల్లో ఉంటే వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి అక్కున చేర్చుకుంటారు.ఎవరికే బాధ కలిగిన ఊరంతా స్పందిస్తారు. అలాంటి పల్లెటూరు వారి సాహిత్యాన్ని గమనిస్తే మానవీయ విలువలకు సంబంధించిన ఎన్నో అంశాలు బయలు పడ్తాయి. అవి నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడ్తాయి. మనల్ని మానవీయ విలువలను కలిగి ఉండేలా ప్రేరేపిస్తాయి.
జానపదులు తాము బాగు పడడమే కాకుండా ప్రజలంతా బాగు పడాలని కోరుకుంటారు. అందరూ సంపదలతో తులతూగాలని ఆశిస్తారు. బీదవాళ్ళు బతకాలని, అందరికీ కూలి పనులు దొరకాలను కోరుకుంటారు. ఇలాంటి మానవీయ విలువలను నేడు ఎంతమంది కలిగి ఉంటారో చెప్పండి. కింది జానపద గేయాన్ని గమనించండి—-
“వానల్లు కురవాలి వానదేవుడా
వరిచేలు పండాలి ”
పన్నెండు ధాన్యాలు ”
బండ మీద పండాలి ”
మా కడుపు నిండాలి ”
కుంట చెరువు నిండాలి ”
బీద సాద బతకాలి ”
పేద సాద బతకాలి ”
కూలి నాలి దొరకాలి ”
బస్సెక్కినా , రైలెక్కినా, విమానమెక్కినా ప్రయాణీకుల గురించి ఎవరూ పట్టించుకోరు, అయితే మన పల్లెల్లోని ప్రజలు ఇందుకు భిన్నంగా ఉంటారు. ఆంధ్రప్రదేశంలో కృష్ణా గోదావరి నదులల్లో పడవ ప్రయాణాలు అధికం. అనేక పల్లెలను ఈ నదులు సస్యశ్యామలం చేస్తున్నాయి. పడవలను నడిపేటప్పుడు పడవకు అధికారి అయినా తండేలు పాటను పాడుతుంటే పడవతాడు లాగే , లేదా తెడ్లు వేసే కళాసులు ఆపాటకొక ఊతపదమో,అనుపల్లవో చేర్చి పాడ్తూ శ్రమను పోగొట్టుకుంటుంటారు. తండేలు తన పాటల్లో పడవలో ఉండే వారంతా పిల్లాజెల్లతో సహా చల్లగ ఉండాలని వారికెటువంటి ఆపద కలగకూడదని గంగమ్మ తల్లిని కోరుకుంటాడు. ఇటువంటి మానవీయ విలువలను కలిగిన కింది పడవ పాటను గమనించండి—-
“తండేలు - గంగమ్మ తల్లికి చెంగల్వ పూదండ – కాళిందికీ తెల్వ దండ
కళాసులు - జోర్మెయ్ బార్మెయ్ జోర్మెయ్ బార్మెయ్
తండేలు - గోదావరి తల్లికి గొజ్జంగి పూదండ – సరసోతికి సన్న జాజిదండ
కళాసులు - జోర్మెయ్ బార్మెయ్ జోర్మెయ్ బార్మెయ్
తండేలు - కృష్ణవేణమ్మాకి గేదంగి పూదండ – కావేరికి చంద్రకాంత దండా
కళాసులు - జోర్మెయ్ బార్మెయ్ జోర్మెయ్ బార్మెయ్
తండేలు - పిల్లజెల్లా అంతా సల్లంగ రచ్చింది – ఇల్లు జేర్చండి ఓ తల్లులార
కళాసులు - జోర్మెయ్ బార్మెయ్ జోర్మెయ్ బార్మెయ్
తండేలు - సిక్కాలు నిండించి శింగాలు నిండించి -ఇల్లు జేర్చండి ఓ తల్లులారా
కళాసులు - జోర్మెయ్ బార్మెయ్ జోర్మెయ్ బార్మెయ్
తండేలు - సుళ్ళు దోపుళ్ళు మొసళ్ళు దప్పించి మ-మిల్లు జేర్చండి ఓ తల్లులారా
కళాసులు - జోర్మెయ్ బార్మెయ్ జోర్మెయ్ బార్మెయ్
తండేలు - గోదావరికి తల్లికి కొట్టరా టెంకాయ – కోరి దండాలెట్టి కుంకుమ పెట్టి
కళాసులు - జోర్మెయ్ బార్మెయ్ జోర్మెయ్ బార్మెయ్
నదులలో సుళ్ళు దోపుళ్ళు మొసళ్ళు దప్పించి పిల్ల జెల్లను చల్లగా ఇల్లు చేర్చుమని టెంకాయ కొట్టి కుంకుమపెట్టి గంగమ్మను ప్రార్థించడం తండేలు మానవీయ విలువలకు నిలువెత్తు సాక్ష్యం.
జూదం ఆడితే సర్వం పొగొట్టు కొంటారు. పెళ్ళాం బిడ్డలు నడివీధి పాలౌతారు. ఇళ్ళల్లో దారిద్రం తాండవిస్తుంది. మానత్వం మంట గలిసి పోయి పెళ్ళాం బిడ్డల్ని అమ్మడానికి కూడా వెనుకాడరు. మానవీయ విలువలకు తిలోదకాలిచ్చే జూదం ఆడడం వల్ల దుర్వ్యసనాలకు బానిసలైపోతారు. జూదంలో భాగమైన కోడి పందెం ఆడడానికి పోయివస్తానని ఒక భర్త భార్యను అడుగుతాడు. అప్పుడు ఆ భార్య కోడి పందేల వ్యసనానికి బానిసై పోవద్దని , తన నగలను , ఆస్తిని ధారపోసి , మానవీయ విలివలు లేకుండా ప్రవర్తించవద్దని ఎలా కోరుతుందో కింది పాటను గమనించండి.-
మగడు :- “కోపలేము తగ్గినాయి
కొమ్మలేమొ హెచ్చినాయి
పోయెచ్చ జానికి కోడిపందెమూ
నేను చూసెచ్చు జానకి కోడి పందెమూ
భార్య :- ముక్కులోటి ముక్కర
కోడి పుంజుల పాలాయ
పోవద్దు మామా కోడి పందెమూ
నువ్వు ఆడద్దు మామా కోడి పందెమూ”
అలా కోడి పందెంలో భార్య కమ్మల్ని, మెడల్లోటి హారాలను, నడుముకున్న వడ్డ్యాణ్యాన్ని , కాలల్లోటి కడియాలన్నింటినీ కోడిపుంజుల పాలు చేయవద్దని, కుంటుంబం పట్ల మానవత్వంతో ప్రవర్తించమని ఆ భార్య భర్తను ప్రాదేయపడ్తుంది.
జానపదులు నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఒకరి భార్యను మరొకరు చెరబట్టడం తప్పుగా భావిస్తారు. అది మానవీయ విలువలకు తిలోదకాలిచ్చినట్లు అవుతుందని తలుస్తారు. అలాంటి వారిని హెచ్చరించి సరైన మార్గంలో పెట్టడానికి రామాయణాన్ని ఉదాహరణగా చేసుకొని పాడుకుంటారు. అది విన్నవారికి మానవీయ విలువలు సుబోధకాలౌతాయి. కింది గేయాన్ని గమనించండి-
“కలలాంటి కలాగంటి
ఇప్పుడు సాల కలాగంటి
కాని పోని కలలగంటినే ఈ రావణా
వద్దు వద్దు రావణా బుద్ది విను రావణా
వారి సీతనారి కంపరా ఓ రావణా
వారి సీతనారి కంపి వారి పాదమూల బడిన
కోరినట్లు వరములిచ్చుకో ఓ రావణా
చేతిలేటి నల్లగాజు చెదిరీ రెండొప్పులాయ
చేటు వచ్చె మన లంకకూ ఓ రావణా
కాలిలేటి కంచి మెట్లు కదిలీ మూడొప్పులాయ
కాని వచ్చె మన లంకకూ ఓ రావణా ”
మానవీయ విలువలకు తిలోదకాలిస్తే చేటు తప్పదని , దుశ్శకునాలు ఎదురౌతాయని ఈ గేయంలో పేర్కోనడం జరిగింది.
తండ్రి మాటను జవదాటరాదని రాముడు ద్వారా మనకు తెలిసింది. దానిని ఆదర్శంగా తీసుకొన్నాం. తండి మాట గౌరవించడం మానవీయ విలువల్లో ఒక భాగమే అవుతుంది. ఇప్పటికీ ఎంతోమంది శ్రీరామ చంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకొని తండ్రి మాటను నిలబెడ్తున్నాను. అలాగే తల్లిని మొదటి దైవంగా చూడమని శ్రీరాముడు భరతునితో చెప్పినట్లు కింది గేయంలో పేర్కోనబడి ఉంది – గమనించండి -
“రాముడూ : భరతుడా నా చిన్ని తమ్ముడ
క్షేమమా తల్లిదండ్రులూ
గురువు విశ్వామిత్రులకు
కుశలమా పుర జనులకూ
అంటూ రాముడు తనను చూడడానికి కొచ్చిన భరతుణ్ణి ప్రశ్నిస్తాడు. భరతుడు తండ్రి దశరధుడు చనిపోయిన సంగతిని తెలియజేసి అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని ఏలుకోమంటాడు. అలాగే తన తలి కైక ముఖాన్ని చూడనని చెప్తాడు. అప్పుడు రాముడు ఏమంటున్నాడో చూడండి -
“కన్న తల్లి మొదటి దైవము
మనసు నుంచి మసలు మా
ప్రేమతో సేవింపుమా
పాదుకా పట్టాభిషేకము
నీకు ఇస్తిని తమ్ముడా
ధర్మమును విడనాడకుమ
నగరమును పాలింపుమా ”
అని తల్లిని మనసు పెట్టి మసలుకోవాలని , ధర్మ సూక్ష్మాన్ని తెలిసి తల్లిని ప్రేమతో సేవించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పరాదని రాముని మాటగా జానపదులు పాడుకున్నారు. ధర్మంలో అధికంగా కనిపించేవి మానవీయ విలువలే .
మానవీయ విలువలకు ప్రతినిధి , అపర దానకర్ణుడు బుడ్డా వెంగళారెడ్డి.ఆయన దాత్రృత్వాన్ని అనేక జానపదగేయాలు చాటుతున్నాయి.రాయలసీమలో పిలవకున్నా పలికే చుట్టం కరువు.తరచూ కరువు కాటకాలతో సతమతమైపోయి రాయలసీమ లో తినడానికి తిండే కాదు, తాగడానికి చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి సర్వసాధారణం. ఒకప్పుడు బ్రిటీషువారు తమపాలనను రాయలసీమతో ప్రారంభించారు. ఆ సమయంలో దున్నేరైతుకు భూమిపై హక్కులేకుండా జమీందారీ విధానన్ని (Fuedal Syatem) ప్రవేశపెట్టారు. రైతులు కూలీలుగా మారిపోయారు. జమీందారులు భూమిపై హక్కును కలిగి రైతుల్ని జలగల్లా పీడించారు. అప్పటి పాలకుడూ సర్ థామస్ మన్రోకు ఇది అన్యాయమనిపించి ‘రైతువారీ’ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ సమయంలో అంటే 1801-1802లో రాయలసీమలో మాహాక్షామం ఏర్పడింది.ఈ కరువు ప్రపంచ చరిత్రలోనే గొప్పది. ప్రజలు ఆకలి బాధ తట్టుకోలేకుండా చిన్న పిల్లలు డొక్కలను చించి వారి పొట్టలోని అన్నాన్ని తినేసేవాళ్ళు అందుకే దీనికి డొక్కలు కరువు అనే పేరు వచ్చిందంట. అప్పుడే బంక మట్టిని ముద్దలుగా చేసుకొని పెరుగుతో ముంచుకొని మింగి ఆకలి బాధను తీర్చుకునేవారు. ఆ సమయంలో ప్రజలను ఈ ఉపద్రవం నుండి కాపాడడానికి అపర దానకర్ణుడైన బుడ్డా వెంగళరెడ్డి దేవుడిలా ముందుకొచ్చాడు. మానవీయ విలువలకు ప్రపంచంలోనే నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు.తన సంపదనంతా పేద ప్రజల ఆకలిని తీర్చడానికి వినియోగించాడు . వేలాదిమంది ప్రాణాలను కాపాడి ప్రపంచ చరిత్రలో మిగిలిపోయాడు.. క్రీ.శ 1886 లో ఇతని సేవను గుర్తించి విక్టోరియా మహారాణి తన రాజప్రతినిధి ద్వారా ఇతనికి బంగారు పతకాన్ని వెంగళరెడ్డికి బహూకరించింది.దానిని కూడా వెంగళరెడ్డి దానానికే వెచ్చించాడని తెలుసుకొన్న రాణి ఆశ్చర్యపోయి మరో బంగారు పతకాన్ని పంపింది. కింది జానపద గేయాన్ని గమనించండి.—-
“ఉత్తరాది ఉయ్యాల వాడలో
ఉన్నది ధర్మం సూడరయా
నేటికి బుడ్డా యంగళారెడ్డి
ధర్మ పెఋవని పాడరయా
దాన పరుడు యంగళరెడ్డి
ధర్మ దేవత బిడ్డడయా
పచ్చి కర్వులో పాసము పోసెను
బెమ్మ దెవుడే ఆయనయా
యెచ్చుగాను పుణ్యాత్ముడు రెడ్డని
యంగళరెడ్డిని ఎంచరయా
యంగళరెడ్డి దానపరుడని
శానా మంది పొగిడిరయా
గుడ్డివాళ్ళకు కుంటివాళ్ళకు
గురుతుగ బండ్లే సేయించెనయా
దొడ్డా బుద్ది కలిగిన పెద్ద
దొరకు దండమని తెలిసిరయా
సాదులకు సన్నాసులకంతా
సంతర్పణలు సేసెనయా
లేదనకుండా బీదలకిచ్చే
దాన కర్ణుడని పొగిడిరయా
యంగళరెడ్డి ధర్మకీర్తులు
ఢీల్లీ కోటకు పాకెనయా
అచ్చిరికి పోయిన రాణమ్మప్పుడూ
ఢిల్లీకె పిలిపించెనయా
రాణమ్మ తన పక్కన తకుతులో
రెడ్డిని కూసున బెట్టనయా
రంగుగాను బంగారు పతాకము
సందిటికి అమరించె నయా
యంగళ రెడ్డికి సాటి యవరని
ఎక్కడ అందరూ పొగిడిరయా ”
ఇలా అనేక జానపదగేయాలలో ప్రజలు బుడ్డా వెంగళ రెడ్డి దానగుణాన్ని కీర్తిస్తూ పాడుకున్నారు.ఇంతటి మానవీయ విలువలు కలిగిన వ్యక్తి రాయలసీమలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
భారతీయ సంస్కృతి ఉమ్మడి కుటుంబానికి పట్టుగొమ్మ.ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి ఉమ్మడిగా జీవించేవారు. కష్టసుఖాలను సమానంగా పంచుకొనేవారు. వయో వృద్ధులు సైతం సుఖ జీవానాన్ని గడిపేవారు. ఉమ్మడి కుటుంబంలో అందరూ సమానులే. నేడు ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. దీనివల్ల వయసు మీరిన తల్లిదండ్రులు కుటుంబానికి భారమైపోయారు. వారిని వృద్ధాశ్రమాల్లో చేర్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కాశీకి తీసుకెళ్ళి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా వదిలిపెట్టేసి, తమ ఊర్లకు వచ్చి కర్మక్రియలు నిర్వహించేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలంటే జానపదులకు చాలా ఇష్టం.ఉమ్మడి కుటుంబాలను ఛిన్న భిన్నం చేసే వ్యక్తుల మీద జానపదులు వ్యంగ్యంగా పాటలు పాడి అలాంటి వ్యక్తుల పట్ల జాగురూకతతో మెలగాలని ప్రభోదిస్తుంటారు. నిజంగా మానవీయ విలువలకు ఉమ్మడికుటుంబం ఒక ప్రతిబింబంగా చెప్పొచ్చు. ఈక్రింది గేయాన్ని గమనించండి.
“ఏరుబడితేనె మేలు మొగుడా- మనము
పొత్తులుంటేనె పోరు మొగుడా
ఏరుబడ్డ తెల్లారి ఏకమై మనముండి
ఏకించి పీకించి నెలకొక్క పొగొడికి
మోట దండెడదొడ్డు మొలతాడు చేయిస్తూ
మక్కజొన్నచేను మన పాలికే వస్తె
నక్కబెదురు బెట్టి మా ప్రఙ్ఞ చూపించి
ఇద్దూము పండేది నత్తామూ పండిస్తూ”
ఇలా ఉమ్మడి కుటుంబాలను ప్రలోభపెట్టి వేరు కాపురాలను పెట్టించే వారి పట్ల ఒక కన్నేసి పెట్టాలని జానపదులు మర్మగర్భంగా పాటల్లో పాడుకుంటుంటారు. ఉమ్మడి కుటుంబాలలో ఉండేమానవీయ విలువలు మరెక్కడా ఉండవు.
ఇలా జానపదగేయాల్లో నేటికీ మానవీయ విలువలు ప్రతిబింబస్తూనే ఉంటాయి. నగరాలలో అంతర్ధానమైన మానవీయ విలువలు నేడు కూడా పల్లెల్లో, పల్లెపాటల్లో కనిపిస్తూ ఉండడం భావితరాల వారికి మార్గదర్శకంగా ఉంటుందని చెప్పొచ్చు.
అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు