Jun2010
మహాప్రస్థానం అంకితం కొంపెల్ల జనార్దనరావు కోసం మాత్రమేనా?
బరంపురంలో మనం ఇంకా
నిన్న గాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్య సాహిత్య పరిషత్తును
కలకల లాడించింది నీ నవ్వు…
విశాఖపట్టణం వీథుల్లో మనం
‘ఉదయిని’ సంచికలు పట్టుకు తిరగడం
జ్ఞాపకం ఉందా?
చెన్నపట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచిక గూళ్లేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకొని
ఆకలీ, నిద్రాలేక
ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి పోతామో తెలియని
ఆవేశంలో
చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ
ఎక్కడికో పోతున్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టిన లోకం
ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి
శపించిందో, శఠించిందో మనల్ని!
తుదకు నిన్ను విషవాగురల లోనికి లాగి
ఊపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి
మా కళ్లల్లో గంధక జ్వాలలు
గుండెల్లో గుగ్గిలపు ధూమంవేసి
మా దారిలో ప్రశ్నార్థ చిహ్నాల
బ్రహ్మజెముడు డొంకలు కప్పి
తలచుకున్నప్పుడల్లా
తనువులో, అణువణువులో
సంవర్త భయంకర
ఝంఝా పవనం రేగిస్తూ
ఎక్కడికి విసిరిందయ్యా నిన్ను!
ఎంత మోసగించిందయ్యా మమ్మూ!
కొంపెల్ల జనార్దనరావు కోసం ‘మహాప్రస్థానం’ అంకితం ఇస్తూ శ్రీశ్రీ 1938లో రాసాడు. ఒక స్నేహితుని కోసం రాసిన ఆర్ద్రమైన ఎలిజీగా ప్రపంచసాహిత్యంలోనే టెన్నిసన్ తన స్నేహితుని కోసం రాసిన ఎలిజీ పక్కన ఇప్పటికే సాహిత్యకారులు, విమర్శకులు దీనికి స్థానమిచ్చారు.
మన దేశ ప్రజల అధోగతికి పదకొండు కారణాలు (ఎలెవెన్ కాజెస్ ఫర్ ఫాల్ ఆఫ్ అవర్ కంట్రీమెన్) అని గిరీశం అనర్గళంగా మాట్లాడితే అవి ఏమిటో బళ్లారి రాఘవ పరిశోధించే ప్రయత్నం చేసినట్లుగా, మనం 1938లో కొంపెల్ల జనార్దనరావుకు అంకితం సందర్భంగా శ్రీశ్రీ ఏఏ అంశాలు ఎందుకు ప్రస్తావించాడో పరిశోధన చేయగలిగితే…
శ్రీశ్రీ జీవితంలో, ముఖ్యంగా రూపొందుతున్న కాలంలో విశాఖపట్నం తర్వాత ప్రభావం వేసిన పట్టణం బరంపురం. విశాఖపట్నం శ్రీశ్రీని పారిశ్రామిక చైతన్యపు ఆధునికుణ్ని చేసింది. ఏరాడకొండతోపాటు తవ్వోడ ఆయన చైతన్యంలో ప్రవేశించింది. సముద్రంతోపాటు, సముద్రం మీద వ్యాపార దోపిడీలు, సముద్రం కింద ఇవ్వాటికీ ప్రపంచాన్ని శాసిస్తున్న తైలం ఆయన జ్ఞానాన్ని పదనుపెట్టింది. అది బరంపురం అయినా, కాకినాడ అయినా, చెన్నపట్నం అయినా, విశాఖపట్నం అయినా 1938 నాటికి నాలుగు చోట్లా సముద్రం మీంచి సంవర్త భయంకర ఝంఝా పవనం రేగుతున్నది. అది కళ్లల్లో గంధక జ్వాలలను, గుండెల్లో గుగ్గిలపు ధూమాన్ని వేసింది. జనార్దన రావు వంటి సున్నిత కవితా మనస్కుని ఊపిరితిత్తులను కొలిమితిత్తులను చేసింది.
యువకులుగా, కవులుగా వాళ్ల కలలేమిటి? బరంపురంలో నానా జాతి సమితి సామూహిక భోజనాల మార్పుగాలి ఇచ్చిన ఉత్సాహం. తాను ఆ సభ జరిగి, చాప కూడు ఏర్పాటు చేసిన 1910లో పుట్టిన ఒక శుభ పరిణామాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు. మనుషులెల్లను ఒక్క ఇల్లయి అట్లా సముద్రతీరాన తుళ్లింతలాడుతూ, కలిసి తిరుగుతూ, తింటూ, బరంపురం అయినా, కాకినాడ అయినా, విశాఖపట్నం అయినా అప్పటికి ఆ ఇద్దరి యువకులకు సాహిత్యమే లోకం మాటలు, కలకల నవ్వులు, ఉదయిని సంచికలు పట్టుకు తిరగడం, చివరకు చెన్నపట్టణపు సముద్ర తీరంలో కూడ పిచిక గూళ్లే కట్టుకున్నారు. సాహిత్యమే సమస్తమనుకున్నారు. చుక్కలలో ఆదర్శాలను లెక్కించారు.
కొంపెల్ల జనార్దనరావు శుద్ధకవిగా, సాహిత్య క్లాసిసిస్టుగా 1938లో క్షయ వ్యాధితో మరణించి ఉండవచ్చు. అది శ్రీశ్రీకి వ్యక్తిగతంగా అశనిపాతం వంటి షాక్.
కాని శ్రీశ్రీని రెక్కపట్టి నిలబెట్టిన లోకం ఆయనకీ దృశ్యాలు చూపించింది.
ఒక్క మాటలో ‘మహాప్రస్థానం’లోని గీతాలన్నీ ఆ దృశ్యాలే.
జగన్నాథ రథ చక్రాలు, గర్జించు రష్యా వంటి మళ్లీ విశ్వాసాన్ని, ఆశను ఆవేశింప చేసుకొని రాసిన రెండు మూడు ప్రధానమైన గీతాలు తప్ప అన్నీ 1938 కన్నా ముందు రాసినవే.
1938 స్పెయిన్ అంతర్యుద్ధం ఓడిపోయి, ముగిసి గాయాలు చూసుకుంటున్న కాలం. శ్రీశ్రీ, జనార్దనరావు వలె కవులు కేవలం సాహిత్యమే సమస్తమనుకొని, చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ సముద్రతీరంలో పిచికగూళ్లు కట్టుకున్న కాలం కాదు.
కవులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్తరానికి అందించడానికి నియంతృత్వాన్ని నిలవరించి సాయుధంగా పోరాడి నేలకొరిగిన కాలం. లేదా వీరోచితంగా ఓడిపోయినకాలం.
అయితే 1938 అక్కడే ఆగిపోలేదు. అది 1936కు 1944కు మధ్యన ఒక సాహస త్యాగంలో ఒక ప్రజా విజయాన్ని హామీ ఇచ్చింది.
స్పెయిన్ అంతర్యుద్ధం రెండో ప్రపంచ యుద్ధాన్ని నాలుగేళ్లు వాయిదా వేసిందనే ఆశావహమైన విశ్లేషణయే కాదు, అది ప్రపంచ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షగా సోవియెట్ రష్యా నాయకత్వంలో ఫాసిజంపై ప్రజా విజయాన్ని కూడా సాధించింది. ‘జయభేరి’ గీతంలో ప్రపంచ నిర్మాత అయిన కార్మికుని రెండు స్థితులను శ్రీశ్రీ మనకు కళ్లకు కట్టాడు. మహాప్రస్థానం, ప్రతిజ్ఞ వంటి గీతాల్లో మరో ప్రపంచపు ఆశ్వాసాన్ని ఇచ్చాడు. కవిగా, ఒక ఆశావహ చైతన్యం నింపుకున్న కవిగా 38 కన్నా పూర్వమే ప్రపంచపు బాధనే కాదు, భవిష్యత్తునూ ఆవిష్కరించాడు.
‘మహాప్రస్థానం’లో 1938 కన్నా పూర్వం రాసిన గీతాల సారమంతా జనార్దనరావు కోసం రాసిన అంకిత గీతంలోకి ఇంకింది.
ఈ వ్యక్తిగత దుఃఖం నుంచి, ఈ సామూహిక సాహసిక తాత్కాలిక అపజయం నుంచి తేరుకొని ఆయన జనార్దనరావు కోసమే కాదు, స్పెయిన్ అంతర్యుద్ధంలో అమరులయిన అందరికోసం ఒక ఆశ్వాసపు హస్తాన్ని అందిస్తున్నాడు.
లేదు, నేస్తం లేదు
నీ ప్రాభవం మమ్మల్ని వదల లేదు!
నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లనే నేర్చుకుంటున్నాం!
ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు
అవి 1936 నాటికి స్పెయిన్ మాత్రమే కావచ్చు, 1940 నాటికి జర్మనీ, ఇటలీ, జపాన్‌లు కూడా అయినవి. ఫ్రాంకో ఒక్కడే కాదు హిట్లర్, ముసోలినీ, టోజోలుగా అవతారమెత్తినవి. నాజీజం, ఫాసిజంగా పడగవిప్పినవి.
భయం లేదులే అయినప్పటికీ
నీ సాహసం ఒక ఉదాహరణ
నీ జీవితమే ఒరవడి!
అని రాసినప్పుడు శ్రీశ్రీ జనార్దనరావు కోసం రాసాడేమో కాని లోకం రెక్కపట్టి నిలబెట్టినపుడు నాకు అందులో స్పానిష్ అంతర్యుద్ధంలో అమరులైన కవులు, కళాకారులు కనిపించారు. ఆనాడు శ్రీశ్రీ ఊహించాడో లేదో కానీ.
వాళ్ల సాహసాలే నక్సల్బరీ, శ్రీకాకుళంలో సరోజ్‌దత్తా, సుబ్బారావు పాణిగ్రాహి వంటి వాళ్లకు ఉదాహరణలైనవి. ఆ జీవితాలే ఒరవడి అయినవి.
శ్రీశ్రీని రెక్కపట్టి నిలబెట్టిన లోకం నిరాశామయలోకం. ఫాసిజం గెలిచిన లోకం. అక్కడే ఆయన కదన శంఖం పూరించాడు.
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను!
‘ఇక్కడ’ శ్రీశ్రీ రాసేనాటికి రెండో ప్రపంచ యుద్ధకాలపు ‘ఇక్కడ’ కావచ్చు.
తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత నక్సల్బరీ కాలపు ‘ఇక్కడ’ కావచ్చు.
అందుకో ఈ చాచిన హస్తం!
ఆవేశించు నాలో!
ఇలా చూడు నీ కోసం
ఇదే నా మహా ప్రస్థానం!
ఎందుకదంతా – ఎల్లకాలాలకు ఒక జీవిత సత్యాన్ని, ఒక పోరాట తథ్యాన్ని ఆవిష్కరించడానికి. ఆ సందేశమే
నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు…
స్పెయిన్‌లో పోరాటం వదలలేదు. వీరోచితంగా పోరాడి ఓడిపోయింది. తెలంగాణలో వదిలిన పోరాటం నక్సల్బరీ, శ్రీకాకుళాలు అందుకున్నాయి. కొంపెల్ల జనార్దనరావు మరణం, అంకితం ఒక సందర్భమే. ఆయన కోసం రాసిన గీతం మాత్రం శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ మానవాళికి అందించిన సందేశం.
2 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు
June 8th, 2010 at 1:01 am
ఏ కవి అయినా సమకాలీన సంఘటనలకూ, ఉద్వేగాలకూ స్పందించి కవితలు రాస్తాడు. అవి ఏ కాలానికైనా, లేదా అనేక సందర్భాలకు వర్తించే లక్షణాలు ప్రదర్శించినప్పుడు ఆ కవికీ, అతని రచనలకూ గల విలువ తెలియవస్తుంది. తన కాలానికి ఎటువంటి ప్రభావాలవల్ల శ్రీశ్రీ రచనలు చేశాడో ఈ వ్యాసంలో రచయిత బాగా వర్ణించారు. ఆ రచనల్లో అంతర్లీనంగా ఉన్న భావాలు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో జరిగిన సంఘటనలకు ప్రతిధ్వనులేననే ప్రతిపాదన సబబుగానే అనిపిస్తోంది.
June 8th, 2010 at 1:17 am
అబ్బ ఇంకెంతకాలం ఈ శ్రీశ్రీ గురించి. ఎక్కడ చూసినా శ్రీశ్రీ గురించే వ్యాసాలు. విరక్తి కలుగుతుందండీ ఇవి చూసి. ఇక ఈ శ్రీశ్రీ సుత్తి ఆపరూ.
ఇక ఈ పోరాటాలు చూస్తుంటే వాంతికి వస్తుంది. ఇన్కెంతకాలం ఈ ఆరాటాలు. మీ పోరాటాలతో మన సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. ఇన్క చాలండి. అది చచ్చిపోయింది.