నేర పరిశోధన

(గత సంచిక తరువాయి)

పై జాబితాలో అతని ఫిడేలు వాయింపు గురించి ప్రస్తావించాను. అతనికిందులో ప్రావీణ్యం చాలా వుంది. కాని ఇతర విషయాలలో లాగే ఇందులొ కూడా అతనికి ఒక పద్ధతిలేదు. అతను నా కోరికపై మెండల్ సోన్, లైడర్ మొదలైన వారి పాటలు వాయించాడు. కాని తనకుతానై వాయించుకునేటప్పుడు అతని వాయింపులో సంగీతం గాని, గుర్తించదగిన పాటగాని సామాన్యంగా వుండేదికాదు. సాయంకాలంపూటల కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని ఫిడెలు మోకాళ్ళమీద అడ్డంగా పరుచుకుని కమానుతో గీకేవాడు.అతను వాయించే స్వరాలు ఒకప్పుడు శ్రావ్యంగా వుండేవి. ఒకప్పు డు  విషాదంగా వుండేవి. ఒక్కొక్కప్పుడు విడ్డూరంగానూ, ఉత్సాహంగానూ ఉండేవి. అతని భావాలు ఆ స్వరాలలో ప్రతిబింబితమయేవన్నదిమటుకు స్పష్టం. అయితే యీ భావాలకు సంగీతం దోహదమే చేసేదో , లేక అతని భావాల ఫలితంగా బాణీలయేవో నిర్ణయించటంమటుకు నా వల్ల కాలేదు.  ఇటువంటి వాయింపు తరవాత అతను నాకిష్టమైన పాటలు కొన్ని వరుసగా వాయించి నాకు పరిహారం చేసేవాడు.
వారం పదిరోజులపాటు మా ఇంటి కెవరూ రాకపోవటం చూసి, నాలాగే నామిత్రుడికీ ఎరిగిన వారెవరూ లేరనుకున్నాను. కాని అతనికి చాలామంది పరిచితులున్నారని తరువాత తెలిసింది. వీరయినా అనేక తరగతులకు చెందిన వ్యక్తులు. పాలిపోయిన రంగూ , ఎలుక ముఖమూ, నల్లటి కళ్ళూ గల పొట్టివాడొకడుండే వాడు. మిస్టర్ లెస్ట్రేడ్ అని అతను నాకు పరిచయం చేయబడ్డాదు. ఇతను ఒక్క వారంలోనే మూడు, నాలుగుసార్లు వచ్చాడు. ఒకరోజు ఉదయం షోకుగా దుస్తులు ధరించిన యువతితో వచ్చి అరగంటకు పైగా మాట్లాడి వచ్చాడు. అతను చాలా ఉద్రేకంలో ఉన్నట్టు కనబడ్డాడు. అతని వెనుకగానే ఒక వయసుమళ్ళిన యువతి, మాసిన గుడ్డలు ధరించినది వచ్చింది. మరో సందర్భంలో ముగ్గుబుట్టలాటి తల గల ఒక పెద్ద మనిషి వచ్చి ప్రసంగించాడు. ఇంకోసందర్భంలో రైల్వే పోర్టరొకడు. యూనిఫాంతోసహా వచ్చాడు. ఈ రకం మనుషులెవరైనా వచ్చినప్పుడు షెర్లాక్ హోమ్స్ సిటింగ్ రూమ్ కావాలని అడిగేవాడు. నేను నా బెడ్ రూమ్ కు వెళ్ళి పోయేవాణ్ణి. నన్నీ విధంగా ఇబ్బంది పెట్టినందుకతను ప్రతీసారీ క్షమాపణ చెప్పుకునేవాడు. “వీళ్ళు నా క్లయింట్లు. నేనీ గదిని నా ఆఫీసుగా వినియోగించుకోవలసి వస్తోంది,” అన్నాడతను . అతని వృత్తినిగురించి అడిగేటందుకు మళ్ళీ నాకవకాశం దొరికిందిగాని అతను చెప్పనప్పుడెందుకు తెలుసుకోవాలనిపించింది. అతనా విషయం రహస్యంగా ఉంచటానికేదో కారణం ఉండివుంటుందని అప్పట్లో నేననుకున్నానుగాని త్వరలోనే నా అపోహ తొలగిపొయింది . తనకు తానే అతనీ విషయం తెచ్చాడు.
ఆ రోజు మార్చి 4 వతేదీ ఙ్ఞాపకం. నేనా ఉదయం మామూలు కంటె పెందలాడి లేచాను. హోమ్స్ ఇంకా భోజనం ముగించలేదు. వంటావిడకు నా అలవాట్లు తెలిసి ఉండటం చేత బల్ల మీద నా ప్లేటు ఉంచలేదు. నా కాఫీ కూడా తయారుచేయలేదు. మానవ సహజమైన ముక్కోపంతో నేను గంటకొట్టి సిద్ధంగా వున్నానని తెలియబరిచాను. ఈ లోగా కాలక్షేపం కోసం బల్లమీద వున్న పత్రిక తీసి చూడసాగాను. ఒక వ్యాసానికి పెన్సిల్ గుర్తు కనిపించటంవల్ల దాన్ని చదవసాగాను.
ఈ వ్యాసానికి “జీవిత గ్రంథం” అని ఆడంబరమైన శీర్షిక ఉన్నది. పరిశీలనా శక్తి గలవాడు తన పరిసరాలను గమనించి ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చునో ఈ వ్యాసంలో వివరించివున్నది. అందులో నాకు తెలివి తేటలూ చాదస్తమూ కూడా కనిపించాయి. తర్కం బాగానే వుందిగాని దానిద్వారా సాధించిన అనుమానాలు అసంగతంగా ఉన్నాయి. ఒక చూపునుంచీ, ఒక కండరం యొక్క కదలికనుంచీ, క్షణికమైన ముఖభంగినుంచీ మనిషి యొక్క రహస్య భావాలను తెలుసుకోవచ్చునని యీ రచయిత వాదం. పరిశీలన, పరిగ్రహణా ఉన్నవాడిని ఎవరూ మోసపుచ్చలేరంటాడు. అతను కనిపెట్టే విషయాలు పామరుడి గారిడీ లాగా కనిపిస్తాయట. వాటిని ఎలా కనిపెట్టిందీ చెబితేనే గాని నమ్మ శక్యంగా ఉండవట.
“ఒక నీటి బొట్టును చూసి తార్కికుడు అది అట్లాంటిక్ మహా సముద్రంలోనిదో, నయగరా జలపాతానికి చెందినవో తెలుసుకొగలడు. అతనా రెంటినీ చూసి ఉండనవసరంకూడా లేదు. అదే విధంగా జీవితమంతా ఒక ఎడతెగని గొలుసులాటిది: అందులొ ఏ ఒక లింకు పరీక్షించినా దాని తత్వం తెలిసిపోతుంది. మిగిలిన విద్యలలాగే పరిశోధనా శాస్త్రం కూడా దీర్ఘకాలం కష్టించి సాధించవలసినది. అందులో సారంగతుడు కావటానికి  ఒక జీవితకాలం చాలదు. అతి క్లిష్టమైన నైతిక. మనోవైఙ్ఞానిక సమస్యల జోలికి పోకపూర్వం ఈ శాస్త్రం నేర్చుకునేవాడు ప్రాథమిక సమస్యలను  క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఇతను సాటిమనిషిని చూడగనే అతని జీవితం గురించీ , అతను చేసే వృత్తి గురించీ తెలుసుకోవాలి. ఇది వృధా అనిపించవచ్చుగానీ, దీనివల్ల మనిషి యొక్క పరిశీలనా శక్తి పదునెక్కుతుంది; దేనికోసం వెతకాలో, ఎక్కడ వెతకాలో అభ్యాసం ద్వారా తెలుస్తుంది. మనిషి యొక్క వృత్తి అతని గోళ్ళలోనూ. కోటు చేతులలోనూ , బూట్లలోనూ , లాగుకాళ్ళలోనూ, చూపుడు వేళ్లకూ బొటనవేళ్ళకూ గల కాయలలోనూ , ముఖభంగిమలోనూ , చొక్కా చేతి అంచులలోనూ వ్యక్తమవుతుంది. ఇవన్నీ పరిశీలించిన తరువాత కూడా సమర్థుడైన వాడు అవతలివాడి వృత్తి కనిపెట్టలేకపొవటం అనూహ్యం, ” అని ఈ వ్యాసంలో ఉంది. ” ఏమిటీ పనికిమాలిన చెత్త! ఇటువంటి తుక్కు నాజన్మ లో ఎన్నడూ చదవలేదు “, అంటూ పత్రికను బల్లమీద గట్టిగా కొట్టాను.
” ఏమిటది?” అన్నాడు షెర్లాక్ హోమ్స్.
“ఏముందీ, ఈ వ్యాసం,” అన్నాను భోజనానికి ఉపక్రమిస్తూ, “దీనికి గుర్తు పెట్టారు గనక మీరు చదివేవుండాలి. రాసిందెవరో తెలివిగానే రాశారు. అయినా చదివాక నాకు చిరాకేసింది. ఎవరో ప్రపంచం మొహం యెరగనివాడూ, పడక కుర్చీలో కూచుని ఈ సిద్ధాంతాలన్నీ ఓపికగా అల్లినట్టు కనబడుతుంది. ఆచరణ సాధ్యమయే విషయం మటుకు కాదు. ఈ మనిషిని అండర్ గ్రౌండ్ రైలు మూడో తరగతి పెట్టెలో పెట్టి ఆందరి వృత్తులూ చెప్పమంటే తెలిసివస్తుంది . చెబితే, తలకు ఒకటికి నేను వెయ్యి పందెం వేస్తాను!”
“అయితే  మీ డబ్బు నిష్కారణంగా పోతుంది ,” అన్నాడు హోమ్స్ సావధానంగా.
“ఇక వ్యాసం మాటంటారా , అది రాసింది నేనే.”
” మీరా !”
“అవును. నాకు పరిశీలనలోనూ పరిశోధనలోనూ కూడా కొంత అభ్యాసం ఉంది. ఈ వ్యాసంలో నేను చెప్పినవీ, మీకు ఆచరణ యోగ్యం కానట్టు కనబడేవీ అయిన సిద్ధాంతాలు యెంత ఆచరణ యోగ్యమైనవంటే నేను వాటివల్లనే ఇంత తిండి తినగలుగుతున్నాను.”
“అదెట్లా?” అన్నాను అప్రయత్నంగా.
“ఏముందీ, నేనొకవిధమైన వ్యాపారం చేస్తాను. ఇటువంటి వ్యాపారం చేస్తున్నది ప్రపంచంలో నేనొక్కణ్ణే అనుకుంటాను. నేను సలహా ఇచ్చే డిటెక్టివును, ఈ లండన్ లో చాలామంది ప్రభుత్వ డిటెక్టివులున్నారు. చాలామంది ప్రైవేటు డిటెక్టివులున్నారు. వీరు దారి తప్పినప్పుడు నా దగ్గరికి వస్తారు. వారిని ఏదోవిధంగా దారిలో పెడుతూఉంటాను. వారు తమకు తెలిసిన విషయాలన్నీ నాకు చెబుతూ ఉంటారు. నేరచరిత్ర గురించి నాకు గల ఙ్ఞానంతో నేను సాధారణంగా వారికి సహాయపడగలుగుతూంటాను. నేరాలలో కొంత సామ్యం ఉంటుంది. వెయ్యి నేరాలను  గురించి కరతలామలకంగా తెలిసినవాడికి వెయ్యిన్నొకటో నేరం ఛేదించటం అసాధ్యం కావటం జరగదు. లెస్ట్రేడ్, పేరుగల డిటెక్టివు. ఇతను ఇటీవల ఒక ఫోర్జరీకేసు విషయంలో అయోమయంలో పడిపోయాడు. అందుకే ఇక్కడికి రావటం జరిగింది.”
“ఈ మిగిలినవాళ్ళు?”
” వీళ్ళను సామాన్యంగా ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలవాళ్ళు పంపుతుంటారు. వీరందరికీ ఏదో విధమైన చిక్కు సంప్రాప్తమై, సహాయం కావలిసి వుంటుంది. నేను వాళ్ళ గాధలు వింటాను. నా సలహాలు వాళ్ళు వింటారు. నా ఫీజు నాకు ముట్టుతుంది.”
“మిగిలినవాళ్ళు స్వయంగా చూసి తెలుసుకోలేని సమస్యలను మీరు ఈ గది దాటిపోకుండానే పరిష్కారం చేయగలుగుతారంటారా?”
“అవును, అటువంటి శక్తి నాకున్నది , ఎప్పుడైనా కాస్త గడ్డు సమస్య వస్తుంది. అటువంటప్పుడు నేనే స్వయంగా బయలుదేరి పరిస్థితులు చూసివస్తాను . నాకు అనేక విషయాలను గురించి ప్రత్యేక ఙ్ఞానం ఉండటం నాకెంతో ఉపకారిగా ఉంటుంది. ఇంతకుమునుపు మీ కాగ్రహం తెప్పించిన ఆ సిద్ధాంతాలు, ఆచరణలో నాకెంతో ఉపకరిస్తాయి. గమనించడమనేది నాకు అభ్యాసమైపోయింది. మనం మొదటిసారి కలుసుకున్నపుడు మీరు ఆప్ఘనిస్తాన్ లో ఉండి వచ్చారని నేనంటే, మీరాశ్చర్యపడ్డట్టు కనిపించారు.”
“మీకెవరో చెప్పివుంటారు.”
“కానే కాదు. మీరు ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చారని నాకు తెలుసును. దీర్ఘమైన అభ్యాసంవల్ల నేనా విషయాన్ని క్షణంలో కనిపెట్టానేగాని, ఆ కనిపెట్టటం కొన్ని భావపరిణామాల ఫలితంగానే జరిగింది. అలాంటి పరిణామ దశలు లేకపోలేదు. ఈ పెద్దమనిషి వైద్యుడి తరగతివాడు. అయితే సైనిక లక్షణాలు కూడా కలవాడు. అంటే సైన్యంలో వైద్యుడై వుండాలి. ఇటీవలనే యీయన ఉష్ణదేశాలనుండి వచ్చి ఉండాలి, ఏమంటే ముఖం నల్లగా మాడింది. అయితే అది ఆయన చర్మం యొక్క సహజమైన రంగు కాదు. ఏమంటే మణికట్టు తెల్లగానే వుంది. ఈయన ముఖ కవళి కనుబట్టి కష్టాలూ, అనారోగ్యమూ అనుభవించాడు. ఈయన ఎడమ చేయి దెబ్బ తిన్నది. ఈ చేతిని ఈయన పైకిలాగి పట్టుకున్నాడు. ఒక ఇంగ్లీషు సైనిక వైద్యుడు ఏ ఉష్ణ దేశంలో కష్టాలూ,రోగమూ పడి చేతికి దెబ్బ తగిలించుకుని ఉంటాడు? స్పష్టంగా ఆప్ఘనిస్తాన్ లో !’ ఇదంతా నా బుర్రలో మెదలటానికి సెకండు కూడా పట్టలేదు. అందుచేత మీరు ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చారన్నాను. మీరాశ్చర్యపడ్డారు.”
“మీరు వివరించి చెబుతుంటే సులభగ్రాహ్యంగానే ఉంది,” అన్నాను చిరునవ్వుతో, ” మిమ్మల్ని చూస్తే ఎడ్గార్ ఆలెన్ పో సృష్టించిన డ్యూపిన్ పాత్ర ఙ్ఞాపకం వస్తోంది. అటువంటి వ్యక్తులు కథలలొనే గనక నిజంగాకూడా ఉంటారని నేనెరుగను.”
షేర్లాక్ హోమ్స్  లేచి పైప్ వెలిగించాడు. ” నన్ను డ్యూపిన్ తో పోల్చి అభినందించుతున్నానని మీ అభిప్రాయం కావచ్చు. నా వుద్దేశంలో డ్యూపిన్ చాలా హీనుడు. అతనికి కొంత పరిశోధనా ఙ్ఞానం ఉన్న మాట నిజమేగాని , పో అనుకున్నంత గొప్ప మేధావిమటుకు కాడు” అన్నాడతను.
“మీరు గబోరియా రచనలు చదివారా? మీ దృష్టిలో లికాక్ మంచి డిటెక్టివేనా?” అని అడిగాను .
“లికాక్ ఒట్టి  పనికి మాలిన చవట, ” అన్నాడు హోమ్స్, కోపంగా. “అతనికున్నదల్లా ఒకటే. ఓపిక. ఆ పుస్తకం చదివితే నాకు జబ్బు చేసింది, ఉన్న సమస్యల్లా చోటును కనిపెట్టడమెట్లాగా అని. నేనయితే ఒక రోజులో కనిపెట్టి వుందును. లికాక్ కు నెల రోజులేమో పట్టింది. డిటెక్టివులు చేయరాని విషయాలు బోధించటానికా పుస్తకం పాఠ్యగ్రంధంగా పనికి వస్తుంది.”
నేను మెచ్చుకుంటూ వచ్చిన రెండు పాత్రలింత చులకన అయిపోవటం నాకు నచ్చలేదు. నేనులేచి కిటికీ వద్దకు పోయి వీధిలోకి చూడసాగాను. “వీడు మేధావి కావచ్చుగాని, ఇంత అహంకారమా ?”అనుకున్నాను.
“ఈ రోజుల్లో నేరాలూ లేవూ. నేరస్తులూలేరు.” అన్నాడతను సాధింపుగా. “ఈ వృత్తిలో తెలివితేటలుండి ఏం లాభం ? ఎంత గొప్పవాణ్ణి కావటానికైనా నాలో శక్తి వుంది. నేరపరిశోధన చేయటానికి నేనుచేసిన కృషిగాని, నాకున్న సహజశక్తులు గాని మరెవ్వరికీ లేవు. కాని ఫలితం యేమిటి ? పరిశోధించటానికి నేరాలు లేవు.అధవా వున్నా అవి చాలా చవకబారువి. స్కాట్లండ్ యార్డ్ డిటెక్టివులు సయితం వాటిని సులభంగా తెలుసుకోగలరు.”
అతని స్వాతిశయం నన్నింకా బాధపెడుతూనే వుంది. మాట మార్చేద్దామని, “ఆ మనిషి ఏం వెతుకుతున్నట్టు ?” అని అడిగాను వీధి అవతలివేపున ఒక దీర్ఘకాయుడు. సామాన్యదుస్తులు ధరించి, ఇళ్ళనంబర్లు చూస్తూ మెల్లిగా నడుస్తూ కనిపించాడు. అతని చేతిలో పెద్ద నీలంకవరున్నది.
“రిటైరయిన మెరీన్ సార్జంట్ విషయమేనా మీరనేది ?” అన్నాడు షెర్లాక్ హోమ్స్!
“ఏం కొస్తాడు లేతసొరకాయలు ! తన కోతలు నిజమో కాదో నేను తెలుసుకోలేనని తనెరుగును !” అనుకున్నాను.
నేనిలా అనుకుంటున్నానో లేదో, మేమిద్దరమూ గమనిస్తున్న ఆ మనిషి మా యింటి నంబరు చూసి చప్పున వీధి దాటి వచ్చాడు. తలుపుచప్పుడూ, బొంగురు గొంతూ, మెట్ల మీద అడుగుల చప్పుడూ వినిపించాయి.
“మిష్టర్ షెర్లాక్ హోమ్స్ కు ,” అంటూ ఆ వ్యక్తి నా స్నేహితుడికి కవరు అందించాడు.
నా స్నేహితుడి పొగరు అణచటానికి మంచి అవకాశం దొరికింది, అతనా కోత కోసినప్పుడు ఇంతదాకా ఊహించలేదు.
“చూడబ్బీ, నువ్వేం చేస్తుంటావ్,” అన్నాను.
“బట్వాడా నౌకర్నండి, యూనిఫాం మరమ్మత్తుకెళ్ళింది.”
“అది వరకేం చేస్తూ ఉండేవాడివో ?” అన్నాను నా స్నేహితుడికేసి కొంచెం వెటకారంగా చూస్తూ.
“సార్జెంటుగా ఉండేవాణ్ణండి. రాయల్ మెరీన్ లైట్ ఇన్ ఫెంట్రీలోనండి. జవాబు లేదాండి ? చిత్తమండి!”
అతను మడమలు తాటించి, చెయ్యెత్తి శాల్యూట్ కొట్టి , వెళ్ళిపోయాడు.

అభిప్రాయాలు లేవు »ధారావాహికలు, నవల, నేర పరిశోధన

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో