శ్రీశ్రీ వచన సాహిత్యం- సామాజిక దృక్పధం

కవిత్వాన్ని ఎంత సామాజిక బాధ్యతగా రాశాడో, వచన రచనలూ అంతే బాధ్యతగా రాసినట్లు శ్రీ శ్రీ గద్య రచనలు చూసినప్పుడు గ్రహించగలం.కవిత్వంలో శ్రీశ్రీ స్పశించిన కోణం లేనట్లుగానే వచనంలో చేపట్టని ప్రక్రియలేదు.శ్రీశ్రీ వచన రచనలన్నిటిని కల్పనాత్మక సాహిత్యం, కల్పనేతర సాహిత్యంగా విభజించవచ్చు.కల్పనాత్మక సాహిత్యంలో నవలలు, కథానికలు , నాటికలు పేర్కోనగా కల్పనేతర సాహిత్య ప్రక్రియల్లో వ్యాసాలు , పీఠికలు, సంపాదకీయాలు, ప్రజ, సమీక్షలను పేర్కోనవచ్చు. వీటిలో సామాజిక దృక్పధాన్ని శ్రీశ్రీ ప్రదర్శించిన తీరును వివరించడం ఈ వ్యాస పరిధి.
సామాజిక దృక్పధం:శ్రీశ్రీవచన రచనల్లో సామాజిక దృక్పధాన్ని వివరించభోయే ముందు అసలు ‘సామజిక దృక్పధం’ అంటే ఏమిటో స్థూలంగా వివరిస్తాను.
సమజం లేకుంటే సాహిత్యం లేదు. ఆ సాహిత్యం ఏ కాలంలో,ఏ సమాజంలో ఉత్పత్తి అవుతుందో ఆ సమాజంలో ఉత్పత్తి అవుతుందో ఆ సమాజం యొక్క అవసరాన్ని గ్రహించో, గమనించో వెలువడుతుంది. తెలుగులో దొరకుతున్నంత వరకు తొలికావ్యమైన ఆంధ్ర మహాభారతాన్ని తన రాజైన రాజరాజ నరేందృడి కోరిక మేరకు తెనిగించాడు నన్నయ్య. నాటి సమాజంలో బౌద్ధమతం వ్యాప్తిలో ఉండడం వల్ల, మరింత  ప్రచారం పొందుతున్నందున తన మతానికి చెందిన భావానల్ని పునరుద్ధరించడానికి, ప్రచారం కావడానికి రాజరాజనరేంద్రుడు ఈ గ్రంధాన్ని తెనిగింపజేశాడు. నన్నయ నుంచి చిన్నయ సూరి వరకు తెలుగున  వెలువడిన సాహిత్యం పురాణ, ఇతిహాసాది గ్రంధాల నుంచి గ్రహించిన వస్తువే. సుమారుగా 19 వ శతాబ్దం నుంచి ఏర్పడ్డ ఆధునికత వల్ల తెలుగులో దైవాల మహత్య్మాలో . బుషుల ఔన్నత్యాలో, రాచరిక ఉన్నతో ఇతి వృత్తగాక సమకాలీన సమాజ మానవుడి జీవనమే ఇతివృత్తమైంది.
ఇక సాహిత్య రూపాన్ని గమనిస్తే పద్యాలలో వెలువడిన మహా కావ్యాల నుండి ఖండకావ్యాలుగా, అనంతరం దేశిమార్గాలైన గేయ ఫణితులు, వాటి తర్వాత వచన కవితలుగా కవిత్వం పరిణామం చెందింది. ఆధునిక కాలం వరకు సాహిత్యమంటే కేవలం శ్రవ్య (కావ్య) దృశ్య(నాటకం) కావ్యాలు మాత్రమే . ఆధునికత ఆరంభమైన అనంతరం తెలుగు సాహితీ వనంలో కథానిక, నవల, వ్యాసం వంటి పలు ప్రక్రియా వృక్షాలు వెలసినవి.
భాషాపరంగా గ్రాంధికం  నుండి శిష్ట్య వ్యావహారికం,వ్యావహరికం,ఇంకా నేడు మాండలికంలో సాహిత్యం వెలువడడం చూస్తున్నాం. ఇలా ఆధునికత వచ్చిన తర్వాత తెచ్చిన పరిణామాలేన్నో .తెలుగులో లిఖిత సాహిత్యం లభించడం ఆరంభమైన నన్నయ కలానికే “విశ్వశ్రేయఃకావ్యం”అనేది ప్రబలి ఉంది. ఈవిశ్వశ్రేయసనేది అభౌతికం.కానీ నేటి ఆధినికత వల్ల విశ్వశ్రేయసనేది సమాజపరంగా,అదే సామాజిక దృక్పధం లేక స్పృహగా మారింది. అందుకే ఆధినిక సాహిత్యాకారులకు,”కదిలేది, కదిలించేది ,/మారేది, మార్పించేది ,/పాడేది ,పాడించేదీ./మునుముందుకు సాగించేది,/పెనునిద్దర వదిలించేదీ,/పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ”1గా ఉండాలి అని ఉద్భోద చేసారు.ఇక విషయపరంగా గమనిస్తే “ఇతిహాసపు చీకటి కోణం /అట్టడుగున పడికన్పించని / కథలన్నీ కావాలిప్పుడు2″ అని సాహిత్యకారులను జాగృతపరిచారు ఆధునికవాదులు.
ఆధునికత వల్ల వచ్చిన మరో పరిణామం సర్వవేళ్ళల్లో లభించాల్సినవన్నీ అభౌతికంగా యఙ్ఞయాగాదులతో లభించేదని చెప్పక చట్టం, ప్రభుత్వాలనుండి పొందగలమని రచయిత భౌతిక దృష్టి, స్పృహ కలిగిఉండడం. కొందరు ఆధునిక రచయితలూ సమకాలీన సామాన్యుడిని ఇతివృత్తంగా స్వీకరించక పౌరాణిక ఇతివృత్తాలను స్వీకరించినప్పుడు అన్యాయం జరిగిన పక్షం వహించడం చూస్తాం.ఉదాహరణకు శ్రీ శ్రీ రాసిన బలి అనే నాటికను పరిశీలిస్తే దేవతల రాజైన ఇంద్రుడూ. రాక్షసుల చక్రవర్తి అయిన బలిల గుణగణాలు, వాళ్ళ క్రియలు రచయిత ఉగ్గడించి బలిమహారాజు వైపు మొగ్గాడు, బలే ఉన్నతుడని పాఠకులకు సందేశం అందించాడు రచయిత శ్రీశ్రీ. ఇదే సామాజిక స్పృహ. అంటే సమకాలీన సమాజానికి ఏదికావాలో గుర్తించి ‘కష్ట జీవి’కిరు వైపుల నిలిచిన సాహిత్యాకారుడికి ‘సామాజిక దృక్పదహం’ లేక సామాజిక స్పృహ ఉన్నట్టు. లేని పక్షాన  నేలవిడిచి సాము చేసినట్టే, పాఠకుల్ని పురోగమనం వైపు గాక తిరోగమనం వైపు  తీస్కెళ్ళడానికి సమాయాత్తపరిచినట్లే. ఇదే విషయాన్ని డాII నోముల సత్యనారాయణగారు “రచయిత ప్రతి రచనలోనూ అతడి దృక్పధం స్పష్టంగానో గౌణంగానో ప్రత్యక్షమౌతూనే ఉంటుంది. ఏ దృక్పధమూ, ఉద్దేశ్యమూ లేని రచనలుండవు- అంటే వాటి అంత వ్యర్థమైనవి వేరే ఉండవు”3 అని తమ అభిప్రాయం తెలిపారు.
సాహిత్యం వల్ల కేవలం ఆనందమేకాదు, సాంఘీక ప్రయోజనమూ నేటి అవసరం. దీన్ని గుర్తించి రాజారామ్మోహనరాయ్, కందుకూరి వీరేశలింగం, గురజాడ, శ్రీ శ్రీ , రావిశాస్త్రి మొదలైన సాహిత్యాకారులు సమాజ సంస్కరణ కోసం సాహిత్యాన్ని బలంగా ఉపయోగించి ‘సామాజిక స్పృహ ‘ ను చాటుకున్నారు, సమాజ శ్రేయస్సే సామాజిక దృక్పధం గా రచనలు చేశారు. ఇదీ స్థూలంగా సామాజిక దృక్పధమంటే . ఇక ‘శ్రీ శ్రీ వచన రచనల్లో సామాజిక దృక్పధం’ఎలా ఉందో సంగ్రహంగా వివరిస్తారు.
కల్పనాత్మక శ్రీశ్రీ వచన రచనల్లో సామాజిక దృక్పధం: కల్పనాత్మక వచన రచనల్లో  నవలలు, కథానికలు , నాటికల్ని శ్రీశ్రీ రాశాడు. వీటిలో చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తూనే సమకాలీన సామాజిక అంశాల్ని జొప్పించాడు.అటువంటి రచనలు నవల, కథానిక , నాటిక ప్రక్రియల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
నవలలు:ఎనిమిదేళ్ల ప్రాయానికే కందంలాంటి పద్యం రాసి సాహిత్య ప్రస్థానం ఆరంభించిన శ్రీ శ్రీ దాదాపు అదే కాలంలో గోకులాయి(1918) నవల రాశాడు. అనంతరం వీరసింహ విజయ సింహులు (1920) , పరిణయ రహస్యము (1924) రాశాడు. ఈ మూడింటిలో చివరిదైన ‘పరిణయ రహస్యము ‘మాత్రమే ప్రస్తుతం లభ్యం.మొదటి రెండు అముద్రితాలు, రాత ప్రతులూ అలభ్యం.ఆ తర్వాత రాసిన నవల ‘ఆదర్శ జీవులు ‘ వీటిలో ఒక్కొక్కటి వివరించబడుతుంది.
పరిణయ రహస్యము: ఈ నవలను ఆంధ్ర సంజీవనీ గ్రంధామాల వారు 1924 లో ముద్రించారు. దొరకుతున్న శ్రీశ్రీ రచనల్లో ఇదే మొదటిది. ఇది శ్రీ శ్రీ బ్రతికున్న కాలంలో లభ్యంకాక ఇటీవలే లభించింది. అందుకే శ్రీశ్రీ  “……… నాపరిణయ రహస్యము(అప్రాధ పరిశోధక నవలిక) పుస్తకం ఇప్పుడెక్కడా దొరకదు. దీనికోసం ఎందరో మిత్రులు గాలిస్తున్నారు. దొరుకుతుందనే ఆశలేదు “అని భావించాడు.
పది ప్రకరణాల నవలిక’ పరిణయ రహస్యము’ ఇందులో కృష్ణారావు అనే అతను పెళ్ళి చేసుకోవడంలో మోసపోయి ఎన్నో కష్టాలకోర్చి చివరికి పెళ్ళి చేసుకోవడం ఇందులోని ఇతివృత్తం. ఈ నవలికలో కృష్ణారావుతోపాటు, నారాయణ్రావు, రాఘవయ్య, రామమోహనరావు, రాజారావు , ఆనందరావు, కామేశ్వరరావు, పద్మనాభరావు ( బంగారమ్మ ) దత్తు, కాంతమ్మ మొదలైన పాత్రలున్నాయి.
ఈ నవలలో విద్యతోపాటు అందమూ ఉన్న అమ్మాయిని పెళ్ళాడడం కోసం కృష్ణారావు ఎంత ప్రయత్నించినా వధువు దొరకదు. దీన్ని మనం గమనిస్తే నాటి సమాజంలో చదువుకున్న అమ్మాయిలు అతి తక్కువగా ఉన్నారని తెలుస్తుంది. అంతే గాదు నాటి సమాజంలో భార్యగా ఎలాంటి వారిని పొందాలనుకుంటున్నారో గ్రహిస్తాం. ఇంకా “లోకమున సామాన్యముగా దమకూతులకి యెవరైనా వరునెన్వేషింతురుగాని మన నారాయణ కుమారునికే వధువు నన్వేషింపవలసి వచ్చెను”అనడం వల్ల నాటి సామాజిక స్థితి ఎలా వుందో తెలుస్తుండి. ఈ నవల ముద్రణ పొందిన నాటికి శ్రీశ్రీ వయస్సు కేవలం 14 సంవత్సరాలే. ఈ వయసుకే సమాజాన్ని ఎంత నిశితంగా శ్రీరంగం శ్రీనివాసరావు పరిశీలించాడో అర్థమవుతుంది.
ఆదర్శజీవులు: ఈ నవలను ఆరుగురు ప్రముఖ రచయితలతో ఆకాశవాణి వారు రచింపజేశారు. దీన్ని పాలగుమ్మిపద్మరాజు, గోపీచంద్, కొడవటిగంటి కుటుంబరావు, చింతా దీక్షితులు, ముని మాణిక్యం నరసింహారావు గార్లతో పాటు శ్రీశ్రీ కూడా రాశాడు. ఈ రచయితల్లో ఒక్కొక్కరు ఒక్కోఅధ్యాయం సృజించారు. వీటిలో ‘సుదర్శనం ;లోకం’ అనే అధ్యాయాన్ని శ్రీశ్రీ రాశాడు. ఇందులో నాయికా నాయకులు శకుంతల, సుదర్శనం. ఈ అధ్యాయం మొత్తం ఈ రెండు పాత్రలే ఉంటాయి. తను తండ్రి కాబోతున్నట్లు తెలుసుకున్న సుదర్శనం తన తండ్రి , తను , తనకు పుట్టబోతున్న కొడుకుల జీవితాల గురించి సమాజతీరు నేపధ్యం తో ఆలోచిస్తాడు. చివరికి తనకు పుట్టబోయే శిశువుకు లేఖరాస్తాడు అందులో తన తండ్రి నాటికి , తన కాలం నాటికి సమాజంలో వచ్చిన మార్పులను తెలుపుతూ తన కొడుకు వచ్చేనాటికి బాగుపడె అవకాశం ఉన్నట్లుగా భూత, వర్తమానాల బేరీజుతో భవిష్యత్తు పట్ల మరింత బావుంటుదని ఆశను వ్యక్తపరిచాడు శ్రీ శ్రీ సుదర్శనం పాత్ర ద్వారా . ఇక్కడ శ్రీశ్రీ’గతకాలమె మేలు వచ్చు కాలము కంటెన్’ అనేదాన్ని గాక ‘ గతమున మంచి కొంతే నోయ్ ‘ అన్న భావానికి అనుకూలంగా చెప్పి జీవితం పట్ల తన పాఠకుల్లో ఆశాజనక మార్గ నిర్దేశం చేశాడు శ్రీశ్రీ.
ఈ  విధంగా పరిణయ రహస్యం ఆదర్శజీవులు ఈ రెండు నవలల్లో నాటి సమాజస్థితి గతులను చూపి పురోగమనం వైపు పాఠకులను తీసుకెళ్ళాడు శ్రీశ్రీ.
కథానికలు :పదహారవఏట నుండే కథానికలు రాయడం మొదలుపెట్టాడు శ్రీశ్రీ . మొత్తం కథల్లో డిసెంబరు 1926 లో ‘లలిత ‘ మాసపత్రిక లో అచ్చైన ‘ఆనందమందిరము’  మొట్ట మొదటి కథానిక. మొత్తం అరవైరెండు కథానికల్ని రాశాడు శ్రీశ్రీ. వీటిలో ఇరవై ఏడు అనువాదకథలు. మిగతా ముప్పయ్ ఐదు స్వీయ కథానికలు.
మొట్టమొదటి కథానికైన’ ఆనంద మందిరము’ మద్యపాన సమస్యను చిత్రించాడు శ్రీశ్రీ. మద్య పానం మన నెట్లా దహిస్తుందో చూశాడు రచయిత. సామాజికంగా , ఆర్థికంగా ఎలా దిగజారవలసి వస్తుందో మధ్యం వల్ల చిత్రించి జనాన్ని జాగృతి పరిచే ప్రయత్నం చేశాడు శ్రీశ్రీ.
గుర్రపు పందాలు కుటుంబాల్లో ఎలా ప్రభావాన్ని చూపుతాయో తెలిపే కథానిక ‘అశ్వమేధయాగం’.తల్లి మరణ శయ్యపై ఉందని తెల్సినా పందెపు గుర్రాల గురించి ఆలోచించే ప్రబుద్ధుల గురించిన సామాజిక స్పృహను కలిగించే కథానిక ఇది.
‘ ఒసె తువ్వాలు అందుకో ‘ లో పురుషాధిక్య భర్త అణగి మణగి ఉండే భార్య స్వభావాన్ని చిత్రిస్తూ నాటి సమాజానికి అద్దం పట్టి చూపాడు శ్రీశ్రీ. ‘హేమంతం’కథానికలో ‘ భిక్షువర్షీయసీ’కవితలోని అవ్వను బిచ్చగత్తెగా ఈ వ్యవస్థఎలా మార్చిందో చక్కగా వివరించబడింది. ఈ చోట “మీ రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాలలో ఎంత నల్లమందు లేదు?”6 అని శ్రీశ్రీ అనిపించడంతో నాటి సమాజంలో రాజకీయ వ్యవస్థ ఎలా వుందో తెలుస్తుంది. ఇంకా ఈ కథ ద్వారా విశాఖ పట్టణం ఎదుగుతున్న తీరు, ఆ సందర్భంలో మనుషుల మధ్య దిగజారుడుతనం మొదలైన వెన్నో అవ్వ పాత్ర ద్వారా శ్రీశ్రీ చెప్పింది నాటి సమాజాన్ని కళ్ళకుకట్టాడు.
‘ అనామిక ‘ కథానిక లో తను కథ రాస్తున్నట్లు దానిలో నాయకున్ని ఎవర్ని చేయాలో యొచిస్తూ “… ఒక నాయకున్ని ఈ మధ్య ఆశ్రయించాను.ఏదో ఉద్యోగానికొచ్చాననుకుని ప్రధాన మంత్రికి ఉత్తరం ఇస్తానన్నాడు” అని చెప్పడం వల్ల నాయకుల దగ్గరికి జనం ఎందుకు వెళ్ళుతున్నారు. సమాజం కోసం కాక స్వార్థ పూరిత పనుల కోసం వేళ్తున్నారని చెప్పకనే చెప్పాడు కథా రచయిత శ్రీశ్రీ.
శ్రీశ్రీ రాసిన మంచి కథానికల్లో ‘చరమరాత్రి’ ఒకటి. ఓ సామాన్య యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకునే పరిస్థితుల్ని కల్పించిన వ్యవస్థ గూర్చి తెలిపే కథ ఇది. మన వ్యవస్థలో ఉన్న అవలక్షణాలను వివరిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా “…….. ఎవరికి వారు, తమ తెలివి తేటలనూ, జిత్తులనూ సామర్ధ్యాలనూ డబ్బుకింద మార్చుకోడానికి ప్రయత్నించడం పరిపాటి. ధనార్జన ప్రధానమై, పరదైవమై, మానవులకు మహదాశయమై పోయింది.”8 అని ప్రస్తుత మన సమాజంపై తన దృక్పధాన్ని పాత్ర ద్వారా చెప్పించాడు శ్రీశ్రీ.
‘జాలి’ కథానికలో బూట్ పాలిష్ చేసే కుర్రాడు చేసే మోసాన్ని చూపి, దేశంలో జరుగుతున్న పెద్దపెద్ద మోసాల ముందు పొట్టకూటి కోసం చేసే ఈ కుర్రాడీ మోసం ఏ పాటిదన్న విధంగా చూపాడు శ్రీశ్రీ.
శ్రీశ్రీ కథానికల్లో నిడివిలో అతిచిన్నదైనా భావంలో, వ్యక్తీకరణలో అతిశక్తి వంతమైనది’ చావూపుట్టుకా’  అనే కథానిక. ఇందులో ఒకవైపు ఆసుపత్రిలో ఒక శిశువు ఉదయించడం, మరో వైపు పొలీసు స్టేషల్లో  ఒకకుర్రాడు చిత్రహింసలపాలై మరణాన్ని పొందడాన్ని శ్రీశ్రీ అద్భుతమైన  కథానికగా మలిచాడు. మన సమాజం కమ్యూనిస్టుల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నదో చూపాడు శ్రీశ్రీ.
చైతన్య స్రవంతి ధోరణి తెలుగులోకి మొట్టమొదట ప్రవేశపెట్టిన సాహిత్యాకారుడు శ్రీశ్రీనే. శ్రీశ్రీ కొన్ని కథానికల్లో అక్కడక్కడ ఇది కనిపించినా కోనేటి దినం, కోనేటి రాత్రి, కోనేటి జన్మ కథానికలను మాత్రం పూర్తిగా ఈ ధోరణి లొనే రాశాడు. ఇందులో ఒక సగటుగుమాస్తా జీవితం ఎలాగుందో చిత్రించి చూపాడు శ్రీశ్రీ. కోనేటి దినం కథను  హెడ్డు గుమాస్తా కోనేటి రావు పంతులు పదకొండు గంటలయింది. గుమాస్తా కోనేటి హెడ్డు పదకొండు గంటలు కొడుతున్నాడు. ఆఫీసువేళ కోనేటి గంటల గందరగోళం తొందర భోజనం ముగించుకుని చుట్ట బిగించుకుని బట్టా సవరించుకుని పాగా తగిలించుకుని ఒసే కుర్రాళ్ళ్ఉ జాగ్రత్త……”9 అని ఆరంభించాడు శ్రీశ్రీ. ఈ కోనేటి రావు మూడు కథల్లో అన్యాయాలు, అ ధర్మాలు ఎంత యధేచ్ఛగా మన సమాజంలో ఎంత ఆధిపత్యంఆ వహిస్తున్నాయో చూపాడు.
ఇలా శ్రీశ్రీ చాలా కథల్లో తన కాలం నాటి సమాజం స్థితిగతులను ఎత్తి చూపాడు, వాటి పట్ల మనలో హేయ్యభావం కలిగేట్టుగా చేయడాన్ని మనం గమనిస్తాం.
నాటికలు : బాలనటుడిగా నాటక రంగంలోకి అడుగిడిన శ్రీశ్రీ ఇరవై పైగా నాటికలు రచించాడు. వీటిల్లో రేడియో కొరకు శ్రావ్య నాటికలు , ప్రదర్శనా యోగ్యమైనకొన్ని నాటికలు ఉన్నాయి. వీటిల్లో శ్రీశ్రీ సామాజిక దృక్పధం ఎలా ఉందో చూద్దాం.
చతురస్రం: ఈనాటికలో స్త్రీ,పురుషుడూ, సిరి, న్యూస్ ఎనౌన్సర్, పండిట్ మనోహర లాల్,శ్రీరావ్ ,కళ , సిలన్, హైమన్ , భారత ప్రతినిధి , శాంశ్వన్ ,లుముంబా జూనియర్, సోవియట్ ప్రతినిధి , ఫిలిప్పిన్స్ ప్రతినిధి, ఙ్ఞానం , రాజ్యం, డాక్టర్ దైవం పాత్రలున్నాయి.ప్రధానంగా మృత్యువును మానవుడు జయించడమనే ఇతి వృత్తంతో ఈ చతురస్రం నాటికను రాశాడు శ్రీ శ్రీ .ఇందులో ఈ పాత్రతో  “………. రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినా మానవజాతికింకా మానసిక స్వాతంత్ర్యం ఏర్పడలేదు ” 10 అని అనడం వల్ల మన సమాజం ఎదగాల్సిన దృక్పధాన్ని శ్రీ శ్రీ సూచించినట్లయింది.
సుప్తాస్థికలు:మహాత్మా గాంధీ మరణానికి బాధపడుతూ శ్రీశ్రీ రాసిన నాటిక ఇది. ఇందులో భూమి మీదున్న మనుషులే గాక ఆకాశంలోని నక్షత్రాలు సైతం బాధపడ్డట్టు ఈ నాటికలో చూపాడు శ్రీశ్రీ. గాంధీజీ గురించి “అతడు సామాన్య వ్యక్తి / అతడు సామన్య వ్యక్తి / తృణం కన్నా తేలిక/ మేరువు కంటే ధీరుడు” 11అనిచెప్పి “…. అతడిప్పుడు లేడు / అతడెప్పుడూ వున్నాడు “అని మహాత్ముడు ప్రజల హృదయాల్లో సర్వదా ఉంటాడని తెలిపాడు శ్రీశ్రీ.
విదూషకుడి ఆత్మహత్య: వేదిక మీద కనిపించి తన చేష్టలతో ఎంతో హాస్యాన్ని సృష్టించే విదూషకుడి తెరవెనుక జీవితంలో ఎన్నో కష్టాలున్నాయని తెలిపే ఇతివృత్తం ‘విదూషకుడి ఆత్మహత్య’ నాటిక . విదూషకుడు ఆత్మహత్య చేసుకోవడాన్కి ముందు రాసిన లేఖలో అతని మరణానికి కారణాలు, లోకంతీరు నాటకంలో తన పాత్ర గురించిన మొదలైనవి వివరిస్తూ “………… నేను రంగస్థలం మీద విదూషకుడుగా నిలబడి లోకాన్ని నవ్వించడానికి పడ్డ బాధ, పరమ దరిద్రంతోసహా అమిత వేగంతో ఎదుగుతున్న నా పిల్లల్ని చూసుకుంటూ ఉంటే కలిగే   సంతోషమూ ఒక్కలాగే కనబడుతున్నాయి “12 అనిఏడవలేక నవ్విన విధంగా తెలుపుకున్నాడు విదూషకుడు  .ఈ పాత్ర ద్వారా లోకంలో సామాన్యుడు నిత్యం ఎన్ని కష్టాల పాలవుతున్నాడో మనకు అవగతమవుతుంది.
గ్రామఫోను రికార్డుల తిరుగుబాటు::     ఈ సృష్టిలో ఏదైనా ఎంతోకాలం చాకిరీ చేయెద్దు, తన హక్కుల కోసం తిరగబడాలనే ఆలోచన శ్రీశ్రీది. కాబట్టే 1934 లోనే ‘అవతారం’ అనే కవితలో “నరకలోకపు జాగిలమ్ములు / గొలుసు త్రెంచుకుఉరికి పడ్డాయి/… కనకదుర్గ చండ నింహం జూలు దులిపీ, ఆవులించింది”13 అని తిరుగుబాటును తెలిపిన శ్రీశ్రీ ఈ  నాటికలో గ్రామఫోనురికార్డులతో తిరుగుబాటు చేయించాడు. అదే విషయాన్ని “తిరుగుబాటు చేసిన గ్రామఫోను ప్లేట్లు నాయకుణ్ణి. పీడిత సంగీత లోకపు హక్కులను అక్కడ పెట్టడం నిలవేసి అడగటానికి వచ్చాను” అని ఓ రికార్డు చేత అనిపించాడు శ్రీశ్రీ. సమాజం పట్ల శ్రీశ్రీ తన బాధ్యతను నెరపడానికై హక్కులు కొల్పోయిన ప్రతీఒక్కరు పోరాడాలని చెప్పకనే చెప్పాడు ఈ నాటిక ద్వారా శ్రీశ్రీ.
గుమాస్తాకల:కోనేటి రావు పాత్రతో మూడు కథలు రాశాడు శ్రీశ్రీ. అదే పాత్రతో’ గుమాస్తాకల’ అనే నాటిక కూడా రాసి ఈ వ్యవస్థలో గుమాస్తా జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మన ఊహకే వదిలి అతను కన్న కలలు- ఈయనను మించిన ఇంజనీరు లేడని తమ దేశానికి అమెరికా ఆహ్వానించడం మొదటికల. రెండవకలగా జర్మన్ సబ్మేరీన్ కమాండర్ జటావల్ కోనేట్ . మూడో కల కథానాయకుడుగా ఓ సినిమాలో నటించడం ఇవన్నీ ఒక సామాన్య గుమాస్తా జీవితంలో సాధ్యంకానివి, కలలో మాత్రమే సాధించడం సాధ్యం మన సమాజంలో అని  శ్రీశీ ఈ నాటికలో చూపాడు.
బలి: ఈ నాటికలో దేవతల రాజైన ఇంద్రుడు , రక్షసుల రాజైన బలి చక్రవర్తిలలో ఎవరు ఉన్నతులో, మంచివారో చూపడమే ఇతివృత్తం . ఇంద్రుడు ఈ నాటికలో జలాంతశ్చంద్ర చపల అనేఆమెను చెరబట్టాబోతాడు. ఆమెను బలి చక్రవర్తి కాపాడతాడు . ప్రస్తుత లోకంలో న్యాయ, అన్యాయాలు ఎటువైపు ఉన్నాయో తన దృష్టిలో శ్రీశ్రీ ఈ నాటికలో ప్రస్ఫుటంగా చూపి మన దిశా మార్గ నిర్దేశం చేశాడు.
మరో ప్రపంచం: 21వ శతాబ్దంలో మానవుడు ఈ భూమిపై ఎలాఉంటాడో కల్పనాత్మకంగా రాసిన నాటిక ఇది. తను చూస్తున్న లోకంలో మానవుడు పడుతున్న కష్టాలేవీ పడకూడదనే భావనతో మరో ప్రపంచాన్ని సృష్టించాడు శ్రీశ్రీ అలా మారాలని ఆశించాడు. ఈ నాటిక చదివిన పాఠకులెవరైనా మన సమాజం అలా మారితే బావుండనిపించేలా ఈ నాటికను తీర్చిదిద్దాడు శ్రీశ్రీ.
స్వామి : భూస్వామి: భూపరిమితి చట్టం వల్ల భార్య పేరున కొంత భూమి మార్చి విడాకులిచ్చినట్లుగా చట్టం ప్రకారం చేసి భూమి ప్రభుత్వం పాలు కాకుండా మోసాలకు పాలు పడడం జరుగుతున్న విధానాన్ని ఈ నాటికలో చక్కగా చూపాడుశ్రీశ్రీ.మధ్య  మధ్యలో ప్రస్తుతం సాహిత్యంపై “చవకబారు నవలలు చదవడానికి కలవాటు పడ్డాక ప్రౌఢ ప్రబంధాల విలువ ఎలా తెలుస్తుంది”14 అని పాఠకుల్లో వస్తున్న మార్పుల్ని పేర్కోన్నాడు. ఇలా సమాజంలో ఉన్నతీరును తన బాధ్యతగా తెలిపాడు శ్రీశ్రీ.
దడిగాడు వానసిరా :ప్రస్తుత మన తెలుగు సినిమా రంగం ఎలా భ్రష్టు పట్టి ఉందొ చెప్పడానికి ఈ నాటికే నిదర్శనం.
ఇలా నాటక ప్రక్రియలో పలు నాటికలు రాసి వాటి ద్వారా సమాజం పట్ల తన బాధ్యతతో కూడిన అభిప్రాయాలు, ఊహాలకు రూపమిచ్చాడు. వ్యవస్థను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేశాడు.
కల్పనేతర శ్రీశ్రీ వచన రచనల్లో సామాజిక దృక్పధం కల్పనాత్మక సాహిత్య ప్రక్రియల్లో శ్రీశ్రీ తన సామాజిక దృక్పధాన్ని ఎప్పటికప్పుడు తెల్పిన దానికంటే ఎక్కువగా కల్పనేతర సాహిత్య ప్రక్రియల ద్వారా వ్యక్తపరిచాడు. అవి వ్యాసాలు , పీఠికలు , సమీక్షలు, సంపాదకీయాలు, ప్రశ్న – జవాబులు . వీటిలో ఒక్కొక్కటి సంగ్రహంగా వివరించడం జరుగుతుంది.
వ్యాసాలు :శ్రీశ్రీకొన్ని వందల వ్యాసాలు రాశాడు. అవి విభిన్న అంశాలపై ఉన్నాయి. ఏ వ్యాసం రాస్తున్నాప్రజల ఉపయోగం కోసం రాసే రచయితల పట్ల తనకు గౌరవమని ‘ రచయితల గురించి’ అనే వ్యాసంలో పేర్కొన్నాడు.
“ఏది విప్లవపంథా ?” అనే వ్యాసంలో సాహిత్య విమర్శ ఎలా చేయాలో చెబుతూ అది మూడు రకాలుగా చెప్పాడు. మొదటిది కాల నిర్ణయం, విషయ విమర్శ, ఛందో వివరాలుగా చెప్పి; రెండో రకంగా విమర్శగా గతి గార్కిక భౌతిక వాద మార్గంతో తెల్పడంగా వివరించి; మూడొ రకం విమర్శగా మనస్తత్వ పరిశీలన అని తెలిపి వీటిలో “సంఘాన్ని ముందుకు నడిపించడమే విప్లవ పంథా, అభ్యుదయ రీతి! ఇది కావ్య విమర్శకు గీటూరాయి”15గా తేల్చి చెప్పాడు.
కవిత్వం రాయ నారంభించిన తొలి రోజుల్లో తనపై ప్రభావాన్ని చూపిన కవుల్లో ప్రముఖుడుగా కవి సామ్రాట్ విశ్వనాథను పేర్కోన్న శ్రీశ్రీ తర్వాతర్వాత విశ్వనాథ భావాలను తీవ్రంగా గర్హించాడు. విశ్వానాథ మరణించిన అనంతరం ” కవ్యుద్ఘ విశ్వనాథ్” పేరుతో ఓ  వ్యాసం రాసి అందులో ఓ చోట ” విశ్వనాథం మృతి పట్ల నేనెక్కడా బహిరంగంగా సంతాప ప్రకటన చెయ్యలేదు. కాని అంతర్గతంగా ఒక ఆత్మీయుణ్ణి కోల్పోయినట్లు బాధ పడుతున్నాను”16 అని తన బాధను తెలిపాడు.విరసం కార్యవర్గ సభ్యులు చెరబండరాజు , జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ గారలను 02-08-1971   నాడు అరెస్టు చేశారన్న వార్తవిని ఎంతో బాధపడ్తూ “గుండెలో గునపం “   పేరుతో ఓ వ్యాసం రాశాడు శ్రీశ్రీ. దీనిలో విప్లవ కవులను పోలీసులు నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండించాడు. ఈ వ్యాసం విరసం మొదటి మహాసభల ప్రత్యేక సంచిక ‘ఎరుపు ‘(ఆగస్టు, 1971) లో ముద్రితమైంది ఈ విధంగా చాలా సంఘటనలకు స్పందించి తన అభిప్రాయాన్ని తెలుపుతూ వ్యాసాల్ని రాసాడు శ్రీశ్రీ.
పీఠికలు:కవిగా తనకంటే ముందు తరం కవులను సైతం స్పందించజేసిన శ్రీశ్రీ ఏది సృజించినా తనదైన ముద్ర ఉంటుంది.ఇది నచ్చిన కృష్ణాశాస్త్రి లాంటి తన ముందు తరం కవులు, మల్లవరపు విశ్వేశ్వరరావు తన   సమకాలీన కవులు, తన తర్వాతి తరం కవులు ఎందరో తమ పుస్తకాలకు శ్రీశ్రీ చేత పరిచయాత్మక పీఠిక   రాయించుకోవడానికి తహతహలాడేఆరు.
ఏ పుస్తకానికి పీఠిక రాస్తున్నాడో ఆ పుస్తకాన్ని  కవిని అభినందిస్తూనే సమకాలీన స్థితి గతులపై తన దృక్పధాన్ని రాసేవాడు శ్రీశీ.మచ్చుకు కొన్ని చూద్దాం. తెలంగాణ సాయుధ పోరాటానికి స్పందనగా ఆరుద్ర ‘త్వమేవాహమ్’ రాసే దాని గురించి మంచి  విమర్శనాత్మక వ్యాసం రాయగా దాన్ని తర్వాతి ముద్రణలో పీఠికా స్థానంలో ముద్రింపజేశాడు ఆరుద్ర. ఈ పీఠికలో నాటి తెలంగాణ సాయుధ పోరాటానికి చెందిన అంశాలతో పాటు ఆరుద్ర కవిత్వం తీరును వివరించేడు శ్రీశ్రీ. ‘లే’ కవితా సంకలనానికి పీఠిక రాస్తూ నాటి ప్రభుత్వాల తీరును ఎండగట్టాడు.
రావిశాస్త్రి రాసిన’ ఆరు సారా కథలు’ పుస్తకానికి పీఠీక ఆ కథలు సమకాలీన సమాజానికి ఎలా దర్పణం పట్టాయో కథల్లోని సంఘటనల్ని  ఉదహరిస్తూ రాసిన ఈ పీఠిక చూస్తే సమాజం పట్ల శ్రీశ్రీ దృక్పధమెంటో అవగతమం అవుతుంది.
ఇలా పలు పీఠికల్లో వ్యవస్థలో రాజకీయాలు, సాహిత్యము, సామాన్యుడీ అవస్థలు శ్రీశ్రీ ఎత్తి చూపినట్లు గ్రహిస్తాం.
సమీక్షలు:పుస్తకాలు, నాటికలు , సినిమాలు మొదలైనా అంశాలపై సమీక్షలు రాశాడు శ్రీశ్రీ. ప్రముఖ కవి కె.శివారెడ్డి రాసిన ‘ఆసుపత్రి గీతం’ పై రాసిన సమీక్షలో ఆనాటి వ్యవస్థను కవి ఎలా దర్శింప జేశాడో బెబుతా ” ఈ ఆసుపత్రి ప్రస్తుత వ్యవస్థకి ఈ నాటి సమాజానికి ప్రతీకగా మనం స్వీకరించాలి”17  అని సమీక్షలో తెలిపాడు శ్రీశ్రీ.
ఆత్రేయ రాసిన ‘విశ్వశాంతి’ నాటీకను సమీక్షస్తూ నాటికల్ని చదివిగాక ప్రదర్శన చూసి సమీక్ష  రాయాలను తెలుపుతూ నాటి సమాజానికి’శాంతి ‘గురించి వివరించాడు.ఇలాగే యోగి ‘ వేమన’, ‘మనుషులు మారాలి’ మొదలైన చలన చిత్రల సమీక్షల్లో సమాజానికి ఆయా సినిమాల ఆవశ్యతకతను విశదీకరించేడు శ్రీశ్రీ.
సంపాదకీయాలు:చాలా పత్రికల్లో ఉప సంపాదకుడూగా పని చేసిన శ్రీశ్రీ కొన్ని పత్రికల్లో సంపాడకుడి బాధ్యతలు కూడా నిర్వహించాడు. అప్పుడూ సంపాదకీయాలు రాశాడు. వీణ , నవత మొదలైన వాటికి సంపాదకీయాలు రాశాడు. శ్రీశ్రీ సంపాదకీయాల్లో మొట్టమొదటిది ‘వీణా’ ప్రారంభ సంచికకు ‘సృతులు’పేర సంపాదకీయం రాశాడు.అందులో సమాజాన్ని సరైనా మార్గంలో నడపడానికి యువకవుల్ని, నవకవుల్ని ఆహ్వానించాడు. ఇందులో నాటి వ్యవస్థ తీరును నిశితంగా తెలిపాడు శ్రీశ్రీ. మొత్తం ఐదే ఐదు సంపాదకీయాలు రాశాడు. వీటిల్లో సాహిత్యము, సమాజం మొదలైన అంశాలన గురించి వివరించాడు.
ప్రజ    : తెలుగు సాహిత్యకారుల్లో ఎవ్వరికీ దక్కని విశిష్టత మహాకవి శ్రీశ్రీకి దక్కింది. సాధారణంగా కవులుగానీ రచయితలుగానీ రచనలు చేయడం ఆవార్డులో , రివార్డులో , ప్రజాదరణ పొందడం జరుగుతుంది. కానీ వీటన్నిటితో పాటు ఎప్పటికప్పుడూ మాధ్యమాలు గానీ సాటి సాహిత్యకారులు కానీ శ్రీశ్రీ అభిప్రాయాలు తెలుసుకోడానికి ఇంటర్వూలు చేయడం, ఇష్టాగోష్టుల వంటివి నిర్వహించడం, వాటిని ముద్రించడం జరిగింది. ఇవన్నీ కలిపి ‘ప్రజ’శీర్షికన ప్రత్యేకంగా ఒక పుస్తకమే పుట్టుక రావడం వల్ల శ్రీశ్రీ అభిప్రాయాలకున్న గౌరవం, ఆదరణ తెలుస్తుంది. ‘ప్రజ ‘ అంటే ‘ప్రశ్న , జవాబులు ‘ అని మనకు తెలుసు . ఇందులో సాహిత్య అంశాలతో పాటు ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై కూడా తన దృక్పధాన్ని తెలియజేసాశు శ్రీశ్రీ . వాటిలో కొన్ని చూద్దం. ప్రగతి వార పత్రిక 16-5-1969 సంచికలో బానిసత్వంలో మ్రగ్గుతున్న నేటి స్త్రీని విముక్తి చేయాలంటే దేనినిమార్చాలి ? అన్న ప్రశ్నకు సమాధానంగా “బానిసత్వంలో మ్రగ్గుతున్నది ఒక్క స్త్రీలు ,మాత్రమేనా ? స్త్రీలకైనా పురుషులకైనా సమాజంలోని ఎగుడూ దిగుడుల్ని చదునుగా మార్చినప్పుడే విముక్తి “18 అని సమాధానమిచ్చాడు. ఇదే సంచికలో కమ్యూనిస్టు లెప్పుడూ యుద్ధాన్ని నిరసిస్తారు. సామ్రాజ్యవాదులే యుద్ధన్ని. మానవ సంహారాన్ని , అందువల్ల వచ్చే లాభాలని కోరుకుంటారు. ఇంకో యుద్ధం వస్తే తాము కూడా తుడుచుకు పోతామన్న భయం చేతనే సామ్రాజ్యవాదులు తమ వద్ద నున్న అణ్వాయుధాలకి పని కల్పించలేదు”19 అని సామ్రాజ్యవాదుల క్రూరమైన ఆలోచననను తెలిపాడూ శ్రీశీ.
పసుపులేటి రామారావు గారు శ్రీశ్రీ తో ఇంటర్వూ చేస్తూ “శ్రీశ్రీకి కచ్చితమైన ఒక అభిప్రాయాం లేదు అని చాలాచోట్ల వినిపించే కామెంట్ కి ఏమంటారు?”
ఆడిగిన ప్రశ్నకు “శ్రీశ్రీకి కమ్యూనిజం అనేటువంటి విధానం ఎప్పుడో ముడిపడిపోయింది. ఆ ముడి ఈ నాటీకీ విడనిది. ఈ ముడీ విడిపొయింది అని ఎవరైనా రుజువు చేయగలరా ? ఈ నాటీకీ శ్రీశ్రీ కమ్యూనిజంకే బద్దుడై వున్నాడు “20 అని తన నిబద్ధతను చెపుకున్నాడు శ్రీశ్రీ.
ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన ప్రశ్నజవాబుల్లో ఓ ప్రశ్న “కమ్యూనిస్టు పార్టీ మీటింగులకు ప్రజలు కోకొల్లల్లుగా వస్తారుగాని ఎన్నికల సమయానికి మొండి చేయి చూపుతారు కారణం?”అని అడగ్గా సమాధానంగా “అప్పుడాచేతుల్లో కరెన్సీ నోట్లుంటాయి కాబట్టి “21 అని వ్యవస్థతీరును బట్టబయలు చేశాడు శ్రీశ్రీ
ఇలా శ్రీశ్రీని అడిగిన ప్రశ్నల్లో అంతర్జాతీయ, జాతీయ , ప్రాంతీయ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలిపాడు శ్రీశ్రీ.
ఈ విధంగా శ్రీశ్రీ కల్పనాత్మక , కల్పనేతర “నా రచనలలో లోకం ప్రతిఫలించి,/ నా తపస్సు ఫలించి,/  నాగీతం గుండెలలో ఘూర్ణిల్లగ/ నాజాతి జనులు పాడూకునే / మంత్రంగా మొగించాలని, / నా ఆకాశాలను/ లోకానికి చేరువుగా,/ నా ఆదర్శాలను / సోదరులంతా పంచుకునే / వెలుగుల రవ్వల జడిగా “22 చేయాలని ఆశిస్తూ ఎప్పాటికప్పుడూ సమాజస్థితిగతుల్ని తెలుపుతూ, సమాజం పట్ల తన బాధ్యతగా ఎండగడుతూ, సామాజిక స్పృహతో  యావత్ సమాజన్ని సమసమాజం వైపు నడపడానికి తన వంతు కృషి సలిపాడు మహాకవి శ్రీశ్రీ.

పాద సూచికలు:
1.మహా ప్రస్థానం , పుట -72
2. మహా ప్రస్థానం, పుట -76
3.సామ్యవాద వాస్తవికత, పుట-2
4.అనంతం      పుట -35
5.పరిణాయ రహస్యము , పుట -2
6.శ్రీశ్రీ కథలు, అనువాద కథలు , పుట -41
7.”               ”               ”                -53
8.”                     ”                  ”       -59
9.”        ”                     ”                – 30
10.    1+1=1 మొదలైన రేడియో నాటికలు , పుట -7
11.     ”                      ”         ”                             -60
12.         ”                    ”                        ” —          73
13.మహాప్రస్థానం, పుట                        —30
14. 1+1=1 మొదలైన రేడియో నాటికలు , పుట —-142
15.శ్రీశ్రీ వ్యాసాలు ,పుట ————-209. 210
16. ”                        ”             —- 279,280
17.వ్యూలు రివ్యూలు ,పుట————–160
18.ప్రజ      ,పుట————42
19           ”           ” ————-
20         ”           ”           ————-182
21            ”             ”————276
22.మహాప్రస్థానం ,పుట -          20

ఉపయుక్త గ్రంధాలు

1.శ్రీశ్రీ ; అనంతం ; విరసం;1990
2.పై ;కథలు , అనువాదకథలు; విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ; హైదరాబాదు; ఆగస్టు, 2008
3 పై ; పరిణయ రహస్యము; ఆంధ్ర సంజీవనీ గ్రంధ్రమాల ; 1924
4. పై ; ప్రజ ; విరసం; 1991
5. పై ; మహా ప్రస్థానం; విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ , హైదరాబాద్ ; జూన్ 2008
6. పై; వ్యూలు రివ్యూలు ; పై           ;1990
7.పై ; శ్రీశ్రీ వ్యాసాలు : పై     1990
8..పై ; 1+1=1 మొదలైన రేడియో నాటికలు  పై; విజయవాడ; ఏప్రిల్ , 1984
9.డాII నోముల సత్యనారయణ; సామ్యవాద వాస్తవికత.

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

2 Responses to “శ్రీశ్రీ వచన సాహిత్యం- సామాజిక దృక్పధం”

  1. 1
    telanganaveerudu Says:

    మ0చి పరిషొధనత్మక వ్యాసము

  2. 2
    madishetty gopal Says:

    వ్యాసమ్ చాలా బాగుంది.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో