వక్త్‌ కీ ఆవాజ్‌

సలాం హైదరాబాద్‌ లోకేశ్వర్‌ ఆత్మచరిత్రాత్మక నవల. తెలంగాణ నవల అన్నాడు గానీ ఇది చార్మినార్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. హైదరాబాద్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. 1969లో ప్రత్యేక తెలంగాణ పోరాట ఉద్యమానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌ అరుదయిన చరిత్ర, అణచివేయబడిన పోరాట చరిత్ర రాసాడు గనుక తెలంగాణ హైదరాబాద్‌ అద్దంలో తన ప్రతిఫలనం చూసుకున్న నవల. అద్దంలో ప్రతిబింబం తప్ప ప్రతిఫలనం కనిపించదు కదా. అందుకే ఈ నవల అద్దం కాదు. హైదరాబాద్‌ చుట్టూ, స్వామిని, వేణును, హైదరాబాద్‌ను, సికిందరాబాద్‌ను కలిపిన హుసేన్‌సాగర్‌ అలల్లో తమ స్నేహాలను, స్వప్నాలను చూసుకున్న నవల.
స్వామిని, వేణును కలపడమంటే తెలంగాణను శ్రీకాకుళాన్ని కలపడం కూడ. స్వామి దగ్గర బయల్దేరి వేణు దగ్గరికి చేరుతామా, వేణు శ్రీకాకుళ ఉద్యమంలోకి వెళ్లిన ఉత్తరం చదువుకుందామా – శ్రీకాకుళం తెలంగాణకు నడచివచ్చిన, కాదు తూర్పుగాలియో, సముద్ర కెరటమో సుడిగాలివలె, తుపాను వలె నాలుగు దిక్కుల చుట్టివచ్చిన ఉదంతం చదువుకుందామా. తుర్రెబాజ్‌ఖాన్‌, అల్లావుద్దీన్‌ల అమరత్వంతో ఆరంభమై ఈ నవల నడుస్తున్న చరిత్రలోని నలభై ఏళ్ల కింద అధ్యాయం దగ్గర ఆగినట్లు (ముగిసినట్లు కాదు) వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంల అమరత్వంతో సెట్‌ బ్యాక్‌కు గురయి అసంపూర్ణంగా ముగిసిన ప్రజాస్వామిక విప్లవ చరిత్ర చదువుకుందామా.

సుడిగాలి, తుపాను అన్నాను కానీ ఈ నవల వసంత మేఘం వలె గర్జిస్తుంది. ఎందుకంటే మనకు వానలు తెచ్చే గాలులు పడమటి మలయ పర్వతాల నుంచి వీచేటివి. ఆ వర్ష సూచన ఆషాఢ మేఘాలు తెస్తాయి. మృగశిరకార్తె తెస్తుంది. కాని ’69 తొలకరి మనకు తూర్పుగాలి తెచ్చింది. వసంత మేఘం తెచ్చింది. శ్రీకాకుళం అడవి తెచ్చింది. ఉత్తర చూసి ఎత్తర గంప అన్నట్లుగా ఉత్తర తెలంగాణలోని గోదావరి లోయ తెచ్చింది. ఇంగ్లిష్‌ వాడు పిలిచిన ఏజెన్సీ ఈ దావానలాన్ని వ్యాపింప చేసింది. అడవిలోనే కాదు, లోయలోనే కాదు, నదులను మాత్రమే మండించలేదు, నగరాలను కూడ మండించింది. తెలంగాణలో ద్విముఖంగా మండించింది. రూపసారాల్లో మండించింది. అంటే తెలంగాణలో విప్లవ సారాంశంలో, విప్లవ నేపథ్యంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అనే భౌగోళిక రూపాన్ని డిమాండ్‌ చేసింది. చెరబండరాజు ‘నన్నెక్కనివ్వండి బోను’ అని ఏఏ సత్యాలు చెప్పడానికి దిగంబర కవిగా విక్రమార్కుని సింహాసనం ఎక్కినా, జ్వాలాముఖి ‘ఓటమి తిరుగుబాటు కాద’ని తెలుసుకున్నా, ‘తిరుగబడు కవులు’ కొండ కోనల్లో నుంచి వీస్తున్న గాలికి స్వాగత హస్తాలు సాచినా, విశాఖ విద్యార్థులు వేసిన సవాళ్లకు ‘ప్రజను సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ కవి’ అని ధీటయిన సమాధానంగా వరంగల్‌ నుంచి ‘విప్లవ కవులు’ స్పందించినా, అది ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజావెల్లువ’ను కనిపెట్టిన అవగాహనయే.
ఇది స్వామి జీవితంలో 18 ఏళ్ల చరిత్ర. అందులోను స్వామి 17వ ఏట 1969 జనవరి 15న ప్రారంభమై 1970 జూలై 10న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం ఎన్‌కౌంటర్‌ వార్త తెలిసిన రోజుతో ముగుస్తుంది. అంటే ఏడాదిన్నర కాలంలో ఇరవైలలో పడుతున్న స్వామి దైనందిన జీవితం. ఆధునికార్థంలో చైనత్య స్రవంతి శిల్పం అనవచ్చునో లేదో గానీ, ఫ్లాష్‌బ్యాక్‌లు, జ్ఞాపకాలు అనే శిల్పంతో చూసినపుడు, అది ఆయన ఇరవై ఏళ్ల జీవితం. ఇంకో ముప్ఫై అయిదేళ్లు గడిచాక స్వామి 2005 జూన్‌ 10 అంటే ’70 జూలై 10 తర్వాత మళ్లీ 35 ఏళ్లకు ఒక నెల తక్కువ కాలానికి స్వామి చార్మినార్‌తో సంభాషణ జరపడంతో నవల ప్రారంభమవుతుంది.

అప్పటికి స్వామి 55 ఏళ్ల హైదరాబాద్‌, తెలంగాణ చరిత్రలకే సాక్షి కావచ్చు. లేదా 37 ఏళ్ల శ్రీకాకుళ ఉద్యమ చరిత్రకు సాక్షి కావచ్చు. కాని ఆయన మాట్లాడుతున్న నాలుగు తలల పెద్దమనిషి వయస్సు 400 ఏళ్లు – అది చార్మినార్‌. రచయిత మాటల్లోనే అది నాలుగు వందల సంవత్సరాల నగర చరిత్రకు ప్రత్యక్ష సాక్షి. ప్రథమ సాక్షి.
కనుక మనం ఇందులో 400 సంవత్సరాల చరిత్ర చదువుకుంటాం.
ఈ చరిత్ర ఎన్నెన్ని అంశాల్లో ఎన్నెన్ని వైవిధ్యం గల స్రోతస్వినులను కలుపుకుందో ఆ సంస్కృతికి మనం సలామ్‌ చెప్పాల్సి ఉంటుంది.  ఈ సంస్కృతికి పునాది ప్రేమ.
ప్రేమ కథ చెప్పడానికి సరళభాష, సాధారణ శైలి చాలవు. ఎందుకంటే ప్రేమమాటల్లో మాత్రమే వ్యక్తమయ్యేది కాదు. అది ఒక మానసిక ప్రవాహస్థితి. అందుకే ఇందులో పంచతంత్రం కథల్లో వలె, కథలోంచి ఉపకథలోకి పయనిస్తాం. అర్ధచేతన నుంచి, స్వప్నాల నుంచి చైతన్య స్రవంతిలోకి ప్రవహిస్తాం. కేవలం తారీఖుల, దస్తావేజుల, స్థలాల, సంఘటనల ఉదంతాలు చదువుకున్నట్లుగా చదువుకొని చెట్లతో అడవిని పోల్చుకుంటాం. స్థల కాలాలు భవిష్యత్‌తో చేసే సంభాషణను స్పష్టంగా వింటాం. స్వామి అనే ఒక ఆత్మ సర్వాంతర్యామి కావడానికి స్థానికతలోని సార్వజనీన లక్షణం, ఒక విముక్త యుద్ధంలో ఒక వేర్పాటు ఉద్యమం సహజమైన అంతస్స్రోతస్విని అయిన ప్రవాహ లక్షణం – వైరుధ్యాల పరిష్కారాల కోసం ఈ నవల పొరలు విప్పుదాం.
ప్రస్తుతానికి చార్మినార్‌ చుట్టూతా, ఆ నాలుగు మీనార్‌ల చుట్టూరానే తిరుగుదాం. అది నాలుగు దిక్కుల తిరగడమవుతుంది. నాలుగు వైపుల నుంచి ఆలోచించడమవుతుంది. రుగ్వేదంలో ‘అనోభద్రాః క్రతవో యన్తు విశ్వతః’  అని చెప్పినట్లుగా గవాక్షాల తలుపులు తెరిస్తే, అది కూడ చార్మినార్‌ గోపురాలపై దాకా ఎక్కి మనసు తలపులు తెరిస్తే నాలుగు వైపుల నుంచి వీచే గాలీ ప్రసరించి వెలుగు – ఒక స్పర్శ, ఒక కాంతి, ఒక అనుభవం, ఒక చూపు.

గోల్కొండ ప్రభువులు, హైదరాబాద్‌ నవాబులు, కులీకుతుబ్షా బాదుషాలు, ఆసఫ్‌జాహీ నైజాం రాజులు పరిపాలించిన తెలుగునేల. మతాలుగా, హిందూ, ముస్లింలు, ఇతరులు, జాతులుగా తెలుగు, కన్నడ, మరాఠీ, ఇతరులు. ఇంగ్లిష్‌వాని జోక్యం లేనంతకాలం ఇచ్చిపుచ్చుకుని కలసిపోయిన సంస్కృతులు. గోల్కొండ, గొల్లకొండనో, గోలీకొండనో. యయాతి చరిత్రను అంకితం తీసుకున్న కుతుబ్షాహీ రాజు మల్కిభరాముడు, హైదరాబాద్‌, భాగ్యనగరం కూడ. ఇదంతా కాల్పనికమా, ఒక తేనె పూతయా. రాజుల కత్తుల పాలనను పంచదార పలుకులతో చెప్పడమా. గగుర్పాటు కలిగించే ఆ ఉదంతాలూ ఉన్నాయి. కలరా వచ్చి వందల వేలాది మందిగా చనిపోతుంటే, చికిత్సలు, ఉపశమనాలు చేసి – నిష్కృతిగా చార్మినార్‌ నిర్మాణం చేయడం, చార్మినార్‌ నిర్మాణం జరుగుతుంటే నడచివచ్చిన లక్ష్మీదేవిని మళ్లీ తిరిగిపోకుండా చేయడానికి ఆ వార్త తెచ్చిన గొల్లవాణ్ని నరికి చంపడం – ఈ మాంత్రిక వాస్తవికత మీద రాజ్యాల చరిత్ర నిర్మాణం కావడం అవాస్తవమేమీ కాదు.
ఒక ప్రవాహం రెండు తీరాలను విడదీసినట్లే రెండు ఒడ్డులను కలుపుతుంది. ముచికుందానది ఏ మతం మనిషి రక్తమైనా ఎరుపేనని ప్రేమభాషలో చెప్పింది. వరదకు ఎదురీది ఆ సత్యాన్ని ఆవిష్కరించుకొమ్మన్నది. ప్రళయ భీకర గాఢాంధకారంలో నీటికి అడ్డం పడి భాగమతి నుదుట ప్రభాత దరహాసాన్ని చూడమన్నది. నాలుగు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్‌ అనే ఒక ప్రేమనగర్‌ వెలిసింది. ప్రపంచ చరిత్రలో రెండు మతాలే కాదు, ఒక ప్రభువు, ఒక ప్రజ అది కూడ ఒక ఆదివాసీ తెగల మధ్య – ఒక పురుషుడు, ఒక స్త్రీయేకావచ్చు – చిగురించిన ప్రేమ వికసించి, వాళ్ల ప్రేమ చిహ్నంగా ఒక నగరం వెలిసిన ఉదంతం ఉన్నదా. యజమాని – సేవక ప్రేమలు, శత్రు శిబిరాల సంధి షరతులుగా ముగిసిన ప్రేమలు, మతాంతర దేశాంతర ప్రేమలు – యుద్ధ రంగంలో ప్రేమకారణంగా ముగిసిన కార్పణ్యాలు ఉండొచ్చు. చరిత్ర అక్కడ ఆగిపోకుండా ఆ ప్రేమబంధం – చేపలు నిండిన సముద్రమై ఒక మహానగరం నాలుగు వందల ఏళ్లకుపైగా ప్రవర్ధమానమై – ఇవాళ మనుషుల మధ్యన మనసులు ఇరుకైన – మనకెంతో తెలిసిన అపరిచిత నగరం.

అట్లని అంతా అనుకూలమేనా? ఆసఫ్‌జాహీ రాజుల చరిత్ర అంతా బ్రిటిష్‌ పాలన అనుకూల చరిత్ర. శాతవాహనులు, కాకతీయులు, విజయనగరరాజులు పరిపాలించినంత సువిశాలమైన తెలుగు సామ్రాజ్యాన్ని ఏలిన వరుసలో వస్తారు కుతుబ్షాహీ రాజులైనా, ఆసఫ్‌జాహీ రాజులైనా. తెలంగాణలోని కోటిలింగాల, ఓరుగల్లు వంటి నగరాలను రాజధానులుగా చేసుకొని పరిపాలించిన శాతవాహన, కాకతీయ రాజుల పరంపరలో వస్తారు గోల్కొండ, హైదరాబాద్‌లను రాజధానిగా చేసుకొని పాలించిన ప్రభువులు. కాని తెలంగాణను, ఆమాట ఒక రాజ్యానికి సంకేతంగా చరిత్రలో నమోదు కాలేదనుకుంటే తెలుగు నేలను, కోస్తా జిల్లాలుగా, సర్కారు జిల్లాలుగా, దత్తమండలాలుగా బ్రిటిష్‌ వలసకు ధారాదత్తం చేసిన చరిత్ర కూడ నైజాములదే. ఈ నాలుగు వందల ఏళ్లలో అదొక రెండు వందల ఏళ్ల పైచిలుకు చరిత్ర. గోల్కొండ రాజ్యానికి మాదన్న మంత్రిగా ఉన్న 18వ శతాబ్దానికే యూరపు నుంచి వచ్చిన వ్యాపార కంపెనీలతో వైమనస్యం ఏర్పడిన తొలి సందర్భాలు, సఖ్యత ఏర్పడిన మలి సందర్భాలూ ఉన్నాయి. ఢిల్లీ పాదుషా ఔరంగజేబు ప్రతినిధిగా వచ్చి – స్వతంత్రత ప్రకటించుకున్న తొలి సందర్భమూ – మచిలీపట్నం పట్టుకోగానే కోస్తా జిల్లాలను ఈస్టిండియా కంపెనీకిచ్చిన మలి సందర్భమూ ఉన్నాయి.
ఇదంతా 1857 కన్నా పూర్వమే. కనుక మనను ప్రత్యక్షంగా బ్రిటిష్‌ వాడు ఎన్నడూ పరిపాలించనప్పటికీ 1948 సెప్టెంబర్‌ 17 కన్నా పూర్వం ప్రత్యక్షంగా తెలంగాణలోని మనం ఎన్నడూ ఢిల్లీ పరిపాలన కిందికి రానప్పటికీ మన నైజాం ప్రభువుల వలన బ్రిటిష్‌ దాస్యం మనకు 1857 కన్నా ఎంతో ముందటి చరిత్ర. మనం మధ్యయుగాలను మరిపించే ఫ్యూడల్‌ పరిపాలనను మాత్రమే కాదు, ఆ పరిపాలకుల వలననే ఇతర సంస్థానాల కన్నా మించిన వలస దాస్యాన్ని కూడ పరోక్షంగా అనుభవించాం. ఆ పరిపాలకుల వలననే తెలంగాణ కన్నా విస్తారమైన తెలుగునేల బ్రిటిష్‌వాని ప్రత్యక్ష పరిపాలన కిందికి వెళ్లిపోయింది.
1672-73 నాటికే గోల్కొండ రాజ్యానికి తూర్పున సముద్రము నుండి పరంగివారి నౌకాబలంతో ప్రమాదమున్నదని, ఐరోపా దేశస్థులతో విదేశాంగ నీతిలో మాదన్న అవలంబించిన భేదోపాయాలను కె.వి. భూపాలరావు గారు రాసి ఉన్నారు. రెండవ నిజాము నిజామలీ ఖాన్‌ 1766లో ఉత్తర సర్కారులను, 1800లో రాయలసీమను ఇంగ్లిష్‌ వారికి ధారాదత్తం చేసాడు.

ఇవి ఐరోపా వర్తక సంఘాలతో, సామ్రాజ్యవాదంతో కయ్యం రాకుండా నెయ్యం కొరకని సరిపెట్టుకున్నా దేశభక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేకులయిన మైసూరు రాజులు హైదరలీ, ఆయన కొడుకు టిప్పు సుల్తాన్‌తో బ్రిటిష్‌వారు పెట్టుకున్న వైరానికి నైజాం అండగా నిలిచాడు. టిప్పుసుల్తాన్‌ను 1799లో ఓడించడానికి సహాయంగా స్వయంగా తన సైన్యాన్ని పంపాడు. సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటనా పోరాటంలో దేశవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచే చరిత్ర టిప్పుసుల్తాన్‌దయితే బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల చెప్పు చేతల్లో, బ్రిటిష్‌ తొత్తులుగా నిలిచే చరిత్ర నిజాం రాజులది.
కనుక 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మిని ఓడించడానికి ఆసఫ్‌జాహీ రాజులు తమ సైన్యాన్ని ఝాన్సీకి పంపించినాడన్నా, స్వయంగా ఇక్కడ తుర్రెబాజ్‌ఖాన్‌, అల్లావుద్దీన్‌ల తిరుగుబాటును అణచి వాళ్లను ఉరికంబాలకెక్కించి, ప్రవాసాలకు పంపించినారన్నా ఆశ్చర్యం లేదు.
లోకేశ్వర్‌ సలామ్‌ హైదరాబాద్‌లో టిప్పు సుల్తాన్‌ను ఎంతో ప్రజాస్వామిక లౌకిక అభిమానంతో స్మరించుకుంటాడు.
”1799ల మైసూరు యుద్ధంలో టిప్పుసుల్తాన్‌ను ఓడించిన, సంహరించిన ఇంగ్లిష్‌వాడికి నైజాం నవాబు సహాయం చేయడం హైదరాబాద్‌ ప్రజలకు ఇష్టం లేదు. టిప్పుసుల్తాన్‌ వీర మరణాన్ని వారు మరచిపోలేదు. ఆ మైసూరు యుద్ధం ముగియగానే నైజాం రాజ్యంలో అంతర్భాగమైన కర్నూలు, రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్‌వారు మద్రాస్‌ ప్రెసిడెన్సీలో విలీనం చేయడం హైదరాబాద్‌ ప్రజలు సహించలేదు” (పే. 215) అని ప్రజలు సామ్రాజ్యవాద వ్యతిరేక లౌకిక భావాలతో ఉంటే నైజాం బ్రిటిష్‌ తొత్తుగా ద్రోహానికి కూడా వెనుదీయని విషయం రాస్తాడు.
అట్లాగే 1838లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ‘వహబీ’ రహస్య ఉద్యమం హైదరాబాద్‌ పట్టణంలో వ్యాపించింది. దానికి కూడా ప్రజల మద్దతు లభించింది. ఆ ఉద్యమ నాయకుడు నిజాం స్వంత తమ్ముడు ముబారిజుద్దౌలా. ఆయన ఆంగ్లేయుల పెత్తనానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే, అతడిని కోటలోనే బంధించినారని, అతడు అందులో కృంగి కృశించి మరణించాడని ప్రజలు అతడిని వీరుడిగా అభిమానించారని రాసాడు.
మనకిట్లా లోకేశ్వర్‌ తన నవలలోనే 1799 నుంచి 1857 లోకి తీసుకపోయే ఒక పరిణామ వేగంలో నైజాం తీసుకుంటున్న బ్రిటిష్‌ అనుకూల వైఖరికి, ప్రజలు తీసుకుంటున్న ప్రతిఘటనా వైఖరికి మధ్య పెరుగుతున్న వైరుధ్యాలో ఏ ప్రధాన సందర్భాన్ని విడువకుండా చేస్తాడు.
‘అగ్గిమీద గుగ్గిలం అన్నట్లు 1853లో నైజాం రాజ్యంలో అంతర్భాగమైన బీరార్‌ను నైజాం చెల్లించవలసిన అప్పుల కింద బ్రటిష్‌ వాళ్లు జప్తు చేసినారు. తమ ఇంగ్లండ్‌లోని లాంక్‌షైర్‌ బట్టల మిల్లులకు అవసరమైన ముడిపత్తి కోసం బంగారం వంటి పత్తిని పండించే బిరార్‌ను తెల్లవాళ్లు గుటుక్కున మింగేసారు.’

అని రాసి ఆ అవమానాన్ని ప్రజల భరించలేకపోయారు. సరియై సమయం కోసం ఎదురుచూస్తుంటే 1857 వచ్చిందంటాడు. నైజాం ఈ అవమానాన్ని అవమానంగానే భావించకుండా దిగమింగాడనే కదా అర్థం.
’1857 జూన్‌ నెలలో హైదరాబాద్‌ సంస్థానంలో తిరుగుబాట్లు తలెత్తినయి. నానా సాహెబ్‌, తాంతియాతోపే అనుచరులు సాధువులు, సన్యాసులు, వైద్యులు, ఫకీర్ల వేషాలలో హైరాబాద్‌ సంస్థానంలోని అనేక గ్రామాలలో తిరుగుతూ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా, ప్రజల్ని సమీకరిస్తున్నారు.’
కోఠీలో ‘తుర్రేబాజ్‌ఖాన్‌ రోడ్‌’ సైన్‌బోర్డ్‌ చూసి స్వామికి వచ్చిన చరిత్ర జ్ఞాపకాల నుంచి ఇట్లా ప్రారంభించి లోకేశ్వర్‌ ఒక పది పేజీలు 1857 పూర్వాపరాల చరిత్రలోకి వెళ్లిపోతాడు.
హైదరాబాద్‌, తెలంగాణ ప్రజలకింత వీరోచితమైన సామ్రాజ్యవాద ప్రతిఘటనా పోరాట చరిత్ర ఉంటే 1956లో వావిలాల గోపాల కృష్ణయ్యగారు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించినవారుగా సర్కార్‌, రాయలసీమ తెలుగు ప్రజలను పేర్కొంటారు. తెలంగాణ తెలుగు ప్రజలేమో కేవలం ‘భూస్వామ్య విధానంతో పోరాటం సాగించినవారుగా చూపుతారు’. అందులోనూ నాయకత్వం వహించినట్లు లేదు!

సామ్రాజ్యవాద వ్యతిరేకత నుంచి వచ్చేదే ప్రజల మధ్య ఐక్యత. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఇది ఎంత అపూర్వంగా వ్యక్తమయిందో లోకేశ్వర్‌ తనివిదీరా వర్ణించాడు. ఫ్యూడల్‌ భూస్వామ్యం పట్ల, దొరల, పెత్తందార్ల, జమీందార్ల, జాగీర్దార్ల, పటేల్‌, పట్వారీల దోపిడీ, అణచివేతకి వ్యతిరేకంగా ఐక్యమైన వర్గాలను (వెట్టిచాకిరీ చేస్తున్న దళితులు, వృత్తి కులాలు మొదలుకొని ధనిక రైతు వరకు) హిందూ ముస్లిం మతాలుగా చీల్చాలని చేసిన ప్రయత్నం హైదరాబాద్‌ సంస్థానంలో ఏమాత్రం నెరవేరలేదని మూడు రోజుల్లోనే రజాకార్‌ ఉద్యమంగా భావించబడింది నామరూపాలు లేకుండా పోవడాన్ని బట్టి గ్రహించవచ్చు. కుతుబ్‌షాహీల కాలం నుంచి కూడ ప్రజలే కాదు, ప్రభువుల వరకు కూడ ఈ మతైక్యత గురించి ఈ నవలలో రచయిత లౌకిక దృక్పథం నుంచి పరచుకొని ఉన్నది. 1946-48 మధ్యకాలంలో మాత్రమే బ్రిటిష్‌ సామ్రాజ్యవాద కుట్ర ఫలితంగా రజాకార్లు అనే ఒక రాజ్యాంగేతర సైన్యం తయారయింది. ప్రభువు ముస్లిం గనుక ముస్లింలంతా ప్రభువులు అనే భావాన్ని వ్యాప్తి చేసి, హిందూ మతంలో ఉండే నిచ్చెన మెట్ల కుల విభజనను, అస్పృశ్యతను ఆధారం చేసుకుని ప్రజల్ని చీల్చాలని చూసారు. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో, తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రజాకార్లను తిప్పికొట్టారు. గ్రామగ్రామాన సంగం నాయకత్వంలో ప్రజలు ప్రతిఘటించారు. దేశ విభజన నాటికి సంస్థానాలకు ఇండియా, పాకిస్థాన్‌లతో ఎందులోనైనా చేరే అవకాశంతోపాటు, స్వతంత్రంగా ఉండే స్వేచ్ఛ కూడ ఉందని బ్రిటిష్‌ పాలకులు చేసిన విభజించి పాలించే కుట్రకు లోనయినవాడు ఒక మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖానే. ఆజాద్‌ హైదరాబాద్‌ పేరుతో రజాకార్ల స్వైరవిహారాన్ని నైజాం అడ్డుకోలేదు. ఆ భ్రమలకు లోనయ్యాడు కూడా. అయితే ’47 ఆగస్ట్‌ 15న దేశానికి ప్రధాని, ఉప ప్రధానులయిన నెహ్రూ, పటేల్‌లు నవంబర్‌లో నైజాంతో యథాస్థితి ఒడంబడిక చేసుకొని పరోక్షంగా పాలకుల ఈ పేరాశకు నీరుపోసినవాళ్లయ్యారు. ’48 సెప్టెంబర్‌ 11న జిన్నా చనిపోక పోయినట్లయితే సెప్టెంబర్‌ 18న హైదరాబాద్‌ సంస్థానం విముక్తమయి ఉండేదికాదు. అప్పటికే భద్రతా మండలిలో హైదరాబాద్‌ను స్వతంత్రంగా ఉంచాలనో లేదా పాకిస్తాన్‌లో కలపాలనో లాబీయింగ్‌ ఉధృతంగా జరుగుతున్నది. యూరపులోని సాదృశ్యాలు చూపి హైదరాబాద్‌ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని చూసారు – అని ఇటీవల ఒక టివి ఛానల్‌ ఇంటర్వ్యూలో బిజెపి నాయకుడు విద్యాసాగరరావు గారు అభిప్రాయపడ్డారు. దేశ విభజనకకు ఒక పెద్ద దేశానికి ప్రధాని, ఉప ప్రధాని కాగలిగిన సామర్థ్యం ఉన్న నెహ్రూ, పటేల్‌ల బాధ్యత ఏమీ లేకుండా, అందులోంచి విడిపోయిన రెండు రాష్ట్రాల సగ విభాగాల అధ్యక్షుడు జిన్నాయే పూర్తిగా ఎట్లా బాధ్యుడవుతాడో చరిత్ర వస్తుగతంగా ఆలోచించాల్సి ఉన్నది. ‘సలాం హైదరాబాద్‌’లో చరిత్రలోని మత ఐక్యత, ప్రాంతాల మధ్యన ఐక్యతగా లోకేశ్వర్‌ చూపగలిగితే ఇంకా బాగుండును. స్వామి మిత్రులలో ముస్లింలెవరూ లేరు.

నాలుగు వందల సంవత్సరాల హిందూ ముస్లిం ఐక్యతా చిహ్నాలన్నీ స్వామికి ఒక కాల్పనిక ఆదర్శ ప్రతీకలయ్యారు. తుర్రెబాజ్‌ ఖాన్‌ మొదలు మగ్దూం వరకు ఆయన స్వప్నాలను వెలిగించిన చరిత్ర పురుషులు. ఉర్దూ భాషలోని సౌందర్యం, ముస్లింల ఆహార అభిరుచులు, షాయిరీలు, దస్తర్‌ ఖానాలు – వాళ్ల జీవనశైలి గురించి దానితో ముడిపడి ఉన్న నాలుగు వందల ఏళ్ల హైదరాబాద్‌ గురించి తనివి తీరని వర్ణనయే నవలంతా. సలాం హైదరాబాద్‌ అని పేరు ఎంచుకోవడం దగ్గర్నించి, చార్మినార్‌తో నిరంతరం సంభాషణ దాకా ఆయన ఈ లౌకిక ఆకాంక్ష వ్యక్తమవుతూనే ఉంటుంది. కాని 1948 తర్వాతితరం, మరీ ముఖ్యం 1956 తర్వాతి తరంలో ప్రధాన స్రవంతిలో హిందూ ముస్లింల భాగస్వామ్యం క్రమంగా విపరీతమైన అసమానతకు గురికావడమే 1950లో జన్మించిన స్వామికి ముస్లిం స్నేహితులు లేకపోవడానికి కారణమనుకుంటాను. చరిత్రలో వచ్చిన కఠోర పరిణామాలను కల్పన పూడ్చలేదు గదా. బస్తీలల్లో ఆ ఐక్యత ఉన్నది గానీ విద్యావంతులందులో భాగం కాలేకపోయారు. రాజకీయ నాయకులయితే తమ ఓట్ల కోసం ఆ ఐక్యతను చీల్చే కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. రాజును భాగమతిని ఐక్యం చేసిన మూసీ నది ఇప్పుడు ఇన్ని వంతెనలు వచ్చి కూడ హిందూ ముస్లిం నగరాలుగా హైదరాబాద్‌ను చీల్చడం దగ్గర ఆగలేదు. మళ్లీ పాతబస్తీలో ఎవరి వాడలు వారివిగా విడిపోయే పిడివాదం వైపు పోతున్నాయి. ఇవ్వాళ రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనం కొరకు ఆర్థిక శక్తులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
ఈ ఐక్యత మతాల విషయంలోనే కాదు స్థానికతల విషయంలో కూడ భగ్నమైన విషాదమే ఈ నవలకు ప్రధాన వస్తువు. స్థానికత, అస్తిత్వ ఆకాంక్ష – ఈ తెలంగాణ నవలకు పూసల్లో దారం వంటి మూలధాతువు. హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలుగు ప్రజలు, నైజాం రాజ్యంలో నాన్‌ ముల్కీల వివక్షకు గురయి వనర్లు, విద్య, ఉద్యోగాల విషయంలో, భాషా సంస్కృతుల విషయంలో ఎంత వివక్షకు గురయ్యారో కేవలం ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన దగ్గర్నే ఈ నవల ప్రారంభం కాదు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి ’69లో ప్రత్యేక తెలంగాణ ప్రజా వెల్లువ పెల్లుబికిన క్రమాన్ని కళ్లకు కట్టవచ్చుగానీ నైజాం ప్రభువులు – పీష్వాల సహాయంతో మహరాష్ట్ర విద్యావంతులను పరిపాలనలోకి తెచ్చుకోవడం నుంచి, ఆ తర్వాత కాలంలో ఉత్తరప్రదేశ్‌ నుంచి కాయస్తులను తెచ్చుకోవడం దాకా వచ్చిన సమస్యలు లోకేశ్వర్‌ మన దృష్టికి తెస్తాడు. రోహిల్లాలు, అరబ్బులు, పఠాన్‌లు ఇక్కడి సైన్యంలో భాగం కావడం మాత్రమే కాదు బుందేల్‌ఖండ్‌ నుంచి వచ్చినవాళ్లు, మార్వాడీలు, సింధీలు – ముస్లిం వ్యాపారవర్గాలకు పోటీగా హిందూ వ్యాపార వర్గాలుగా మార్కెట్‌లో విస్తరించిన క్రమమూ చిత్రిస్తాడు.

తెలంగాణలో స్థానిక ప్రజలు రెండు వందల సంవత్సరాలుగా ఈ అన్ని కారణాల వలన కోల్పోతున్నదేమిటో అది ఎట్లా 1969 ఉద్యమంలో వ్యక్తమయిందో, స్థానికత ఒక అస్తిత్వ ఉద్యమంగా రూపుదిద్దుకున్నదో చెప్పే ప్రయత్నమే ఈ నవలకు ప్రాణవాయువు.
స్థానికులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు రాకపోవడానికి, వాళ్ల భాషా సంస్కృతులు వికసించలేకపోవడానికి స్థానికేతరుల ప్రాబల్యం, కీలక పదవుల్లో వాళ్ల అధికారం ఏభైల దాకా చెల్లిన పద్ధతికీ ఏభై ఆరు తర్వాత చెల్లిన పద్ధతికీ ఒక గుణాత్మకమైన తేడా ఉన్నది. నవాబు, ఆయన పిరమిడు నిర్మాణంలో పాలుపంచుకున్న పెత్తందార్లు పరాన్నభుక్కులు గనుక ప్రజలను పన్నులు, జరిమానాల రూపంలో వేధించి తమ విలాసాలు గడుపుకోవడానికి స్థానికేతరులను తెచ్చుకున్నారు. ఈ స్థానికేతరులు తమ పబ్బం గడుపుకోవడానికి తెలివితేటలు, తమ స్థానాలు వదిలివచ్చి ఇక్కడ వేళ్లూనాలి గనుక జాగరూకతలు ప్రదర్శించారు.
అయినా వీళ్లు మారిన పరిస్థితుల్లో ఒక వర్గంగా రూపొందలేకపోయారు. వ్యాపార వర్గంగా రూపొందిన మార్వాడీలు కూడ రాజకీయాధిపత్యాన్ని గుప్పిట్లోకి తీసుకోలేక పోయారు. ఆ ఆధిపత్య శక్తియుక్తులు కోస్తా జిల్లాల నుంచి డెబ్భై ఏళ్ల క్రితం నుంచే వలస రావడం ప్రారంభించిన రెండున్నర జిల్లాల రెండున్నర కులాల సంపన్న వర్గాలకు అబ్బినవి. అందుకు రాజకీయార్థిక, చారిత్రక కారణాలు ఉన్నాయి. స్థూలంగా కృష్ణా, గోదావరి నదులపై కాటన్‌ మహాశయుడు దూరదృష్టితో నిర్మించిన ఆనకట్టలు, విశాఖపట్నం నుంచి, మద్రాస్‌ నుంచి వేసిన రైల్వే లైను, కృష్ణాగోదావరి డెల్టాలలో పంటలు పండించి అదనపు విలువను అందిపుచ్చుకో గలిగిన ఒక వర్గం రూపొందడం – అందుకు మూలకారణం. అట్లే మద్రాస్‌ ప్రావిన్స్‌లో కావేరీ, గోదావరి డెల్టా ప్రాంతాల్లోని అగ్రవర్ణ, అగ్రవర్ణ సంపన్నులు పరిపాలనా విభాగంలోనూ, పారిశ్రామిక రంగంలోకి చొచ్చుకుపోయిన తీరు, సంస్కృత శాస్త్రాల నుంచి, ఇంగ్లిష్‌ శాస్త్రాలలోకి గొంగడి పురుగు సీతాకోక చిలుకగా మారినంత సహజంగా జరిగిపోవడం – దోహదం చేసాయి. మంజీరానదిపై నిజాం సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేయగానే నైజాం రాజు వీళ్లను ఆ ఆనకట్ట కింద వ్యవసాయం చేయడానికి ఆహ్వానించాడు. ఆ రాకడ రాకడ తెలంగాణ నీటిపట్టు ఉన్న ప్రతిచోట స్థిరపడడానికి వచ్చిన వాళ్లు రావడం ఇంక ఆగలేదు. సెటిలర్స్‌ అని ఆంధ్రవలసవాదులని – తెలంగాణ వాదులు ఆరోపిస్తున్న వాళ్లు, అంతర్గత వలస విధానం, అంతర్గత సామ్రాజ్యవాదం అని తెలంగాణ మేధావులు విశ్లేషిస్తున్న వాళ్లు – నూట ఏభై సంవత్సరాలు పోగుబడిన సంపదలోని అదనంపై వచ్చిన ఆధిపత్యం వల్ల రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలపై ఆధిపత్యాన్ని సాధించగలిగారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే వరకు ఈ దళారీ పాలకవర్గం హైదరాబాద్‌పై కన్నువేసింది.

’52లో ముల్కీ ఉద్యమం, ’55 నాటికి భాషా రాష్ట్రాల ఏర్పాటు కొరకు నియమించిన ఫజల్‌ అలీ కమిషన్‌ ముందు తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయవద్దన్న డిమాండ్‌ ఈ దళారీ ఆధిపత్యం పట్ల అప్పటికే పెరుగుతున్న భయాందోళనల వల్ల వచ్చినవే.
ఆంధ్రమహాసభ నాయకత్వంలో హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలుగు ప్రజల అస్తిత్వ ఆకాంక్షలు, ముఖ్యంగా మధ్య తరగతి బుద్ధిజీవుల, కవుల, కళాకారుల ఆకాంక్షలు – ఈ ఆకాంక్షలకు స్థూలంగా ప్రాతినిధ్యం వహించిన కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్‌లోని ఒక సెక్షన్‌ ఆకాంక్షలు – మొత్తంగానే జాతీయోద్యమంలోగానీ, నిజాం రాష్ట్రాంధ్ర ఉద్యమంలోగానీ సామ్రాజ్యవాద అనుకూల దళారీ స్వభావంలోని పరిపాలన ఎట్లా ఉంటుందో ఊహించలేక పోవడం వల్ల ఈ భయాందోళనలను పక్కన బెట్టి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసారు.
దూరదృష్టి లేని రాజకీయ నాయకత్వం దీనికి ప్రధాన బాధ్యత వహించాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీరోచితంగా నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ – దానిని పోలీసు చర్య పేరుతో సైనిక అణచివేతకు గురిచేసి మూడువేల మంది కమ్యూనిస్టులను చంపిన నెహ్రూను – ఆయన పరిపాలన కొనసాగినంత కాలం ప్రాజస్వామ్య సామ్యవాదానికి నమూనాగా భావించింది. నెహ్రూ దగ్గరనే ఆగలేదు. నెహ్రూ కుటుంబానికంతా చిన్న చిన్న విరామాలతో తన అండదండలందిస్తూనే ఉన్నది.
హైదరాబాద్‌ విమోచన పేరుతో, రజాకార్లను అణచివేసే పేరుతో లక్షలాది మంది ముస్లింలను చంపిన నెహ్రూను, తన ప్రధాని పదవి కోసం దేశ విభజనను అంగీకరించిన నెహ్రూను చరిత్రలో లౌకికవాదిగా, సంప్రదాయ మార్క్సిస్ట్‌ బుద్ధిజీవులు ఈనాటికీ పేర్కొంటూనే ఉన్నారు. ఈ విషయంలోను సోనియాగాంధీ దాకా ఈ వారసత్వాన్ని మోస్తున్నారు.
నిజామాబాద్‌లో హిందీ భాష వాసన వేసే ‘ఆంధ్రప్రదేశ్‌’ ఏర్పాటును ప్రకటించిన నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు ‘గడుసు పిల్లవానితో అమాయక పిల్ల పెళ్లి’గా ఆంధ్ర, తెలంగాణ విలీనాన్ని పోల్చిన చతురతకు – నెహ్రూ కూడ అయిష్టంగానే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటును అంగీకరించాడని క్రెడిట్‌ సంపాదించుకున్నాడు.
కమ్యూనిస్టుల అణచివేత, ముస్లింల ఊచకోతలకు కేంద్ర ప్రభుత్వ బాధ్యతల నుంచి విడదీసి వల్లభాయి పటేల్‌ను చూపే ప్రగతిశీల లౌకికవాదం మనను ’69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాక కూడా ప్రభావితం చేసింది.
నక్సల్బరీ, శ్రీకాకుళ రాజకీయాల వైపు నైసర్గికంగానే ఆకర్షితుడయిన లోకేశ్వర్‌కు జవహర్లాల్‌ పట్ల ఉన్న బలహీనత దీనికి మినహాయింపు కాదు.

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్య సారాన్ని లోకేశ్వర్‌ పట్టుకున్నాడు. 17 సంవత్సరాల నవయువకునిగా ప్రారంభమై 20వ సంవత్సరంలో ప్రవేశించే దాకా ఆయన ప్రయాణం, ఆయన స్నేహితులతో పాటు అటు వైపే సాగింది. ఈ ఇరవై ఏళ్ల యువకునికి హైదరాబాద్‌ నగరంతో నాలుగు వందల ఏళ్ల రక్తబంధం గనుక – వదిలిపెట్టలేక పోయాడు గానీ లేకుంటే స్వామి కూడ శ్రీకాకుళం పోవలసిన వాడే. కనుక ఏమిటా నేపథ్యం. ఆ నేపథ్యాన్ని స్వామి తన అధ్యయనం, సాహిత్యాభిరుచిలో వస్తున్న మార్పుల వల్ల సూచిస్తాడు. వేణుతో బలపడుతున్న స్నేహంలో చూపిస్తాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మిలిటెన్సీని సమర్థించడంలో చూపిస్తాడు. ఆ నేపథ్యంలోని దినుసులేమిటి? హైదరాబాద్‌ సంస్కృతి పట్ల ఒక వ్యసనం వంటి ఆకర్షణ ఉన్న స్వామికి వాటిల్లో కనిపించిన ఆలంబన ఏమిటి?
సృజనాత్మకత, ప్రశ్నించే లక్షణం, ధిక్కరించే స్వభావం, జీవితం నుంచి, జీవితంలోని చలనము, సంఘర్షణల నుంచి సిద్ధాంతాన్ని సృజనాత్మకంగా అన్వయించుకునే నేర్పు. ప్రత్యేకతలోని విశ్వజనీనతను, స్థానికతలోని అంతర్జాతీయతను, అస్తిత్వంలోని సామ్రాజ్యవాద వ్యతిరేకతను పసిగట్టగలిగిన చూపు.
అవి ఒక్క స్వామికి వచ్చినవి కావు. ఒక్కనాడు వచ్చినవి కావు. ఒక్క 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన విద్యార్థి యువజనులకు వచ్చినవి కావు. హఠాత్తుగా వచ్చినవి కావు. హఠాత్తుగా వచ్చినవి కాకపోవచ్చు గానీ మనిషి నడక నేర్చిన దగ్గర్నించీ రూపొందిన నాగరికత ఎక్కడో ఉరుకులు, పరుగులు, గెంతులవుతుంది కదా – దానిని గుణాత్మక మార్పు అంటాం కదా. వాటిని కొండ గుర్తులుగా పేర్కొంటుంటాం.
అవి బోల్షివిక్‌ విప్లవం, చైనా విప్లవం – అని ఇదివరలో తెలుసుకున్నట్లుగానే మన సందర్భానికి చైనా శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం – వర్గ సమాజంలో వర్గ పోరాటం అనివార్యమని చెప్పింది. అన్నిటినీ ప్రశ్నించమని చెప్పింది. ఆలోచించడానికి సాహసించమని చెప్పింది. కేంద్రాన్ని బద్దలుకొట్టమని చెప్పింది. ఏటికి ఎదురీదమని చెప్పింది. నీకు అందివచ్చిన ప్రతి విలువను ప్రశ్నించి, పరీక్షించి, తిరస్కరించడమో, స్వీకరించడమో చేయమని చెప్పింది. పునాదికీ, ఉపరితలానికీ ఉండే సంబంధాలను కొత్తగా నిర్వచించింది. వర్గేతర భావజాలం కమ్యూనిస్టు పార్టీలలో కూడ ఉండవచ్చు కనుకనే రెండు పంథాల మధ్య పోరాటం ఉంటుందని చెప్పింది.
ఆ వెలుగులో వచ్చినవే నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు. ఆ వెలుగులో వచ్చినవే 1968 ఫ్రెంచి విద్యార్థి విప్లవం, ’69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.
లోకేశ్వర్‌ ఇట్లా ఎక్కడా చెప్పలేదు. కాని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడి ప్రాణాలర్పించిన అమరుల గురించి ఆయన నమోదు చేసిన చరిత్రను నవల ముగిసేవరకు సత్యం, కైలాసాల అమరత్వంతో ముడిపెడతాడు.
ఆ వెలుగులో మళ్లీ ఆయనే మనకీ పూసల దారం వంటి భావన అందిందో లేదో అనే ఆదుర్దాతో చైతన్య స్రవంతి శిల్పంలో 237వ పేజీ నుంచి 239 వరకు

1970 జూలై 10 శ్రీకాకుళం

అని ప్రారంభించి ఫ్లాష్‌బ్యాక్‌లోకి పోతాడు. బాపులు భద్రం కొడుకా అని చెప్తూనే ఉంటారు. బిడ్డలు భద్రలోకం తమ కోసం ఏర్పాటు చేసుకున్న ఆస్తిసంచయ శాంతి భద్రతలను భంగం చేస్తూ ”నడుస్తున్న దారి మధ్యల పెద్దపులి అడ్డం వస్తే దాన్నుండి ఎట్లా తప్పించుకోవాల్నో జాగ్రత్తలు” నేర్పుకుంటూ సాగిపోతూనే ఉంటారు. ఎందుకంటే దారికి అడ్డం వచ్చి ఒకసారి, తన దారిలోకి రప్పించుకోవాలని ఒకసారి గుహలో పొంచి ఉన్నది మన మార్గంలో ఆ పెద్ద పులే. అది కంటాకావృతమైన కష్టాల బాటనే కానీ – అది భవిష్యత్‌ చిత్రపటాన్ని మనసులో నింపిన నిరంతర యాత్ర.
ఈ ప్రయాణంలో లోకేశ్వర్‌ ఈ ఆత్మచరిత్రాత్మక నవలలో 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని దాన్ని ప్రజాబాహుళ్య మిలిటెంట్‌ రూపంలో తారీకులు, సంఘటనలు కూడ వాటి వివరాలతో పాటు నమోదు చేసి భవిష్యత్‌ తరాలకు గొప్ప ఉపకారం చేసాడు. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ అమరులు అనామకులు కాకుండా రక్తాక్షరాలతో వాళ్ల పేర్లు, వాళ్ల త్యాగాలు నమోదు చేసాడు.
తెలిసిన వారిని ఒకసారి 1969-70ల్లోకి తీసుకపోతాడు. తెలియని వారిని, ఇవ్వాళ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారిని ఈ వారసత్వాన్ని స్వీకరించి ముందుకు వెళ్లమని ప్రేరణ ఇస్తున్నాడు. శత్రువును పోల్చుకొమ్మని చెప్తున్నాడు.
చరిత్రలోని పాత్రలుగానూ, నవలలోని పాత్రలు గానూ, రక్తమాంసాలున్న మనుషులు మన కళ్ల ముందు చరిత్ర నిర్మించిన వాళ్లు ఈ ప్రధాన కథలో కనిపిస్తారు. ఒక రాజకీయ పోరాటంలో పాల్గొంటున్న ఈ మనుషులు తమ అభిరుచులు, స్నేహాలు, ప్రేమలు, అనుబంధాలతో మననకు చుట్టుముడతారు. స్వామి తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు సరేసరి. ఒక ఉరేగింపు, దానిపై లాఠీఛార్జ్‌, కాల్పులు, ఆ తర్వాత కర్ఫ్యూ – అందులో గాయాలు, మరణాలు – ఇదంతా ఒక చిత్తడి, ఉద్వేగం, కన్నీళ్లు, నెత్తురు, విషాదమైతే – అందులో లోకేశ్వర్‌ కూర్చిన స్నేహాలు, అనుబంధాలు, ప్రేమలు – హృదయంతో రాసిన తీరు మనకు దిగులు కాదు – ఏదో తెగింపునిస్తాయి. వార్తా పత్రికల్లో జోసెఫ్‌ మార్క్వెజ్‌ జెఫ్రీ తలవంచుకొని సిగిరెటు తాక్కుంట తెలంగాణ విముక్తి వార్తల కోసం దేవులాడుతున్న అనుభూతే మిగులుతుంది.
పర్షియన్‌ గుల్‌ మొహర్‌ పుష్పం ఖైరున్నిసా, మక్కామసీదు చిన్నారి చెల్లె చాదర్‌ఘాట్‌ రేణుకల దాకా – 1857 నుంచి శ్రీకాకుళం దాకా స్వామి తన నడకలో ఎందరెందరినో చేర్చుకున్నాడు. లోకేశ్వర్‌ హైదరాబాద్‌ సంస్కృతిలో ప్రేమను, స్నేహాన్ని చూపాడు. శ్రమను, పోరాటాన్ని చూపాడు. ఆదరణను, ధిక్కారాన్ని చూపాడు. ఈ సంస్కృతికి ఒక చూపు ఉందని, ఆ సంస్కృతియే తనకు ముందు చూపునందించిందని, అది సలామత్‌గా ఉండాలని ఆకాంక్షిస్తున్నాడు.
ముఖ్యంగా అది 70తో ముగిసింది కాక, ఇంకా కొనసాగుతున్నది గనుక నడుస్తున్న చరిత్రతో సంభాషించడానికి మళ్లీ మన ముందుకొస్తున్నది సలాం హైదరాబాద్‌!

(03 సెప్టెంబర్‌, 2009)

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు, ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో