అలనాటి మన సాహిత్య విమర్శ “కవిత్రయ కవితా విమర్శనము”

ఇరవయో శతాబ్దం ప్రథమార్థంలో వచ్చిన తెలుగు సాహిత్య విమర్శను చదువుతుంటే అనేక ఆసక్తికరమైన విషయాలు మన దృష్టికి వస్తాయి. సంప్రదాయ సాహిత్యాన్ని సంప్రదాయ దృష్టితోనే చూసేవర్గం ఒకటి వుండగా, సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో అంచనా కట్టే వర్గం ఇంకొకటి మనకు కనిపిస్తుంది. సంప్రదాయ సాహిత్యాన్ని ఆధునిక దృష్టితో అంచనా కట్టేవాళ్ళందరూ సారాంశంలో భావజాలంలో ఆధునికులు కాకపోయినా, ఆంగ్లసాహిత్యం ద్వారా కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొత్త కొలమానాలతో ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించే ధోరణి మాత్రం ఆహ్వానించదగిందే, పి. దక్షిణామూర్తితో  మొదలైన (పింగళి సూరన 1892) ఈ ధోరణి కట్టమంచి రామలింగారెడ్డి, వింజమూరి రంగాచార్యులు( కవిత్వతత్వవిచారము, పింగళిసూరనార్యుడూ 1914) తో అది ఒక స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంది వీళ్లలో కూడా రెండు మూడు రకాల వాళ్ళు కనిపిస్తారు. మొదటి రకం వాళ్ళు ప్రాచీన సాహిత్యంలోని వస్తు శిల్పాలు రెండిటినీ పాశ్చ్యాత్య సాహిత్య సిద్ధాంతాల నేపథ్యంలో పరిశీలించి గుణ దోష విచారణ చేసిన వాళ్ళు. రెండో రకం వాళ్ళు, మొదటి రకంవాళ్ళు ప్రాచీన సాహిత్యం మీద పెట్టిన విమర్శలను వ్యతిరేకిస్తూ వాళ్ళు అనుసరించిన వాస్తవికతావాదంతోనే, వాళ్ళ వాదాలను పూర్వ పక్షం చెయ్యడానికి ప్రయత్నించినవాళ్ళు . మూడో రకం వాళ్లు ప్రాచీన సాహిత్యం లోని వస్తువు జోలికిపోకుండా సాహిత్య శిల్పం వరకే పరిమితమై ప్రాచీన తెలుగు కవుల ప్రతిభను పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాల వెలుగులో వివరించే ప్రయత్నం చేసినవాళ్ళు .ఈ రకానికి చెందిన మంచి సాహిత్య విమర్శకుడు గుర్రం వెంకటసుబ్బరామయ్య. ఈయన గ్రంధం “కవిత్రయ కవితా విమర్శనము”.(1933)
గుర్రం వెంకటసుబ్బరామయ్య నెల్లూరు నివాసి. ఎం.ఏ ఇంగ్లీషు చదివి నెల్లూరు లో 30 ఏళ్ళు ఆంగ్లోపాధ్యాయులుగా పని చేశారు. ఈయన 1899 లో జన్మించి 1970 లో మరణించారు. సుబ్బరామయ్య సంస్కృత, ఆంగ్ల , తెలుగు సాహిత్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈయన మీద మిల్టన్ , షేక్స్ పియర్ ల ప్రభావం బలంగా ఉంది. షేక్స్ పియర్ నాటకాలను ఆయన అభినయాత్మకంగా బోధిస్తూఉంటే  షేక్స్ పియర్ కళ్ళ ముందు కనబడినట్లుండేదట.  సుబ్బరామయ్య మన కవిత్రయభారతం పద్దెనిమిది పర్వాలను ( అరణ్య పర్వంలో రెండాశ్వాసాలు తప్ప ) మిల్టన్ శైలితో వచన కవితగా అనువదించారు. అందులో బెజవాడ గోపాల రెడ్డి, రేబాల వంటి వాళ్ళు విరాట ఉద్యోగపర్వాలను మాత్రం ప్రచురించారు. తక్కిన పర్వాలు అలాగే మిగిలిపోయాయి. ఆయన వారసులు ద్రావిడ,  తెలుగు విశ్వవిద్యాలయాలను సంప్రదించినా ఫలితం లేకపోయిందని బాధపడుతున్నారు.
కాళిదాసు మేఘసందేశ అనువాదకుడు కూడా అయిన సుబ్బరామయ్య రాసిన విమర్శగ్రంధం ” కవిత్రయ కవితా విమర్శనము”. 1933లో వచ్చిన 210  పుటల ఈ గ్రంధం వెల 1.00 మాత్రమే ఈ గ్రంధానికి అప్పటి ఎంఎల్సి బెజవాడ రామచంద్రారెడ్డి “తొలిపలుకు” రాస్తూ సుబ్బరామయ్య “వాఙ్మయోపాసకులకు ఆధునికు ” లని , ఆయన ” ఆంగ్ల సాంప్రదాయముననుగమించి భారత కవుల కవిత్వతత్వమును విమర్శిం”చారని అభిప్రాయపడ్డారు.
ఈ పుస్తకం మూడు ఉద్దేశాలతో రాయబడినట్లు పూర్తిగా చదివిన తర్వాత అర్థమవుతుంది. 1. తెలుగు మహాభారతం అనువాదమే నన్న కట్టమంచి రాయలింగారెడ్డి అభిప్రాయాన్ని పూర్వపక్షం చెయ్యడం. 2. నన్నయ్య, తిక్కన చుట్టూ చేరిన గ్రూపు రాజకీయాలను తిరస్కరించడం . 3. కవిత్రయం వారి మౌలిక రచన ధోరణులను ఆవిష్కరించడం.
కట్టమంచి “నన్నయాదులు………. మొత్తము మీద భాషాంతరీ కర్తలేకాని యపూర్వ సృష్టి క్రియానిపుణులుగారు. ఇట్లనుటచే వారిపై దోషారోపణము చేయుచున్నానని నాపై గినియకుడు. వీరికి ప్రతిభయు, భావన శక్తియు నయేయములు ” అన్నారు.( చూ. కవిత్వతత్వ విచారము.పు 17)ఈ అభిప్రాయము నాటి విధ్వాంసులెవరికీ నచ్చలేదు.అనేకులు అనేక రకాలుగా  ఈ అభిప్రాయాన్ని తిరస్కరించారు. వెంకటసుబ్బరామయ్య చాలా సౌమ్యంగా  ఉంటూనే కట్టమంచి అభిప్రాయాన్ని నిర్ధ్వంధ్వంగా తిరస్కరించారు.” ఆంధ్ర భారతమును చాలావరకు స్వతంత్రకావ్యమనియె పేర్కొనదగును ” అని చెప్పారు . అయినా తెలుగు మహా భారతం కవిత్రయం వారు స్వయంగా తెలుగులో తెలుగు జీవితంలోంచి తీసుకొని రాసిన రచన కాదన్న అభిప్రాయం కూడా ఈయనలో లేకపోలేదు. కేవలానువాదంకాదు, సృజనాత్మకానువాదమన్నదే ఈయన వాదం.
భారతీయ సమాజంలోని కులం, కులాలలోని శాఖలు. అధ్యాత్మిక విశ్వాసాలు ఇరవయ్యోవ శతాబ్దం  ప్రారంభంలో సాహితీ రంగం మీద ప్రభావం చూపించాయి. నన్నయ్య, తిక్కనల విషయంలోనే వైదిక నియోగపండితులు బాగా వాదోపవాదాలు చేసుకున్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు విశ్వనాధ, పింగళిల మధ్య ఈ ధోరణి ఉందని అనుకునేవారు. వెంకటసుబ్బరామయ్య ఈ విషయాన్ని పైకి చెప్పలేదుగాని, కవిత్రయం వారి మధ్య ఏ దృష్టి తో చూచినా కవిత్వ పద్ధతులకు సంబంధించిన తేడాలున్నాయి గాని , ఎక్కువ తక్కువలు లేవని అనేక పర్యాయాలు అంటూ వచ్చారు . ” ముగ్గురును ఉత్తమ కవిమండలికి జేరుటంజేసి వీరిలో తగ్గుమొగ్గు లేర్పరుపజూచుట త్రిమూర్తులలో దారతమ్యము గణించుటవంటిది. కాని వీరి కవితా సరణులందు పరస్పర భేదములు  అనన్య సామాన్యములగు విశేషము ఏమేని కాన్పించిన వాని నెత్తి చూపుట వలన దోషము లేమియేగాక ఙ్ఞానాభివృద్ధికలదు “     (పు.06)  అని ప్రారంభంలోనే తన గ్రంధరచనోద్దేశాన్ని ప్రకటించి ఆ ప్రకారమే కవిత్రయం వారి రచనా వైఖరులను ఆవిష్కరించారు. పండితులు ఏవేవో ప్రమాణాలతో గ్రూపులుగా విడిపోయి కవులలో ఎక్కువ తక్కువ దృష్టితో సాహిత్య యుద్ధాలు చేస్తుండడం చూచి వెంకటసుబ్బరామయ్య బాగా కలత చెందినట్లున్నారు , కవిత్రయం వారిలో ఎక్కువ తక్కువలు లేవని, చూడరాదని అనేకపర్యాయాలు గుర్తు చేశారు. ” పై కవులు మువ్వురును ఉత్తమమేయగుదురు. వారిలో తగ్గు మెగ్గుల ప్రస్తావనము నిరర్థకమగును”  ( పు.16)  ” వారియం దెచ్చుతక్కువల నెన్నుట సమంజసముగాదు” ( పు19 ) ” ఈ కవిత్రయమునందు తగ్గుమొగ్గులు నిశ్చయించుటపాడిగాదు ” (పు .20).
కవిత్రయం వారి కవిత్వ ధోరణులలో సామ్యభేదాలే తప్ప ఎక్కువ తక్కువలు లేవు అని నిరూపించడమే వెంకటసుబ్బయ్య ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఆయన ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకుని దానిని మరింత స్పష్టంగా సోదాహరణంగా అమలు చేశారు.కవిత్రయం వారి కవిత్వధోరణులను విశ్లేషించడానికన్నాముందు, వెంకటసుబ్బరామయ్య ఉత్తమ కవిత్వానికి సత్యాత్మికభావన ( ఇమాజినేషన్ ) అంగ సౌష్టవం, శైలీ పరిపక్వత అని మూడు ముఖ్య లక్షణాలుంటాయని, పేర్కోని వాటిని నిర్వచించి, వివరించి, అవి ఆ ముగ్గురిలోనూ ఉన్నాయని అందువల్ల ఆ ముగ్గురు “ఉత్తమ కవిమండలి ” లో చేరుతారని పేర్కోన్నారు. నన్నయ్యలో మూడింట రెండు వంతులు సంస్కృత పదాలుండగా, తిక్కనలో మూడింట రెండు వంతులు తెలుగు పదాలుంటాయని, ఎర్రనలో సంస్కృతాంధ్ర పదాలు సమానంగా ఉంటాయని కందుకూరి చేసిన ప్రతిపాదనను ఈయన ఆమోదించి ఉదాహరణలిచ్చారు. అదే సమయంలో నన్నయ భావన చిత్ర లేఖకుని భావన వలె ఉంటుందని, తిక్కన మనస్సును వర్ణంలోని అచంచలస్థితి కన్నా చిత్తరువు కందని అనుక్షణం చాంచల్యమాన దశలే ఎక్కువ ఆకర్షించాయని , ఎర్రనలో ఈ రెండూ మేళవించాయని సోదాహరణంగా రుజువు చేశారు.
ఇలా కవిత్రయం వారి మధ్య గల భేద సాదృశ్యాలను వివరించిన తర్వాత , వెంకటసుబ్బరామయ్య నన్నయ్య భారతంలోంచి సభాపర్వాన్ని , తిక్కన భారతంలోంచి విరాట పర్వాన్ని , ఎర్రన నృసింహాపురాణాన్ని తీసుకుని ఆయాకవుల కావ్యకళాధోరణులను విశ్లేషించారు. ఒక పరిశోధకునికి, విమర్శకునికి గ్రంధ రచనలో ప్రణాళిక అన్వయ ఙ్ఞానం ఎంత ఉండాలో వెంకటసుబ్బరామయ్య రుజువు చేశారు. ఆయనకు పాశ్చాత్య సాహిత్య విమర్శతో ప్రగాఢమైన పరిచయం ఉండడంవల్ల అది సాధ్యమైంది.
నన్నయ్య కావ్య కళానైపుణ్యాన్ని అనువాదం, కావ్యశిల్పమహిమ అనే రెండు విభాగాలుగా వివరించారు. అనువాదాన్ని మూల విస్తరణం, మూలక్లుప్తీకరణం, నూతన కల్పన , మూల విస్మరణ, యధామూలకం , మూలతిరస్కరణ అని ఆరు ఉప శీర్షికలలో చర్చించారు. కావ్య శిల్పమహిమను కథా వస్తు నిర్మాణం, గుణశీల చిత్రణ, భావన పటిష్టవర్ణన ,శైలీ రమ్యత అనే ఉప శీర్షికలలో సోదాహరణంగా చర్చించారు. తిక్కన కావ్య కళానైపుణ్యాన్ని అనువాదం, దృశ్య ప్రబంధసామ్యం, వర్ణన విశేషం , శైలీ పరిపక్వత అని నాలుగు విభాగాలుగా వివరించారు. ఎర్రన కావ్యకళా నైపుణ్యాన్ని నన్నయ్య లాగే రెండు భాగాలుగా చర్చించారు. ఈ ప్రణాళికనంతటినీ సోదాహరణంగా వివరించి కవిత్రయం వారి మధ్య ఎక్కువ తక్కువలు లేవని, వాళ్ళు కేవల అనువాదకులు కాదు, గొప్ప సృజనాత్మక శక్తి ఉన్నవారని సిద్ధాంతం చెయ్యడం విమర్శకుని ఉద్దేశం.
ఈ ప్రణాళికలో వెంకటసుబ్బరామయ్య తాను ఉపయోగించే ప్రతి సాంకేతిక పదాన్ని అర్థ వివరణ ఇవ్వడం, ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఉదాహరణతో సమన్వయ పరచడం , వివరణ ఇవ్వడంలో గందరగోళం లేకపోవడం వంటి ఉత్తమ విమర్శక లక్షణాలు కనిపిస్తున్నాయి. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దివాకర్ల వెంకటావధానిగారి నన్నయ్య అనువాద విధానాన్ని’ నన్నయ్య భారతం ‘ అను గ్రంధంలోంచి నోట్స్ రాసుకున్నాం.అందులో మూల విస్తరణ , మూలవిస్మరణ, మూలసంకోచం వంటి ప్రణాళిక ఉంది. మా గురువులు ఆ ప్రణాళికను చెప్పారు. మా తర్వాత వాళ్ళకి కూడా అదే ప్రణాళిక చెబుతున్నారు. వెంకటసుబ్బరామయ్య గ్రంధంలో 1933 నాటికే ఆ ప్రణాళిక ఉంది. అయితే ఈయన పేరు ఎవరూ చెప్పలేదు . ఇదే ఆశ్చర్యం.ఈ ప్రణాళికకు ఈయనే ఆద్యుడా లేక ఇంకెవరైనా ఉన్నారా? అన్నది పరిశీలించవలసి ఉంది. అలాగే అనువాద అధ్యయనంలో ఈ ప్రణాళిక మన తెలుగు పండితులే సృష్టించారా, లేక పాశ్చాత్య సాహిత్య విమర్శ లోంచి మన వాళ్ళు తెలుగు లోకి తీసుకొచ్చారా?  అన్న దానిని కూడా పరిశీలించవలసి ఉంది.
ప్రాచీన సాహిత్య విమర్శకులు నన్నయ్యను కొందరు దక్షిణాత్య భారత కవులతో పోల్చి చూశారు గాని, ఆయనను ఏ పాశ్చాత్య రచయితతోనూ పోల్చినట్లు లేదు. వెంకట సుబ్బరామయ్య కూడా నన్నయ్యను నన్నయ్యగానే చూశారు. తిక్కన దగ్గరికి రాగానే ” ఆంగ్లకవుల షేక్సు పియరు, సంస్కృత కవుల  కాళిదాసుడెట్లునో తెలుగు కవుల తిక్కన యట్లే యుత్తముడని యంగీకరింపని వారరుదు.” అన్నారు. ( పు.81) .” తిక్కన భారతము శ్రవ్య ప్రబంధరూపము దాల్చియున్నను కార్లయిలు కవీశ్వరుని ‘ పరాసు విప్లవమువలె జిరుతుక మార్పులతో నొక మహాత్కృష్ట నాటకము కాగలదు ” అన్నారు ( పు .104) నన్నయ్య అనువాద విధానం గురించి చెప్పినట్లు గానే తిక్కన నాటకీయతను గూడా పింగళి లక్ష్మీకాంతం నుంచి ఆచార్యులు ఒకటే పాఠం చెబుతూ వస్తున్నారు. దానికి కూడా మూలాలు వెంకటసుబ్బరామయ్య గ్రంధంలో ఉన్నాయి. దీనినెవరూ గుర్తించలేదు. తిక్కనను కార్లుయిలుతో పోల్చడానికి తిక్కన కవిత్వం లోని మానవ స్వభావ పరిఙ్ఞానం , ప్రకృతి అనుసరణ శక్తి, ఔచితీ నిర్వహణ అన్నవి కారణాలని కూడా రచయిత పేర్కొన్నారు.
నన్నయ్య, తిక్కనలను పండితులు గుర్తించిన కొన్ని భేదాలతో వెంకటసుబ్బరామయ్య విభేదిస్తున్నారు. నన్నయ వైదిక మతావేశం ఆయన కవితాశిల్పానికి నష్టం చేసిందని, తిక్కన కావ్య కళాసృష్టి విశేషమైందని నాటి కొందరి పండితుల వాదాన్ని ఈయన వ్యతిరేకించారు. ఇద్దరిలోనూ వైదికమత రక్తి, కావ్య కళాశక్తి సమానంగా ఉన్నాయని ఆ యిద్దరి రచనలలోని అంతర్గత సాక్ష్యాలతో రుజువు చేశారు.
అయితే వెంకటసుబ్బయ్య కవిత్రయం  వాళ్ళు అనువాదాలలో చేసిన మార్పులు చేర్పులకు  ఆయన తర్వాత అనేక మంది పండితులు చెప్పిన కారణాలనీ – రస పోషణ, ఔచిత్య పోషణ, వంటి   కారణాలనీ చెప్పడం విచారణీయం. వ్యాస భారతానికి కవిత్రయ భారతానికి వెయ్యేళ్ళకు మించిన కాల వ్యవధి ఉంది. ఆ వ్యవధిలో అనేక సామాజిక మార్పులు వచ్చాయి. వాటి కారణంగానే వాళ్లు తమ రచనల్లో మార్పులు చేర్పులు చెయ్యవలసి వచ్చింది. దీనిని ఈ విమర్శకుడూ గుర్తించి ఉంటే తర్వాతి పండితులు కూడా ఆ మార్గంలో ఆలోచించి ఉండే వాళ్ళు.
వెంకట సుబ్బరామయ్య ఆంగ్లోపాధ్యాయుడు. ఆంగ్ల సాహిత్య విమర్శ ప్రభావం ఆయన మీద వుంది. 1933  నాటికి తెలుగు సాహిత్యం మీద మార్క్సిజం ప్రభావం గాని, సామాజిక వాద ప్రభావంగాని అంతగా పడలేదు. అయితే వీటి ప్రభావం లేకపోయినా కట్టమంచి అదే పాశ్చ్యాత్య సాహిత్య ప్రభావంతో కవిత్వతత్వ విచారంలో రచన లోని జీవితాన్ని వస్తువును కూడా పరామర్శించారు. ఈ సంప్రదాయ పండితులంతా ఆ వస్తు దృష్టిని విడనాడారు. రూప పరిశీలనకే పరిమితమయ్యారు. ఈ విమర్శలకు కూడా అదే పరిమితికి లోనై రూప విమర్శ దగ్గర ఆగిపోయారు. పైగా వాళ్ళలో అనేకులు కట్టమంచి వ్యతిరేక శిబిరాలు నిర్వహించడంలో నిమగ్నమైనారు. ఇప్పటికకీ ఆ శిబిరం కొనసాగుతూనే ఉంది. ఈ శిబిరమే లేకుంటే తెలుగు సాహిత్య విమర్శ ఎదుగుదల మీద సందేహాలు వ్యక్తమయ్యేవికావు. వెంకట సుబ్బరామయ్య ఆ శిబిరంలో ఉన్నారో లేరో తెలియదు గాని ఆయన కావ్య కళా విమర్శనకే పరిమితమయ్యారు. కవిత్రయం వారి సాహిత్యంలోని జీవితం జోలికి పోలేదు. వాళ్ళ భావజాలం జోలికి పోలేదు. అందువల్ల ఆ కవుల భావజాలంతో ఈ విమర్శకునికి మమేకత ఉందనే భావించవలసి వుంది. ఏమైనప్పటికీ ఈ గ్రంధంలో 1933 నాటికి ఆధునిక  విమర్శ లక్షణాలను పొదివి రావడం, ఆ తర్వాత అనేకమంది ఈయననే అనుసరించడం మాత్రం వాస్తవం. ఈ గ్రంధాన్ని ఇవాళ ఎవరైనా మళ్ళీ ముద్రిస్తే మంచిది.

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో