దళితసాహిత్యం-చరిత్ర

చరిత్ర రచనాక్రమం_నేపధ్యం    :
భారతదేశ చరిత్ర రచనను మొదట ప్రారంభించిన వారు వలసవాద చరిత్రకారులు.  జె.ఎస్.     మిల్, మెకాలే వంటివారు భారతదేశ చరిత్రను వలసవాద దృక్పథంతో పరిశీలించారు.  వీరి రచనలలో భారతీయులు వెనుకబడిన అనాగరికులు.  వీరికి సంస్కారం నేర్పి, నాగరికులుగా చెయ్యటం పాలకులుగా తమబాధ్యత అనే ధోరణి కనిపిస్తుంది.  వీరు భారతదేశ చరిత్రలో ప్రాచీనయుగాన్ని హిందూయుగంగాను, మధ్యయుగాన్ని ముస్లిం యుగంగాను ఆధునిక యుగాన్ని బ్రిటిష్ యుగంగాను విభజించి చరిత్రరచనలో తమ సంకుచితత్వాన్ని చాటుకున్నారు.  వలసవాద చరిత్రకారులను వ్యతిరేకిస్తూ కొందరు సంప్రదాయవాద చరిత్రకారులు ప్రాచీన మధ్య యుగాలలో భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులైన అశోకుడు, కనిష్కుడు, హర్శవర్థనుడు, సముద్రగుప్తుడు, బాబర్, అక్బర్ వంటివారి చరిత్రపై గ్రంథాలు వెలువరించి భారతీయుల ఆత్మగౌరవాన్ని చాటారు.  వీరిలో ఆర్.సి.ముజుందార్,భండార్కర్, వి.డి.మహాజన్, రాధాకుముద్
ముఖర్జీ మొదలైనవారు ప్రముఖులు.  వీరి అనంతరం వి.డి.సావర్కర్, తారాచంద్ వంటివారు జాతీయోద్యమ     స్ఫూర్తితో భారతదేశ చరిత్రను పరిశీలించారు.
చరిత్రను రాజవంశీకుల వ్యక్తిగత అంశాలు, దౌత్యసంబంధాలు,యుద్ధాలు, సంధుల వంటి అంశాల చుట్టూ పరిభ్రమించడాన్ని మార్క్సిస్టు చరిత్రకారులు, సబాల్ట్రన్ చరిత్రకారులు తప్పుబట్టారు.  చరిత్రలో     ఆర్థిక, సాంఘిక అంశాలకు, మానవనాగరికతా నిర్మాణంలో సామాన్యమానవుడు నిర్వహించిన పాత్రకు     ప్రాముఖ్యత ఉండాలని నినదించిన మార్క్సిస్టు చరిత్ర అణగారిన వర్గాలు, స్త్రీల యొక్క అస్తిత్వాన్ని చరిత్ర     నిర్మాణానికి వారు చేసిన కృషిని వెలికితీయడంలో వైఫల్యం చెందింది.
మార్క్సిస్టు చరిత్రకారుల ఆర్థికవాదన్ని విమర్శిస్తూ కిందినుంచి చరిత్రను పునర్నిర్మించాలని    చరిత్రలో రైతాంగవర్గాలు, గిరిజనులు నిర్వహించిన పాత్రలను అధ్యయనం చెయ్యడం తమధ్యేయమని ప్రకటించుకున్న సబాల్ట్రన్ చరిత్రకారులు ఆచరణలో చేసిందేమిటి?  వీరు చరిత్రరచనలో కొంతమేరకు     గిరిజనులకు రైతాంగవర్గాలకు ప్రాముఖ్యత నిచ్చినప్పటికి సమాజంలో అణగారిన వర్గాలైన దళిత బహుజనుల చరిత్రను వెలికి తీయలేకపోవడం గమనార్హం.  వీరు చెప్పేరైతాంగ వర్గాలు గ్రామాలలో పెత్తందారులుగా ఎదిగిన అగ్రకుల శూద్రులు, నయాసంపన్న పాలకవర్గాలు.  దళితులపై ప్రత్యక్షంగా కులవివక్షను పాటిస్తూ వారిపై     భౌతికదాడులకు, అత్యాచారాలకు పాల్పడేది ఈవర్గమే!

దళితుల చరిత్ర    :
పైన పేర్కొన్న వివిధ చారిత్రక స్రవంతులకు భిన్నంగా దళితుల చరిత్ర రచన ఇటీవలి కాలంలో ముందుకు వస్తుంది.  ప్రధాన స్రవంతికి చెందిన చారిత్రక ఆధారాలైన శాసనాలు, కైఫీయతులు, సంప్రదాయ     సాహిత్య గ్రంథాలలో దళితుల చరిత్ర కనిపించదు.  సంప్రదాయ సాహిత్యంలో దళితుల ప్రస్తావన అరుదుగా వచ్చినప్పటికీ అది వారిని కించపరిచేదిగా ఉంది.  సంప్రదాయ సాహిత్యం దళితులు నివశించే వెలివాడల గురించి అక్కద కూడా ప్రస్తావిస్తూ అక్కడివారి రూపురేఖలను విడ్డూరంగా చిత్రించడం చూడవచ్చు.  దళితులు     ఎదురుపడితే అగ్రవర్ణాలకు అంటుకునే మైలను ఎలా ప్రక్షాళన చేసుకోవాలి?  వారిని ఎంతదూరంలో ఉంచాలి?      వారికేటువంటి శిక్షలు విధించాలి?  అనే అంశాలనే దళితుల పరంగా ఎక్కువగా ప్రస్తావించడం గమనార్హం.
విదేశీయాత్రికులైన పాహిమాన్,హుమాన్ త్యాగ్,మార్కోపోలో,ఆల్ బెరూని,పమెస్,న్యూనిజ్     వంటివారు భారతసమాజంలో అంటరానివారిగా ఊరికి దూరంగా నివశిస్తున్న వారి గురించి తమ యాత్రా రచనలలో ప్రస్తావించారు.  పాహిమాన్ భారతదేశాన్ని గుప్తులకాలంలో సందర్శించాడు.  ఆయన సమాజానికి     ఆమడంత దూరంలో నివసిస్తూ, అంటరనివారిగా పరిగణింపబడే వర్గం ఆరోజుల్లో ఒకటి ఉండేదని, వారు ఊళ్ళోకి వస్తే వారు ఊంచిన ఉమ్మి కిందబడకుండా మెడలో ముంత, వారి పాదముద్రలు నేలపై పడకుండ వెంటనే తుడిచి వేయడానికి నడుముకు చీపురు వేలాడదీసుకొని వచ్చేవారని, వారు ఎదురుపడగనే మిగిలిన వారంతా పక్కకు తప్పుకొని వెళ్ళేవారని పేర్కొన్నాడు.
ఏడవ శతాబ్దంలో హర్షుని కాలంలో భారతదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుమాన్ త్యాంగ్ మధ్యయుగాలలో ముస్లింల పాలనలో భారతదేశానికి వచ్చిన ఆల్ బెరూని, మార్కోపోలో, విజయనగర     పాలనాకాలంలో వచ్చిన పర్షియన్ యాత్రికుడు పమెన్, న్యూనిజ్ లు కూడ వెలివాడల దుస్థితిని తమ     రచనలలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రపై గ్రంథాలు వెలువరించిన ప్రధాన స్రవంతికి చెందిన చరిత్రకారుల్లో ఆర్.సి.     ముజుందార్ తన పుస్తకంలో దళితుల కోసం ఓక పేరాను, బిపిన్ చంద్ర మూడు పేజీలను కేటాయించారు.  ఆర్. సి. ముజుందార్ మానవతావాదులు, సంఘసంస్కర్తలు తమ సేవాకార్యక్రమాలను విస్తరింప     జేసుకోవడానికి దళితులు ఉపయోగపడ్డారని తన పుస్తకంలో పేర్కొన్నాడు.  ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడైన సుమిత్ సర్కార్ జాతీయోద్యమకాలంలో హరిజనోద్ధరణను ప్రారంభించిన గాంధీజీ     కార్యక్రమాలను వివరించే సందర్భంలో దళితుల గురించి ప్రస్తావింఛాడు.  కాని అదేకాలంలో దళితుల     చాంపియన్ గా ముందుకొచ్చి దేశ రాజకీయాలలో దళితసమస్యపై చర్చను లేవనెత్తిన అంబేద్కర్ పాత్రను ఈ     మార్క్సిస్ట్ చరిత్రకారుడు విస్మరించడం యాదృచ్ఛికం కాదు.
భారతదేశంలో దళితుల చరిత్రను చరిత్రకారు లెవ్వరూ పట్టించుకోని రోజుల్లో     ఆంత్రోపాల జిస్టులు,ఎత్నో గ్రాఫర్లు, క్రైస్తవ మిషనరీలు దళితుల చరిత్రను అధ్యయనం చేశారు.  వీరిలో అత్యధికులు విదేశీయులు కావడం విశేషం.  రిప్లే, కేట్కఱ్,థర్ స్టల్, సేనార్ట్, నెన్ ఫీల్డ్,హట్సన్, గుర్రే,  బ్రిగ్స్,ఆండ్రీ  బేట్ల్, లించ్ వంటిసామాజిల శాస్త్రవేత్తలు భారతసమాజంలో కులవ్యవస్థ యొక్క పుట్టుపూర్వొత్తరాలు, దళితుల     స్థితిగతులు, అంటరానితనం భారత సమాజం యొక్క ప్రత్యేక లక్షణంగా పరిణమించిన తీరుతెన్నులను     అధ్యయనం చేశారు.  క్రైస్తవ మిషనరీలు మారుమూల పల్లెల్లో ఒకవైపు తమ మతాన్ని ప్రచారం చేసుకుంటూ హైందవ సమాజానికి దూరంగా కనీస సౌకర్యాలు, సామాజిక హోదా లేకుండా జీవిస్తూ సభ్యసమాజంచేత     వెలివేతకు గురవుతున్న వెలివడల దుస్థితిని అధ్యయనం చేశారు.  కాబట్టి బ్రిటిష్ వారి రాకతో భారతదేశంలో దళితుల చరిత్ర రచన అనేది ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు.
మార్క్ జుర్గన్స్ మేయర్ ఆది ధర్మయుద్ధంపైరాసిన పుస్తకం దళితుల చరిత్రపరంగా     మొదటిది.  అని పరిశీలకులు భావిస్తున్నారు.  బ్రాహ్మణీయ వ్యవస్థలో అంటరనివారిగ, కడజాతి వారిగా     పరిగణింపబడుతున్న తళితులు వలసవాద కాలంలో ఇంగ్లీషువిద్య వలన చైతన్యవంతులై దేశవ్యాప్తంగా ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన క్రమాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. దళితులు తాము ఈ నేలతల్లి బిడ్డలమని, ఈ దేశానికి మూలవాసుల మని బయటి నుంచి వలస వచ్చిన ఆర్యులు తమపై కులాన్ని రుద్దారని పేర్కొంటూ ఉత్తరాదిన ఆది హిందు, ఆది ద్రావిడ, దక్షిణాదిన ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర,  ఆది కర్ణాటక ఉద్యమాలను ప్రారంభించడాన్ని జుర్గన్స్ మేయర్ వివరించాడు.  ఎల్లినార్ జెల్లియట్ మహారాష్ట్రలోని దళితుల సామాజిక నేపథ్యం, వారిలో వచ్చిన సామాజిక చలనం, వలసవాద ప్రభుత్వంతో వారు చేసిన పోరాటం, మహర్ల నాయకుడిగా ప్రారంభమైన అంబేద్కర్ ప్రభంజనం మొదలైన అంశాలను తన అధ్యయనంలో వెలుగులోకి     తెచ్చింది.  నెయిల్ ఆవెల్ వలసవాద కాలంలో దేశంలోని వివిధ ప్రాంతలలో తలెత్తిన దళితుల ఆత్మగౌరవ పోరాటాలను వివరించింది.  ఆమె దళిత ఉద్యమాన్ని ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా విలువల ఆధారంగా     జరిగిన ఉద్యమంగా పేర్కొనడం విశేషం.  మన శాంషా దళిత ఉద్యమాలను సంస్కరణవాద, ప్రత్యామ్నాయ ఉద్యమాలుగా విభజించాడు.  ఎస్.కె.గుప్తా దళిత ఉద్యమం యొక్క వివిధ కోణాలను విశ్లేషించాడు.  ౧౯౯౧లో అంబేద్కర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా దళితుల చరిత్ర పరంగా అనేక అధ్యయనాలు వెలుగులోకి వచ్చాయి.  దళితుల చరిత్ర అంటే దళితుల ఆత్మగౌరవ పోరాట చరిత్రగా ముందుకొచ్చింది.  దళిత ఉద్యమం గురించిన చరిత్రను గ్రంథస్థం చేయడం తొలినాటి దళిత ఉద్యమంపైన పి.ఆర్.వెంకటస్వామి “అవర్ స్ట్రగుల్ ఫర్     ఎమానిపేషన్” పేరుతో రెండు సంపుటాల గ్రంథాన్ని ౧౯౫౫లో ప్రచురించాడు.  ఆంధ్రదేశంలో స్వతంత్ర     ఉద్యమం బాగా ఊపందుకోక ముందే దళితులు కులవివక్షకు వ్యతిరేకంగ సంఘటిత మవ్వడం, వారు తమకోసం అనేక సంఘాలను ఏర్పాటు చేసుకొని తమవైన ఆకాంక్షలను వ్యక్తపరచడం ప్రభుత్వానికి నివేదనలు సమర్పించడం వంటి అంశాలను వెంకటస్వామి ఈ పుస్తకంలో వివరించడు.  దళిత నాయకులుగా ముందుకొచ్చిన భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, ఆదయ్య వంటి వ్యక్తుల గురించి కూడ ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
ఎం.వి.గౌతం భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను “భాగ్యోదయం” పేరుతో ౧౯౯౧లొ ప్రచురించాడు.
ఈ పుస్తకం హైదరాబాదు రాష్ట్రంలోని దళిత ఉద్యమ చరిత్రను, అందులో కీలకపాత్ర వహించిన భాగ్యరెడ్డి వర్మ     వ్యక్తిత్వాన్ని గురించి గౌతం వివరించారు.
కత్తి పద్మారావు “దళితుల చరిత్ర,” ఉ.సాంబశివరావు “దళిత రణనినాదం,” కలేకూరి ప్రసాద్     ”దళిత ఉద్యమం_దళిత సాహిత్యోద్యమం” దళిత ఉద్యమ చరిత్రను వివరించాయి.  బొనిగల రామారావు “మాల మాదిగల ప్రాచీన చరిత్ర,” “ఆది గురువు చండాల,” “మాల కన్నమనీడు,” భూపతి నారయణ మూర్తి రచన     ”దళితుల అసలు జాతి నాగులు,” కె. లక్ష్మీనారయణ “ఆది భారతీయుల చరిత్ర,” వంటి గ్రంథాలు ప్రత్యామ్నాయ చారిత్రక ఆధారాలలో దళితుల ప్రాచీన చారిత్రక మూలాలను వెతికి తీసే ప్రయత్నం చేశాయి.  ఈ రచయితలు చరిత్ర రచనలో అకడమిక్ ఒపరిశోధకులకు భిన్నంగా ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించి దళితుల ప్రాచీన చరిత్రను కొంతమేరకైనా గ్రంథస్తం చేయగలిగారు.
అకడమిక్ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో దళితుల చరిత్రపరంగా వచ్చిన పుస్తకాలలో యాగాంతి     చిన్నారావు దళిత్స్ స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటీ (ఆంధ్ర అండ్ హైదరాబాద్ ౧౯౦౦_౧౯౫౦) గ్రంథం మొదటిదని     చెప్పవచ్చు.  ఈపుస్తకంలో చిన్నారావు దళితుల చారిత్రక నేపథ్యం, దళితులలో విద్యాభివృద్ధి, దానికి దోహదం చేసిన వివిధ అంశాలు, వలసవాద వ్యతిరేక ఉద్యమంలో దళితులపాత్ర, వారిలో ఏర్పడిన రాజకీయ చైతన్యం, ఆర్థిక,సాంఘిక అసమానతలపై దళితులు ప్రారంబించిన నిరసనోద్యమం, దళిత ఉద్యమంలో భాగంగా ఏర్పాటైన మాన్యసంఘాలు, జగన్ మిత్రమండలి, స్వస్తిదళ్ వంటి సంఘాలు, ఆది హిందు, ఆది ఆంధ్ర మహాసభలు, సమావేశాలు మొదలైన అంశాల్ని చిన్నారావు పుస్తకంలో చర్చించబడ్డాయి.
తరువాత ప్రచురితమైన అడపా సత్యనారాయణ “దళిత్ అండ్ అప్పర్ క్యాస్ట్స్” పుస్తకం దళిత     ఉద్యమపరంగా కీలకమైనది.  ఆయన కులం, వర్గం అనే భావనలపైన, దళితులు క్రైస్తవమంతం కారంచేడుకు     పూర్వం దళిత ఉద్యమం యొక్క తీరుతెన్నులు, ఆకాలం నాటి సాహిత్యం, అగ్రకుల శూద్రపాలక వర్గాల వారు     దళితులపై సాగించిన భౌతికదాడుల వెనుక పనిచేసిన ఆర్థిక, రాజకీయ సూత్రాలు, జీవనభృతిని వెదుక్కుంటూ     బర్మా వెళ్ళిన దళితుల పరిస్థితిపై కూడా అడపా సత్యనారయణ విలువైన పరిశోధనా వ్యాసాలను ఈపుస్తకంలో పొందుపరిచి ఆధునిక కాలంలో దళితులలో వస్తున్న రాజకీయ, సామాజిక చైతన్యం యొక్క వివిధకోణాలను వివరించారు.
ఇనుకొండ ఇరుమలి తెలంగాణా ప్రాంతంలోని దళిత బహుజనులు ఏకకాలంలో ఒకవైపు     నిజాం నిరంకుశ పాలనపైన, మరోవైపు స్థానిక అగ్రకుల దొరలపైన పోరాడిన వైనాన్ని తనగ్రంథ “ఎగినెస్ట్ దొర     అండ్ నిజామ్” లో విశ్లేషించారు.  ఈపుస్తకంలో తెలంగాణా దళితుల ప్రత్యేక పరిస్థితులైన ఆర్థికదుస్థితి, వెట్టిచాకిరి, అంటరానితనం, వెనుకబాటుతనం వంటి సమస్యలను వెలుగులోనికి తీసుకురాగలిగింది.
అకడమిక్ రంగంలో దళితుల చరిత్రను వెలికితీయడంలో కంచ ఐలయ్య, జంగం చిన్నయ్య,     ప్రియదర్శిని విజయశ్రీ, ఘంటా చక్రపాణి, ఈ సుధారాణి, ఆర్. స్వరూపరాణి, కె.వై.రత్నం మొదలైనవారు కృషి చేస్తున్నారు.

దళిత సాహిత్యం_చరిత్ర    :
లిఖితరూపంలో పుస్తకాల కెక్కిన దాన్ని మాత్రమే సాహిత్యమనుకుంటే, దళితసాహిత్య పరిధి     చాల చిన్నదవుతుంది.  తెలుగులో నన్నయకు పూరమే దళిత బహుజనవర్గాలకు చెందిన లిఖితకవులుంటే     దళితులు విస్తృతస్థాయిలో మౌలిక సహిత్యాన్ని జానపద కళారూపాలు, కథాగేయాలు ఒగ్గుకథలు, బుర్రకథలు, వీథి భాగవతాలు మొదలైన రూపాల్లో సృష్టించి వేల సంవత్సరాలుగా గానం చేస్తూ, ప్రదర్శిస్తూ, తరతరాలకు తమసాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తూ వస్తున్నారు.  వీటికి తారీఖులు, దస్తావేజులు     లేవు.  దళితులే అనాదిగా జాంబపురాణం,చెన్న పురాణం, ఎల్లమ్మ కథ, అల్లీరాణి కథ, చిందు భాగవతం వంటి     బ్రాహ్మణేతర సాంస్కృతిక రూపాలను రూపొందించుకొని వాటిని ఎంతో శ్రద్ధతో కాపాడుతూ వస్తున్నారు.      చిందుకళాకారులైతే ఆయా కళారూపాలను ప్రదర్శించడం వృత్తిగా చేసుకొని ఇంకా సంచారజీవనంలోనే     గడుపుతుండడం విశేషం.
ఈ కళారూపాలలో దళితుల సాంస్కృతిక మూలాలు నిక్షిప్తమై ఉన్నాయి.  ముఖ్యంగా ఆర్య_అనార్య జాతుల మధ్య జరిగిన ఆధిపత్యపోరులో అనార్యులు ఓడిపోయి బానిసలుగా మారిన స్థితి,     తద్వారా మాతృస్వామిక వ్యవస్థల స్థానంలో పితృస్వామిక సంస్కృతి పైచేయి సాధించడం దళితుల మౌఖికసాహిత్యంలో చిత్రించబడింది.  బ్రాహ్మణ బ్రాహ్మణేతర వర్గాలు పరస్పరం ఘర్షించుకొన్న క్రమంలో ఒకనాడు స్వయంపోషకత్వాన్ని, సాధికారతను అనుభవించిన దళితజాతులు క్రమంగా బానిసలుగా,     అంటరానివారిగా మార్చబడిన పరిస్థితిని బ్రాహ్మణీయ వర్గాలు సృష్టించిన లిఖిత, అలిఖిత సాహిత్యంలో వారెక్కడా పేర్కొనకపోవడం యాదృచ్చికం కాదు.  పురాణ ఇతిహాసాలైనహిందూమత సాహిత్యంలో ఎంతో     పాజిటివ్గా కనిపించి, బ్రాహ్మణీయ వర్గాలు న్యాయం, ధర్మం అని చెప్పేవాటికి అనుకూలంగా ప్రవర్తించే రాముడు,     కృష్ణుడు, అర్జునుడు మొదలైన వారంతా దళితుల మౌఖిక సాహిత్యంలో ప్రతినాయకులుగాను వారిచేతిలో పరాజయానికి, మోసానికి గురైన శంబూకుడు, ఏకలవ్యుడు వంటి పాత్రలు పాజిటివ్ గాను కనిపించడం గమనార్హం.  అంటే లిఖితరూపాల్ని సంతరించుకోక పూర్వమే దళితసాహిత్యం తనదైన ప్రాపంచిక దృక్పథాన్ని     ప్రదర్శించిందన్నమాట.  హిందూ పురాణేతిహాసాలను అంబేద్కర్ విశేషించిన తీరు ఇక్కడ మనం చూడవచ్చు.
దళితుల మౌఖికసాహిత్యంలో జాంబపురాణం, చెన్నపురాణం, అల్లిరాణి కథ,ఎల్లమ్మకథ ముఖ్యమైనవి. మాదిగల సాంస్కృతిక మూలాలు జాంబపురాణంలోనూ, మాలల మూలాలు చెన్నపురాణంలో     వ్యక్తమవుతాయి.  మాదిగల మూలపురుషుడు జాంబవంతుడు సమాజంలోని మిగిలిన ఉత్పత్తి కులాలను కూడా సృష్టించాడని, ఆయన సృష్టిలో ముందున్న వాడని మాదిగలు స్వయంగా చెప్పుకుంటారు. ఈనాటికీ మాదిగల పెండ్లి పాటలలో వారు జాంబవంతుని ప్రస్తావన తీసుకొస్తారు. జాంబవంతుడు వచ్చి వారిని ఆశీర్వదిస్తాడని వారి నమ్మకం. అలాగే మాలలు చెన్నపురాణంలో వారి మూలపురుషుడైన చెన్నయ్య గురించి తమకులం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి గొప్పగా చెప్పుకోవడం విశేషం.  మాదిగ అనుబంధ కులాలైన చిందు భాగములు, బైండ్లవారు జాంబపురాణాన్ని గానంచెయ్యగా చెన్నపురాణాన్ని పంబలివారు గానం     చేస్తారు.  బైండ్లవారు చెప్పే అల్లీరాణి, ఎల్లమ్మ కథలలో దళితస్త్రీలపై అగ్రవర్ణాలు సాగించిన దాష్టీకాన్ని ఆయా కథకులు ఎండగడతారు.  అల్లీరాణి కథ ఒకనాటి దళితస్త్రీల సాధికారతకు ప్రతిరూపం.  ఎల్లమ్మ కథలో     బ్రాహ్మణీయ పురుషాధిపత్యానికి ప్రతినిధియైన పరశురాముడు తన తల్లియైన రేణుకను వధించగా ఆమె తల వెళ్ళి దళిత వాడలో పడుతుంది.  దళితులు ఆస్త్రీని బ్రతికించుకొని ఎల్లరకు అమ్మగా ఎల్లమ్మగా పూజించుకుంటున్న విధానం వ్యక్తమవుతూంది.  ఈనాటికీ మాదికలు, పంబలివారు హిందువులుగా మిగిలివున్న దళితులు జమదగ్ని, పరశురాముడు, ఎల్లమ్మ, రేణుక వంటి పేర్లు పెట్టుకోవడం గమనార్హం.
దళితులచే వేయించబడిన శిలాశాసనం అమరావతి బౌద్ధస్థూపం వద్ద లభ్యమయింది. విధికుడనే చర్మకారుడు తన కుటుంబంతో అమరావతి బౌద్ధారామాన్ని సందర్శించి అక్కడ పూర్ణకుంభాన్ని దానం చేసినట్లు, ఈ విధికుని తండ్రి ఒక ఆచార్యుడన్నట్లు ఈ శాసనంలో పేర్కొనడం జరిగింది.  విధికుడు దానంగా ఇచ్చిన ఆ పూర్ణకుంభమే నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం.  దీనిని బట్టి దళితుల సాంస్కృతిక మూలాలు బౌద్ధంలో ఉన్నాయని తెలుస్తుంది.  దక్షిణ భారతదేశంలో ఆర్యనైజేషన్ పూర్తయి కులవ్యవస్థ     వేళ్ళూనుకోక పూర్వం దళితులు ఆదిబౌద్ధులుగా ఉన్నతస్థితిలో ఉన్నట్లు అమరావతి శాసనం వలన స్పష్టమయ్యింది.  అయితే దళితుల బౌద్ధమత సాహిత్యం ఏమైనట్లు?  దేశవ్యాప్తంగా జరిగిన హిందూమత     పునరుజ్జీవన ప్రక్రియలో భాగంగా బ్రాహ్మణ కులస్థులు బౌద్ధమత సాహిత్యాన్ని పూర్తిగా ధ్వంసంచెయ్యడం     జరిగింది. ఈ క్రమంలోనే దళితుల సాహిత్యం కూడా కనుమరుగైపోయి ఉండవచ్చు. దళితులపై అంటరానితనం రుద్దబడి ఆదివాసులు సభ్యసమాజానికి దూరంగా నెట్టబడిన తరువాత దళితులు బహుశా ఈ మౌఖిక రూపాలను సృష్టించి ఉంటారు.  ప్రజల జ్ఞాపకాలలో నిక్షిప్తమై, నిరక్షరాస్యుల నాలుకలపై నిలిచి ఉంటాయి     కాబట్టి ఈ కథాగేయాలను, కళారూపాలను ఎవరూ ధ్వంసం చేయలేకపోయారు.
మధ్యయుగాలలో వీరశైవం దళితకులాలలో “జంగమ” అనే కులాన్ని, వైశ్ణవం “మాలదాసర్ల”ను సృష్టించక పూర్వమే బౌద్ధమత శాఖయైన వజ్రయానం హిందూమత ప్రభావంతో మాలల్లో “పంబలి” అనే ఉపకులాన్ని, మాదిగలలో “పోతురాజు” వ్యవస్థను సృష్టించింది.  ఇక్కడి జోగినీ వ్యవస్థను పోలిన     ”కుమారి పూజ” అనే విధానం వజ్రయాన బౌద్ధమత ప్రభావంతో నేపాల్ లో కూడా వేళ్ళూనుకుంది. వజ్రయానం, తంత్రమానం, కాలచక్రయానాలలో వారువేసే ముగ్గులు, ప్రదర్శించే తాంత్రికవిద్యలు,     మంత్రతంత్రాలకు మనప్రాంతంలో పంబలి, పోతురాజులు చేసే పూజకు దగ్గరసామ్యం ఉంది.  ఈకోణాన్ని     సాహిత్యం ఎక్కడా ప్రస్తావించలేదు.
ఆధునికకాలంలో దళితుల లిఖిత సాహిత్యాన్ని కారంచేడుకు ముందు, కారంచేడు తర్వాత     వచ్చిన సాహిత్యాలుగా విభజించవచ్చు.  దళితులు క్రైస్తవ మిషనరీలు అందించిన విద్యావకాశాల వలన అక్షరాస్యులై ౧౯వ శతాబ్ది ద్వితీయార్థంలో నుంచే సాహితీసృజన ప్రారభించారు.  ఈక్రమం వారిరచనలలో కూడా వ్యక్తమయింది.  దళితుల లిఖితసాహిత్యం మొట్టమొదటిసారిగా ౧౯౦౧లో లభించింది.  “అందారు పుట్టిరి యిందమ్మ తల్లికి” అన్న ఈ గేయరచయిత ఎవరో తెలియదు.  తర్వాత కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, గుర్రం జాషువా, నక్కా చినవెంకయ్య, నూతక్కి అబ్రహాం, జాలా రంగస్వామి వంటి ఎందరో     రచయితలు, కవులు కారంచేడు పూర్వమే సుమారు ౨౦౦ మందిదాకా ఉన్నారు.  వీరిలో జాషువా, బోయి     భీమన్న, కుసుమ ధర్మన్న వంటివారు తప్ప మిగిలిన వారి గురించి చాలామందికి తెలియదు.  వారి     రచనలను ప్రధానస్రవంతికి చెందిన పత్రికలు, సాహితీసంస్థలు ప్రచురించకపోవడం, స్వంతంగా ప్రచురించుకునే ఆర్థికస్తోమత రచయితలకు లేకపోవడం వలన ఎందరో రచయితల సాహితీసృష్టికి ఎక్కువగా అముద్రితంగానే ఉండిపోయింది.  స్వాతంత్ర్యానికి పూర్వం భాగ్యరెడ్డి వర్మ వంటివారు ఆదిహిందూ, ఆదిఆంధ్ర పేర్లతో నడిపిన     దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి ఆనాటి దళిత ఉద్యమం వాహికగా నిలిచింది.  దళితులు స్వాతంత్ర్యం, స్వరాజ్యం అనే భావనల పట్ల తమవైన ఆకాంక్షలను, ఆశలను తమసాహిత్యంలో వ్యక్తీకరించారు.  ఆనాడు     వలస్వాదులను విమర్శిస్తూ గరిమెళ్ళ రాసిన “మాకొద్దీ తెల్ల దొరతనం” అనే గేయానికి బదులుగా కుసుమ ధర్మన్న “మాకొద్దీ నల్ల దొరతనం” గేయాన్ని రాసి దళితులకు బ్రిటిష్ వారి పాలనకంటే ఇక్కడి అగ్రకుల పెత్తందారీతనమే బధాకరంగా ఉందని అప్పటి దళితదృక్పథాన్ని చాటాడు.
గుర్రం జాషువా, బోయి భీమన్నల సాహిత్యం దళితులలో చైతన్యాన్ని నింపింది.  దళిత పీడితులకు అండగా నిలిచింది.  దళితులు ఎదుర్కొంటున్న ఆర్థికపీడనను, సామాజిక దుర్నీతిని వీరు సున్నితంగా బట్టబయలు చేసి, వెలివడలను మేల్కొల్పారు.  బానిలకు నువ్వు బానిసవని చెప్తే అతడే     దాన్నుంచి బయటపడడానికి ప్రయత్నం మొదలుపెడతడని అంబేద్కర్ అన్నమాటలు వీరిద్దరి విషయంలో నిజమయ్యాయి.  దళిత ఉద్యమం అంత క్రియాశీలంగా లేని రోజుల్లో జాషువా సాహిత్యం ఆలోటుని తీర్చింది.      కరుణరసాత్మకంగా ఉండి దళితుల ఆవేదనకు అద్దంపట్టే జాషువా పద్యాలు వేమన పద్యాల తర్వాత అంతటి     ప్రజాదరణను పొందాయి.  ఛందస్సులో ఉన్నప్పటికీ ఇవి నిరక్షరాస్యుల నాలుకలపై మోగిపోయేవి.
బోయి భీమన్న రచించిన “పాలేరు” నాటకం దళితులలో చైతన్యాన్ని నింపడమే కాక, గ్రామాలలో చదువుకు దూరమై అగ్రకుల భూస్వాముల ఇళ్ళల్లో పాలేర్లుగా పనిచేస్తున్న అనేకమంది గొడ్లకాడి బడ్డోళ్ళు చదువు ప్రారంభించి పంతంతో ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లయిన సందర్భాలు కూడా ఉన్నాయంటే     ఆనాటకం ఎంతగా దళితుల మనసుల్లో నిలిచిపోయిందో అర్థం చేసుకోవచ్చు.  పంచభక్ష్య పరమాన్నాలు     భుజించి, తాంబూలం సేవించి, రచించిన కావ్యాలు సాధించిన సామాజికప్రయోజనం ఏమిటో ఎవరికీ     తెలియదుగాని,     కారంమెతుకులు తిని కనీసం రాసుకోవడానికి పేపర్లు ,    కూర్చోడానికి కుర్చీ, టేబుల్ అంతంతమాత్రంగా ఉండే దళితులు సృష్టించిన కడుపు దహించుకుపోయే సాహిత్యం ఆవర్గాలలో ప్రాణవాయువును నింపిందని     చెప్పవచ్చు.  వీరి సాహిత్యంలో ఆధిపత్యదోపిడీ సంస్కృతిపై తిరగబడ్డ ధిక్కారచరిత్ర అణువణువునా కనిపిస్తుంది.
కారంచేడు ముందుతరానికి, కారంచేడుతరం రచయితకు వారధిగా కొలకలూరి ఇనాక్     నిలిచారు.  దళిత సమస్యపై ఆయన రాసిన కథలు దళిత సాహిత్యచరిత్యలో కీలకమైనవి.  అసలు దళితకథలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఇనాక్ కథ “ఊరబావి కథ”.  అస్పృశ్యత కారణంగా సవర్ణులు వాడుకొనే బావుల్లోని నీటిని తోడుకోవడానికి అవకాశంలేని దళితులు గుక్కెడు మంచినీళ్ళ కోసం సాగించిన పోరాటాల     చరిత్రను వివరిస్తుంది.  అలాగే ఆయన రాసిన “మునివాహనుడు” నాటకం దళితుల దేవాలయ ప్రవేశంకోసం     చేసిన ఉద్యమచరిత్రకు అద్దంపడుతుంది.  సంస్కరణవాద యుగంలో అగ్రకుల సంస్కర్తలు ఒకవైపు     స్త్రీజనోద్ధరణ కోసం కృషిచేస్తున్న రోజుల్లో మరోవైపు దేశవ్యాప్తంగా దళితులు నీటికోసం, దేవాలయ ప్రవేశంకోసం     వీథిపోరాటాలు చేసిన చారిత్రక సందర్భాన్నీ ఇనాక్ శక్తివంతంగా ముందుకు తీసుకొచ్చారు.
దళితౌద్యమ చరిత్రలోను, దళితుల సాహిత్య,సాంస్కృతిక చరిత్రలోను కారంచేడు ఓ     మైలురాయి.  ౧౯౮౫లో ప్రకాశంజిల్లా కారంచేడు గ్రామంలో అగ్రకుల భూస్వాములు మాదిగవాడపై జరిపిన     మారణకాండను నిరసిస్తూ ప్రారంభమైన దళిత ఉద్యమం సరికొత్త ధిక్కారసాహిత్యానికి నాంది పలికింది. కారంచేడు అనంతరం చుండూరు, నీరుకొండ, పదిరి కుప్పం, వేంపెంట మొదలైనచోట్ల దళితులపై అగ్రవర్ణాలు     జరిపిన ఊచకోతకు రక్తం మరిగిపోయిన దళిత యువతరం తమ ఆగ్రహానికి కవిత్వరూపం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉప్పెనలా ఎగిసిపడిన దళిత ఆగ్రహం, ప్రతిఘటన సరికొత్త కలాలను సృషించింది.  ఎప్పుడూ     లేనంతగా అత్యధికసంఖ్యలో కవులు, కళాకారులు ఈకాలంలో తయారయ్యారు.  వీరు కొత్తవస్తువు, కొత్తశైలి, కొత్తభాష, కొత్తప్రశ్నలతో సాహితీప్రపంచాన్ని నిలువునా కుదిపివేశారు.  వీరు సృషించిన సునామీసాహిత్యం     గురించి ప్రజలలో ఉన్న అభిప్రయాలను, అంచనాలను పూర్తిగా మార్చివేసిందనవచ్చు.  చరిత్రలో ఆర్యుల     దాష్టీకానికి బలైపోయిన శంభూకుడు, ఏకలవ్యుడు, శూర్పణఖ వంటి పాత్రలతో వర్తమాన దళితబాధితులను     పోల్చుతూ దగాపడ్డ తరతరాల దళితజాతి చరిత్రను తమ కవితల్లో ఆవిష్కరించారు.
దళితసాహిత్యంలో కవిత్వం ఎక్కువశాతం ఉన్నప్పటికీ అది క్రమంగా కథలు, ఆత్మకథలు,     నవలలుగా విస్తరించింది.  నాగప్పగారి సుందర్రాజు “మాదిగోడు”, ఎండూరి సుధాకర్ “మల్లెమొగ్గల గొడుగు” చిందు ఎల్లమ్మ “నేను చిందుల ఎల్లమ్మను” (సంపాదకత్వం_ముత్యం) ఆత్మకథల కోవకు చెందినవి.  మాదిగోడు, మల్లెమొగ్గల గొడుగు మాదిగల సమాజిక, సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబిస్తుండగా నేను చిందుల ఎల్లమ్మను అనే గ్రంథం నిజజీవితంలో చిందు కళాకారిణియైన ఎల్లమ్మ యొక్క ఆత్మకథ.  మాదిగల ఆశ్రిత అనుబంధకులమైన చిందుకులం వీథిభాగవతాలు ప్రదర్శిస్తూ సంచారజీవనం గడపడం, వారి కళాప్రదర్శనలోని     విశేషాలు, మాదిగలకు, చిందువారికి ఉన్న పేగుబంధం మొదలైన అంశాలు చిందు ఎల్లమ్మ మాటల్లోనే డా.కె.ముత్యం గ్రంథస్తం చేశారు.
దళిత నవలాసాహిత్యంలో జి.కళ్యాణరావు “అంటరాని వసంతం”, వేముల ఎల్లయ్య “కుక్క”,     స్పార్టకస్ “ఖాకీ బతుకులు”, పాణి “నిప్పులవాగు”, చిలుకూరి దేవపుత్ర “పంచమం” ముఖ్యమైనవి.      ”అంటరానివసంతం” మాలల సాంస్కృతిక చరిత్రను వెలికితీయగా “కుక్క” తెలంగాణా మాదిగల చరిత్రను తెరకెక్కించింది.  సుందర్రాజు “మాదిగోడు” కథల్లో రాయలసీమలో కర్నూలుజిల్లా దళితుల మాండలికం ఉపయోగించగా, కుక్కలో ఎల్లయ్య తెలంగాణ పల్లెల్లోని దళితుల మాండలికంలో సాగింది.  ఈ రెండుపుస్తకాలు మొదట్లో పాఠకులకు కొరుకుడు పడలేదు.  చాలామంది కులపరంగా కూడా ప్రత్యేక మాండలికం ఉంటుందా?      అని ముక్కున చేలేసుకున్నారు.  “ఖాకీ బతుకులు” నవలలో వలసవాదకాలం నుంచి దళితులు ఎక్కువగా     మిలిటరీ, పోలీసు వంటి శాఖలలో కిందిస్థాయి ఉద్యోగులుగా పనిచేసి అక్కడి అగ్రకుల అధికారం నుండి     ఎదుర్కొన్న వివక్షను, పోలీసు డిపార్ట్ మెంట్ యొక్క అసలురూపాన్ని ఆవిషరించింది.  దెవపుత్ర “పంచమం”     దళితులలో వస్తున్న సామాజిక చైతన్యం ఆత్మగౌరవ స్పృహలను చిత్రించింది.  వేంపెంట దళితులపై     అగ్రకులాలు సాగించిన మారణహోమాన్ని నేపధ్యంగా తీసుకొని పాణి రచించిన “నిప్పులవాగు” నవల దళిత     ఉద్యమచరిత్రలోని మరో కోణాన్ని చూపించింది.
కారంచేడు పూర్వం వచ్చిన దళితసాహిత్యం అప్పుడు ప్రారంభమైన దళితచైతన్యాన్ని,     దానియొక్క సంస్కరణవాద స్వభావాన్ని వ్యక్తీకరించింది.  ఆనాటి సాహిత్యంలో రచయితలు తమను కూడా మనుషులుగా గుర్తించమని అగ్రకులాల వారిని వేడుకున్నట్లు ప్రాధేయింపు ధోరణితో రచనలు చేయగా కారంచేడు అనంతరం వచ్చిన సాహిత్యంలో దళిత ధిక్కారస్వరం కనిపిస్తుంది.  ప్రతిఘటన, తెగింపు ఈనాటి సాహిత్యాన్ని పదునెక్కించాయి.  దళితసాహిత్యం మొత్తాన్ని ఒకచోట పెట్టి చూసినపుడు దళితసమూహాలలో వచ్చిన సామాజిక చలనం, పెరుగుతున్న రాజకీయస్పృహ, సైద్ధాంతికంగా స్పష్టమైన అవగాహన     రూపుదిద్దుకోవడం వంటి క్రమపరిణామం కనిపిస్తుంది.
దళితుల చరిత్రను పురనర్ నిర్మించే చరిత్రకారునికి చారిత్రక ఆధారాల కొరత ఉంటుంది.      ప్రధానస్రవంతికి చెందిన చారిత్రక ఆధారాలు దళితుల చరిత్రకు కనిపించకుండా చేసినప్పటికీ దళితుల     మౌఖికసాహిత్యం, లిఖితసాహిత్యం, సంస్కృతి వారి చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి.  దళితుల సాహిత్యమే     వారిచరిత్ర అనవచ్చు.
***    ***    ***    ***    ***

9 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

9 Responses to “దళితసాహిత్యం-చరిత్ర”

  1. 1
    buchi reddy Says:

    చా ల విపులముగా చెప్పారు—బాగుంధి

  2. 2
    kcube Says:

    దళిత సాహిత్యం – చరిత్ర అంటే ఈ దేశం నిజమైన మట్టి మనుషుల చరిత్ర. మనం చదువుతున్నదంతా పరాయి దేశ దురాక్రమణదారుల చరిత్రే. వారి వీరత్వాలను ఇంతవరకు చదువుకొని మురిసిపోయినందుకు సిగ్గుపడాలి. ఈ దేశ సామాజిక ఆర్థిక సంబందాలలోని ఎత్తుపల్లాల- ఎగుడుదిగుడుల- మలుపుల రాపిడికి ఒరిపిడికి నెత్తురోడిన తమ రక్తచరిత్రను తామే తవ్వి తీయాల్సిన అవసరమెంతైనా వుంది. వారైతేనే దాని నిగ్గు తేల్చగలరు. యూనివర్శిటీ డాక్టరేట్ల మాయలో పడి తమ చరిత్రను విశ్మరించి పనికిమాలిన పరిశోధనల వెంట పడిపోతున్న దళిత యువత ఖచ్చితంగా ఆ వనరులను వాడుకొని, శాస్త్రీయ పరిశోధనల ద్వారా తమ నెత్తురంటిన ఈ దేశ సామాజిక అభివృద్ధి నిజ రూపాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరాన్ని ఈ వ్యాసం ద్వారా గుర్తెరగ చేసిన మీకు ధన్యవాదాలు..

  3. 3
    B S RAMULU Says:

    బాగుంది. అభినంద న లు.
    బి ఎస్ రాములు

  4. 4
    ramnarsimhareddy Says:

    వ్యాసం బాగుంది..

    అభినందనలు..

  5. 5
    vrdarla Says:

    ప్రయత్నం బాగుంది. సమగ్రంగా లేదు

  6. 6
    Wilson Sudhakar Says:

    చాలా బాగా వ్రాసారు. ఇంత సవివ్ రంగా వ్రాసిన వ్యాసం నెనింత వరకు చదవ లేత్సుఅభినందనలు.
    తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, దక్షిణాఫ్రికా

  7. 7
    vasu ethiopia Says:

    చాలా బాగా వ్రాసారు. అభినందనలు.

  8. 8
    A.K.Prabhakar Says:

    వ్యాసం బాగుంది.మౌఖిక సాహిత్య సంప్రదాయాన్ని, అది ప్రతి ఫలించిన చరిత్రని ప్రస్తావించడం వల్ల వ్యాసానికి నిండుదనం వచ్చింది.మౌఖిక సాహిత్య సంప్రదాయాన్ని,కళారూపాల్ని వదిలి దళిత చరిత్రని నిర్మించదడానికి చేసే ప్రయత్నం ఏదయినా అసమగ్రమేనని మీ వ్యాసం నిరూపించింది.
    అభినందనలు.
    ఎ.కె.ప్రభాకర్ .

  9. 9
    sivalakshmi Says:

    అసలు పోరాట యోధులు దళితులే!ఆ రోజుల్లో వలస వాదులతో వీరోచితంగా పోరాడడం వల్లే వాళ్లని concentration camps లో ఉంచేవారు.
    ఆ తర్వాత క్రమక్రమంగా కులాల సృజన లో దళితులు గా మార్చబడి ఊరి బయటికి బలవంతంగా నెట్టబడ్డారు. ఏ ఉద్యమమైనా విజయవంతం కావాలంటే
    దళితులు తమ స్త్రీల తో సహా ముందుకు రావాల్సిందే!
    దళిత చరిత్ర ను వివరంగా అందించి నందుకు స్వరూప కు ధన్యవాదాలు!
    జమ్ము కాశ్మర్.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో