Oct2010
డయాస్పోరా సాహిత్యానికి ఒక కానుక ఎస్ . నారాయణస్వామి కథాసంకలనం ‘రంగుటద్దాల కిటికీ’
ఈ మధ్య కాలంలో తెలుగు డయాస్పోరా సాహిత్యం మీద కొన్ని వ్యాసాలు వచ్చినయి, చర్చలు జరుగుతున్నయి. డయాస్పోరా సాహిత్యం అంటే ఏమిటి, దాన్ని సృష్టించేదెవరు, చదివేదెవరు, సాహిత్యం లో ఉండే అంశాలేమిటి, దానికీ వలస జీవితానికీ, వలస రాక ముందు తెలుగుదేశం లోని జీవితానుభవానికి సంబంధమేమిటి, ఈ డయాస్పోరా సాహిత్యానికి ప్రత్యేక ప్రయోజనమేమైనా ఉందా, ఉంటే అదేమిటి, ఎవరికి - ఇలాంటి అనేక విషయాలపై చర్చ జరిగింది, జరుగుతోంది,. ఈ సందర్భంలో ప్రచురితమైన ఒక మంచి కథా సంకలనం ఎస్ . నారాయణస్వామి గారి ‘రంగుటద్దాల కిటికీ - కథలు”. రచయిత ‘నాసీ’ గా సాహిత్యాభిమానులందరికీ పరిచితులు. ఈ సంకలనం లోని కథలన్నీ అచ్చు పత్రికల్లోనో, అంతర్జాల పత్రికల్లోనో ప్రచురితమైనయి, వాటన్నింటినీ డిసెంబర్ 2009 లో ఒక సంకలనంగా తీసుకొచ్చారు. ఈ సంకలనంలో అధిక భాగం డయాస్పోరా కథలు, మిగిలినవి తెలుగు నేలపై తెలుగు గాలిలో పొదిగిన తెలుగు జీవితానుభవాలు.
నారాయణస్వామి గారి డయాస్పోరా కథలు ఊరికే అమెరికా లో జీవన విధానం గురించి చెప్పడానికి రాసిన కథలు కావు. భారతదేశం నుంచి అమెరికాకు వచ్చి ఇక్కడ స్థిర పడుతున్న క్రమంలో మొదటి తరం ప్రవాసులకు (immigrants) కొత్త దేశపు సాంస్కృతిక వాతావరణంలో ఎదురయ్యే పరిస్థితులనూ వాళ్ళకూ, అమెరికా లో పుట్టి పెరిగిన వాళ్ళ పిల్లలకూ మధ్య వచ్చే తరాల అంతరాన్నీ, వీళ్ళలో కొందరు వదులుకోలేని prejudice నీ, విలువలనీ , వాటి వెనకాల ఉన్న బావజాలంతో సహా ఆవిష్కరించి, చర్చకు పెట్టిన కథలివి. పైకి కనబడే లక్షణాలని, prejudices ని వర్ణిస్తూ, బయట పెడుతూ రాయడం ఒక ఎత్తు. కాని వాటి వెనుక ఉన్న భావజాల మూలాలని ఆవిష్కరించగలగడం ఇంకో ఎత్తు. నారాయణస్వామి గారు అనేక కథల్లో ఈ పని చేయ గలిగారని నాకనిపించింది. అలాంటి కొన్ని కథల గురించి ప్రస్తావిస్తాను.
‘ఇండియన్ వాల్యూస్’ కథ స్త్రీ పురుష సంబంధాలలొ ఉండే ద్వంద్వ విలువలని (డబుల్ స్టాండర్డ్స్) బయటపెడుతూ అమెరికాలో పుట్టి పెరిగినా, ఇండియన్ పిత్రుస్వామ్య పద్దతిలోనే ఆలోచించే కొందరు ఇండియన్ మగవాళ్ళ ఆలోచనా విధానాన్ని కళ్ళకు కడుతుంది. దాన్ని సవాలు చేసే అమ్మాయే ఈ కథలో ముఖ్య పాత్ర, ఈ కోవలోకే వచ్చే కథ ‘అత్తగారితో కొత్త కాపురం’ .
‘కూపస్థ మండూకం’ కథ బావిని వదిలినా బావి మనస్తత్వాన్ని వదలని భారతీయుల గురించిన కథ. మన గొప్ప ఇతరులకి చెప్పడమే తప్ప, ఇతరుల గొప్ప గురించి తెలుసుకోవల్సిన అవసరం ఉందనుకోని కప్పల గురించినదీ కథ. ’సాయం సేయరా డింభకా’ కథ పరస్పరం సాయం చేసుకోడానికి మనవాళ్ళే కానక్కరలేదని చూపిస్తుంది. ‘వీరిగాడి వలస’ సంకుచితత్వాన్ని వీడని చిన్నతరాన్ని, దాన్ని తోసిరాజనగల మధ్యవయసు తల్లిదండ్రుల తరాన్ని మన ముందుంచుతుంది.
‘చక్కని చుక్క’ మరో మంచి డయాస్పోరా కథ. పిల్లలని అమెరికన్ సమాజంలో పూర్తిగా కలవనీయకుండా ఇండియన్ పద్దతుల్లోనే పెంచాలనుకునే తల్లిదండ్రులు, ఆ isolation వల్ల పక్క దారులు పట్టే పిల్లలు ఈ కథలో ముఖ్య అంశం. ఇరుపక్షాలా, ఇది తేలికగా పరిష్కారం అయ్యే అంశం కాదు. ‘ఎఫిషీయన్సీ ప్లీజ్ ‘ అమెరికన్ వ్యవస్థలో కన్సల్టెంట్ల పేర జరిగే వృధా పనులని ఎత్తి చూపుతుంది.
ఈ కథా సంకలనం లో డయాస్పోరా కాని – తెలుగు కాలమాన పరిస్థితులలో జరిగే కథలు కూడా ఉన్నయి. వాటిలో ‘ఖాండవ వనం ‘ ముఖ్యమైన కథ. ‘ఖాండవ వనం’ కథా కాలానికి రచయిత ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్లు లేరు కానీ అక్కడి రాజకీయ, సాంఘిక పరిస్థితులని ప్రతిబింబిస్తూ రాసిన కథ ఇది.
“కథకి శిల్పం ఆయువు పట్టు అన్నారు కొడవటిగంటి కుటుంబరావు. కథాంశం ఎంత గొప్పదయినా, రచనా శిల్పం కూడా అంత గొప్పగా లేకపోతే ఆ కథ చదవాలనిపించదు., ఎలాగో కష్టపడి చదివినా, నాలుగు కాలాల పాటు గుర్తుండి పోదు. నారాయణస్వామి గారి కథలు చదవాలినిపించేవీ, గుర్తుండి పోయేవీనూ! కథ ‘నడవడానికి’ కథాంశం తో పాటు కథ చెప్పే పద్దతి కూడా ముఖ్యమని గుర్తించిన రచయిత నారాయణస్వామి గారు. ఆయన కథల్లో అక్కర్లేని వర్ణనలూ పాత్రలూ కనిపించవు. కథ చురుగ్గా ముందుకు సాగుతుంది. అలా సాగుతూనే పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తిస్తుంది. నాసీ గారు కథా వస్తువుని సామాజిక జీవితంలో పొదిగి, చుట్టూతా ఏమవుతుందో ఎందుకవుతుందోలో ఉన్న complexity ని ఆవిష్కరించగల సమర్థులు.’తుపాకీ’ కథలో అమెరికా లో రేసిజం, మారుతున్న ఆర్థిక పరిస్థితులూ, వేటాడడం తరతరాలుగా తమ హక్కుగా భావించే సంస్కృతీ, వలస జీవితంలో పిల్లలని పెంచడం, పిల్లలని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ, వాళ్ళు తమని నమ్మగలిగేటట్లుగా, ప్రవర్తించాలని ప్రయత్నించే తల్లిదండ్రులూ – ఇన్నింటి మధ్యా తుపాకుల వద్దనే ideology ని ముందుకు తెస్తారు. డయాస్పోరా సాహిత్యాన్ని ఒక అడుగు ముందుకు తీసికెళ్ళే కథలివి. నారాయణస్వామిగారు ఇంకా అనేక కథలు, ముఖ్యంగా డయాస్పోరా కథలు రాస్తారని ఆశిస్తాను.
5 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు
October 8th, 2010 at 10:00 am
లక్ష్మి గారు:
ఇన్నాళ్ల తరవాత మీరు తెలుగు లో ఈ వ్యాసం రాయడమే నాకు మహా సంతసంగా వుంది.
పైగా, నాసీ కథల మీద రాయడం ఇంకా బాగుంది. ఆయన ముఖాముఖీ కూడా ఇక్కడ చదవండి.
http://www.afsartelugu.blogspot.com/
మీ మవ్యాసంలొ చాలా కొత్త విషయాలు వున్నాయి కూడా.
నాసీ మాత్రమె కాదు, మిగిలిన అమెరికా తెలుగు రచయితలు కూదా అవి తీవ్రంగా పట్టీంచుకొవాలనుకుంటా.
October 12th, 2010 at 11:51 am
సమిక్స మంచి గుంది.
పుస్తకము చెతిలొ ఉంది. చద్వుత..
బి ఎస్ రాములు
October 13th, 2010 at 4:47 am
సమీక్ష బాగుంది..
అభినందనలు..
October 13th, 2010 at 1:02 pm
good discussion.keep on discuss.
October 22nd, 2010 at 8:48 am
సమీ క్ర్వాబాగుంది. చాలా ఎల్ల తర్వత లక్ష్మి గారిని తెలుగులొ చదువుతున్నాఒ. అభినందనలు.
భాస్కర.