ఎంపిక

”చూడటానికలా వుంటుంది కానీ అమ్మో ! నెరజాణండీ అది” అన్న సరోజ మాటలు మరోసారి గుర్తొచ్చాయి ఆ అమ్మాయిని చూస్తుంటే.
ఆరోగ్యంగా కళగా వున్న మొహం. ఆమొహంలో ఏదో అర్ధం కాని భావం. దిగులా ! భయమా ! అసహ్యమా ! నిర్వేదమా !
ఈ మహిళా సంరక్షణ కేంద్రం అయిదేళ్ళుగా నడుపుతున్నాను నేను. ఈవూరే కాక చుట్టుప్రక్కల పల్లెటూర్ల నుంచి కూడా ఎందరో ఆడవాళ్ళు వస్తుంటారిక్కడికి.
రకరకాల సమస్యలతో వచ్చిన ఆడవాళ్ళని చూశాను నేను. తమకి అన్యాయం చేసిన వాళ్ళపై దుమ్మెత్తి పోసేవాళ్ళనీ, శాపనార్ధాలు పెట్టేవాళ్ళనీ, ఏడ్చి పెడబొబ్బలు పెట్టే వాళ్ళనీ, ఆపకుండా రాగాలు తీసేవాళ్ళనీ…
ఒక్కొక్కసారి.. నవ్వుతూనే తమ కష్టాలని విప్పి చెప్పేవాళ్ళనీ.. సమస్యని ఎంత నవ్వులాటగా తీసుకున్నా.. పరిష్కారం మాత్రం దొరికే తీరాలని పట్టుబట్టేవాళ్ళనీ.. అందరినీ చూశాను.
కానీ ఈ అమ్మాయి.. ఈ అమ్మాయి వాళ్ళందరికీ భిన్నంగా వుంది. అసలు ఈమె మనసులో భావమేమిటో అర్ధం కానంత గంభీరంగా వుంది. ఇదేనా జాణతనమంటే !
సత్యవతి తీసుకొచ్చింది ఈ పిల్లని నాదగ్గరికి. ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోబెట్టి తన కథంతా చెప్పింది. చాలా పాత కథే.
పేరు మల్లీశ్వరి. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ చలాకీగా వుండే మల్లీశ్వరి అంటే వూర్లో తెలియని వాళ్ళు లేరు.  చదివిస్తే చాలా గొప్ప మనిషి అయిపోయేది కానీ.. చదివించే శక్తి వాళ్ళ నాన్నకి లేదు. ఇక్కడికి దగ్గర్లోనే వున్న చిన్న పల్లెటూరు వాళ్ళది.
వాళ్ళ వూర్లో రంగారావు గారు ఓ మోస్తరు స్థితిపరుడు. ఆయన కొడుకు ప్రసాద్‌. ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ప్రసాద్‌కి మల్లీశ్వరి నచ్చింది. మల్లీశ్వరికి ప్రసాద్‌ నచ్చాడు. చదువయిపోయాక నిన్ను పెళ్ళి చెసుకుంటానన్నాడతను. మురిపించే కబుర్లు చెప్పాడు. ఆమె అభ్యంతరం చెప్పకపోవడంతో ఇంకా ముందుకీ వెళ్ళాడు.

వీళ్ళిద్దరి వ్యవహారం వూర్లో చాలామందికి అర్ధమయింది. ఒక ఏడాదిపాటు ఇలా సాగాక.. రెండు నెలల్లో ప్రసాద్‌ చదువయిపోతుందనీ.. ఆ తర్వాత అతని మేనమామ కూతురుతో అతని పెళ్ళవుతుందనీ మల్లికి తెలిసింది.
ప్రసాద్‌ని నిలదీసింది. ‘నీతో నాకు పెళ్ళా !’ అంటూ అతను నవ్వాడు. అతనేకాదు వూర్లో వాళ్ళందరూ కూడా నవ్వారు ఆమె అత్యాశకి.
‘జరిగిందేదో జరిగింది. ఇక నోర్మూసుకో’ మన్నదే ఆమెకి అందరూ యిచ్చిన సలహా.
‘పెళ్ళి జరగాల్సిందే’ అనేది ఆమె సమాధానం.
ఆమె మొండితనానికి వూర్లో ఎక్కువమంది తిట్టిపోసినా… ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు మాత్రం ఆమెకి కాస్త సానుభూతి చాపించారు. వాళ్ళలో సత్యవతి ఒకతె.
అయితే సత్యవతి కూడా మల్లీశ్వరిని పూర్తిగా సమర్ధించదు. ప్రసాద్‌ పెళ్ళి చేసుకోవడమనేది జరుగుతుందనీ అనుకోదు. ఏం కావాలో, ఏం చేయాలో స్పష్టంగా తేలీకపోయినా… మల్లీశ్వరి బాధపడుతోంది కాబట్టి, బాధపడే ఆడవాళ్ళు నాదగ్గరికి వస్తూంటారు కాబట్టి మల్లీశ్వరిని తీసుకొచ్చింది.
”ఏం చేయాలో చెప్పండమ్మగారూ !” అంది.
మల్లీశ్వరికి మాత్రం తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసు. ”నన్ను అతను పెళ్ళి చేసుకుంటానన్నాడు. అందుకే నేను ఒప్పుకున్నాను. కాబట్టి ఇప్పుడు పెళ్ళి చేసుకోవాల్సిందే” అని స్పష్టంగా చెప్పింది.
”ఆయనెందుకు చేసుకుంటాడు ! చేసుకోడు” అని ఆమె ఇంట్లో వాళ్ళే తేల్చేశారు.
”నిన్ను చేసుకుంటే ఆ బాబుని వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడే, పైసా ఇవ్వడు” అన్నాడు మల్లీ వాళ్ళ నాన్న.
”ఇయ్యకపోతే యియ్యకపోయాడు. ఆయన్నైతే పెళ్ళి చేసుకోమను” అంది మల్లి. ”నాకు డబ్బులక్కరలేదు. ఆయన చదువు చూసి యిష్టపడ్డా అది చాలు” అంది.
”బడి మొహమే ఎరగని దరిద్రపు దానా ! నీకు అంత చదువుకున్నోడు కావాల్సొచ్చాడంటే !” అని అందరూ ఛీత్కరించారు.
రెండు రోజుల క్రితం యిదంతా చెప్పి వెళ్ళారు సత్యవతీ, మల్లీశ్లరీ. నిన్న మళ్ళీ వచ్చారట కానీ అప్పుడు నేను మరోపని మీద బయటికి వెళ్ళాను.

నిన్న సరోజ మాట్లాడింది ఆ అమ్మాయితో. నేను లేనప్పుడు ఆఫీస్‌ వ్యవహారాలన్నీ సరోజే చూసుకుంటుంది.
ఎవరి సపోర్టూ లేదని అర్ధమయింది కాబట్టి సరోజ ఆమెకి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినట్లుంది. శీలం వగైరా పట్టింపులు వాళ్ళకి పెద్దగా వున్నట్లు లేవు. ”ఏ ఇక చాలు, వూర్కో” అని వాళ్ళ నాన్నే కసురుతున్నాడు.
అందుకే సరోజ కూడా యిదంతా జరిగేపని కాదన్నట్లుగా మాట్లాడినట్లుంది.
”ఎంత చెప్పినా ఒప్పుకోలేదండీ. ఆయన పెళ్ళి చేసుకుంటానన్నాడు కాబట్టి చేసుకోవాల్సిందే. అని మొండికేసి కూర్చుంది.” అని చెప్పింది సరోజ నిన్న నేను రాగానే.
”పెళ్ళి చేసుకుంటానంటే మాత్రం నీబుద్ధేమయింది ! అని అడిగేద్దామనుకున్నా” అని కూడా అంది.
నాకర్ధమయింది. సరోజకీ అమె పట్ల సానుభూతి లేదు. సమితి కార్యకర్తలందరూ కూడా తలోకరకంగా మాట్లాడుతున్నారు. ఎవరూ దీనిని పూర్తిగా అన్యాయమనరు. అలాగని ప్రసాద్‌నీ సమర్ధించరు.
ఆ విషయాన్ని పట్టించుకోకుండా నాపని నేను మొదలు పెట్టాను. ఒక పదిమంది కార్యకర్తలతో కలిసి ప్రసాద్‌ ఇంటి దగ్గరికెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను. మీడియాకి చెప్పాం.
ప్రసాద్‌ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంజనీరింగ్‌ చదివే కుర్రాడంటే నాజూగ్గా వూహించుకున్నాను నేను. మా అబ్బాయి కూడా యింజనీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. కానీ ప్రసాద్‌ మా కిరణ్‌లా లేడు. పొడుగ్గా, లావుగా, చెప్పలేనంత మొరటుగా వున్నాడు.
మల్లీశ్వరి కంటే ఏ పదేళ్ళో పెద్దవాడేమో అనిపించేట్లున్నాడు. ఏం చూసి ఎంచుకుంది మల్లీశ్వరి వీడిని భర్తగా ! నిజంగా చదువు చూసేనా ! వాడి ఆస్తి వాడి వంటిమీద కనిపిస్తోంది కానీ వాడి చదువు వాడి మొహంలో కనిపించడం లేదు. ఆ విషయం మల్లీశ్వరికి అర్ధమవలేదా !
వార్త మీడియాకి చేరింది కాబట్టి విపరీతంగా ప్రచారం వచ్చింది కానీ.. వెనక నిలబడి పరిష్కారం కనుక్కునే బాధ్యత మాత్రం మల్లీశ్వరి నామీదే పెట్టింది.
ఏం చేయాలా, ఎవరి మధ్యవర్తిత్వంతో విషయాన్ని సెటిల్‌ చేయచ్చా అని నేను ఆలోచిస్తుండగా వచ్చాడు కిషోర్‌. కిరణ్‌ క్లాస్‌మేట్‌. ”ఆంటీ, మీకో విషయం చెప్పాలి” అంటూ.
నన్ను కూర్చోపెట్టి పెద్దమనిషిలా గంభీరంగా చెప్పాడు. ”కిరణ్‌, బిందు లవ్‌ చేసుచేసుకుంటున్నారాంటీ, పెళ్ళి చేసుకుందామనుకుంటున్నారు.”

”ఏమిటీ !” అన్నాను నేను అదిరిపడుతూ.
”అవును ఎగ్జామ్స్‌ అయ్యాక మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇద్దరికీ క్యాంపస్‌ యింటర్వ్యూలో జాబ్స్‌ వచ్చాయి కదా ! అందుకే ఎగ్జామ్స్‌ అవగానే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు”.
వాడు తాపీగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నేను స్థాణువులా కూర్చుండి పోయాను. వాడు నిజం చెప్పాడా.. జోక్‌ చేసి వెళ్ళాడా అనిపించింది. కానీ జోక్‌ ఎందుకు చేస్తాడు యిలాంటి విషయంలో !
కానీ కిరణ్‌ మాత్రం యింత పెద్ద విషయం నాదగ్గర దాచిపెడతాడా ! ఒక్కడే కొడుకవడం వల్లనేమో వాడితో నాకు అనుబంధం ఎక్కువే. ఇప్పటికీ వాడు కాలేజ్‌లో జరిగే ప్రతి విషయం నాతో చెప్తాడు. నేనూ నా కార్యక్రమాలన్నీ వాడితో చర్చిస్తాను.
రాత్రిపూట నేను పనులు పూర్తి చేసుకుని నడుము వాల్చగానే నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఓ అరగంటయినా నాతో కబుర్లు చెప్తాడు.
వాడి స్నేహితులందరి పేర్లూ… లక్షణాలూ… అన్నీ తెలుసు నాకు. ఈ బిందు అనే పిల్ల కూడా తెలుసు. వాడితో కొంచెం చనువుగానే వుంటుంది.
ఆ అమ్మాయి గుర్తు రాగానే నామొహం చిరాకుతో ముడుచుకుంది. తన శరీరమే తనకి బరువన్నట్లుగా వుంటుంది.
ఒళ్ళంతా కదిలేలా నవ్వడం.. మగపిల్లలపై పడిపోతూ మాట్లాడటం.. నాకు నచ్చని వెకిలితనాలు చాలా వున్నాయి ఆ అమ్మాయికి.
అలాంటి పిల్లని కిరణ్‌కి భార్యగా నేనెప్పటికీ ఒప్పుకోలేను.
కిరణ్‌ వచ్చాడు. కిషోర్‌ వచ్చిన విషయం చెప్పకుండా.. ఇంకేదేదో డొంకతిరుగుడుగా మాట్లాడి.. చివరకి ఈ ప్రశ్న వేశాను.
”అవునమ్మా, బిందు అంటే నాకిష్టం. పెళ్ళి చేసుకుంటాను” అన్నాడు వాడు తడుముకోకుండా.
ఆ నిర్ణయం మీద ఎంత గట్టిగా నిలబడతాడో వాడు ఆ మాట చెప్పిన ధోరణిలోనే అర్థమయింది.
ఇదెక్కడి గోల తెచ్చిపెట్టావురా భగవంతుడా ! అనుకున్నాను. మల్లీశ్వరి సమస్య వెనక్కి వెళ్ళింది.  నాసమస్య భూతమై ముందుకొచ్చింది.
మా వారితో చర్చించాను. మా బావగారినీ, తోటికోడల్నీ పిలిపించారాయన. వాళ్ళూ మాట్లాడారు.

తన నిర్ణయం మరోసారి స్పష్టంగా చెప్పి, ఒక్కమాట ఎక్కువగా మాట్లాడకుండా.. అసలన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం.. మమ్మల్ని కన్విన్స్‌ చేయాల్సిన అవసరం తనకి లేవన్నట్లుగా బయటికి వెళ్ళిపోయాడు కిరణ్‌.
”ఆ పిల్ల ఎవరోగానీ.. బానే వల్లో వేసుకుంది వీడిని” అంది మా తోడికోడలు.
”అసలు వీడింత త్వరగా పెళ్ళి ఆలోచన చేస్తాడని నేననుకోలేదు” అన్నారు మావారు విస్మయంగా.
అవును. నేనూ అనుకోలేదు. నాదగ్గర పడుకుని అమ్మా అమ్మా అంటూ గారాబాలు పోయేవాడు.. నేను నోట్లో ముద్దలు పెడితేనే అన్నం తింటానంటూ మారాం చేసేవాడు.. ఇంత త్వరగా పెళ్ళి అంటాడని నేనూ అనుకోలేదు.
”ఈరోజుల్లో ఆడపిల్లలు ఎలావున్నారు !” అంది మాతోడికోడలు. ”కాస్త డబ్బున్నవాడు కనబడితే వదిలిపెట్టడం లేదు. అమ్మాయిలకంటే అబ్బాయిలని జాగ్రత్తగా చూసుకోవలసిన పరిస్థితి వచ్చింది”.
ఆవిడకి యిద్దరు మగపిల్లలు. ఆ అతిశయమూ, ఆడపిల్లల మీద చులకన భావమూ ఆవిడ మాటల్లో ఎపుడూ వినిపించే విషయాలే.
అరగంట చర్చ తర్వాత అందరూ ఎవరిదోవన వాళ్ళు వెళ్ళారు. నేనొక్కదాన్నే మిగిలాను యింట్లో. సమితి ఆఫీస్‌కి వెళ్ళాలనిపించలేదు. సరోజకి ఫోన్‌ చేసి ”ఒంట్లో బాగాలేదు. నువు చూసుకో” అని చెప్పాను.
టి.వి. ముందు కూర్చుని ఆలోచనలలో పడ్డాను. కిరణ్‌ వచ్చాక మెల్లిగా సర్దిచెప్పాలి. సాధకబాధకాలన్నీ వివరిస్తే తెలుసుకోకపోడు. ఆ అమ్మాయి నాకు నచ్చలేదంటే అర్థం చేసుకోకపోడు.
నన్ను నేనే సమాధానపర్చుకుంటూ… నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూండగా ఫోన్‌ మ్రోగింది.
”అత్తయ్యా.. కిరణ్‌ నేనూ బయటికి వెళ్తున్నాం. మాప్రాజెక్టు గైడ్‌ వాళ్ళింటికి. కిరణ్‌ సెల్‌ పనిచేయడం లేదు. అందుకే నేను చేస్తున్నాను. కొంచెం లేట్‌గా వస్తానని చెప్పమన్నాడు కిరణ్‌”.
ప్రవాహంలా వినపడుతున్న మాటలకి అడ్డంపడి ”ఎవరు మాట్లాడేది !” అన్నాను నేను అయోమయంగా.
”నేనత్తయ్యా.. బిందుని”
నాకు వంట్లోనుంచి ఒక్కసారిగా వేడిసెగ పైకి లేచినట్లనిపించింది. ఎంత ధైర్యం ఈ పిల్లకి ! నిన్నటిదాకా ఆంటీ అని పిల్చేది. ఇవాళ అత్తయ్యా అనుకుంటూ ఎంత దర్పంగా మాట్లాడుతోంది !
”అత్తయ్యా అంటున్నావేమిటి క్రొత్తగా !” అన్నాను.

సన్నగా నవ్విన ధ్వని. ”కిరణ్‌ మీకు చెప్పాడట గదాంటీ !” అంది.
”ఏంటీ చెప్పేది ! వాడు చెప్పగానే అయిపోయిందా ! మా నిర్ణయం ఏమిటో మేమింకా చెప్పలేదు” అన్నాను పరుషంగా.
మీరేం నిర్ణయించుకున్నా యిక మాపెళ్ళి ఆగదండీ. మేమాస్థాయి ఎపుడో దాటేశాం, అంతకన్నా పదునుగా చెప్పి ఫోన్‌ పెట్టేసిందామ్మాయి.
దిమ్మెరపోయాను నేను. కాసేపటిదాకా పరిసరాల స్పృహ లేదు. ఏమిటో పిల్ల ! ఏం మాట్లాడుతోంది ! ఆ స్థాయి ఎపుడో దాటేశాం అంటే.. అంటే అర్థమేమిటి ? ఎంత దూరం వెళ్ళారు వీళ్ళిద్దరూ !
ఆ అమ్మాయి మాటలకి అర్థం అదేనా ! అయినా, కాకపోయినా ఆ అమ్మాయి అలా అని చెప్పి గొడవచేస్తే యిక తను చేయగలిగిందేమీ వుండదు. ఎవరో ఎవరో అయితే వేరు. మహిళా సంరక్షణ సమితి నడుపుతూ.. మహిళల కోసమే పోరాడుతున్నానని చెప్పుకుంటున్న తను ఎలా కాదంటుంది ఆ పెళ్ళిని !
చచ్చినట్లు ఒప్పుకొని తీరవలసిందే. నిస్సహాయతతో నాకళ్ళలోకి నీళ్ళొచ్చాయి.
ఎంత తెలివిమీరి పోయారు ఆడపిల్లలు ! మగపిల్లాడికి ఆడపిల్ల మీద మోజు మాత్రమే వుంటుంది. వీళ్ళకి అంతకు మించిన ప్లాన్లూ.. స్ట్రాటజీలు వున్నట్లున్నాయి.
లేకపోతే కిరణ్‌లాంటి పిల్లాడు ఒక అమ్మాయి వలలో యింత ఈజీగా పడటమేమిటి ? ఎంతో తెలివైన వాడనుకున్న కిరణ్‌ యిలాంటి పిల్లని ఎంచుకోవడమేమిటి ? ప్రతి విషయాన్నీ సూక్ష్మంగా అర్థం చేసుకునే కిరణ్‌ యింత అమాయకంగా ప్రవర్తించడమేమిటి ?
నేను బాధలోనునిచి తేరుకోకముందే సరోజ దగ్గరినుంచి ఫోన్‌, ”రేపు ధర్నాకి అన్ని ఏర్పాట్లూ చేశాను మేడమ్‌. మనవాళ్ళందరికీ ఎనిమిది గంటలకల్లా ఆఫీస్‌ దగ్గర వుండాలని చెప్పాను. పత్రికల వాళ్ళకీ యిన్‌ఫాం చేశాను”.
”సరే”, అన్నాను కొంచెం విసుగ్గా.
మల్లీశ్వరికి సపోర్టుగా రేపు పెద్ద ఎత్తున ధర్నా తలపెట్టాం. కానీ యిప్పుడు ఎందుకో అది అంత ఆసక్తి కలిగించడం లేదు. బిందు ప్రవర్తన చూశాక మల్లీశ్వరి మీద యిదివరకటి సానుభూతి కలగడం లేదు. అక్కడికి వెళ్ళాలనీ.. నినాదాలు చేయాలనీ.. చేయించాలనీ అనిపించడం లేదు.
కానీ తప్పదు. నా మనసుకి నేనే సర్ది చెప్పుకోవాలి. అయినా కిరణ్‌ విషయాన్నీ, మల్లీశ్వరి విషయాన్నీ ఒకేలా చూడకూడదు.

ఇక్కడ కిరణ్‌ని పెళ్ళి చేసుకోవడం కోసం ఆ అమ్మాయి తన ఆడతనాన్ని ఎరగా వేస్తోంది. అక్కడ… అక్కడయినా అంతేగా ! ప్రసాద్‌ని పెళ్ళిచేసుకోవడం కోసమేగా మల్లీశ్వరి ఆపని చేసింది !
కానీ.. కానీ.. ప్రసాద్‌ కిరణ్‌ అంత అమాయకుడు కాదు. వాడికి తెలుసు తనేం చేస్తున్నాడో !  కిరణ్‌ నాల్రోజులు ఆ అమ్మాయితో చనువుగా తిరిగినందుకే పెళ్ళి చేసుకుంటానంటున్నాడు. వాడు.. ఆ ప్రసాద్‌ ఆ అమ్మాయితో అన్నీ కానించుకుని పెళ్ళి చేసుకోను పొమ్మంటున్నాడు. మంచివాళ్ళు ఎపుడూ ఎదుటివాళ్ళు కూడా తమలాగే స్వచ్ఛంగా వున్నారని అనుకుంటారు. అందుకే వాళ్ళ వలలో పడిపోతారు. కిరణ్‌ బిందు వలలో అలాగే పడుతున్నాడు. ఆ అమ్మాయి ఎంత ప్లాన్డ్‌గా యిదంతా చేస్తుందో వాడికి అర్థం కావడం లేదు.
రాత్రంతా యివే ఆలోచనలు. ఎంత సర్దిచేప్పుకున్నా మధ్యమధ్యలో ప్రసాద్‌లో కిరణ్‌ మొహమూ, మల్లీశ్వరిలో బిందు మొహమూ కనిపిస్తున్నాయి. కిరణ్‌ మీది సానుభూతి ప్రసాద్‌ మీదా, బిందు మీద అసహనం మల్లీశ్వరి మీదా కలుగుతున్నాయి.
నిద్రలేచాక కూడా తలంతా భారంగా వుంది. కిరణ్‌ వరండాలో కూర్చుని న్యూస్‌పేపర్‌ చూస్తున్నాడు. నేను కాఫీకప్‌ చేత్తో పట్టుకుని హోల్లోని సోఫాలో కూలబడ్డాను. మరో న్యూస్‌ పేపర్‌ చేతిలోకి తీసుకుని తిరగేయసాగాను. పేపర్లో ఈరోజు మేం చేయబోతున్న ధర్నా గురించి ప్రముఖంగా వార్త వచ్చింది. ఉన్నట్లుండి కిరణ్‌ పేపర్‌తో సహా వడివడిగా లోపలికి వచ్చాడు. ”అమ్మా ! ఏంటి ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారా ఆ అమ్మాయికోసం !” అన్నాడు.
”అవును.ఏం !” అన్నాను.
”వద్దు” అన్నాడు వాడు నేను మాట పూర్తి చేయకముందే. ”నువ్వెళ్ళద్దు”.
”అదేమిటి ! నేను వెళ్ళకపోతే ఎలా ! అసలిది తలపెట్టిందే నేనయితే !”
”అదంతా నాకు తేలీదు. నువు మాత్రం వెళ్ళద్దు. ఆ అమ్మాయి ఒళ్ళు తెలీకుండా ఎవడితోనో తిరగడమేమిటి ? నువ్వెళ్ళి పూలిష్‌గా తనని సపోర్టు చేయడమేమిటి ?” అన్నాడు వాడు చిరాగ్గా మొహం పెట్టి.
”కిరణ్‌ !” అన్నాను నేను నిర్ఘాంతపోతూ.
”అవునమ్మా. ఒక్కొక్కసారి నువు యింత అమాయకంగా ఎలా వుంటావో నాకసలు అర్థం కాదు. ఆ అమ్మాయేమన్నా పసిపిల్లా ! పెళ్ళికి ముందే వాడితో తిరగకూడదని ఆ పిల్లకి తెలీదా ! తను చేసిన తప్పుకి తనే బాధ్యత తీసుకోవాలి. ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి. అంతేగానీ ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళందర్నీ సపోర్టు చేస్తూ రోడ్డుమీద కూర్చుని ధర్నాలు చేస్తే నాఫ్రెండ్స్‌ నవ్వుతారు. నువ్వెళ్ళద్దు”. మరోసారి ఖచ్చితంగా చెప్పి పేపర్‌ టీపాయ్‌ మీదకి విసిరికొట్టి వెళ్ళిపోయాడు.

నేను వూపిరి తీసుకోవడం కూడా మర్చిపోయినదానిలా కూర్చుండిపోయాను. వీడినా నేను అమాయకుడనుకున్నది ! నన్నే అమాయకురాలినంటున్న వాడి గురించా నేను మోసపోతున్నాడనుకుని బాధపడింది ! ఎంత బాగా చెప్పాడు ! ఎవరి కర్మ వాళ్ళనుభవించాలిట !
నిజమే. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే. అదే అందరి విషయంలో యిప్పుడు జరుగుతున్నది. మల్లి, ప్రసాద్‌, కిరణ్‌, బిందు, నేను… అందరం ఎవరి కర్మ వాళ్ళం అనుభవిస్తున్నాం. కానీ క్రొత్తగా మేం తలపడుతున్న పనులు ! వాటి వెనుక మాకున్న ఆలోచనలు ! పథకాలు !
పసివాడనుకున్న కిరణ్‌.. వెకిలిపిల్ల అనుకున్న బిందు… ముగ్ధలా వుండే మల్లి… మొరటుగా కనిపించే ప్రసాద్‌..
అయిందేదో అయింది యిక నోర్మూసుకో అనే మల్లి వాళ్ళ నాన్న.. ‘అంతా దాని ప్రారబ్ధం’ అనే వూరి జనం.. మళ్ళీ తరపున న్యాయపోరాటం చేయాలనుకున్న నేను.. అందరికీ ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి. ఎవరి ఛాయిస్‌ ప్రకారం వాళ్ళం ఒక విషయానికి రియాక్ట్‌ అవుతున్నాం. మేము చేయాలనుకున్నది చేస్తున్నాం.
మాకు కావలసిన వ్యక్తుల్నే కాదు… మేము అనుసరించే మార్గాలనీ.. మేము చేస్తున్న పనులన్నీ కూడా మేమే ఎంచుకుంటున్నాం.
ఇందులో ఎవరు తెలివైన వాళ్ళు ! ఎవరు అమాయకులు ! ఎవరు ఎవర్ని విమర్శించగలరు ! ఎవరు ఎవరికి దారి చూపించగలరు !
వెల్లువెత్తిన ప్రశ్నలతోపాటు.. నా వుద్వేగమూ చల్లారింది.
ఎవర్నో వుద్ధరిస్తున్నానన్న అహంకారం అణగిపోయింది. నేను వున్న పరిస్థితులకి కారణం ప్రారబ్దమయితే.. నేను తలపెడుతున్న పనులకి కారణం నా ఛాయిస్‌ అని నాకర్థమయింది.
తేటపడ్డ మనసుతో మొదలుపెట్టిన పని పూర్తి చేసేందుకు నేను ధర్మం అనుకున్న దానిని సమర్థించేందుకు బయల్దేరుతూంటే.. ‘ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి’ అన్న కిరణ్‌ మాటలు గుర్తొచ్చి నా పెదవులపై చిరునవ్వు మెరిసింది.

ఒక అభిప్రాయం »కథలు

One Response to “ఎంపిక”

  1. 1
    మూర్తి Says:

    ఈ కధలో వన్నీ పిచ్చి పాత్రలే. ఒక్క పాత్ర సరిగా ప్రవర్తించ లేదు. అసలు కధ ఏం చెప్పాలనుకుందో కూడా అర్థం కాలేదు. ఏదైనా సందేశమో, పరిశీలనో ఈ కధలో దాగుని వుంటే, అది మామూలు పాఠకుడికి అందదనే అనుకుంటున్నాను.

    ఈ కధలోని పాత్రల్లో ఒక్కళ్ళకీ సంస్కారం లేదు. సంస్కారం పక్కన పెడితే, ఒక్క పాత్రకీ తెలివి కూడా లేదు. “నేను” అనే పాత్రకీ ఒళ్ళంతా కపటత్వమే.

    చాలా అయోమయంగా వున్న కధ కూడా. ఇంత కన్నా ఎక్కువగా రాయడానికి ఏమీ లేదు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో