Oct2010
“గాయాలే గేయాలై” ఆవిష్కరించబడ్డ తీరు
తెలంగాణ ఉద్యమం హక్కుల కోసం,ఆత్మగౌరవం కోసం,అత్యవసర శాంతి కోసం జరుగుతున్న యుద్ధం. ఈ నేపధ్యంలో “యుద్ధం చేయడానికి ఆయుధాలు మాత్రమే సరిపోవు_ఆయుధాలు పట్టిన వారందరూ….. యుద్ధాలు చేయరు.” అనే సత్యాన్ని తెలుసుకొన్న ముగ్గురు మహిళలు కలిసి అరవైమంది కవయిత్రుల కవితలను సేకరించి “గాయాలే గేయాలై” అనే కవితా సంపుటిని రూపొందించి మే ౮వ తేదీన (౦౮.౦౫.౧౦) నిజామాబాద్ పట్టణంలో పుస్తకావిష్కరణ సభను అత్యంతఘనంగా జరిపారు.
పది తెలంగాణ జిల్లాల కవయిత్రులు అరవైమంది రాసిన కవితలతో కూడిన “గాయాలే గేయాలై” కవితా సంపుటిని ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాత రెడ్డిగారు ఆవిష్కరించారు. విశిష్ట అతిథిగ సీనియర్ సివిల్ జడ్జిగా వికారాబాదులో విధులు నిర్హిస్తున్న ప్రముఖ తెలంగాణ కవి “జింబో”, ఆత్మీయ అతిథిగా హైకోర్టు మహిళా న్యాయవాది దాసోజు అమరావతి హాజరయినారు. ఈ సభకు ఇందూరు భారతి అధ్యక్షులు ఏ.సూర్యప్రకాష్ అధ్యక్షత వహించారు.
తెలంగాణ వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అనే పాటతో ప్రారంభమైన ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రసాధనకు ఉద్యమించాలనే సందేశాలతో మరుమోగింది. ఈ పుస్తకావిష్కరణ సభకు పది తెలంగాణ జిల్లాల నుండి వచ్చిన కవయిత్రులతో పాటు అనేకమంది స్థానిక కవులు, కళాకారులు, మహిళలు అనేకమంది హాజరయి ఆద్యంతం జై తెలంగాణ నినాదంతో అత్యుత్సాహంగా పాల్గొన్నారు.
నిజామాబాద్ లోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో జరిగిన సభలో పుస్తకావిష్కరణ అనంతరం మొదటిప్రతిని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ శోభకు అందజేశారు. ముఖ్యఅతిథిగారి సందేశంలో ముదిగంటి సుజాత రెడ్డి “తెలంగాణ మహిళల విజృంభణ శక్తికి నిలువెత్తు నిదర్శనం ఈ కవితాసంకలనం, మొదటిసారిగా తెలంగాణ మహిళల కవితలను, మహిళలే పూనుకొని సంకలనం చేయడం శుభపరిణామం, చిరస్మరణీయమే కాదు సాహసోపేతం కూడా. అరవైమంది రచయిత్రుల కవితలు అందరి మనసులను హత్తుకునేలా ఉన్నాయి. ఇటువంటి కవితలను సృష్టించే శక్తి కేవలం తెలంగాణ మహిళలకే ఉందని నిరూపించారు అన్నారు. ఆధునిక తెలుగుసహిత్యంలో తెలంగాణ కవయిత్రులు తక్కువేమీ కాదన్నారు. అయితే ఇంకా ఎంతోమంది తెలంగాణ మహిళలు ప్రతిభను మరుగుపరుచుకొని ఉంటున్నారు, వారు చొరవతో బయటికి రావలసిన అవసరం ఉందన్నారు. అనేక అవార్డులందుకున్న అకృతలత వంటి వారిని గురించి పత్రిలలే ప్రపంచానికి తెలియబరచాలన్నారు. తెలంగాణ కవయిత్రులకు సరైన ప్రాధాన్యత లభించడం లేదు, ఆంధ్రప్రాంతాల వారినే వివిధ సందర్భాలలో ఎంపికచెస్తున్నారు అన్నారు. బతుకమ్మ పేర్చి పాటలల్లడం, నాట్లువేస్తూ పాటలు కట్టడంలో తెలంగాణ మహిళల సృజనా శక్తికి సాటి ఎవరూ రారన్నారు. ”గాయాలే గేయాలై” సంకలనం ద్వారా సంపాదకులు ముగ్గురు తెలంగాణ మహిళల వాదనను చాటి చెప్పటానికి ప్రత్నించారు, సాహిత్యచరిత్రలో ఇది మరచిపోలేని ఘట్టం. ఈసందర్భంగా వారిని అభినందిస్తున్నా
నని సుజాతారెడ్డిగారు ముగించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రముఖ తెలంగాణ కవి “జింబో” తమ ప్రసంగంలో తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో “గాయాలే గేయాలై కవితా సంకలనం వెలువడడం చారిత్రాత్మక సంఘటన అన్నారు. అరవైమంది కవయిత్రులు ఒకే గొంతుకతో తెలంగాణ అవసరాన్ని, ఆవేదనను వ్యక్తపరిచారన్నారు. తెలంగాణలో కవయిత్రున్నారా? అన్న ప్రశ్నకు ఈ సంకలనమే సమాధానం. కవయిత్రులేకాదు మహిళా సంపాదకులూ ఉన్నారని సాక్ష్యమిస్తుందన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కవయిత్రులు ఆవేశంతో, ఆక్రోశంతో ఎలుగెత్తి తమ కవితలద్వారా ప్రశ్నించారన్నాఉ. ఈ కవితల్లో ఎక్కువ “బ్లాక్ పొయిట్రీ” ఉందని చెప్తూ “మనింట్లుండి వాడి పాటపాటపాడే రంకుబొంకు చంద్రుల్ని మనమిపుడు రాహువులై మింగాలి” వంటి కవితాపంక్తుల్ని ఉటంకించారు.
ఆత్మీయ అతిథిగా వచ్చిన హైకోర్టు మహిళా న్యాయవాది తొలి తెలంగాణ ఉద్యమంలో జైలుకెళ్ళిన దాసోజు అమరావతి మాట్లాడుతూ (అమరావతి) తెలంగాణ కవయిత్రులు కలాలను బల్లాలుగా మార్చాల్సిన అవసరం ఉమ్ది. తెగింపు చేసినపుడు తెలంగాణ సాధించుకోవడం సాధ్యమనే విషయాన్ని ఈ సంకలనంలో కవయిత్రులు, సంపాదకులు నొక్కి వక్కాణించారన్నారు. కలాన్ని కత్తిలా మార్చి చావో,బతుకో అన్నట్టు పోరితేనే ప్రత్యర్థులు పారిపోతారని, అప్పుడే తెలంగాణ సుసాధ్యమన్నారు.
పుస్తక పరిచయం చేస్తూ జ్వలిత “గాయాలే గేయాలై” సంపాదకత్వం వహించిన క్రమంలో ఎదురైన అనుభవాలను….వివిధ రచయిత్రులు,కవయిత్రులు అందించిన సహకారాన్ని తెలుపుతూ తెలంగాణ మహిళల ఐక్యశక్తికి ఈసంకలనం నిదర్శనం అన్నారు. ఈసంకలనంలో దాదాపు నలభైమంది లబ్ధప్రతిష్టులు ఉన్నారు. అందులో ఉద్యమకారులు,ప్రొఫెసర్లు,డాక్టరేట్లు,డాక్టర్లు,టీచర్లు,విద్యార్థులు,గాయకులు,గృహిణులు ఉన్నారు. ఇరవైమంది కొత్తగా కలంపట్టిన వారున్నారు. అయినా అందరి ఆకాంక్ష,అంతిమ వాంచ “తెలంగాణ” అని వ్యక్తపరిచారు. తెలంగాణ కవయిత్రులు హక్కులకోసం ఎక్కుపెట్టిన కలాలు త్రీవ్రంగా,వేగంగా కదులుతూనే ఉండాలని అన్నారు. ప్రతిసంవత్సరం ఇటువంటి సంకలనం వెలువడాల్సిన అవసరం ఉందని,తెలంగాణ ప్రత్యేక
రాష్ట్రమేర్పడినా ఈప్రయత్నం కొనసాగలనే కోరికను వ్యక్తపరిచారు. తెలంగాణపై ఎంతో ప్రేమతో ఈ సంకలనం కొరకు ఆర్థికంగా,హార్థికంగా ఎంతో కృషిచేసి, అమ్మతనంతో అందరిని ఒక్కదారికి చేర్చగలిగిన అమృతలతగారి అమృతప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకొని మరికొందరు ముందుకురావాలన్నారు.
ఇందులో తెలంగాణేతరుల కవిత్వం ఉందనే వాదన రావచ్చని, దానికి సమాధానంగా తెలంగానకు సానుకూలంగా ఉన్న గళాలను, కలాలను తమలో కలుపునే ప్రయత్నమే ఇది, భావసారూప్యత ఎంతో మనోబలాన్ని చేకూరుస్తుందని, ఈ ప్రయత్నంకోసం సహర్కరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ జ్వలిత ముగించారు.
“గాయాలే గేయాలై” ప్రధాన సంపాదకురాలు, ఆవిష్కరణసభా నిర్వాహకురాలు, అమృతవర్షిణి పత్రికను నడిపిన అమృతలత మాట్లాడుతూ_ఏ రాజకీయపార్టీలతో సంబంధంలేని తెలంగాణప్రజలు, మేధావులు,బుద్ధిజీవులు,కవులు,మహిళలు ఏమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నంలో “ఓ ఝలక్” ఈ ”గాయాలే గేయాలై” కవితాసంకలనం. మనరాష్ట్రంలో అనేక పార్టీలుండి తాత్కాలికపొత్తులు పెట్టుకొని ఏకాభిప్రాయం లేకున్నా ప్రభుత్వా లేర్పాటుచేస్తున్నప్పుడు, రాష్ట్రం విడిపోవడానికి ఏకాభిప్రాయం ఎందుకు? అని ప్రశ్నించారు.
నాడు కలిసేందుకు తెలంగాణ ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వనపుడు, విడిపోవడానికి నేడు అవతలివారి అభిప్రాయం ఎందుకు? అన్నారు. ఏకాలంలో అయినా గోడమీద పిల్లులకు ప్రజల చీత్కారాలే చివరకు దక్కుతాయన్నారు.
రెండుతలలు అతుక్కుని పెరుగుతున్న శిశువు మన ఆంధ్రప్రదేశ్. సర్జన్ శాడిస్ట్ అయి చూడకూడదు. నిపుణతతో శస్త్రచికిత్స చేసి రెండుజీవితాలను నిలపాల్సిన భాధ్యత శ్రీకృష్ణ కమిటీపై ఉన్నది. అది జరిగేలా చేసేందుకు కవులు,కళాకారులు ఎప్పుడూ ఐక్యంగా పోరాడుతూనే ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో నావంతుగా ఈ సంకలనం వెలువరించే అదృష్టం కలిగినందుకు వివిధజిల్లాల నుండి నా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆవిష్కరణసభకు వచ్చిన అందరూ నాకు ఆనందన్ని కలిగించారని తన ప్రసంగాన్ని ముగించారు. మరో సంపాదకురాలు అనివార్యకారణాల వల్ల హాజరు కాలేకపోయారు.
సంకలనంలో కవితలున్న కవయిత్రు లందరితోపాటు చిత్రకారుడు బాబు (సంకలనానికి బొమ్మలు వేసిన బాబు) తమస్పందనలో ఆనందం వ్యక్తపరిచారు. వారికందరికి మెమెంటోతో పాటు దుస్శాలువాతో సత్కరించారు అమృతలత.
ఈ ఆవిష్కరణ సభకు హైదరాబాదు నుండి జూపాక సుభద్ర,మేరీ మాదిగ, శైలజామిత్ర, సుజని,విమల,జి.విజయలక్ష్మి,ఝాన్సి,ముదిగంటి సుజాతా రెడ్డి,జింబో,హిమజ మొదలైన ఇరవైమంది కవులు పాల్గొన్నారు.
వరంగల్లు నుండి నెల్లుట్ల రమాదేవి, అనిశెట్టి రజిత, శోభ మొదలైన వాళ్ళు, కరీంనగర్ నుండి షహనాజ్ ఫాతిమా,కొలిపాక శోభారాణి,జి.శ్యామల, ఖమ్మం నుండి జ్వలిత,సస్య,జనార్దన్ రావు, రంగారెడ్డి నుండి విజయ దామోదర్ స్వామి పాల్గొనగా నిజామాబాద్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి డా.త్రివేణి, లావణ్య,కిరణ్ బాల, ఇందిరాదేవి, తుర్లపాటి లక్ష్మి, మొదలైన వారు, స్థానిక కవులు సి,హెచ్.మధు,కందాళై రాఘవాచార్య, ఎనిశెట్టి సంకర్ చిత్రకారుడు బాబు, చందన్ రావు, వి.ఆర్.శర్మ, చాకు లింగన్న,ఘనపురం దేవేందర్, కాసర్ల నరేష్, కొండా రాజశేఖర్, గోలి సదానందం, పడాల రామారావు మొదలైన దాదాపు ౨౦౦ మంది హాజరయినారు.
“గాయాలే గేయాలై” సంకలనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఇంతకుముందు ఏ కవితా సంకలనంలో లేని విధంగా కవయిత్రులు ఇంతకుముందు వేలువరించిన పుస్తకాల వివరాలతోపాటు చిరునామాలు పొందుపరిచారు. అదేవిధంగా సభా నిర్వాహకులు వేదికపైకి కవయిత్రులను ఆహ్వానిస్తూ ఒక్కొక్కరిని చందన్ రావు పరిచయం చేయగా ఒక్కోక్కరి అక్విల్లోని కొన్ని వాడియైన వాక్యాలను చాడా లలితాదేవి పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణ సభ ఆద్యంతం వినూత్నంగా ఒకపండుగ వాతారవణంతో, ఆనందోత్సాహాలతో ముగిసింది.
October 20th, 2010 at 6:16 am
మంచి ప్రయత్నం.
అందరికి అభినందనలు..
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in