Oct2010
కథా సాహిత్యం – రైతు జీవన చిత్రణ
అది 1980 వ దశకం. రైతు జీవన యాదార్థ సంఘటనలు కథా కళగా మారుతున్నాయి. జానపద కథ విప్లవ కథగానూ, జానపద వృత్తి గాయకులు విప్లవ గాయకులుగాను మారుతున్నారు. తెలంగాణలో వీరగాధల్ని ఊరూరా పాడుకుంటూ ప్రజల్లో పోరాట చైతన్యం నింపుతున్నారు.తత్ఫలితంగా విప్లవోద్యమం బయలుదేరింది. ఇది అటు కథా కళారంగలోనూ. ఇటు రైతు సంఘంలోనూ గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఈ విభిన్నమైన రెండు కోణాల్ని స్పృశిస్తూ “తుమ్మేటి రఘోత్తమ రెడ్డి” గారు “సవారీ” అనే కథను రచించారు.
రైతు సంఘం జెండా కింద దొరలపైన ప్రజలు అమలు చేసిన సాంఘీక బహిష్కరణోద్యమం” రైతాంగ పోరాటంలో బలమైన ఆయుధంగా రూపుదిద్దుకొంది. సంఘం పట్ల అపారమైన నమ్మకాన్ని పెంచుకున్న రైతు బలాన్ని చూసి దొరల గుండెల్లో బుగులు మొదలైంది.
ఇంచుమించుగా ఈ సందర్భంలోనే కరీంనగర్ జిల్లాలోని చినమెట్ పల్లి గ్రామంలో ఒక యదార్థ సంఘటన చోటుచేసుకుంది. రైతు సంఘటిత శక్తిని, స్ఠైర్యాన్ని చెదరగొట్టడానికి ఆ ఊరి భూస్వామి 1978 సెప్టెంబర్ 15 వ తేదీన రైతాంగం మీద కాల్పులు జరిపాడు . ఆ కాల్పుల్లో దాదాపు 19 మంది రైతులు తీవ్రంగ గాయపడ్డారు. కాల్పుల పర్యంతం కొరుట్ల నుంచి పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ తన బలగంతో రంగప్రవేశం చేశాడు. దొర దగ్గరనుంచి తుపాకీ స్వాధీనం చేసుకోమ్మని రైతులు ఎస్.ఐ ని డిమాండ్ చేశారు. ఆ గుంపులోంచి ఒక స్త్రీ ముందుకొచ్చి….
దొర అట్లాకాలుస్త ఉంటే సూత్తావేమయ్య అరెస్టు చేయక, గ బట్టలు నాకియ్యి గ తుపాకీ నా సేతికియ్యి – అన్ని అరెస్టు సేత్తా అని ఎస్ ఐ ని నిలదీసింది.
పోలీసు యంత్రాంగం నివ్వెరపోయింది అటు తర్వాత పోలీసులు దొర ఇంట్లోనే క్యాంప్ పెట్టారు గానీ దొరనేమీ చేయలేదు.
భూస్వామి , పోలీసులు కుమ్మాక్కై రైంతాంగం మీద చేసిన ఈ హత్యాకాండ ప్రజానీకాన్ని ఒక్క కుదుపు కుదిపింది . విద్యార్థి సంఘాలను, కవులను , రచయితలను బాగా కదిలించింది. ఈ నేపద్యంలో భూస్వామ్య దమన నీతిని ఖండిస్తూ రైతుల వీరోచిత పోరాటాన్ని వర్ణిస్తూ పాటలు, కథలు నవలలు వచ్చాయి.
పై సంఘటన అందుగుల మొండయ్య” కుంపటి” కథకు వస్తువైంది. అల్లం రాజయ్య “కొలిమంటుకొన్నది ” నవలకు ముగింపైంది. పోలీసును తుపాకీ అడిగిన స్త్రీ మాటలు సృజనకు సంపాదకీయమైనాయి.
1978 అక్టోబర్ లో ప్రభుత్వ యంత్రాంగం జగిత్యాల సిరిసిల్ల తాలొకాల్ని కల్లోల ప్రాంతాలుగా ప్రకటించి , ఉత్తర తెలంగాణలోని మిగిలిన భాగాలను అప్రకటిత కల్లోల ప్రాంతాలుగా పరిగణించి నిర్భంధాన్ని అధికం చేసింది. ఎన్ని నిర్భంధాలు అమలు పరిచినా రైతాంగ ఉద్యమం నీరు గారలేదు. రైతు ఉద్యమ కథలు రావటం మానలేదు.
భూస్వాముల నుంచి భూములు స్వాధీనంలోకి తీసుకోవడం, గడీలమీద దాడి చేసి సంఘం జెండా ఎగురవేయడం, అప్పు పత్రాలు తగులబెట్టి దాస్య విముక్తులు కావడం, దొరల్ని ఊరునుంచి తరిమివేయడం, రజాకార్ల నుంచి , సైనికుల నుంచి తమను కాపాడుకొని, గెరిల్లా యుద్ధ వ్యూహాల్ని అమలు పరచడం , వారి దాడుల్ని సమైక్యంగా తిప్పికొట్టడం వంటి రైతాంగ పోరాట సంఘటనలు, విజయాలు వీరరసాత్మకతంగా ప్రజలు నాలుకల మీద కథలుగా రూపుదిద్దుకొన్నాయి.
దేశవ్యాప్తంగా భూమికోసం , భుక్తి కోసం జరుగుతున్న పోరాటాలు తెలంగాణాకు మరోసారి స్ఫూర్తినిచ్చాయి. శ్రీకాకుళం కొండల్లో చెలరేగిన రైతాంగ ఉద్యమం – ఆదిలాబాద్ అడవుల్లో ,కరీంనగర్ పల్లెల్లో, గోదావరి అలల్లో ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరిచింది.
తెలంగాణ తొలితరం భూస్వామ్య వ్యవస్థలోని దొరల దౌర్జన్యాలు, దురహంకారాలు, అకృత్యాలు వెట్టి విధానం, శిస్తు వసూళ్ళు , ప్రకృతి వైపరీత్యాలు వర్ణింపబడ్దాయి.
వెట్టి విధానం – రైతు జీవితం
1932లోనే మ్యాదరి వెంకట భాగ్యరెడ్డి వర్మ అఙ్ఞాత వాసి పేర “వెట్టిమాదిగ” కథను ఆయనే నడిపిన భాగ్యనగర్ పత్రికలో వెలువరించారు. ఆ రోజుల్ల్ తెలంగాణలో మాల , మాదిగలు ,సాలె , చాకలి, కుమ్మరి , మొదలగు వృత్తి పనిగాళ్ళు దొరలకు, పటేల్ పట్వారీలకు , దౌర వచ్చే ప్రభుత్వోద్యోగులకు జీత భత్యాలు లేకుండా “వెట్టి” పనులు చేసేవారు. కుటుంబం మొత్తం పస్తులున్నా వెట్టిమాన్రాదు. నాటి వెట్టి విధాన పరిస్థితుల్ని ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ” గ్రంధం విశ్లేషిస్తుంది.
ఈ కథల్లో – మల్లడు “వెట్టిమాదిగ”. తీరిక వేళలో భూఖామందు దగ్గర వెట్టికి వ్యవసాయం చేసి పెండ్లాం పిల్లల్తో ఆరునెలలు కష్టపడి ధాన్యం పండించాడు. నాలుగు అయిదు నెలలు కుటుంబం మొత్తం కలో, గంజో తాగుదామనుకొంటారు. అది కుప్పలి కొట్టు సమయం పోలీసు పటేలు రామిరెడ్డి తన బంధువు ఇంటికి ఉత్తరం పంపించవలసి ఉండి వంటు మాదిగ మల్లడిని పిలిపిస్తాడు. ధ్యానం గింజలు చేతిలో పడే రోజులు కాబట్టి వంతుకు మరొకరిని పంపిస్తానని విన్నవించుకొంటాడు. ఆ మాటకు ఆవేశంతో ఊగిపోయిన పటేలు చేతిలో కర్రతో మల్లడిని చితకబాదుతాడు. రక్తం వరదలై పారినా , పటేలును మల్లడు నోరెత్తి ఒక్క మాట అనలేదు.
1946 – 49 మధ్య కాలంలో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన కథ ” పరిగె” ఇది జైలి లోపల కథా సంపుటిలోనిది. ఈ సంపుటీ నిండా జైలులో శిక్షలు అనుభవిస్తున్న వారి జీవితాలే ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టినవారి చరిత్రలు ఈ కథా సంపుటీలో దర్శనమిస్తాయి.
‘పరిగె’ కథలో ఖైదీ మల్లయ్య ఒకప్పుడు “వంతు మాదిగ” గ్రామ బేగారిగా ఉంటూనే తండ్రిని, చెల్లెలిని పొషించుకోవడానికి వెట్టికి కూలీపని చేసేవాడు. ధాన్యపు గింజలు బిచ్చమడుగుదామని కుప్పలు కొట్టే చోటుకు వెళ్ళుతాడు. అక్కడ ధాన్యపు గింజల కోసం భూస్వామి దగ్గర రైతులే బేరాలాడుతున్నారు. అలాంటి పరిస్థితిల్లో తనకేమీ గింజలు రాలవని కొంత వరి పరిగె కట్టెలు ఏరుకుని మోపు కట్టుకొంటాడు . తిరిగి ఇంటికి వచ్చే దారిలో మరో పటేలు అడ్డుకొని, తన పొలంలోనే వరి పరిగెను దొంగిలించాడనుకొని ఆగ్రహంతో తన చేతిలొనే కర్రతో కొట్టి , పోలీసులకు పట్టిస్తారు.
బలహీనులు బలవంతుల చేతిలో ఎట్లా బాధలు పడుతారో పై రెండు కథలు వర్ణిస్తాయి. నికృష్టమైన వెట్టి వారి జీవితాలను అధఃపాతాళానికి నెట్టివేసింది.
“సారస్వత జ్యోతి ” పత్రికలో అచ్చైన “చెన్నమనేని రాజేశ్వర్ రావు”కథ ‘పిట్టబ్రతుకు ‘ . ఇది 1948లోనే రచించబడింది.
ఈ కథ పాలేరు విషాద జీవమ గాధను తెలుపుతుంది. జమీందారు కుటుంబంలో 40 ఏళ్ళుగా పెద్ద పాలేరుగా ఉన్న రామయ్య తన జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. ఇల్లు కట్టుకోవాలని, భూమి కొనుక్కోవాలని , కొడుక్కి వ్యాపారం పెట్టించాలని అనుకొన్నాడు. కలలన్నీ పగటి కలలుగా మారి దొరల పాదాల కింద పువ్వుల్లాగా నలిగిపోయాయి. కట్టుబట్టలతో మిగిలి వృద్ధాప్యంలో పడిపోయాడు. ఇప్పుడు తన పాలేరు స్థానంలోనే కొడుకు చం ద్రయ్యను ఉంచవలసి వచ్చింది. సమయందొరికినప్పుడల్లా రామయ్య తన కొడుక్కి దొరల దురహంకారాన్ని వివరించేవాడు. తండ్రి జీవితానుభవంతో తన గుడిసెను మార్చి ఇల్లు కట్టుకోవాలని చంద్రయ్య నిర్ణయించుకొంటాడు. ఇల్లు కట్టుకోవడం కోసం జామీందారును అప్పుగా రూ.50 అడుగుతాడు. చింతలకాడి భూమిని కబ్జా చేయాలనే ఆలోచనలో ఉన్న జమీందారు ఇల్లు కట్టిస్తానని చెప్పి, చింతల కాడి భూమిమీద అబద్ధపు సాక్ష్యం చెప్పుమని ఒప్పిస్తాడు. నిజానికి చింతలకాడి బావి తన చిన్నాయన కొడుకులది. చంద్రయ్య అబద్దపు సాక్ష్యం చెప్పడం భార్యకు , తండ్రికి ఇష్టం లేదు.
“దొరలంటే నందిని పంది , పందిని నంది జేత్తరు, పేదోళ్ళ కడుపు గొట్టడానికే పోగాలమచ్చిందిరా…. ” అనితండ్రి-
“ఇగ జూడు .. నువ్వట్ల జేత్తే రేపటి నుంచి పొరుగింటి కాకి మన ఇంటిమీదాలది…” అని భార్య హితబోధ చేస్తారు.
కళ్ళు తెరిచిన చంద్రయ్య తహసీల్దారుతో ఉన్నమాటనే చెప్పి, మాలోల్ల విజయానికి కారణమవుతాడు.కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అదే యేడు వర్షాలకి గుడిసె కూలిపోయి కుంటుంబం మొత్తం మరణిస్తారు.ఏకాకిగా చంద్రయ్య ఒక్కడే మిగులుతాడు.
పాలేరు బతుకు కష్టాల్తో సాగి కనీళ్ళతో ముగిసిపోయింది. వాడిది పిట్ట బ్రతుకు. హృదయవిదారకరమైన ఇతివృత్తాన్ని రచయిత మంచి నైపుణ్యంతో ప్రదర్శించారు.
పట్టణీకరణం ద్వారా రియల్ ఎస్టేటు వ్యాపారం ఉదృతమయింది. భూ బేరాల్లో చిక్కుకుని, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన రైతు జీవితాలను ముదిగంటి సుజాతారెడ్డి కథలుగా రచించినవారు ‘అడవిరాజ్యం, వలస, పుత్ర శొకం, గుడిసెలు- గుడిసెలు, రాజకీయ మంటలు’ అనే కథల్లో భూ వ్యాపారంలో భూములు అమ్ముకుని వలస వెళ్ళిన రైతుల జీవితాలు వర్ణింపబడ్డాయి. భూమి అమ్మకాల్లో మోసపోయిన రైతులు తమ పిల్లల్ని పట్నంలో పనుల్లో పెట్టించడం, యజమానులు చిన్న పిల్లలని కూడా చూడకుండా చాకిరినీ చేయించుకోవడం, చిత్రహింసలకు గురిచేయడం, వీటిని భరించలేని బాలలు అసాంఘీక శక్తులుగా మారడం వంటి అంశాలు ఈ కథల్లో వివరించారు.
నగరాభివృద్ధి వెనుక చీకటి పర్శ్యాలను స్పృశిస్తూ ‘గుడిసెలు – గుడిసెలు ‘ కథ రైతు జీవితాల్ని వెల్లడి చేస్తుంది.హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం, చుట్టు పక్కల రైతుల భూములను తీసుకుని, వారిని నిలువుదోపిడికి బలిచేయడం, రాజ్యం ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చివేసే విధానాన్ని అవలంబించడం ఈ కథలో కనిపిస్తుంది. పేదలకు పంచిన భూములకు డిమాండ్ ధర పెరగడం వల్ల రాజకీయ నాయకులు కబ్జా చేయాలని చూడడం, తాము కొన్నట్టుగా వేలిముద్రలు వేయించుకోవడం వంటి అంశాలు “రాజకీయ మంటలు ” లో చోటుచేసుకున్నాయి. ఈ కథలన్నీ ముదిగంటి సుజాతా రెడ్డి” మింగుతున్న పట్నం ” కథా సంపుటీలో కనిపిస్తాయి.
ముదిగంటి సుజాతా రెడ్డి ‘వ్యాపార మృగం’ కథా సంపుటిలో వ్యాపార పోకడ మోజులో పడి రైతు జీవితం ఏ విధంగా విచ్ఛిత్తి అవుతుందో తెలుస్తుంది. వ్యాపారవియ్యం, ముంజలు ,నిస్సహాయులు, కొసరి కొసరి బేరాలు కథలు వ్యాపార సంస్కృతిలో చిక్కిపోయిన రైతు బతుకుల్ని చిత్రించాయి. రియల్ ఎస్టేటు వ్యాపారులు శత్రువులైనా తమ ప్రయోజనం కోసం వియ్యమంది రైతుల భూములను కొని, ఇంకా ఏర్పడని కొత్త రాష్ట్రానికి రాజధానిని సృష్టించి భూముల్ని, అమ్మి రైతు జనన్ని మోసగించడం ‘వ్యాపార వియ్యం’ తెలుపుతుంది. రైతు కుటుంబాల ఆత్మీయ సంబంధాలు దేశాంతరాలు వెళ్ళినా చెరగని ఙ్ఞాపకాలుగా మిగిలిపోయే సన్నివేశాలు ముంజలు కథలో దర్శనమవుతుంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్తి తమ పిల్లలకు పెండ్లిండ్లు చేసే దొరలు, పని మనుషులకు మాత్రం ఒక రుపాయి కూడా ఎక్కువ ఇవ్వకుండా ఉండటం, దొరసానులు పనివాళ్లతో అరిసెల పిండి కొట్టించుకోవడం కోసం కొసరి కొసరి బేరాలు చేయడం కనిపిస్తుంది. వ్యాపార విషమృగం ద్వారా రైతు సమాజంలో తీవ్ర రూపం దాలుస్తున్న ఆర్థిక అసమానతల్ని రచయిత ఈ కథల్లో వివరించారు.
పి.వి నరసింహారావు “గొల్లరామవ్వ ” కథలో కొంత రైతు నేపధ్యం కనిపిస్తుంది. రైతాంగ పోరాటంలో సాయుధ దళంలో చేరిన ఉద్యమకారుని గొల్ల రామవ్వ పోలీసు యంత్రాంగం నుంచి రక్షించే ప్రయత్నం చేస్తుంది. పద్మశాలీల బతుకు చిత్రాన్ని నేసిన కథ ‘తెగిన పోగు’ రచయిత కొక్కుల భాస్కర్. పద్మశాలీల జీవన సత్యాలను రచయిత ప్రశ్న జవాబుల రూపంలో ఆసక్తికరంగా చిత్రించారు. చాకిరేవుకే పరిమితమైన చాకలి కులస్తుల జీవితాల్ని బతుకురేవుగా మలిచినవారు చైతన్య ప్రకాష్ గారు. వెనుకబడిన తరగుతుల్లో కులవృత్తుల్ని అవలబింస్తున్నవారేగాక వ్యవసాయదారులు కూడా ఉన్నారు.కులవృత్తులు అంతరిస్తున్న ఈ తరుణంలో కొంతమంది వ్యవసాయ దారులు కూడా ఉన్నారు. కులవృతులు అంతరిస్తున్న ఈ తరుణంలో కొంతమంది వ్యవసాయకూలీలుగా బతుకుతున్నారు. అయితే నీటి సమస్యతో , అప్పుల బాధతో కుటుంబ అవసరాలతో ఉన్న కొంచెం భూమిని అమ్ముకొంటున్నారు.
దళిత రైతు జీవన సందర్భాలను, వేదనలను, ఉద్వేగలను, సర్దుబాట్లను, రితుగుబాట్లను మొదలగు అం శాలన్నింటిని డాక్టర్ గుండెడప్పు కనకయ్య తన కథలకు అందించారు. వీరు దళిత సమస్యలను కథల ద్వారా తెలిపిన దళితుల్లో ప్రధములు. దళిత సాహిత్యంలో తొలిదళిత రచయితగా ప్రసిద్ధిపొందారు. “మేమిట్లుండం” కథా సంపుటీలో దళిత స్పృహతో కలిగిన రైతు సమస్యలను తెలియజేశారు. మాదిగ జాతి పుట్టుకకు సంబంధించిన ఊహపై అల్లిన కథ “చెప్పిచ్చుకొడతాం” ఈ కథలు తెలంగాణ దళిత విధానాన్ని, సాంస్కృతిక విశేషాల్ని, సింధు కళాకారుల సంచార జీవితాన్ని విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను, ఎల్లమ్మ పండుగ సంబారాలను , బలి విధానాలను ప్రతిబింబిస్తాయి.మాతంగి స్త్రీల విషాదభరిత జీవితాలను,కన్నీటి ఎతలను,మాల మాదిగల మధ్య నున్న వైషమ్యాలను ఈ కథలు కట్టినట్లుగా వివరిస్తాయి.మరొక కథా సంకలనం ‘ఎదురు చూపులు ‘ లోని కథలు దళిత జీవనానికి సజీవ దర్పణాలుగా నిలుస్తాయి. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇతివృత్తాలతో బి.దామోదర్ రావు’ సింగిడి’ కథా సంపుటిని రచించారు. గ్రామీణా దళిత రైతులపై దొరలు జరుపుతున్న అరాచక చర్యలను, పన్ను వసూళ్ళను , కుల వివక్షతను వివరించారు. ‘ఊరిబాయి’ కథ నీళ్ల బావుల వద్ద కుల వివక్షతతో వెతలు చెందే దళిత జాతి స్త్రీల మనోభావాల్ని వర్ణిస్తుంది. వీరికథలు దళిత కథా సంకలనంలో ప్రచురించబడ్డాయి. కాలువ మల్లయ్య కథలు కొన్ని దళిత వాదానికి సంబంధించినవి.
చాకలి ఐలయ్య, దూడలపాలమ్మ , కమలమ్మ , కొండమ్మ , వజ్రమ్మ , గజ్జెల బాలమ్మ , సైదమ్మ , గొల్లమల్లమ్మ . ప్రియంవద , అచ్చమాంబ , పెసరసత్తెమ్మ - వీళ్ళంతా తెలంగాణా లో వేరు వేరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతు స్త్రీలు. వాళ్ళ మాటాల్లో వినిపించిన కథనాలన్నీ కథలుగా అభివర్ణించవచ్చు. ఒక్కొక్క కథనం అనేక కథలకు బాట వేస్తుంది. ఆనాటి పోరాట కథల ద్వారా స్త్రీల సాంస్కృతిక జీవితాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయటానికి అవకాశం దొరుకుతుంది.
భూస్వాములకు అనుకూలంగా మారిన ప్రభుత్వం స్త్రీ , పురుష బేధం లేకుండా , బాల వృద్ధ విచక్షణ లేకుండా అత్యంత నీచమైన దమన నీతితో ప్రజలపై హింసాకాండ నిర్వహించింది. అప్పట్లో గ్రామాల్లో స్త్రీలంతా సంఘటితమై పోలీసు యంత్రాంగంపై, దొరల , పటేండ్ల పెత్తనాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వంటి అంశాలు విమల “కలిసేపొదాం యెన్నీయలో …..” కథలో తెలుస్తాయి.
రైతు గిరిజన స్త్రీల సంస్కృతిని , వారిపై జరుగుతున్న అణచివేతను సాహు కథలు తెలుపుతాయి. వీరు గిరిజన స్త్రీల అత్మాభిమానానికి సంబంధించిన కథలనేకం వీరు రచించారు. సంఘటిత గిరిజన స్త్రీశక్తిని కాలరాయటానికి పోలీసులు లైంగిక అత్యాచారాలకు పూనుకోవడాన్ని సాహు “పొలీసుదాడి ” కథల్లో వర్ణించారు.
తెలంగాణ తొలి తరం కథకులను తన సంకలనాల ద్వారా సాహితీ లోకానికి పరిచయం చేసిన ముదిగంటి సుజాతారెడ్డి కథకులకు కాణాచి గా తెలంగాణను సాహితీ చరిత్రలో నిలిపింది. ఆమె కథా సంపుటాల్లో స్త్రీ ప్రాధాన్యతతో కూడింది ‘విసుర్రాయి.’దొరల గడీల్లో కనిపించే వాస్తవిక జీవన దృశ్యాలు ఈ సంపుటిలో కనిపిస్తాయి. ఈ కథలో 1940-80 నాటి స్థితిగతులు, ఆర్థిక, సామాజిక , రాజకీయ పరిణామాలు ప్రతిబింబింపబడతాయి. రైతు కుటుంబాల్లోని స్త్రీలను, వారి జీవితాలను వర్ణిస్తాయి. జావాబుల్లేని ప్రశ్నలు, కబ్జా , బేరం , దోపిడీ , వంటి కథలు రైతు స్త్రీల మనోభావాన్ని, స్త్రీలపై పడుతున్న బరువు బాధ్యతల్ని గుర్తుచేస్తాయి.
పత్తి రైతు ఆత్మహత్యతో రోడ్డున పడ్డా రైతు కుటుంబం, అతని భార్య ఆక్రోశం ఆకాశాన్నంటడం లాంటి సన్నివేశాలు వీరి కథలో దర్శనమిస్తాయి.పత్తిరైతు భార్య శోకం “జవాబుల్లేని ప్రశ్నలతో ” లోకాన్ని ఇలదీస్తుంది. కబ్జా కథలో స్త్రీల మానాభిమానం మంటగలిపే సంఘటన కనిపిస్తుంది. భూమిని కబ్జా చేయడం కోసం ఒక రెడ్డి తన భార్యను మరొక రెడ్డి రేప్ చేశాడని , తన భార్యతోనే అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. లాయర్లు కోర్టులు , ఇరుగు పొ రుగు వారు ఆడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పి, చెప్పి తాను నిజాంగానే శీలాన్ని కోల్పోయిన మానసిక స్థితికి చేరుకుంటుంది. ‘బేరం ‘కథలో పట్నానికి వలస వెళ్లిన రైతు కుటుంబంలో అమాయకురాలైన పల్లెపడుచు లచ్చిని పట్నంలో దళారి వేశ్యాగృహానికి అమ్మివేయడం వంటి విషయాలు హృదయాన్ని ద్రవీభవించ్పజేశ్తాయి. గంపెడు సంతానాన్ని మోయలేక, వాళ్ళకడుపుకింత కూడు పెడదామనుకొని పొద్దంతా కూలీ చేసి కష్టపడి సంపాదించిన పైసలను మగడూ దోపిడీ చేసి, వాటిని తాగుడూకి , పేకాటకు పెట్టి బుగ్గిపాలు చేయడం వంటి అంశాలు “దోపిడీ ” కథలో కనిపిస్తాయి. డాక్టర్ లావణ్య ‘అక్కలి ‘కథా సంకలనంలో నేటి సమాజంలో స్త్రీలపై ఆర్థికభారం ఏవిధంగా పడుతుందో వివరించారు. పత్తిరైతు ఆత్మహత్య వల్ల కుటుంబం వీధి పాలవడం. చేతికొచ్చిన కొడుకులు చెల్లాచెదరవడం, ఆడపిల్లల బరువు బాధ్యతలతో, అప్పులతో తల్లి మాత్రమే మిగలడం వంటి అంశాల్ని వీరి కథలు స్పృశిస్తాయి.
4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
October 12th, 2010 at 10:22 pm
మీరు రాసిన వ్యాసం బాగుంది
October 20th, 2010 at 6:18 am
చాలా మంచి వ్యాసం.
అభినందనలు.
October 22nd, 2010 at 11:34 am
త్రివేణి గారు నమస్తె
మీ వ్యాసం బాగుంది. అద్బుతంగా వుంది.
December 22nd, 2010 at 10:41 pm
ఇది తెలుగు రైతు జీవనమా? తెలంగాణా రైతు జీవితమా?
-కవిత