Oct2010
మంచి కథ అంటే…
మంచి కథ అంటే మనకు అందరికీ ఇష్టమే. కాని, మంచి అంటే ఏంటీ? మంచి ఎలా వుంటుందీ? మంచి కథకు ఉండాల్సిన లక్షణాలేంటీ? ఇలాంటి ప్రశ్నలకు మనందరం ఏకీభవించే జవాబులు లేవు. నాకు మంచివి అనిపించే కథలు మీకు నచ్చకపోవచ్చు. ఈ విషయం గుర్తుంచుకుంటూ, నాకు ఎలాంటి కథలు నచ్చుతాయో, ఎలాంటివి నచ్చవో, ఎందుకు నచ్చవో వివరించటానికి ప్రయత్నం చేస్తాను.
“ఏదో చాలా సీరియస్‌గా చదువుతున్నారే.”
“అవునండీ, కథ, చాలా బాగుంది.”
“అలాగా. దేనిగురించీ?”
ఈ సంభాషణ మీరు వినేవుంటారు. మన సాంప్రదాయంలో ప్రతి కథా ఏదో ఒక విషయం గురించే అయి ఉంటుంది. ప్రతి కథకూ ఒక ప్రయోజనం ఉంటుంది. కథల ప్రయోజనం సమస్యలకు పరిష్కారాలు చూపించటం అనే అభిప్రాయం తెలుగులో బలంగా కనిపిస్తుంది. ఈ నాటి అమెరికన్ కథల్లో ఇది కనబడదు. సామాజిక స్థితిగతులకూ సమస్యలకూ సాహిత్యానికీ సంబంధం లేదనే ఇక్కడి కథకుల అభిప్రాయం అని ఇప్పుడు వస్తున్న అమెరికన్ కథలు చదివితే తెలుస్తుంది. నా అభిప్రాయం రచయితకు సామాజిక స్పృహ ఉండాలనే. సమాజానికి హితవైన రచనలు చెయ్యాలనే. కథల ద్వారా సందేశాలు గానీ, సమస్యలకు పరిష్కారాలు గానీ అందించటంతో నాకు ఎలాంటి ఇబ్బందీలేదు. కానీ ఆ అందించటం ఎలా జరిగిందా అన్నది చాలా ముఖ్యం అని నా అభిప్రాయం. పరిష్కారం కథ ద్వారా చెప్పదల్చుకుంటే దాన్ని కళాత్మకంగా చెప్పాలి. వస్తువుకు తగిన కథనం ఉండాలి, తగిన సన్నివేశాలు కల్పించాలి, సరైన పాత్రలను చిత్రించాలి. “పరిష్కారం కథలోనుంచే సహజంగా రూపొందాలి, ” అన్నారు వల్లంపాటి గారు. అలా చెయ్యగలిగితే కథ బాగుంటుంది. చెయ్యలేకపోతే బాగుండదు. ఈ బాగా ఉండటం అంటే ఏంటో, ఉండకపోతే ఎలాఉంటుందో, ఉండని కథల లక్షణాలేంటో వివరించటానికి ప్రయత్నిస్తాను.
1. చెప్పదల్చుకున్నదేదో కథనం ద్వారా చెప్పటం కుదరని కథల్లో ముఖ్య పాత్ర చేత ఒక ఉపన్యాసం ఇప్పిస్తాడు రచయిత. కథ ద్వారా తను అందించదల్చుకున్న సందేశం ఆ ఉపన్యాసంలో ఉంటుంది. ఈ ఉపన్యాసం మరోపాత్రను ఉద్దేశించిందే అయినా దాని టార్గెట్ ఆడియెన్స్మాత్రం పాఠకులు.
ఒక ఉదాహరణ: (ఆగస్ట్ 10, 2008 ఆంధ్రభూమి సండే స్పెషల్లో వచ్చిన కథ). భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన ఉండాలని చెప్పటం ఈ కథ ఉద్దేశం. కథ చివర్లో “ఏపని చేసినా తన జీవితంలో భాగం అయిన భార్యను ఎప్పుడూనిర్లక్షం చెయ్యకూడదు. ఈ సత్యం చెప్పటానికే అర్ధనారీశ్వరుడి రూపాన్ని మనకు అందించారు మన పెద్దలు. ఏ సమస్య ఎదురైనా నీ కోణం నుంచే కాదు – రెండో సగం అయిన నీ భార్య కోణం నుంచి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఆ జీవితాలు ఆనందమయమవుతాయి,” అని అంటుంది అత్తగారు. “ఇక నుండి లతను ఒక్క క్షణం కూడా విడిచి ఉండను. ఆమెతో సంప్రతించే నిర్ణయాలు చేస్తాను,” అంటాడు అల్లుడు. కథ అయిపోతుంది. సందేశం మంచిదే. కాని చెప్పదలిచిన నాలుగు మాటలూ ఇలా ఒక పాత్రచేత వివరంగా చెప్పిస్తే, ఇక మిగతా కథ అంతా ఎందుకు రాసినట్లూ? సందేశం ఇలాంటి ఉపన్యాసం ద్వారా కాకుండా తగిన సన్నివేశాల్ని కల్పించి, పాత్రల ప్రవర్తనద్వారా పాఠకుడికే తోచేలా రాయగలిగితే కథ ఇంకా బాగుండేది. ఒక పాత్ర చేత ఇలాంటి ఉపన్యాసం ఇప్పించటం కథనం కుదరకపోవటానికి గుర్తు అని నా అభిప్రాయం.
తను చెప్పదల్చుకున్నది కథద్వారా చెప్పటం ఏ మాత్రం ఫలించకపోతే కథకుడు ఏదో ఒక విపరీత మార్గాన్ని ఆశ్రయించాల్సివస్తుంది. మథురాంతకం రాజారాం గారి “ఎడారి కోయిల” కథ లో ఇది కనిపిస్తుంది. “భౌతిక వనరుల విషయంలో భగవంతుడు వీళ్ళను చిన్న చూపు చూశాడు. సిరిసంపదలకు నోచుకోకపోయినా వీళ్ళలో మంచితనానికీ, మమకారాలకూ కొదువలేదు. జయాపజయాల మాటకేముందిగాని, వీళ్ళు వీరోచితంగా పరిస్థితులతో పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో ఏ అదృష్టవంతుడికైనా విజయం పొందేటట్లుగా తోస్తే, అలాంటివాణ్ణి కలిమి కలిగిన కామందులు గద్దల్లా వచ్చి తమగూళ్ళల్లోకి తన్నుకుపోతున్నారు. అలా వేరు పడిన జన సమూహంలో నుంచి తమకు నచ్చిన వాళ్ళనీ, కావలసినవాళ్ళనీ, సంపన్న దేశాలవాళ్ళు తమ సరసకు చేరదీసుకుంటున్నారు. అదంతా ఒక విజేతల వర్గం. విజేతలయిన వారికి పరాజితులపట్ల ఇసుమంతైనా సానుభూతి ఉండటం లేదు. ప్రేమ, త్యాగం, మమకారం, ఆత్మీయత మొదలైనవి వాళ్ళ పాలిటికి అర్ధహీనమైన పదాలుగా తోస్తాయి. స్వార్ధమే వాళ్ళ జీవితాకికి పరమార్ధమైపోయింది. సంగ్రహంగా ఇది ఈనాటి సామాజిక చరిత్ర అయి ఉండాలి”.
కథ చివర్లో ప్రధాన పాత్ర ఆలోచన ఇది. తన సందేశాన్ని ఒక పాత్ర చేత చెప్పించటం కూడా వీలు కానప్పుడు, రచయితే కథలో ప్రవేశించి, ఏదో ఒక పాత్ర తల్లో దూరి, తను చెప్పదలిచిందేదో ఇలా సంగ్రహించాల్సి వస్తే కథలో కథనం కుదరలేదనీ, సన్నివేశ కల్పన తగినట్లుగా లేదనీ అర్ధం.
మంచి కథకు ఒక ఉదాహరణ ఈ మధ్య వచ్చిన ఆర్ ఎం ఉమామహేశ్వరరావు గారి “వొంటేపమాను” (ఆదివారం ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 24, 2004). కథ దేని గురించీ అని అడిగితే క్లుప్తంగా నాలుగు మాటల్లో సమాధానం చెప్పటం సాధ్యంకాదు. మంచి కధకు అది ఒక ముఖ్యలక్షణం అని నా అభిప్రాయం. మారు తున్న చిన్న గ్రామం, చాలామంది కొత్త వాళ్ళు. ఇరుగు పొరుగులతో సంబంధాలు సన్నగిల్లటం, ఒక రోజు ఆ వూరి భోగం కుటుంబాల ఆడపిల్లలమీద పొలీసుల జులుం, ఎవరూ పట్టించుకోక పోవటం, బంగారమ్మ అనే ఒక భోగం పెద్దావిడ పోలీసులను ఎదిరించటం, పొలీసులు ఆమెను అవమానించటం, అవమానం భరించలేక ఇంతకాలం గౌరవంగా అందరికీ చేదోడువాదోడుగా బ్రతికిన బంగారమ్మ ఆత్మ హత్యచేసుకోవటం, అనూహ్యమైన ముగింపు. కథ గురించి ఎంత చెప్పినా న్యాయం చెయ్యలేము. కథ చదవాల్సిందే.
2. వస్తువు ఎన్నుకోవటంలో గందరగోళం.
నవలలో చాలా విషయాల గురించి రాయవచ్చు. కథకు అంత నిడివి లేదు. కథలో ఒక్క వస్తువు గురించి మాత్రమే రాయటానికే వీలవుతుంది. ఎంతో దగ్గర సంబంధం ఉన్నవి అనిపించినా రెండు వస్తువులు ఒక్క కథలో ఇమడవు.
ఒక ఉదాహరణ. ఈ మధ్య ఒక డిటియెల్సీ సమావేశంలో చదివిన కొల్లూరి సోమశంకర్ గారి అనువాద కథల్లో “వృత్తిధర్మం” అనే కథ. ఇందులో ఒక డాక్టర్ ఉన్నాడు. అతన్ని ఒక ముసలివాడు ఊపిరితిత్తుల కాన్సర్ తో చాలా బాధలో ఉన్న తన భార్య కు విముక్తి కలిగించమని ప్రాధేయపడతాడు. ప్రాణం తియ్యటం పాపం అంటాడు డాక్టర్. నేనామెను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఆమె ఇంతబాధలో ఉండటం తను చూడలేక పోతున్నాను అంటాడు ముసలివాడు. కోపంగా వెళ్ళిపోతాడు డాక్టర్. ఈ డాక్టర్ హాస్పిటల్ నుంచి పిలుపు వచ్చినప్పుడల్లా తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా వదిలేసి హాస్పిటల్ కి వెళ్ళటం అతని ప్రియురాలికి నచ్చదు. ఒక రోజు ఆమె మరొకడిని పెళ్ళిచేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఇతనితో చెప్తుంది. నేను చేసిన తప్పేంటీ? ఈ అమ్మాయిని ఎంతగా ప్రేమించానో, నావృత్తినీ అంతే ప్రేమించాను అనుకుంటాడు ఆ డాక్టర్. కాని అసందర్భంగా అతనికి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. తన భార్య బాధ చూడలేక ఆమెకు విముక్తి కలిగించమని అడిగిన ముసలివాడిది నిజమైన ప్రేమ అని తెలుసుకుంటాడు. అతని భార్యకు విముక్తి కలిగించటానికి పనికొచ్చే మందుతో బయలుదేరతాడు. కాని అక్కడికి చేరే లోగా ముసలివాడు తన భార్యను చంపి ఆత్మహత్య చేసుకుంటాడు.
ఈ కథలో ముసలివాడి ప్రేమ నిజమైన ప్రేమ అనిచెప్పటంలో కథ సఫలమయిందనిచెప్పొచ్చు. కాని అదే కథలో పని వొత్తిడి వల్ల తనకు ఇష్టమయిన వాళ్ళతో గడపటానికి సమయం లేని యువకుడి గురించి చెప్పటానికి ప్రయత్నించాడు రచయిత. రెండు కథలూ ఒకే కథలో ఇమడ్చటం కుదరదు. కుదరలేదు. కథకు చదివేవాడి నుంచి ఆశించిన ప్రతిస్పందన రాదు. ఈ డాక్టర్ మీద నాకు ఎలాంటి సానుభూతి కలగలేదు.
నా అభిప్రాయంలో, కథలో చెప్పదల్చుకున్నదేదో జాగ్రత్తగా ఆలోచించాలి, ఆ తర్వాత ఆ విషయం మీదే కేంద్రీకరించాలి. దానికి సంబంధించిన మిగతా విషయాలనుకూడా ఈ కథలోనే చెప్పేస్తేపోతుందనే భావాన్ని అదుపులోపెట్టుకోవాలి. లేకపోతే కథద్వారా పాఠకుల నుంచి ఆశించిన స్పందన రాదు.
3. అసహజమైన సంభాషణలు కథను చెడగొడతాయి
కొన్ని కథల్లో ఒక ముఖ్య పాత్ర పేజీలు పేజీలు మాట్లాడేస్తుంటుంది. మాటలు చెప్తుంది మరోపాత్రకే అయినా ఉద్దేశించిందీ, జ్ఞానోపదేశంచేస్తున్నదీ పాఠకులకు అని మనం సులభంగా గ్రహించవచ్చు. కథ 2003 లో “మట్టి పక్షులు” (జాన్సన్చోరగుడి) అని ఒక కథ ఉంది. అందులో ఒక పాత్ర ఒక అర పేజీ అంతా మాట్లాడతాడు. నువ్వు చెప్పేదేంటో కొంచెం వివరంగా చెప్పరాదూ, అంటాడు రెండో పాత్ర.. మొదటి పాత్ర మళ్ళా రెండు పేజీలు మాట్లాడతాడు.
ఇదే రచయిత రాసిన మరొక కథ కథ 2007 సంకలనంలో ఉంది (దీనికి పాత సాఫ్ట్ వేరే పనిచేస్తుంది). ఇందులో చివరి మూడు పేజీలు కథానాయకుడు మాట్లాడేస్తాడు. కథల్లో ఉండకూడని రుగ్మతలు ఈ ఏకభాష్యంలో చాలా కనబడతాయి.
కథానాయకుడు ఒక యువకుడి ఇంటికివస్తాడు. అతనితో ఇదివరకు పరిచయం లేదు. ఆ యువకుడు, అతని భార్య, తండ్రి, మరో మిత్రుడు అందరూ కూర్చోని మాట్లాడుకుంటుంటే ఒక ఫోన్‌కాల్ వస్తుంది ఆ ఇంటి అతనికి. అతనూ అతని భార్య ఫోన్ లో మాట్లాడి వస్తారు. ఆ యువకుడి భార్య మన కథానాయకుడితో అంటుంది – “అరవింద్ వాళ్ళ చెల్లెలు ఫ్లోరిడాలో ఎమ్మెస్ చేస్తుంది. పెళ్ళి సంబంధాలు చూస్తున్నాం. చికాగోలో చదివి అక్కడే జాబ్ చేస్తున్న ఒక అబ్బాయి ఉన్నాడు. అసలు ఆ అబ్బాయి హాబీలేంటో కనుక్కో వదినా అంటుంది అమ్మాయి. ఏమంటే, బుక్ రీడింగ్ అలవాటులేకపోతే రేపు మనందరం ఒకచోట కూర్చున్నప్పుడు మనమంతా మాట్లాడుకొంటూ ఉంటే అతను మనతో జాయినవ్వాలికదా అంటుంది. మా వారు ఏమీ చెప్పలేకపోతున్నాడు. కజిన్స్ వాళ్ళ పిల్లలూ అంతా కలిసి వీళ్ళు నలభైమందికిపైగా ఉన్న కుటుంబం. చదవటం ఫామిలీ కల్చర్‌లో భాగమైపోయింది. ఇప్పుడు తను చేసుకోబోయే అతనికి కనీసం అటువంటి ఆసక్తికూడా లేకపోతే తను ఒక్కతే ఇంతమందిలో వేరైపోతానేమోనని తన భయం. ఈయనేమో అరేంజ్‌డ్ మేరేజెస్‌లో ఇలాంటివన్నీ ఎక్కడ కుదురుతాయి అంటారు”.
తన అభిప్రాయం అడుగుతున్నారేమో, లేకపోతే మొదటిసారిగా కలిసిన వాడితో ఇలాంటి కుటుంబవిషయాలు ఎందుకు చెప్తారు అనుకుంటాడు మన కథానాయకుడు. అలా అనుకోని, మూడు పేజీలు మాట్లాడతాడు. ఆ ఏక భాష్యంలో భాగంగా ఇలా అంటాడు: ” ప్రొఫెషనల్ కోర్సులు తప్ప మన పిల్లలతో మనం మరింకేమీ చదివించదం లేదు. వీటిలో ఏ కోర్సూ మానవ సంబంధాల గురించి మనకు బోధించటం లేదు. మరి అవి తెలుసుకోవడానికి రేపటి తలిదండ్రులు ఏం చదవాలి? ‘ అతనికి బుక్ రీడింగ్ అలవాటు ఉందేమో తెలుసుకో వదినా’ అని మీ మంజరి అడిగిన ప్రశ్నే, దానికి జవాబు.” అలా అని, అంతటితో ఆగకుండా, ముందు తరాల వాళ్ళు తమ జీవితాల్లో ఎదుర్కొనే ” సమస్యలకు పరిష్కారాలు కూడా వాళ్ళు తమ సమకాలీన రచయితల రచనల నుంచే వెతుక్కొంటారు. ఎటొచ్చీ మనం చేయ వలసిందల్లా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే మనం వాళ్ళను పుస్తకాల దగ్గరకు చేరిస్తే, ఆ తర్వాత ఆ పుస్తకాలే వారికి దిశ నిర్డేశిస్తాయి,” అని కూడా సలహా ఇస్తాడు. ఈ మాటలు పుస్తకాల గురించి తెలియని వారికో, చదవటం మీద అంత ఆసక్తి లేని వారికో చెప్తే బాగానే ఉండేది. పుస్తకాలే ప్రపంచం అయిన ఒక కుటుంబానికి ఇలాంటి మాటలు చెప్పటం హాస్యాస్పదం. పాఠకులకు జ్ఞానోపదేశం చెయ్యాలనే తహతహలో తను సృష్టించిన పాత్రల స్వభావాలను కూడా రచయిత లెక్క చెయ్యలేదని మనం సులభంగా గ్రహించవచ్చు.
పాత్రల చేత పేజీలు పేజీలు మాట్లాడించటంతో వచ్చే మరో చిక్కేమిటంటే రచయితకు ఆ పాత్ర ద్వారా అనవసరమైన, అసందర్భమైన వ్యాఖ్యానాలు చేయ్యటానికి అవకాశం లభించటం. పై కథలో, ” వాళ్ళిద్దరూ సాఫ్ట్ వేర్ ఎంజినీర్లేనా” అని అడుగుతాడు కథానాయకుడు. వాళ్ళిద్దరూ అంటే ఫ్లోరిడాలో చదువుతున్న అమ్మాయి, చికాగోలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి. అవును అంటారు వాళ్ళు. దానికి జవాబుగా ఈ పాత్ర మాట్లాడిన మూడు పేజీల్లో ఇలా అంటాడు: “పరిధులుదాటి పెరుగుతున్న జిం కల్చర్ లో క్రమంగా మనయువకుల దేహదారుఢ్యం పెరుగుతూ ఉంటే, మనో వైశాల్యం తగ్గుతూ వస్తుంది. ఆపైన ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, కమ్యూనికేషన్నెట్వర్క్, వారి మనిష్కాలమీద పెరుగుతున్న వత్తిడి వారు దానికి తట్టుకోగలిగే స్థాయిలను దాటి మించిపోతూ ఉంది. ఈ వ్యాఖ్యానాలకూ కథకూ ఎలాంటి సంబంధమూ లేదు. సాఫ్ట్వేర్ఇంజినీర్ల మనో వైశాల్యం తగ్గుతుందని చెప్పిన కథా నాయకుడు, ” మనకంటే మన తర్వాతి తరంలో నిజాయితీ ఎక్కువ, ” అంటాడు. సాఫ్ట్వేర్ఇంజినీర్ల మనోవైశాల్యం తగ్గుతుందనటానికి నిదర్శనం ఏంటో, మనో వైశాల్యం తగ్గటానికీ నిజాయితీ పెరగటానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, అసలు వీటికీ కథకూ సంబంధం ఏమిటో నాకైతే అర్ధం కాలేదు.
మూడు పేజీల ఉపన్యాసం ముగించేముందు, ఈ పాత్ర చేత ఇలా అనిపిస్తాడు రచయిత: ” మంజరి ఈ తోటలో మీరు పెంచిన మొక్క. దానికి మొగ్గలు వస్తున్నప్పుడు అవి ఏ పరిమళాలు వెదజల్లాలో ఆ మొక్క నే నిర్ణయించుకోనివ్వండి. అది తోట చేయవల్సిన పనికాదు.” నాకు తెలిసినంతవరకూ ఎలాంటి పరిమళం వెదజల్లాలో మొక్కలు ఆలోచించి నిర్ణయించవు. తోట కు కూడా దానితో ఎలాంటి ప్రమేయం ఉండదు. ఇది రాకెట్ సైన్సుకూడా కాదు. నాలుగు మొక్కలు పెంచిన వాడికెవరికైనా తెలిసిన విషయమే. మరి ఇలాంటి వేదాంతం అంతా కథల్లోకి ఎలా వస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?
నా అభిప్రాయంలో పైన చెప్పిన మూడు సమస్యలకూ సులభమైన పరిష్కారం ఉంది. కథ రాసింతర్వాత పదిరోజులు దాన్ని దూరంగా పెట్టేసి మళ్ళా చదివితే, లేక కథ ను ఒకరిద్దరు మిత్రులకు పంపించి వారి సూచన లను సహృదయంతో స్వీకరించి తగిన మార్పులు చెస్తేనో, ఇలాంటి తప్పులూ తడకలూ కథల్లోకి రాకుండా చూసుకోవచ్చు.
ముగించే ముందు ఈ మూడు అంశాల గురించి మరోసారి క్లుప్తంగా చెప్తాను.
కథలో సందేశం గానీ ఒక సమస్యకు పరిష్కారంగానీ ఉండటంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కాకపోతే అది కథ చదివింతర్వాత పాఠకుడు ఆలోచించి గ్రహించేదిగా ఉండాలి. కథద్వారా అందించ దల్చిన సందేశం ఒక పాత్రచేత విడదీసి చెప్పించాల్సివస్తే, రచయితే వ్యాఖ్యానం చెయ్యాల్సి వస్తే ఆ కథలో కథనం కుదరలేదని గుర్తు.
కథలో వస్తువుమీద ఫోకస్ఉండాలి.
కథలో ఒక పాత్ర చేత పేజీలు పేజీలు మాట్లాడించటం కథనం కుంటుబడిందనటానికి సూచన.
తెలుగులో మంచి కథలు రావాలంటే రచయితలు కనీసం స్నేహితులదగ్గరనించైనా విమర్శ స్వీకరించాలి, కథలను తగిన విధంగా సవరించాలి.
DTLC దశమ వార్షికోత్సవ సాహిత్య సభల (2008) సందర్బంగా చదివిన ప్రసంగ పాఠం
7 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
October 11th, 2010 at 6:31 pm
మంచి కధ అంటే……….సాహిత్య వ్యాసం భాగుంది .
October 12th, 2010 at 6:25 pm
ఛాలా భాగుందీ
October 13th, 2010 at 4:52 am
‘మంచి కథ’పై ‘మంచి వ్యాసం’..
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
October 13th, 2010 at 1:06 pm
manchi vishleshana.bagundi.
December 3rd, 2010 at 4:28 am
వ్యాసం బావుంది. జాన్సన్ చోరగుడి ‘ పాత సాఫ్ట్ వేర్ ‘ మీద విశ్లేషణ సరైనదే. చదువుతున్నప్పుడు నాకు కూడా ఇటువంటి అభిప్రాయమే కలిగింది.మంచి కథ రాయాలనుకొనే వారంతా నేర్చుకోవాల్సిన అంశాల్ని చక్కగా ప్రస్తావించారు.మీ నుంచి ముందు ముందు కథపై మరిన్ని విమర్శ వ్యాసాల్ని ఆశించేలా రాశారు.
అభినందనల్తొ,
ఎ.కె.ప్రభాకర్ ..
December 3rd, 2010 at 12:31 pm
చాలా చక్కగా రాశారు. తెలుగు కధకులలో చాలా మంది కధనం మీద దృష్టి పెట్టడం లేదు.-కరుణాకర్
January 8th, 2011 at 3:36 am
చాలా బాగుంది గురూ గారు!