Oct2010
మూకీగాడు
ట్రింగ్……ట్రింగ్….ట్రింగ్…
అలారం మోగుతున్నా తన చెవి పక్కనే లెమ్మని సొదపెడుతున్నా కార్తీక్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని నీలిమ అలారం తలపై ఠపీమని అరచేతితో చిన్న దెబ్బ వేసింది.
ఆ దెబ్బకి అలారం ఆగిపోయినా గడియారం దభీమని కింద పడింది.
ఆ చప్పుడుకి బెడ్ రూమ్ లో పడుకున్న అందరూ ఒక్క ఉదుటున నిద్ర లేచారు.
ఉదయం 5 గంII కావోస్తోంది
ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి బెడ్ రూం లో వెలుగు పరుచుకుంటోంది.
కిటికీ తలుపులు తెరిచి ఉంచినందువల్ల చల్లని గాలి ముఖాలకు తాకుతోంది.
క్రిందపడిన గడియారాన్ని మళ్ళీ యధాస్థానంలో పెట్టి నీలిమ బెడ్ దిగి బద్ధంకంగా ఒళ్ళు విరుచుకుంది.
రోజు జరిగే ఈ తంతుకు అలవాటు పడినా.. కార్కీక్ విసుక్కుంటూనే నసుక్కుంటూనే చిన్న కొడుకు మోక్షిత్ ని దగ్గరకు తీసుకుంటూ నిద్ర కోసం కునికి పాట్లు పడుతున్నాడు.
పెద్దాడు శాండిల్య కళ్ళు నులుపుకుంటూ లేచి కూర్చుని ‘మమ్మీ వాటర్’ అంటూ రాగాలాపన చేస్తున్నాడు.
నీలిమ వాణ్ణి బెడ్ మీదనించి క్రిందకు దించి ముందర బాత్ రూం కెళ్ళి పాస్ పోసుకొనిరా మంచి నీళ్ళిస్తాను..అంటూ వదులైన పోనీటైల్ జుట్టుకు రబ్బరు బాండ్ బిగించి ఒక్కసారి అద్దం లో ముఖం చూసుకొని బాల్కనీలోకి బయలు దేరింది.
పాల ప్యాకెట్ , న్యూస్ పేపరు రెండూ పక్కపక్కనే డోర్ తీయగానే దర్శనమిచ్చాయి.
రెండూ చరో చేతిలో తీసుకుని పేపరు చదువుదామని మనసు పీకుతున్నా స్కూలుకి టైం అయిపోతుందనిపించి న్యూస్ పేపర్ ని హాల్లో సోఫాలో వేసి పాల ప్యాకెట్ తో కిచెన్ లోకి వెళ్ళింది.
ఆ సరికే నీలిమ అత్తగారు సరస్వతమ్మ నిద్రలేచి , స్నానం చేసి దేవుని గదిలో పూజ చేస్తోంది.
చందనపు అగరొత్తుల వాసన మెల్లగా నీలిమ ముక్కు రంధ్రాలకు సోకుతోంది.
నీలిమ ఇంగ్లీషు మీడియం స్కూల్లో హైయర్ క్లాస్ లకి మ్యాథ్స్ చెబుతుంది. భర్త కార్తీక్ కూడా లెక్చరర్ గా ప్రవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. పెద్దాడు శాండిల్య నీలిమ పని చేస్తున్న స్కూల్లోనే 5 వ క్లాస్ చదువుతున్నాడు.చిన్నోడు మోక్షిత్ కు నాలుగు సంవత్సరాలు . పదిరోజుల కిందటే ఇంటి దగ్గర స్కూల్లో వాణ్ణి ప్రీకేజీ వేశారు. అందరూ ఇల్లోదిలేది ఉదయం 9 గంటలకే . అందుకే ప్రొద్దునే ఆ ఇంట్లో కొంచెం రసాబసాగా ఉంటుంది. ప్రతి పనికి విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఉన్న ఒక్క బాత్ రూమ్ లోకే అందరూ ఒకేసారి పోవాలని ప్రయత్నించడం. అందరూ ఒకేసారి స్నానానికి, కాఫీకీ, టిఫిన్ కి, డ్రస్సింగ్ కి హడావిడి పడటం వల్ల అందరూ ఆలస్యంగానే బయట పడాల్సొస్తోంది. ఆ ఆలస్యం వాళ్ళ బయట పనులతో చిరాకుగా మారి అది చిన్నంగా అసహనంగా యూటర్న్ తీసుకుని తిరిగి వాళ్లు ఫ్యామిలీ సంబంధాల్లోనే గ్యాప్ ని సృష్టిస్తోంది. దీన్ని అదిగమించడానికి అత్తగారు పూజలు చేసినా, కార్తీక్ మెడిటేషన్ కి పోయినా, నీలిమ ఎంత తొందరగా పనిచేసినా కుదరటం లేదు.
*************************************************************************
ఉదయం 5 గంటల్కు బెడ్ రూం వదిలిన నీలిమ మళ్ళీ రెండుగంటల తర్వాత కాఫీ కప్పుతో అడుగుపెట్టింది.
అప్పుడు బెడ్ రూం యుద్ధం జరిగిన తరువాత రణస్థలి ఉన్నట్టుంది.
బెడ్ పైన ఉండాల్సిన రెండు దిండ్లు చెరోచోట కిందపడి ఉన్నాయి.
బ్లాంకెట్ సగం బెడ్ పైన సగం నేలపైన నీళ్ళలో ఉభయ చర జీవిలా వేలాడుతోంది.
బెడ్ కింద పడిపోయిన వాటర్ బాటిల్ మూత వదులుగా ఉండటం వల్ల నీరంతా పడి నేల తడితడిగా ఉంది.
నీలిమ తన కాళ్ళు జారకుండ వుండటానికి నెమ్మదిగా అడుగులు వేస్తూ కార్తీక్ ని నిద్రలేపి బెడ్ కాఫీ ఇచ్చింది.
చిరునవ్వుతో ధ్యాంక్స్ చెప్తూ చప్పుడు చేస్తూ కాఫీ తాగడం మొదలెట్టాడు.
ధ్యాంక్స్ చెప్పిన ఉత్సాహం మనసుకి చేరే లోపలే నీలిమకు ఆ కాఫీ చప్పుడూ ఇరిటేట్ తెప్పించింది.
ఏమండీ ఆ కాఫీని చప్పుడు చేయకుండా తాగండని ఎన్ని సార్లు చెప్పాను.మిమ్మల్ని చూసి మోక్షిత్ కూడా పాలను చప్పుడూ చేస్తూ తాగుతున్నాడు. మీరు ఈ జన్మకు మారరు అంటూ కింద పడిన రెండు దిండ్లను మంచం మీదకి విసురుగా విసిరేసింది.
ఆ మాటల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా కాఫీని పూర్తిగా ఆస్వాధించడంలో మునిగి పోయాడు కార్తీక్ …అదే గుర్రుమనే చప్పుడుతో నిద్రపోతున్న మోక్షిత్ ని అట్లానే భుజానేసుకుని హాల్లోకి వెళ్ళి వాణ్ణి డైనింగ్ టేబుల్ మీద నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ వాణ్ణి ముద్దుగా’ మోకీ తెల్లారింది నిద్రలేమ్మా’ అంటూ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది.
వాడు చిన్నంగా కళ్ళు తెరుస్తూ మృదువుగా నవ్వాడు.
అచ్చు నాన్నే అంటూ మళ్ళీ అదే బుగ్గమీద ముద్దు పెట్టుకుంది.
మోకీ నువు ఇక్కడే కూర్చో నేన్నీకు పాల గ్లాసు ఇస్తాను. దాన్ని మొత్తంగా తాగేసి అప్పుడూ మోకీ బాత్ రూం లో స్విమ్మింగ్ చేస్తాడంట…. ఆ తర్వాత మంచిగా టిఫిన్ చేసి… సూపర్ డ్రస్ వేసుకుని స్కూలుకి మమ్మీ స్కూటర్ లో బయల్దేరతాడంట సరేనా!
అప్పుడూ దాకా అమ్మ ముద్దుగా మాట్లాడుతుంటే ఉత్సాహంగా మొహమాటంగా ఇకిలించి పళ్ళు బయటపెట్టి నవ్వుతున్న మోక్షిత్ స్కూల్ పేరెత్తంగనే బుంగ మూతి పెట్టి తల అడ్డంగా వూపాడు.తప్పు మోకీ నువ్వు స్కూల్ చేరి 10డేసే అయింది. రోజూ స్కూల్ కి పోతే పెద్దయ్యాక నువ్వు కూడా డాడి మాదిరి బైక్ లో కాలేజీకి పొవచ్చు సరేనా! మళ్ళీ కీ ఇచ్చిన బొమ్మ మాదిరి బుంగమూతితో తల అడ్డంగా వూపాడు మోక్షిత్.
సరే ముందర పాలుతాగు అంటూ అత్తగారు తెచ్చిచ్చిన పాల గ్లాసును వాడికిచ్చి మళ్ళీ పననే యుద్ధానికి బయల్దేరింది. నీలిమ ఏ పని చేస్తున్నా తర్వాత చేయబోయే పని గురించి ఆలోచిస్తుంటుంది. అందువల్ల ఏ పని సరిగా చేయదని అత్తగారు నస పెడుతుంటారు. అది పూర్తిగా నిజం కానప్పటికీ అబద్ధం మాత్రం కాదు. తను ఏ పని చేస్తున్నా ఏకాగ్రత గా పనిచేయలేక పోవడం తనూ గమనిస్తోంది. తనని ఏదో ఙ్ఞానపకం బాధగా వెంటాడుతూనే ఉంటుంది. ఈ మధ్య అ సంఘటింతంగా ఉన్న అన్నీ ఆలోచనలు ఒకే ఒక బాధగా స్థిరపడిపోయి ఆ బాధ మెదడుని చెదల పురుగు మాదిరి తొలుస్తూనే వుంది. ఆ బాధంతా నాలుగు సంవత్సరాలైనా మోక్షిత్ కి మాటలు రాకపోవడ్మే అప్పటికీ ఎన్నో విధాల ప్రయత్నించినా లాభం లేకపోవడంతో ఇంక డాక్టర్ ని సంప్రదించాలని కార్తీక్ , నీలిమ ఒక నిశ్చయానికి వచ్చారు. మొక్షిత్ ఎంతకూ స్కూలు కు పోవడానికి ఒప్పుకోకపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గరే వదిలి వారి వారి డెస్టినీలకు బయలుదేరారు.
ఇంట్లో మోకీ వాళ్ళ నానమ్మ తనకిష్టమైన సీరియల్ ని సోఫాలో కూర్చుని మోకీని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని చూస్తోంది.
మోకీ రిమోట్ తీసుకుని వాడికిష్టమైన జెటిక్స్ పెట్టుకున్నాడు. వాళ్ళ నానమ్మకి ఎక్కడ లేని కోపం వచ్చింది.
‘హూ వెధవ దీనికేమి తక్కువ లేదు.. అయ్యగారికి నోట్లోంచి ఒక్క మాట ఊడిపడదు… రిమోట్ ని మాత్రం నొక్కడం వచ్చు.. చూడు మీ అమ్మ నాన్న ఎంత బాధ పడుతున్నారో , వీధి వాళ్ళంతా నిన్ను మొకీగాడు అంటూ వెక్కిరిస్తున్నారు. ఈ సారి మాట్లాడక పోయావంటే ముడ్డిమీద ఒక్కటిస్తాను’. అంటూ ఆమె లోపలి గూడు కట్టుకున్న బాధనంతా వెళ్ళగక్కె అవకాశం వచ్చేసరికి సునామిలాగా విరుచుకుపడింది. ఆమె ఎప్పుడూ అంతే ఉరుముల లేని పిడుగు మాదిరి దభీమని పడుతుంది ఎదుట ఎంత దిట్టమైన వాడు ఉన్న తట్టుకోవడం కష్టం.మళ్ళీ ఏమీ ఎరగనట్టు పూలవాన కురిపిస్తుంది. అలవాటైన వాళ్ళు ఆమెను బోలమనిషి అంటారు.
మోకీ గాడీకి కోపమొచ్చి చేతిలోని రిమోట్ ను విసిరికొట్టి బెడ్ రూం లోకి విసవిసా వెళ్ళిపోయాడు. అదో అపార్టుమెంటు దాంట్లో డబుల్ బెడ్ రూం ప్లాట్ వీరిది. ఇంకెక్కడికెళతాడు. వాడీమధ్య ఒక పెద్ద అడ్వంచర్ చేశాడు. అదే వాళ్ళ అపార్ట్ మెంట్ మెట్లుదిగి క్రింద వాచ్ మెన్ కళ్ళు గప్పి ఎదురుగా వున్న చెట్ల కింద అప్పుడే ఈనిన ఒక చిన్న కుక్కపిల్లను ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చాడు.అది వీడి కన్నా తెలివిగలది.వీడు ఇంట్లో దీన్ని వదిలి వదలడంతోనే అది చిన్నగా పరిగెత్తుకుంటూ వచ్చిన దారెంటే వాళ్ళమ్మ దగ్గరికెళ్ళిపోయింది. ఆరోజంతా వాడు విషయం చెప్పి కుక్క పిల్లని తెమ్మంటాడు. వాడన్న శాండిల్య వాడిని . రేయ్ నీవు మీ అమ్మ దగ్గరుంటావు. కాని అది వాళ్ళమ్మ దగ్గరకు పోవడం తప్పా. నువ్వు మారాలి .. అందులో నువ్వు నా తమ్ముడివి . ఒకసారి నువ్వు పెద్దగా ఆలోచించి వాడెప్పుడొ కార్టూన్ బాషే మాట్లాడుతుంటాడు. ఒక్క స్కూల్ లెసన్స్ తప్పితే.
మోకీ వాళ్ళ అమ్మమ్మ కూడా చిన్నంగా బెడ్ రూం లోకెళ్ళి వాడు కూర్చున్న చిన్న కూర్చీముందర తను నిదానంగా గొంతుక కూర్చుని వాడికళ్ళల్లోకి చూసింది. ఉదయాన్నే గడ్డిపరక మీద మంచుబిందువు మాదిరి. వాడికళ్ళల్లో తడిపడీపడనట్లుంది మోకీ… వాడి వైపే అప్యాయంగా చూసిందామె. చప్పున ఆమె భర్త గుర్తొచ్చి . అచ్చు తాతాపోలికే .. రోస్ మిల్క్ మాదిరి కలర్ . పచ్చ కర్పూరం మాదిరి తెల్లని కళ్ళు . పట్టుకుంటే కందిపోయేటట్టుండే బుగ్గలు .. ఎర్రమిరపకాయ మాదిరి పెదాలు. నల్లని మేఘాల్లాంటి వత్తైన జుట్టు.
నీకు బాగా వినపడుతుంది కదా.. కాని మాట్లాడావు. నీవు మాట్లాడితే పైన ఫోటోలో వున్న మీ తాత కూడా నవ్వుతాడు… వాడి బుగ్గలను కందిపోతాయని తెలిసినా రెండు చేతులతో గట్టిగా పిసికింది.ఆ దాటికి వాడి కంట్లోంచి రెండు కన్నీటి బొట్లు ఆమె చేతిమీద పడ్డాయి. అరె దీనికేడవగూడదు. మోకీ అంటూ వాడిని గట్టిగా గుండెలకదుముకుంది. తర్వాత నీకు బిక్కీ యిచ్చేనా.. వాడు చిన్నగా నవ్వుతూ .. తలూపాడు. … వాడెప్పుడూ పెద్దగా నవ్వడు . నోరుతెరిస్తే చిన్ని కృష్ణుని మాదిరి ముల్లోకాలు కనబడతాయనేమో . చిరునవ్వులు మాత్రమే రువ్వుతాడు చిద్విదానంద స్వరూపుడు ఏడుపు మాత్రం గుక్కపట్టి ఏడుస్తాడు. వాడి కిష్టం లేనివి ఏవైనా వాడి మీద రుద్దితే.
వాడికి బిస్కెట్లిచ్చి ఆమె మళ్ళీ యింటి పనులలో మునిగిపోయింది.
మోకీ బెడ్ రూం కిటికీ లో నుండీ క్రిందకి చూశాడు. డబుల్ కాట్ బెడ్ ప్రక్కనే కిటికీ కావటం వలన వాడు సులభంగా బెడ్ పైకెక్కి కిటికీ లోనుండి చూడ గలడు. వీడుండే ఫిప్త్ ఫ్లోర్ లో క్రింద రోడ్ మీద కొంతమంది పిల్లలి వీడిమాదిరే స్కూళ్ళకు ఎగ్గొట్టినోళ్ళు ఏవో ఆట ఆడుతున్నారు. వాళ్ళ కేరింతలు వీడికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. వాళ్ళందరూ వాడికి తెలిసిన వాళ్ళు. వీడుఫస్టు చెయ్యి వూపాడు. ఎవ్వరూ వీడివైపు చూడకపోయినా . తర్వాత వాళ్ళ మీద ఏదైనా విసిరేస్తే వాళ్ళు వీడిని చూస్తారని . వాడింటికొచ్చి వారితో పాటూ తీసుకెళ్తారని … వాళ్ళతో ఎంచక్కా ఆడుకోవచ్చని వీడి అత్యాశ. వాళ్ళందరూ నాలుగు ఐదో తరగతి వాళ్ళు. వీడు మంచం దిగి బెడ్ రూం లో ఏమన్నా విసిరేసే వస్తువులున్నాయా అని చూశాడు. వాడికేం కనిపించలేదు. కిచెన్ లోకెళ్ళి వాళ్ళ నానమ్మతో స్పూన్ కావాలని చేతితో చూపెట్టాడు. రెండో సారి వాడేం చెప్పకముందరే ఆమే వాడికి రెండు స్ఫూన్లు తీసిచ్చింది.పాపం పసిపిల్లాడు అందునా మాటలు రావు. కాబట్టి వాడినోటికి శరీరానికి ఏ మాత్రం శ్రమ తెలియకుండానే ఆమె చేసేస్తుంది. వాడు నిక్కరిప్పేదానికి ట్రై చేస్తే … లెట్రిన్ కి పోవాలా అంటుంది. వాడు తల అడ్డంగా వూపుతాడు. పాస్ కా.. మళ్ళీ తల అడ్డంగా వూపుతాడు . ఆమె చెరగని చిరునవ్వుతో డ్రాయర్లో చీమలున్నాయా.. ఆ విధంగా వాడు అవును కాదు తలూపే వరకు వాడి కేమాత్రం శ్రమ లేకుండా చేస్తుంది.ఎక్కువ మాట్లాడితే ఆమె కూడా సైగలు చేస్తుంది మరీ మురిపెం ఎక్కువైతే ఆమెకు అదో కాలక్షేపం . సరదాగా వాడితో మూగసైగలు రకరకాల మాటలు చేయిస్తుంది.
స్పూన్లు తీసుకుని మోకీగాడు మళ్ళీ బెడ్ రూం లోకొచ్చి మంచం పైకెక్కి కిటికీ లో నుంచి క్రిందకి చూసాడు. పిల్లలు తమ ఆటల్లో మునిగిపోయినారు. రెండు స్పూన్లు ఒకసారి క్రిందకి విసిరేసాడు . ఆ రెండు పిల్లలకు దూరంగా పడ్డాయి.పిల్లలసలు వాటిని గమనించే స్థితిలో ఏ మాత్రం లేదు. మోకీగాడికి కోపం వచ్చి కిటికీ తలుపులు దబదబా బాదడం మొదలెట్టారు. అవి పెద్ద చప్పుడు చేస్తూ కొట్టుకుంటున్నాయి. శబ్దాని కన్నా వారు తలపైకెత్తి చూస్తారేమోనని వాడి ఆశ. పాపం వాడీ ఆశ తీరే పరిస్థితి వాడికి కనీపీల. ఇంకా కోపంతో ఈ సారి గట్టిగా కిటికీ తలుపు మూశాడు.కిటికీ కున్న అద్దాలు భళ్ళున పగిలి రెండు పెద్ద ముక్కలు బెడ్ రూమ్ లో వాడు నుంచున్న మంచం మీద పడ్డాయి. అవి కింద పడుతూ వీడి కాలు కూడా కొంచెం గొకాయి. వాడి కాలి మడమ నుంచి చిన్నంగా రక్తం కారి బెడ్ రూం తెల్లని బ్లాంకెట్ కొంత భాగం ఎర్రంగా అయ్యింది. వాడు భయంతో బెడ్ మీద నుండి క్రిందకి దూకి వాళ్ళనానమ్మ దగ్గరికి పరిగెత్తాడు. వాడు పరిగెత్తిన దారల్లా చుక్కలు చుక్కలుగా రక్తం మరకలు.
గ్యాస్ స్టౌవ్ మీద తిరగమాత పెడుతున్న వాళ్ళనానమ్మ దగ్గరకు అరుస్తూ పరిగెత్తాడు. ఆ అరుపు వాడి లేత స్వర పేటిక లో నుంచి బయలు దేరివాడి గోంతు ద్వారా పయనించి పెదవులకు చీల్చుకుని ‘నానమ్మ’ అనే మాట రూపంలో గట్టిగా దూసుకొచ్చింది . కాని ఆ మాట ఎవరి చెవుల్ని చేరకుండానే గాలిలో యింకి పోయింది.పరిగెత్తుకురావడంలో ఏం మోకీ అనే మాట ఆమె పెదాలనుంచి రాక మునుపే ఆమెకళ్ళు రక్తం కారుతున్న వాడి కాలిని చూసి కొంచెంసేపు బిత్తరపోయి తర్వాత తేరుకుని ఏమయిందిరా అంటూ జీరబోయిన గొంతుతో వాడిని చంకనెత్తుకుని గబగబా హాల్లోని ల్యాండ్ ఫోన్ నుండి మోకీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది. తర్వాత తన చీర అంచున కొంచెంగుడ్డను చింపి దాన్ని తడిపి వాడి కాలిగాయానికి కట్టింది. ఒక అర్థగంట తర్వాత కార్తీక్ నీలిమ అదుర్దాతో ఇంట్లోకొచ్చారు.
ఏం జరిగింది. కార్తీక్ వాళ్ళమ్మనడిగాడు. తెలీదురా అంది. ముందర వీడ్ని డాక్టరు దగ్గరికి తీసుకెళ్దాం పదండి. వాడి కాలికి కట్టిన తడిగుడ్డను కూడా దాటుకుని రక్తం సన్నగా కారుతుండటంతో దాన్ని చేత్తోనే నీలిమ తుడూస్తూ వాడ్ని చంకనెత్తుకుంది.
వీటికి మాట్లొస్తే ఏం జరిగిందే తెలిసేది. వీడేం మాట్లాడక పోయే సరే రండి పోదాం . అసలు సంగతి పక్కన పెట్టి అనవసరవిషయాలు ఇప్పుడా మాట్లాడేది అంటూ చెప్పులేసుకుని నీలిమ బాల్కనీలో కొచ్చింది.
కార్తీక్ , నీలిమ డాక్టర్ దగ్గరకెళ్ళి మోకికీ ట్రీట్ మెంట్ ఇప్పించారు. వస్తూ వస్తూ మూగ, చెవిటి స్పెషలిస్టు డాక్టర్ సలీం దగ్గరికెళ్ళారు. లంచ్ టైం కావటంతో క్లినిక్ లో ఎవరూ లేనట్లున్నారు. రిసెప్షన్ దగ్గర విషయం చెప్పి ఆమె చూపిచ్చిన కుర్ఛిలో కూర్చున్నారు. మోకీగాడు ఇంకా కాలివైపే అప్పుడప్పుడూ భయంగా చూస్తున్నాడు. వాడ్ని నీలిమ ప్రక్కనున్న కుర్చీలో కూర్చొపెట్టి వాడి మొహనికున్న చెమటని ఖర్చీఫ్ తో తుడుస్తోంది. మోకీ బంగారమ్మ భలే అందగాడు అంటూ వాడ్ని నవ్వించే ప్రయత్నం చేస్తుంది.వాడు కాల్ని చూపించి చేతితో ఏమైందన్నట్టు సంఙ్ఞ చేసాడు. ఏమి కాదురా కాలేం తీసేయరు కార్తీక్ వాడి గాబరాను అర్థంచేసుకోకుండా కొంచెం గట్టిగా అరిచాడు. మళ్ళీ అది ఇల్లు కాదని తెలిసి అదే మాటను వివరంగా చెప్పాడు.
సిస్టరొచ్చి మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు అని చెప్పింది .స్ప్రింగ్ డోర్ ను తీసుకుని లోపలికెళ్ళారు. ఎదురుగా కుషన్ చైర్లో ఫ్రెంచ్ కట్ గడ్డం పెట్టుకుని బట్టనెత్తితో మిడిల్ ఏజ్ డ్ అతను కూర్చునున్నాడు. దళసరి కళ్ళద్దాల్లో నుంచి అతని చిన్నికళ్ళు గుచ్చిగుచ్చి చూస్తున్నట్టు అనిపిస్తోంది. తెల్లని శరీరంతో దబ్బపండు మాదిరున్నాడు. ఆయన మెడలో స్టెత్ స్కోప్ వేలాడుతోండి. ఎదుటి వాళ్ళు డాక్టర్ అనుకునేదానికి ఆ జాగ్రత్త తీసుకున్నాడానిపించింది.
కూరోండి రిసెష్పనిస్ట్ మాదిరి చిరునవ్వుతో అతని టేబుల్ ఎదురుగా నున్న కుర్చీలు చూపించాడు.
ఏసి రూం కావడం వలన చల్లని గాలి ముఖాలకి తగిలి కొంత రిలీఫ్ గా అనిపించింది.
ఏం పేరు బాబు మోక్షిత్ ని చూస్తూ అదే చిరునవ్వుతో అన్నాడు.
మోక్షిత్… కార్తీక్ సమాధానం చెప్పాడు.
మోకీగాడు ఆ స్పెక్ట్స్ లో డాక్టర్ కళ్ళని తన కళ్ళతో పట్టేదానికి ట్రై చేస్తున్నాడు.
ఏం చదువుతున్నావు…. డాక్టర్ నోటంట మాట వెలువడితే… నవ్వుకూడా అదే స్వీక్వెన్స్ లో వస్తోంది. తమాషాగా మొహం మొత్తం విప్పారకుండ ఒక్క నోరు మాత్రమే కార్టూన్ బొమ్మాల్లో కదిలినట్లు నవ్వుతూ వుంది.
ప్రీకేజీ…. ఈ మధ్య స్కూల్లో వేశాము … .కార్తీక్ వెంటనే సమాధానం చెప్పాడు.
ఈ సారి డాక్టర్ ….. అయామ్ సలీం …. మీ పేరు కార్తీక్ కు షేక్ హాండిస్తూ …అడిగాడు.
కార్తీక్ తన పేరు చెపుతూ … తన భార్య పేరు నీలిమా అని తనకు ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మతో కలిసి వుంటున్నానని. మొకీగాడూ .. ఇప్పటి వరకు మాటలు రావడం లేదని ఇంక చాలా విషయాలు ఒక పదినిమిషాలు అనర్గళంగా మాట్లాడాడు… ఎండిపోయిన పెదలను కార్తీక్ నాలుకతో తడుపుకుంటుంటే డాక్టర్ టేబుల్ మీదున్న బిస్లరీ బాటిల్ మూత తీసి కార్తీక్ కి అందించాడు .. కార్తీక్ .. బాటిల్ ను పైకెత్తి తల కొంచెం పైకెత్తి బాటిల్ ను నోటీకానించకుండా ఒక్క బొట్టు కిందకి పోకుండా శుభ్రంగా తాగి …డాక్టార్ కి ఖాళీ బాటిల్ యిచ్చాడు.
మీరు బ్రాహ్మిన్సా …డాక్టరడిగాడు.
కార్తీక్ ఆశ్చర్యంతో అవునని తలూపాడు.
మీరు దేవుణ్ణి నమ్మరా…డాక్టర్ మళ్ళీ అడిగాడు.
కార్తీక్ అదే ఆశ్చర్యంగా అవునని తలూపాడు.
డాక్టర్ మీకు ఈ విషయాలు ఎలా తెలుసు… ఆశ్చర్యాన్ని ఏ మాత్రం దాచుకోకుండా ఎగ్జైట్ గా అడిగాడు.
ఈ లోపల మోకీగాడు వాళ్ళమ్మతో నీళ్ళు కావాలని సైగ చేసాడు. నీలిమ కుర్చీలో నుంచి నీళ్ళకోసం లేవబోతుంటే డాక్టర్ .. కూర్చోమని సంఙ్ఞ చేసి…
మోకీ నీ ముద్దు పేరా మోక్షిత వైపు చూస్తూ డాక్టర్ చిరునవ్వుని కంటిన్యూ చేస్తూ అడిగాడు.
అవునండి .. కార్తీక్ మాట పూర్తిగాకుండానే డాక్టర్ చురుగ్గా అతనివైపు చూసేసరికి ఠక్కున నోరుమూసేసాడు.
అప్పటివరకు చిరునవ్వుతో వుండిన సంభాషణ, కొంచెం సీరియస్ గా మారింది.
మోకీగాడూ వాళ్ళ నాన్న వైపు చూసాడు.
వాళ్ళ నాన్న డాక్టర్ వైపే చూస్తున్నాడు.
తన చేత్తో మోకీ గాడి తలకాయను తన పైపు తెప్పుకుని అదే ప్రశ్నడిగాడు.
మోకీగాడి కంట్లో చిన్నంగా నీళ్ళూరుతున్నాయి.
అమ్మానాన్న వున్నా మాట్లాడటాంలేదు
డాక్టర్ ఏమో టీచర్ అడిగినట్లు నన్నే అడుగుతున్నాడు. విధిలేక తలను పైకి కిందకి వూపాడు.
మంచినీళ్ళు ….కావాలా..
మళ్లీ అవునని గబగబా వూపాడు.
బయట నర్స్ వుంటుంది. ఆమె దగ్గరకెళ్ళి ఈ ఖాళీ బాటిల్ తీసుకుని నీళ్ళు తీసుకునిరా .. సరేనా గుడ్ బాయ్ కొంచెం పెద్దగా నవ్వి అన్నాడు.
వాడు ఉత్సాహంగా కుర్చీలో నుంచి లేచి వాళ్ళమ్మను రమ్మని ఆమె చేయి లాగాడు.
నువ్వు డేర్ బాయ్ కదా నువ్వే వెళ్ళి తీసుకునిరా… నీవు తీసుకొస్తేనే గుడ్ బాయ్. .. డాక్టర్ మాటల్లో వుండగా నీలిమ లేవబోయిందల్లా మళ్ళీ సర్దుకుని కూర్చుంది.
మోకీగాడు బాటిల్ ని తీసుకుని స్ప్రింగ్ డోర్ దగ్గరకెళ్ళి దాన్ని తన చిన్న చేతుల్తో లాగటానికి ప్రయత్నించాడు అది రాలే. వెనక్కి తిరిగి చూశాడు. వాళ్ళముగ్గురు ఏవో మాట్లాడుకుంటున్నారు. ఇంకొంచెం బలంగా లాగాడు కొంచెంగా తెరుచుకుంది వాడు పట్టెంత సందిచ్చింది.. వాడు ఆ సందులో దూరంగానే మళ్ళీ నిదానంగా మూసుకుంది.
చూడండి ..డాక్టర్ చెప్పటం మొదలుపెట్టాడు.
మీవాడికి వినికిడి శక్తి అమోఘంగా వుంది కాబట్టి మాటలు రాకపోవటం అనే సమస్య లేదు.
మీరిద్దరు ఉద్యోగస్తులు ప్రొద్దున వెళితే సాయంత్రం వస్తారు. మీతో పాటూ మీ పెద్దోడు. రాత్రి 7గంటాలకు ఇల్లి చేరంగానే మీ శ్రీమతి ఇంటిపనుల్లో పడిపోతుంది .పెద్దోడు హోం వర్క్ T.V. తర్వాత భోజనం నిద్ర, కార్తీక్ మీరు రాత్రి 9 గంటలకు ఇంటికెళ్తాము అని కదాచెప్పారు. ఆఫీసు అవ్వంగనే ఆ టీ బంకుల దగ్గరా సిగరెట్ళు కాల్చుకుని ఫ్రెండ్స్ తో కొంచెం నోటి దూల తీర్చుకుని యింటికి వెళ్ళేసరికి రాత్రి అవుతుంది .
అంటె మీ ఫ్యామిలిలో మీరు మాట్లాడుకునే సమయం దాదాపుగా లేదనే చెప్పాలి
చిన్నాడి మీద మీకున్న గారాభంలో వాడికి ఏ యిబ్బంది లేకుండా వాడేమీ అడక్కుండానే వాడి మనసులోనిది సైతం మీరు గ్రహించి వాడికి మీరు అవసరాలు తీరుస్తున్నారు.
మోకీ ని నేను ఏమి అడిగినా మీరే సమాధానం చెపుతారు. ఎక్కువ మాట్లాడితే వాడు మూగాడు సార్ వాడికి మాటలు రావు అని మీ ఇంటి చుట్టుపక్కల చివరికి వాడ్ని చేర్పించిన స్కూల్లో కూడా టాంటాం వేసి… వాడిని అక్కడ కూడా మాట్లాడనీయకుండా చేశారు.
చివరికి .. వాడ్కి వాడే నేను మూగోడిని నాకు మాటలు రావు అనే స్థాయికి దిగజార్చారు.
డాక్టర్ కొంచెం సేపు ఆగాడు.
కార్తీక్ కి ఒళ్ళు మండింది ఆవేశంగా నాకొడుక్కి మాటలు రావటం లేదని మేము తెగ బాధ పడిపోయి మా తిప్పలు మేము పడుతుంటే మేము మావాడిని మూగోడిని చేశారంటారేంది. ఇంట్లో మా అమ్మ వుంది , మేమెవ్వరం లేకపోతే ఆమె తో వాడు మాట్లాడచ్చుకదా.వాడికి మాటలు రావు కాబట్టి మాట్లాడపోయాడు.
డాక్టర్ మళ్ళీ ప్రశాంతంగా అందుకున్నాడు .
మీరు ఎంతసేపటికి మావాడు మూగోడు అనే ఫిక్సయిపోయి మాట్లాడుతున్నారు. వాడికి మాట్లాడే అవసరం కల్పించి వాడికా ఛాన్స్ ఇస్తే మాట్లాడతాడు. అని నేనంటున్నాను పోనీ ఆ విధంగా మీరు ప్రయత్నించారా. …
నీలిమ డాక్టర్ మాటాలకు కొంచెం ఆలోచనలో పడింది. ఆ విధంగా ఎప్పుడైనా ప్రయత్నించామా అంటే లేదనే తెలుస్తోంది. కనీసం వాడితో ఆడుకునే దానికి పిల్లలు కూడా లేకపోయారు అదీ అపార్ట్ మెంట్స్ . అదీ సిటీకి కొంతదూరంలో ..
వాడ్ని..మోకీగాడికి మాటలు రావు కాబట్టి బయటికి పంపిస్తే కనీసం ఎవరి పిల్లాడివని అడిగినా చెప్పలేని పరిస్థితి . పిల్లలందరూ ఎప్పుడు కలిసినా . వాడ్ని ఒక ఆటబొమ్మచేసి వాడిని మురిపెంగా ముద్దుగా చూస్తారు కాబట్టి .వాడికి అది ఆనందాన్నిచ్చివుంటుంది.
వాడికి ఏమి మాట్లాడకుండానే అన్ని జరిగిపోతున్నాయి. కాబట్టి… అసలు మాట్లాడాల్సిన అవసరం ఆ పరిస్థితులు వాడికి కల్పించలేదనిపిస్తోంది.బావిలో తోస్తేనే కాని ఈతరాదన్నట్టు కట్ట మీద నుంచి లోతైన నీళ్ళని బావిని ఎంత సేపు చూసి ఏం ప్రయోజనం.
ఇంట్లో అత్తయ్యగారతే మరీను వాడికి ఏ అవసరం కావాలన్నా వాడడక్క ముందే అన్నీ చేస్తుంది. చివరికి లెట్రిన్ కూడా వాడి ఫేస్ లో కొంచం పీలింగ్స్ వున్న వాడికి లెట్రిన్ వస్తుందని చడ్డీ విప్పి లెట్రిన్ లోకి తీసుకెళ్తుంది. అట్లా ప్రతిదీ చేసేస్తుంది . వాడు ట్రై చేస్తే మాట్లాడతాడేమో.
కార్తీక్ ఇంకా డాక్టర్ తో వాదనలు చేస్తున్నాడు . కార్తీక్ ఎంత సేపటికీ నెగటివ్ యాంగిల్ లోనే ఆలోచిస్తున్నాడనిపిస్తుంది.
చివరికి నీలిమ డాక్టర్ తో ఇప్పిడేం చెయ్యమంటారు సార్… గట్టిగానే అడిగినా స్థిరంగా అడిగింది.
కార్తీక్ ..డాక్టర్ .. ఇద్దరు నీలిమ వైపు చూశారు. డాక్టర్ కుర్చీ వెనకకు వాలి
వెరీ సింపుల్ ..ఏదైనా వాడి నోటితో వాడు అడిగితేనే ఇవ్వండి. వాడు ముందరే మీ చుట్టుపక్కల వారికి స్కూల్లో వారికి మోకీ బాగా మాట్లాడతాడు. అనే పదే పదే చెప్పండి. దాంతో కొంచెం ఇబ్బందులు ఎదురైనా ప్రయత్నించండి . అప్పటికీ మాటలు రాకపోతే అప్పుడు మనం మెడిసన్ పరంగా ప్రయత్నిద్దాం.
అదేదో ఇప్పుడే మెడిసన్ ఇవ్వచ్చుగా వాడి చిన్న మనసును అనుక్షణం గాయం చేస్తూ మాటలు రానివాడీ దగ్గర .. మాట్లాడమని లేకపోతే మంచినీళ్ళు అన్నంగానీ ఏమీ పెట్టమంటే .. వాడికి మాటలురావు అని మీరు చెప్పేదానికి వాడి మీద అన్ని పరీక్షలు .. కార్తీక్ అవేధనగా .. బొంగురు గొంతుతో మాట్లాడాడు.
తలుపు తోసుకుంటూ నవ్వుతూ మోకీ వాటార్ బాటిల్ తో లోపలికొచ్చాడు . వెరీ గుడ్ బాయ్ డాక్టర్ గట్టిగా అంటూ చేత్తో చప్పట్లు కొట్టాడు. నీలిమ కుడా నవ్వుతూ చప్పట్లు కొట్టింది. వాడు ఆనందంతో గర్వంతో ఇందాక వాళ్ళమ్మ ఒళ్ళో కూర్చున్నాడు కాస్త . ప్రక్క కుర్చీలో కూర్చున్నాడు . తాను ఒక వ్యక్తిని , నాకు ఉనికుంది అన్నట్టు.
ఆల్ ది బెస్ట్ ప్రయత్నించండి కార్తీక్ కీ షేక్ హ్యాండిచ్చాడు. మోకీ కి కూడ షేక్ హ్యాండిచ్చాడు . వాడూ నవ్వుతూ డాక్టర్ నాకు షేక్ హ్యాండిచ్చాడు చూడు అని గర్వంగా వాళ్ళమ్మ వైపు చూశాడు.
ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ
మూడు నెలల తర్వాత కార్తీక్ , నీలిమ , మోక్షీత్… డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకుని డాక్టర్ ఎదురుగా కూర్చున్నారు ముగ్గురు నిశ్శబ్దంగా డాక్టర్ వైపు చూసారు.
డాక్టర్ కి అర్థమయింది … ఒకే నో ప్రాబ్లమ్ మనం మెడిసన్ స్టార్ట్ చేద్దాం . మీరు వర్రీ అవ్వాల్సినపనిలేదు.
ఏం మోక్షిత్ నువ్వేమంటావ్ .. డాక్టర్ నవ్వుతూ అన్నారు.
‘నేను రెడీ’ అంకుల్ మోక్షిత్ ఉత్సాహంగా అన్నాడు.డాక్టర్ ఒక్కసారిగా అవాక్కయాడు ఈ సారి పెద్దగా నవ్వడం కార్తీక్ ,నీలిమ వంతయ్యింది ఏం జరిగిందా అర్థంగాకపోయినా మోకీగాడు కూడా వాళ్ళతో శృతి కలిపాడు.