Oct2010
పెండ్లి కార్యం
నర్శింలు బిడ్డ పెండ్లి.
కాలేదు….. పెట్టుకుంటరు.
వాళ్ళు వచ్చి పిల్లను చూసిపోయిండ్రు. నచ్చిందని చెప్పి పంపిండ్రు. నర్శింలుకు ఇష్టమే లేదు. వీళ్ళు పోయి పిల్లగాన్ని చూసి వచిండ్రు. పిల్లగడు నచ్చిండు. పెండ్లి చెయ్యాలనుకున్నరు. అలాలిసకు డేటుకూడా అనుకున్నారు. నర్శింలుతో పని లేకుండా అంతా జరిగిపోయింది.
అప్పుడు మొదలైంది నర్శింలుకు వణుకుడు. ఎట్ల…ఎట్ల…? ఏం జెయ్యాలె…? ఎట్ల నడువాలె…? అనుకుంటుండు. భయపడుతుండు. తొక్కులాడుతుండు. రంది మొదలయింది.
నర్శింలుకు డబ్బులేక కాదు. భాంకుల నిలువ ఉన్నయి. చేతికింద మనుషులు లేకగాదు. ఎప్పటికి ఎంట పదిమందుంటరు. పైసామే పరమాత్మ. చెప్పినపని చెప్పినట్టు చేస్తరు. ఊర్లె కులంలేక గాదు. మున్నారుకాపు కడుపలు మున్నారు తాటుతయి. బలుగం లేదంటే అదీకాదు. ఇద్దరు అన్నలున్నరు. ఎదిగిన అన్నపిల్లలున్నరు. ఊర్లెనే ఒక అక్క ఉంది. అక్క పిల్లలున్నరు. నాయిన లేడుగనీ తల్లి ఉన్నది. సమస్యంతా ఒక్కటె. వాళ్ళెవరూ నర్శింలుతోని మాట్లాడరు. ఇప్పుడుగాదు ఐదేండ్లు దాటింది. ఇంతదాక నిడిచింది. ఇప్పుడు పెండ్లిగదా! ఎవలు రాకపోతే ఎట్లా అన్న ఆలోచనలో పడ్డడు నర్శింలు.
నర్శింలు ఇక్కడుండడు. దుబాయి లుంటడు. అక్కడ ఏంపని చేస్తడో ఎవలకూ తెలువదిగనీ ఫోర్మెన్నని చెప్పుకుంటడు. రెండేండ్లకు ఒకసారి వచ్చి మూడునెలలు ఉండి పోతడు. బాగనే సంపాయించిండు. ఊర్లె ఇల్లుగట్టిండు. రెండెకరాల భూమి కొన్నడు. కొడుకు ఇంటర్ల ఫేలయి ఊర్లె గాలితిరుగుడు తిరుగుతుంటే తనకంపెనిలకే తీసుకున్నడు. బిడ్డలగ్గం జేద్దామన్న ఆలోచనలో లేడు. అనుకోకుండా పెండ్లి కుదిరింది.
కుదిరినప్పుడు చెయ్యాలని అందరు అన్నరు. మాఘమాసలగ్గాల్లో చేద్దామనుకున్నడు నర్శింలు. అపుడు పిల్లగానికి బలంలేదని చెప్పిండ్రు. పిల్లకు బలంలేకుంటే పేరుమార్చి చెయ్యచ్చు. పిల్లగానికి అట్ల గాదుగదా! ఆయిటిముండట జేద్దామనుకున్నడు. పిల్లగాడు ఇంటికి పెద్దోడు. జేష్టమాసంల చెయ్యరాదుకదా!
ఓయాడాది ఆగుదామనుకున్నడు నర్శింలు. పిల్లగానోళ్ళు ఆగమన్నారు. వాళ్ళ ఇంట్ల ముసలవ్వ బాగలేదట. సచ్చిపోతే యాడాది సుట్టిముట్టుకు కండ్లముందే పెండ్లిజెయ్యాలని పట్టుమీదున్నరు. ఎట్ల చెప్పాలెనో తెలువక ఇప్పుడు నాతో కాదన్నడు నర్శింలు. కట్నం ఎప్పుడు ఇచ్చినాసరే అన్నఖర్చుపెట్టి పెండ్లి చెయ్యిమన్నరు పిల్లగానోళ్ళు. అప్పుడు మొదలయింది అసలుకథ.
“ఎట్ల…..వో::ఇ ఎవ్వలు మాట్లాడకపోయిరి…….పెండ్లికార్యం ఎట్ల ఎల్లాలె” భార్యతో అన్నడు.
“సూద్దాం….ఇంకో నెల రెండునెలల్లుంది గదా…..” అన్నది అనసూయ. నర్శింలు నిజమే అనుకున్నడు గని ఆరోజురాత్రే పిడుగులాంటి వార్త తెలిసింది. ఇయ్యంపుడచ్చి కొత్తముచ్చట చెప్పిండు. కార్తీకమాసం దాటితే పిల్లపిల్లగాని వరుగులు కలువయట. రాశులు కలువయడు. ఈలోపలనే లగ్గంకావాలని చెప్పిండు. క్యాలండర్ తీసిచూస్తే కార్తీకమాసం పదిరోజులుంది.
“పదిరోజులల్ల లగ్గమయితదా….” కోపంగా అడిగిండు నర్శింలు.
అనుకుంటె అయితది ఏముంది. ఎల్లుండి లగ్గంబెట్టుకుందాం. ఆటెనుక సున్నం ఎరుక వెట్టుకుందాం. ఈవారం నాకు పసుపులు ముట్టుడు. పైసలుంటె అన్ని అయితయి.” ఇయ్యంపుడు అన్నడు.
“ఏంబడిపోయింది. మెల్లేగాయె. బంగారుకత్తని మెడగోసుకుంటమా….” ఆడివిల్ల లగ్గం. ఎన్ని సదురుకోవాలె. ఎల్లుండే లగ్గంబెట్టుకుంటే నేను సుట్టుపక్కలోల్లకు చెప్పకోవన్నా వద్దా…..ఉరుకులాడితె అయితదా….” అన్నాడు నర్శింలు.
ఇయ్యంపుడు కోపానికి వచ్చిండు.
“ఓ…..హో…..నీది గావాలంటె చెట్టుకొమ్మ లెక్కచల్లిచ్చి పొయ్యవడితివి…..? బత్మటికి బద్దలు గట్టినట్టుంది కథ…..”అని అలిగిపోయిండు.
ఇది తెలిసి చాలామంది నర్శింలుకు నచ్చజెప్పిండ్రు. మంచి సంబందం పాడగొట్టుకోవద్దన్నారు. నర్శింలుకు గూడా కారణమేదీ కనిపించలేదు. సుట్టాలే గదా ఎల్లుండి చెప్పుకోవచ్చులే నుకున్నడు.
“కార్యం మనది. తొలుతలగ్గం. కాళ్ళుమొక్క తోలుకచ్చుకోవాలె. కొట్లాడుకున్నోళ్ళు అయితే ఆపదిల కలుస్తరు. లేకుంటె సంపతిలి కలుస్తరు. ఇప్పుడు కాకుంటే ఎప్పుడూ కలువం. మనోళ్ళు రాకుంటే మనకే చిన్నతనం గదా. రేపుపోయి అందరిని బతిమాలుకుందాం” అన్నది అనసూయ.
నర్సింలు మస్కట్ పోకముందు అందరు బాగనే ఉందురు. మాట్లాడుకుందురు. మస్కట్ పోయినంక ఒక్కొక్కలు దూరమయిండ్రు.
“తమ్మీ……బావ వట్టిగనే ఉన్నడు. తింటండు. తిరుగుతండు. పనిలేదు పాటలేదు. ఆయనకు తగినట్టు కాలం ఎన్నీల గాత్తంది. ఏదన్నా కంపెనీల పెట్టి మస్కట్ తోలుకపోరాఉ. పాస్ పోటు గూడా తీసిండు. ఇక్కటుంటె చేతికి రాడు” అన్నది అక్క ఒకసారి.
“అయ్యో! అట్ల తోలుకపోరా దక్కా….ఇప్పుడు విజాలు ఎల్లుతలెవ్వు. అప్పటినుంచి అక్క రాకడ పోకడ బంద్. మాటలు బంద్.”
చిన్నన్న ఒకసారి నర్శింలును అప్ప అడిగిండు. “తమ్మీ…బోరు ఫెలయింది. నొట్లెకచ్చిన పంట ఎండిపోయేతట్టుంది. ఇంకోబోరు ఏత్త ఇరువై వెయిలుంటే ఇయ్యిరా….పంటల్మీద తీరుస్త” అన్నడు. ”అయ్యో….అన్న…..చేతుల ఒక్కపైస లేదు. కంపెని మూడునెలల నుంచి జీత్తాలే ఇత్తలేదు.” అన్నడు నర్శింలు.
ఆ మరునాడే ఇంటిపక్క పెంటం మల్లయ్యకు యాభైవెయిల బాకీ ఇచ్చిండు. అప్పటినుండి చిన్నన్న మాటలు బంద్. ఫోన్ జేత్తే ఎత్తడు. వచ్చిన్నాడు మాట్లాడడు.
మిగిలింది తల్లి,పెద్దన్న. తల్లి తనది తాను వండుకుంటది. కాళ్ళు,రెక్కలు ఆడుతున్నయి. ముగ్గురు కొడుకులు పసలుకు రెండువెయిల చొప్పున ఆరువెయిలిత్తరు. తల్లి అండ్లనే బట్ట్,పొట్ట ఎల్లదీసుకుంటది.
దేశం పోయిన కొత్తలో “అవ్వా….. నేను లేకపోతిని. పిల్లలు చిన్నోళ్ళు. నువ్వు నాయింట్లనే ఉండు.” అన్నడు నర్శింలు.
తల్లి సరేనన్నది. కోడలుకు ఇది నచ్చలేదు. వద్దని భర్తతో చెప్పలేదు. మింగలేక కక్కలేక వండక వడివెట్టింది. అత్త ఉండలేకపోయింది. పొమ్మనలేక కోడలు పొగవెట్టింది. ఏడాది దాటకముందే అత్త బట్టలు సదురుకుని బయటకు నడిచింది.
భర్తకు అనసూయ ఏడ్సుకుంట ఫోన్ గొట్టింది. నర్శింలుకు కోపమచ్చి తల్లికి ఫోన్ చేసి తిట్టిండు. ఇక్కడ అత్తాకోడండ్లకు దుమ్ము పంచాది.
“నీకు పసలుకు రెండువెయిలు ఇత్తన్న. ఇప్పటినుంచి ఇయ్యనే ఇయ్య. ఏం చేస్తవో చేసుక పో…” అన్నది అనసూయ.
కొడుకు చెప్పితినే కోడలు అన్నదని అత్తకు అనిపించింది. అప్పటినుంచి తల్లితో మాటలు బండ్. పోయిన్నాడు తనలెక్క ఎంతనో ముట్టసెప్పతడు. వచ్చేనాడు “అవ్వా పోతన్న” అని ఇంటికిపోయి చెప్పివస్తడు. అంతె!
పెద్దన్నకు నర్శింలుకు పాణాపాణం సోపతౌండె. పెద్దన్నకు కొడుకులు ఎదిగిండ్రు. తమ్ముడు ఏదన్నా తొవ్వ చూపిస్తడని ఆశ. నర్శింలు పొలం కొన్నతర్వాత అన్నకు పాలుకు ఇచ్చిండు. అది అనసూయకు ఇష్టంలేదు. పరాయివాళ్ళకు పాలుకిస్తే చేతికింద ఉంటరని చెప్పినపని వింటరని ఆమెకు ఆశ. కల్లందగ్గరనో పంపకం దగ్గరనో ఏమనరాదామె. అనసూయ తెలివిగా ఒకటి రెండుమాటలు వాళ్ళతోని వీళ్ళతోని అన్నది. ఆమాటలు పెద్దబావకు చేరినయి.
“నీచేను వద్దు, చెలువ వద్దు. ఎవలకన్న ఇచ్చుకపో…..మేమే బతుకలేకపోతమా” అన్నది యారాలు.
ఇదేసందని ఇంకొకరికి ఇచ్చింది అనసూయ. భర్తకుమాత్రం వేరేరకంగా చెప్పింది.
“నేను వచ్చేదాక నువ్వేచేసుకో అంటిని. నడిమడ్లె నాగలి ఇడిసినట్టు ఇప్పుడు వద్దంటడా” అని నర్శింలు.
వీడే పెండ్లాన్ని ఎగేసిండని పెద్దన్న. అప్పటినుంచి ఇద్దరికీ మాటలు బంద్.
ఎవరింట్ల ఏకార్యం కాలేదు. ఐదేండ్లపొద్దు ఎవలుతల వాళ్ళు ఉన్నరు. ఇప్పుడు బిడ్డపెండ్లితో గోసవచ్చింది నర్శింలుకు.
“ఎట్ల…ఎల్లుండే పెండ్లి పెట్టుకునుడు. ఎందరిని పిలువాలె గదా!” అన్నడు నర్శింలు.
“పిలువాలె. పిలుద్దం. దొంగతం చేసినమా, లంగతనం చేసినమా? ఎవలదన్న దోసుకు తిన్నమా…..రేపు నాలుగు ఇండ్లల్లకు పోదాం. పాతయి తవ్వుకోవద్దని కాళ్ళు మొక్కుదాం. అంటే! ఇండ్ల ఏముందని ఆగమైతున్నవు. నువ్వు నాఎంట రా….గంతే!” అన్నది అనసూయ.
నర్శింలుకు ఏనుగంత బలమచ్చింది. “ఒక్కసారి గాకుంటే నాలుగుసార్లు కాళ్ళు మొక్కుత. నాకేం చిన్నతనం?” అనుకున్నడు.
తెల్లారింది. అన్నలను, అక్కను,తల్లిని కలుద్దామని బయలుదేరిండు నర్శింలు. అప్పటికే లగ్గంముచ్చటాందరికి తెలిసిపోయింది. “వీడు ఎట్లజేత్తడో సూత్తం” అనుకున్నరు అందరు. తల్లి ఓ ఊరికి, అన్నలు ఓ ఊరికి, మారాండ్లు ఓ ఊరికి, అక్క ఓ ఊరికి పోయిండ్రు. ఇండ్ల్ల పిల్లలే ఉన్నరు. ఎటు పోయిండ్రంటే చెప్పరు. ఎప్పుడత్తరన్నా చెప్పరు.
ఇద్దరాలుమగలు ఇంటికచ్చి నెత్తికి చేతులు వెట్టుకున్నరు.
“చూసినవా…కావాలనే బదులుకున్నరు. ఏమన్న అంటే మాకేం తెలుసు అంటరు. పిల్లగాన్ని
చూసిన్నాడు చెప్పిండ్రా….మాట్లాడుకున్న నాడు చెప్పిండ్రా అంటరు. పెండ్లి అనుకోకుండ వచ్చె. వీళ్ళు రాకుంటే ఎందరు ఏమంటరు.” అన్నడు నర్శింలు.
అనసూయ కూడా ఆలోచనలో పడ్డది.
నర్శింలుకు ఏంచెయ్యాలో తోచలేదు. ఆరోజు తిండిముట్టలేదు. సీసమీద సీస నాలుగుసీలు కల్లుతాగి పన్నడు. భార్య ఎంత నచ్చజెప్పినా వినలేదు. మద్యాన్నం రెండుగొట్టంగ మాత్రం ఒకసారి లేచి బయటకు వచ్చిండు. గుండెల నొస్తుందని భార్యకు చెప్పిండు. అట్లనే నిలువునిత్తారం కూలబడిపోయిండు.
అనసూయపాణం జల్లుమంది. ఏడుపు అందుకుంది. బీడీలు చేస్తున్హ్నబిడ్డ చాప పక్కనపెట్టి పరుగెత్తుకచ్చింది. అప్పటికే నర్శింలు గుడ్లుతేలేసిండు. ఎవరో ౧౦౮కు ఫోన్ చేసిండ్రు. పదినిమిషాల్లో ౧౦౮ వచ్చింది. ముస్తబాద శంకర్ దవాఖాండ్లకు తీసుకపోయిండ్రు. భార్యాకూతురు మొత్తుకుంట ఎంబడి పోయిండ్రు. నిమిషాలమీద ఊరంతా మసిపారింది. మనిషి సచ్చిపోయిండని పుకారు పుట్టింది.
పొద్దుగూకే వరకు బలుగమంతా దవాఖానకు చేరుకున్నరు.
“గుండెల చిన్నగ నొప్పివచ్చింది. రందివెట్టుకోవద్దు” అని డాక్టర్ మందులు ఇచ్చిండు.
కూరుకురాత్రి జీబు కిరాయి తీసుకుని అందరూ ఇంటికచ్చిండ్రు. బలుగమంతా ఇల్లునిండింది.
నర్శింలు అప్పుడప్పుడు చాతిపై రాసుకుంటూ ఆయాసపడుతుండు. తల్లి కొడుకు సెయ్యంతా నిమురుతుంది. అన్నలిద్దరూ తలాపున కూసున్నరు. మారాండ్లు అనసూయ దగ్గర కూసున్నరు.
“రేపు వాళ్ళను వద్దందామా…”ఎవలో అన్నరు.
“ఎందుకు….రాని…..ఆడపిల్ల పెండ్లి. చేసి బరువుదించుకోవాలె గనీ ఎత్తగొట్టుకుంటరా….” పెద్దన్న అన్నడు.
“వాడి మంచంలనే ఉండె ఎట్ల…” ఇంకెవలో అన్నరు.
“ఏందెట్ల…..మేం లేమా….?” చిన్నన్న అన్నడు.
“బలమచ్చినప్పుడు కానీ…..ఆపద్దు” అక్క అన్నది.
మబ్బుల బాత్ రూంకని లేచిండు నర్శింలు. అనసూయ ఎంట వచ్చింది. ఎవ్వలూలేనిది చూసి “ఎట్లుంది కథ?” అన్నడు నర్శింలు నవ్వుతూ.
“నీ పాడుగాను…. నేను నిజమే అనుకుంటిని” కోపంగా అన్నది అనసూయ.
7 అభిప్రాయాలు »కథలు, మానేటి కథలు
October 13th, 2010 at 5:29 pm
బాగు౦దన్నా…
October 14th, 2010 at 1:20 am
Anna,
Your Stories are disappointing me again & again..
You are a Teacher..
Why doesn`t any Teacher concentrate on Reforms in Educations System?
Why don`t any Teacher/Lecturer/Professor write Stories on Studies Pressure?..
You are not only responsible to the Farmers & Telangana Movement but also to The
Students..
Email:ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
October 25th, 2010 at 7:27 am
తెలంగాన్ సంస్క్రుతి మీద చక్కని కథ్ ఇది. మావూరిలొ జరిగినట్టే వుంది. బాగుంది.
November 10th, 2010 at 11:43 am
అన్న బాగున్న్ ది. మావూరి బాగొతం కతలు మల్ల రాయవా… పద్మ
November 12th, 2010 at 8:39 am
చలా బాగుఒధి , తెలంగ్నా కథ
చంద్ర షెకరు
November 16th, 2010 at 6:03 pm
Excellent story.. Simply superb…
March 27th, 2011 at 5:56 am
చాలా బాగుంది