Oct2010
సమాధుల తోట
మాటలతో ఏమీ చెప్పజాలని అశక్తతలాగే
వెనుకకు తిరిగి చూసినపుడు రాసిన పద్యాల జాడలవెంట
కాంక్షించినదేదీ పలుకని తిరస్కృతిలా
ఎక్కడో దారితప్పి తనచుట్టూ తాను
తిరిగి తిరిగి వేసారే పాదాల వేదనా తీరం
ఇక్కడ ఏమీ మిగిలిలేదు
చేయి చాచిన ప్రతిసారీ అశక్తత ఒక్కటే ఒక శూన్యపు స్పర్శగా
సదా మస్థిష్క గోళాంతరాలలో
మహా భారమై రేగే అగ్నికణికలు తప్ప
జీవితం వాళ్ళకు ఎంత అల్పం
అల్పమని తెలిసి మరింత ఒదిగి ఒదిగి
భయముతో వేసటతో
ఒక మహా పర్వత సదృశ్యమైన దేన్నో
మూపులపై తప్పించుకోజాలక శృంఖలాబద్ధమయి
మనుషుల అసహాయ విన్యాస కేళీ విలాపం
అనాదిగా వాళ్ళకు తెలిసిందొక్కటే
చావు తప్ప మరొకటింకేదీ
జీవితపు తొక్కిళ్ళ నుండీ విముక్తి నివ్వదని
అరచేతుల మడతలలో బిరుసుబారి కఠినాతికఠినమై
చివరకు అరగడంతప్ప మారని బతుకురాతను
చచ్చేంతదాకా అలా పొడిగించక తప్పదని
“మంచి మంచి వాళ్లకు చావొస్తుంది నాకొచ్చి చావదేమండ్రా”ని
ఊపిరి సలుపని ఆక్రోషంలో తనను తాను దహించుకుంటూ
ఈసురోమని తిరిగి లేస్తూ తప్పించుకోజాలని
అరవై ఏళ్ళ జీవితానికి ముగింపునొక ఆశ్వాసనగా
తలపోసి తలపోసి చావు ఎంత బాధాకరమైనా
తిరిగి చూడని నాయన-
మగ్గపు చప్పుళ్ళ మధ్య నిర్లిప్తత ఒక మత్తుగా మరిగి
నిరంతరమూ ఊళ్ళు పట్టుకుని నాడెలా సంచలించిన ఆయన తండ్రి
బతుకంతా ఆసులో దారమై
ధారవాహికంగా ఎనబై ఏళ్ళపైబడి రెక్కలను సాది
అక్షరాలా అరిగి బొగిలిపోయిన జేజి
భారమై మలిగిపోయే శ్వాస కొసలలో
రగిలిన అనేకపు నిప్పుపూలు
అనామకపు ఖాళీలనడుమ
ఎక్కడో కాలపు పొరల మాటున
ఎదురుచూస్తున్నదేదో తమకు సిద్ధించినట్టుగా
విశ్రాంతిలో పరుండినవాళ్ళను
ఇప్పుడు నేను పేరుపెట్టి పిలువబోను
తెలిసి తెలిసి
ఒక విఫల నిష్ఫల గీతికా చితినై
నిరంతరమూ నన్ను నేను దహించుకోలేను
November 20th, 2010 at 2:34 am
అభినందనలు.