శుద్ధి

ఎప్పుడో ఐదుంబావుకే వరంగల్లు స్టేషన్ కి రావాల్సిన సింగరేణి ప్యాసింజర్ ఏడుగంట     లవుతున్నా రాకపోవడంతో నాలుగున్నరకే వచ్చి కూర్చున్న మాకు భరించలేనంత విసుగ్గా ఉంది.
మేం కూర్చున్న గ్రానైట్ బల్లకు కుడివైపు బల్లమీద ఎవరో వృద్ధ ముస్లిందంపతు లిద్దరు ఉర్దూలో మాట్లాడుకుంటున్నారు. ఇక ఎడమవైపు బల్లమీద సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఎవరిలోకంలో వాళ్ళే ఉష్ట్రపక్షుల్లా కూర్చున్నారు కొంతమంది కాలేజీ విద్యార్థులు.
విద్యార్థులకు రెండోవైపు కూర్చున్న వ్యక్తులు కొందరు సత్యం రామలింగరాజు మీద చర్చించు     కుంటున్నారు.    ఏ రైల్లోనో వచ్చి దిగిన హిందీప్రాంతపు పిచ్చివాడొకడు తనభాషలో ఎవరినో బండబూతులు తిడుతున్నాడు.
అప్పుడే వచ్చివెళ్ళిన జమ్ముతావిలో నుండి దిగిన గుడ్డిదంపతులిద్దరు పాటలు పాడుకుంటూ     మనిషిమనిషినీ అర్థిస్తూ స్టేషనంతా చుట్టేస్తున్నారు.
ఇంతలో కొతమంది ఆడవాళ్ళు భుజాలకు సంచులు తగిలించుకొని గలగలా మాట్లాడు కుంటూ వచ్చి సరిగ్గా మా ముందు నేలమీద హాయిగా కూర్చుని సంచుల్ని ఒళ్ళో పెట్టుకున్నారు.
అలా ఏ భేషజమూ లేకుండా కింద కుర్చుని కులాసాగా మాట్లాడుకుంటున్న వాళ్ళను చూస్తూ “చూశావా! అలా బ్రతకడం అనేది వాళ్ళకో వరం.” నా పక్కనే కూర్చున్న మా రెండో అమ్మాయి     అర్చనతో అన్నాను మెల్లగా.
“పోమ్మా!  నీదంతా అదోటైపు.  అలా నిర్క్లక్ష్యంగా నేలమీద కూర్చుని, పక్కవాళ్ళకు ఇబ్బంది     కలిగేలా లొడలొడా మాట్లాడ్డం కూడా వరమేనా?” అంటూ నావైపు అదోమాదిరిగా చూసింది అర్చన.
పల్లెటూళ్ళో పుట్టిపెరిగిన నిన్నటితరం మనిషినైన నాకు, పట్టణంలో పుట్టిపెరిగిన ఇప్పటితరం     మా పిల్లలకూ మధ్య మనుషులను అవగాహన చేసుకోవడంలొ ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుంటే, “సర్లే పోనిద్దూ…” అంటూ కూర్చున్నవాళ్ళనే చూడసాగాను.

***    ***    ***    ***    ***

ఆ కూర్చున్న మహిళల్లో ఓ పాతికేండ్ల యువతి తప్ప మిగతా వాళ్ళంతా దాదాపు నలభై     పైబడ్డవాళ్ళే!  ఆ పాతికేళ్ళ యువ్తికి ఓ మూడేండ్ల పిల్లవాడు కూడా ఉన్నాడు.
పిల్లవాణ్ణి ప్లాట్ ఫాం మీద దించిన యువతి,కోడిపెట్ట తనపిల్లల్ని కనిపెట్టుకుని తిరుగాడినట్టు     తనుకూడా మిగతావాళ్ళతో మాట్లాడుతూనే పిల్లవాణ్ణి ఓకంట కనిపెడుతూనే ఉంది.
ఏప్రాణికైనా తనసంతానం మీద ఉండే ఆ జాగ్రత్త సృష్టిలో మరిదేనితోనూ అమ్మను పోల్చి     చూడలేని దివ్యత్వాన్ని ఆపాదించిపెట్టిందేమో!
పిల్లవాడు బొద్దుగా,నల్లగా మెరుస్తూ….చిన్నిచిన్ని పాదాలతో ప్రయాణీకుల మధ్య     ఉడుతపిల్లలా గెంతులు వేస్తూ అటూ,ఇటూ పరుగెడుతూ,తల్లిదగ్గరకొస్తూ దోబూచులాడసాగాడు……
ఆ స్త్రీలను చూస్తూంటే రెక్కలకష్టంతో ఏరోజుకారోజు పొట్టపోసుకునే మామూలు మనుషుల్లా     అన్సిస్తూంది.  వాళ్ళ శరీరాలు మోటుగా ఉన్నాయి.  వాళ్ళ వంటిమీది గుడ్డలు,రేగిపోయిన తలకాయలు,     చెమటతో జిడ్డోడుతున్న ముఖాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.
వాళ్ళమాటలనుబట్టి,వాళ్ళంతా కొత్తగూడెం దగ్గర బేతంపూడి నుండి ఏదో సువార్తకూటముల     కోసం వరంగల్లు వచ్చిపోతున్నట్టుగా అర్థమవుతుంది.  మతం తీసుకుని దైవాన్ని నమ్ముకున్న తరువాత     వాళ్ళబతుకుల్లో చెప్పలేనంత మార్పు వచ్చిందంట.  వాళ్ళమాటల్లో వ్యక్తమవుతున్న నమ్మకానికి     ఆశ్చర్యపోతూ కూర్చున్న నన్ను అప్పుడే వచ్చిన ఒకావిడ “కొంచెం జరగండి” అంది.
నేను మా అర్చనవైపు జరుగుతూ ఆమెవైపు చూశాను.  తనూ మధ్యవయస్కురాలే.  వంటిమీద కనకాంబరం రంగు ఆర్గండీ చీర, అదేరంగు జాకెట్టూ ధరించింది.  ఆమె ఎడమచేత బరువుగా కన్పిస్తున్న ఓ కర్రలసంచీ, కుడిచేతిలో ఓ సెల్ ఫోన్ ఉన్నాయి.
“సింగరేణి ఇంత లేటైందేంటి?” నా పరిశీలనకు అడ్డం వస్తూ అంది ఆ సంచీ ఆవిడ.
“ఆమెకు చోటెందుకిచ్చావ్?” అన్నట్టు చూపుల్తోనే నన్ను ప్రశ్నించింది మా అర్చన.
“నిజంగా ఈతరం పిల్లలు వస్తువుల మీద, దుస్తుల మీద చూపిస్తున్న ప్రేమలో పదోవంతు     ప్రేమ కూడా తోటిమనుషుల మీద చూపించడంలేదు.  సాంకేతిక చదువులతో లభిస్తున్న ఉద్యోగాలు, డబ్బుతో     విలాసాన్ని, ఎలక్ట్రానిక్ వస్తువులతో ఒంటరితనాన్ని నేర్పుతున్నాయి తప్ప మనిషిని మనిషిగా ప్రేమించాలనే     మౌలికసూత్రాన్ని చేర్పడంలేదు.
అంతలో మాకెదురుగా కూర్చున్న ఆ ఆడవాళ్ళంతా ఏదోపాట అందుకున్నారు.
మేమంతా ఆ పాటలోని ఆర్ద్రత అనుభవిస్తూ వింటున్నాము.
అదే సమయంలో ఓ ప్లాస్టిక్ బస్తానిండా అరవిరిసిన నందివర్ధనంలాంటి మొక్కజొన్న పేలాలతో వచ్చిన కుర్రాడొకడు “గరంగరం మసాలా పాప్ కార్న్” అంటూ మావైపు కొచ్చాడు.
పాప్ కార్న్ బస్తాను చూసిన చిన్నపిల్లవాడు కాస్తా అవి కొనిపెట్టమంటూ తల్లికొంగు పట్టి గుంజుతూ మారాం చెయ్యసాగాడు….
పాపం! తల్లిదగ్గర డబ్బులున్నాయో లేవోగాని, పిల్లవాడు ఎంతమొత్తుకున్నా కొనిపెట్టడం     లేదు.
పాప్ కార్న్ కోసం తల్లినేడిపిస్తున్న పిల్లవాణ్ణి గమనించిన పాప్ కార్న్ కుర్రాడు అక్కడే నిలబడి “పాప్ కార్న్! పాప్ కార్న్!” అంటూ మళ్ళీమళ్ళీ కేకలెయ్యసాగాడు….
ఎంతసేపు ఉన్నా ఆతల్లి దగ్గర పిల్లవాడికి పాప్ కార్న్ కొనిపెట్టే ఉద్దేశ్యం కన్పించకపోవడంతో     పాప్ కార్న్ కుర్రాడు కాస్తా ఇక లాభంలే దనుకున్నాడేమో గాని అక్కణ్ణించి ముందుకెళ్ళీపోయాడు.
పాప్ కార్న్ కుర్రాడు వెళ్ళిపోవడంతో  ఆ చిన్నపిల్లవాడు ఒక్కసారిగా మా కాళ్ళముందరే కిందపడి కాళ్ళూ, చేతులూ తపతపా కొట్టుకుంటూ బిగ్గరగా ఏడవసాగాడు….
దాంతో అప్పటిదాకా పిల్లవాణ్ణి ఏదోవిధంగా సముదాయించాలని చూసిన తల్లికి ఒక్కసారిగా     కోపం ముంచుకొచ్చినట్టుంది.  వాణ్ణి పట్టుకొని “చెటాచెటా” మంటూ ఆచెంపా,ఈచెంపా వాయించింది.            పాటపాడుతున్న వాళ్ళల్లో ఒకావిడ తల్లివంక తిరిగి “హ్హే! పిల్లగాణ్ణి కొట్టకే” అంటూ మళ్ళీ     పాటందుకుంది.
పిల్లవాడి “దూకుడు” అంతకంతకూ పెరిగిపోతూంది.
వాణ్ణి సముదాయించలేని తల్లి “ఏడ్చి,ఏడ్చి వాడే ఊకుంటాడులే” అన్నట్లు పాటలో     మునిగిపోయింది.
కళ్ళముందు జరుగుతున్న వ్యవహారాన్నంతా అప్పటిదాకా మౌనంగా చూస్తూ కూర్చున్న     కర్రలసంచీ ఆవిడ తన సంచీలో నుండి ఏదో తీసి, నోరుతెరిచి ఏడుస్తున్న ఆ పిల్లవాడినోట్లో జారవిడిచింది.
“అంతే!”
గాలికి “గప్ఫ”న ఆగిపోయిన కొవ్వొత్తిలా చప్పన ఏడుపు ఆపిన పిల్లవాడు నోట్లో పడినదాన్ని     తియ్యగా చప్పరించసాగాడు…..
స్పందించే హృదయమే మానవతకు నిజమైన ఆలయం.  నాబ్యాగ్లో కూడా మా మనుమరాలికోసం కొన్న చాక్లెట్లు,బిస్కట్లు,చలానే ఉన్నాయి.  కానీ ఏంలాభం?  ఏడిచే పిల్లవాడికి తీసి     ఇవ్వాలన్న ఆలోచనే రాలేదు నాకు.
ఠక్కున ఏడుపు ఆగిపోవడంతో “ఏంటబ్బా?” అనుకున్న తల్లి ఇటు తిరిగి “పిల్లగాని     కేంపెట్టినావ్?” ఏదో సందేహం గొంతులో తొంగిచూస్తుంటే కరలసంచీ ఆవిడవంక చూస్తూ అడిగింది.
“బాబా ప్రసాదం” చెప్పింది సంచీ ఆవిడ.
తీవ్రమైన తప్పిదం ఏదో జరిగిపోయినట్టు “సఠిక్” మంటూ లేచిన తల్లి పిల్లవడి రెండుబుగ్గలను తన ఎడమచేత గట్టిగా వత్తిపట్టడంతో వాడింకా స్త నొప్పితో విలవిల్లాడుతూ పిచ్చుకపిల్లలా నోరు తెరవగానే     నోట్లో ఉన్న ప్రసాదాన్ని తీసి నేలకేసి కొట్టింది!
అప్పటిదకా అనుకోని ఉపద్రవం ఏదో మీదపడ్డట్టు బిగుసుకుపోయిన మిగతా ఆడవాళ్ళంతా     ”మాపిల్లగనికి మీప్రసాదం పెట్టమని ఎవరు జెప్పారు?” అంటూ కర్రలసంచీ ఆవిడ మీదకు పోట్లాటకు     దిగిపోయారు.
“ఏదో చంటిపిల్లగాడు గుక్కబట్టి ఏడుస్తున్నాడు గదా!  పోన్లెమ్మని ఇంతప్రసాదం నోట్లో ఎస్తే పెద్ద
ఘోరమేదో జర్గిపోయినట్టు మొత్తుకుంటారెందుకు? ఐనా, మీకిష్టం లేకపోతే మళ్ళీ పెట్టొద్దని చెప్పాలిగాని నోట్లో     ప్రసాదం దీసి అట్లా తొక్కిళ్ళల్లో పారేస్తారా?” అంటూ తనూ ఎదురుదాడికి దిగింది కర్రలసంచీ ఆవిడకూడా!
నోట్లో తీపిని తీసెయ్యడంతోపాటు, బుగ్గలు నొప్పిపుట్టడంతో ఆ పిల్లవాడు కాస్తా మళ్ళీ కాళ్ళు,     చేతులు ఝాడిస్తూ ఏడుపు లంకించుకున్నాడు.
“ఇంకా చూస్తవేంది?  ఆ సంచిలో ఉన్న ప్రేరాయల్ దీసి పోరని నోట్లో ఇంతబోసి శుద్ధిజెయ్యక!”     అంటూ తల్లిని హెచ్చరించింది వాళ్ళల్లో ఒకావిడ.
ఆమాట మినడంతోనే తనదగ్గరున్న సంచీలో నుండి ఏదో సీసాను బయటికి తీసి దాన్లో ఉన్న     నూనెను పిల్లవాడి నోటిలో పోయబోతుంటే, వాడు అటూ,ఇటూ కదలడంతో సీసాలోని నూనంతా ఒక్కసారిగా     పిల్లవాడి నోటినిండా పడిపోవడంతో అప్పటికే గుక్కబట్టి ఏడుస్తున్న వాడికి పొలమారి నూనె అంతా     శ్వాసనాళాల్లోకి పోయినట్టుంది.  దాంతో ఊపిరాడని వాడికి కిందిగుడ్లు కిందనే, పైగుడ్లు పైన్నే తేలవేస్తూ,     తల్లిచేతుల్లో తోటకూరకాడలా వాలిపోయాడు.
పిల్లవాణ్ణి ఆస్థితిలో చూసిన తల్లికి పైప్రాణాలు పైన్నే పోతుంటే “వామ్మో, నాకొడుకో! ఏమైందిరో
నాయనో !” అంటూ గుండేలు బాదుకుంటూ ఘొల్లుమని ఏడవసాగింది….
“దేవుని మహిమ జూసినవా రంగమ్మా!”  వాళ్ళల్లో ఒకావిడ ఇంకో ఆవిడతో అంటూంది.
“ఇదంతా ఎటుబోయి ఎటొస్తుందో, ఏమో?” అనుకున్న కర్రలసంచీ ఆవిడ ఆ హడావిడిలో     ఎప్పుడో అక్కణ్ణుంచి మెల్లగా తప్పుకుంది.
“జర్గిన తప్పును క్షమించమని చెప్పి అయ్యగారితో ప్రార్థన చేయిద్దాం పాండి.”    పిల్లవాణ్ణి గాల్లో
ఎగరేస్తూ అంది ఇంకో ఆవిడ వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ…..
జరిగిందంతా చూస్తున్న నాఒళ్ళు శీతలం కమ్ముతుంటే పిచ్చిగా చూస్తుండిపొయ్యాను.
అప్పటిదాకా మాపక్కనే నిల్చుని జరుగుతున్నదంతా చూస్తున్న ముస్లిందంపతుల్లో ముల్సలాయన ముందుకొస్తూ “యా అల్లా! మతం పేరుమీద మనుషు లెంతమూద్ఖంగా తయారైతున్నారో     చూస్తున్నావా?” అంటూ పిల్లవాడి చెయ్యిపట్టుకుని నాడి చూస్తూ “ప్రార్థన,గీర్థన తర్వాత.  ముందు వాణ్ణి ఏదన్న ఆస్పత్రికి తీస్కపోండి” అంటూ హెచ్చరించాడు.
ఇంతలో కూతవేస్తూ వచ్చిన సింగరేణి ప్యాసింజ ప్లాట్ ఫాం మీద ఆగింది.

4 అభిప్రాయాలు »కథలు

4 Responses to “శుద్ధి”

  1. 1
    లియో Says:

    చక్కని కథ. నెనర్లు.

  2. 2
    bhanu Says:

    స్పందించే హృదయమే మానవతకు నిజమైన ఆలయం. బాగుంది. మతమ్ మథ్థులొ ఎంత అగ్న్యానంగా జనమ్ ప్రవర్తిస్తారొ సిమ్పుల్ గా చాలా చక్కగా రాసారు.

  3. 3
    sivalakshmi Says:

    కాంతారావు గారూ,
    కధ చాలా బాగుంది.అన్ని మతాలూ స్త్రీలకు వ్యతిరేకమైనవే!జనాభా లో సగ భాగం గా ఉన్న స్త్రీల తెలివిటతేటలూ,శక్తి యుక్తులూ- మతాచారాలకూ , దేవుళ్ల పూజలకీ,ఉపవాసాలకీ బలై పోతున్నాయి.సమాజంలో ఉన్న స్త్రజాతి మెదళ్లన్నీ శాస్త్రీయంగా ఆలోచించగలగితే భావి తరాల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది.ఆ దిశ గా మీ కధ కొంత మేరకైనా ఆలోచింపజేసేది గా ఉంది.ధన్యవాదాలు.

  4. 4
    medavaram kanthi kumar Says:

    the main theme of the story what i felt is the people those who performing the retuals of certain caste, not observing the actuale theme of caste, but following the foolish things. In the story, other caste women feeded some prasadam to child, who belongs to some other caste, the mothe of the chaild oppose the same and tried to took of the prasadam from the child mouth, resulting child rushed to hospital.
    bothe are womens one who tried to stop the crying of the child, another child mother who tried to oppose the action of the women. why the role of the child mother negatively created, the mother used to keep the child in happy irrespective of the caste rituvals. so that the negative role of mother is not appreciable
    in addition, the respect of the people, in view of their dress sense, colour, behaviour, the generation differences between archana and her mother showed in little, which dilutes the main concept the story, since the gap of generation is separate subject, which leads the story away from main concept.
    further, what actually writer wants to tell is not established forcely.
    anyway the observation of writers is appreciable and nice stroy.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో