Oct2010
వాన
తెల్లవారింది, వర్షం అలాగే పడుతోంది. ఆగి ఆగి కొంతసేపు, గాలి వీస్తు మరికొంత సేపు, కుండపోతగా మరికొంతసేపు కురుస్తూనే వుంది. రెండురోజుల క్రితం మొదలైన వాన, ఇంపూ తెంపూ లేకుండా కురుస్తూనే వుంది.
మాసడు అడ్డాకుల గుత్తిని తలకి అడ్డుపెట్టుకుని కొండమీద నడుస్తున్నాడు. ముడుతలు పడిన శరీరమ్మీంచి వాననీరు క్రిందికి జారుతోంది. ఒంటి మీద ఏ ఆచ్చాదనా లేదు, మొసకి కట్టిన గోచిగుడ్డ తప్ప. నడుస్తున్నాడన్న మాటేగాని, సన్నగా వొణుకుతున్నాడు. వొంట్లో సత్తువ లేకపోయినా చేతిలో ‘కంక’ సాయంతో జారిపోకుండా జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. కొండ వాలులోంచి సాగుతున్న దారది. ఎదురుగా ఏమీ కనిపించడం లేదు. ఒక తుప్ప దగ్గర ఆగేడు. వంగి ఒక మొక్కని మొదలు పట్టి లాగేడు. దాని ప్రక్కనే మరో పాదుని చూసేడు. అతని కళ్ళు మెరిసేయి. అది పులిదుంపల పాదు. దాని మొదలెక్కడుందో పట్టుకున్నాడు. కంకతో తవ్వేడు. కొండ బాగా తడిసుండడంతో పని సులువయ్యింది. దుంపలు దొరికేయి. పాక వైపు అడుగులేసేడు దుంపల్ని మోసుకుంటూ.
”దొరికినవా ?” అడిగింది కోడలు. ‘ఔనన్నట్టు తలవూపి ముంజూరు మీంచి కారుతున్న నీటిలో దుంపల్ని కడిగేడు ముసిలోడు. కాళ్ళు, కంక శుభ్రం చేసి పాక లోపలికి అడుగుపెట్టేడు. మూల దాచిన ఎండు పుల్లలతో పొయ్యి ముట్టించింది కోడలు. కుక్కి మంచం కింద కుంపటిని లాగి అగ్గి రాజేసింది.
”ఊష్టమొగ్గుండదు గలా… మల్లా వాన కాడ తడుస్తున్నవు” కోడలు
”ఊష్టమని తొంగుంటే తిండి దొరుకుతాదమ్మీ” అని దుంపల్ని వెదురు బుట్టలో వుంచేడు.
‘నిజమే, ఈ దుంపల్లేకపోతే రాత్రికి పస్తులే’ అని యిద్దరికీ తెలుసు. పొయ్యి మీద దాకలో నీళ్ళు తల తల మరుగు తున్నాయి. అట్టుకు మీద నుంచి బుట్ట దించింది. అందులో టెంక పిండిని వెలుగులోనికి తెచ్చి చూసింది. పురుగు లేమైనా వున్నాయేమోనని. కిందటేడు పిండది. మామిడి బాగా కాయబట్టి టెంకలు ఆ పాటైనా దొరికినాయి. టెంకలు ఎండబెట్టి పగలుగొట్టి గుజ్జును గూటంతోని సితగ్గొట్టి, గెడ్డలోన కస పోయిందాక కడిగి కడిగి ఎండబెట్టి పిండి సెయ్యాల. కస పోకపోతే కడుపు తిప్పేస్తుంది.
మరుగుతున్న నీళ్ళలో పిండిని కలిపి అంబలి చేసింది. ఉప్పు గడ్డల్ని వేసి రుచి చూసింది. ఆ వాసన పాకంతా వ్యాపించి ఆకలిని గుర్తు చేసింది.
ముసిలోడు తడిసిన గోచి గుడ్డని మార్చుకొని మనవడు ‘పింటు’ తెచ్చిన హాస్టల్ దుప్పటిలోకి దూరిపోయేడు. హాస్టలు పుణ్యమా అని మనవడి తిండికి లోటు లేదు, గాని పింటు ఎప్పుడు బడొగ్గేసి తిరుగుతాడు. బడికాడ ఆడికెన్ని యిబ్బందులో ? మనవడిని సూస్తె కొడుకు గుర్తొస్తాడు. మనవడిని బడిలోకి చేర్చుకుని కొడుకు జ్ఞాపకాల్లోకి జారిపోవడం ముసిలోడికి మామూలే.
కొండమీద వానల్లేక, పనుల్లేక, పంటల్లేక తిండికి కట కటౌతున్న రోజుల్లోన ఎంకటిగాడు ఇంటి కొచ్చేడు. ఆడు దిగవూరోడు. ఆ కిందటేడు దేశమెల్లి తిరిగొచ్చేడు.
”ఎలాగున్నావురా ?” అడిగేడు కొడుకు.
”నాకేటి ? సూపరు” అని ”అక్కడ రెండు పూటలు తిండి, వుండడానికి యిల్లు, రోజుకి వంద” చెప్పేరు.
”పనో ?”
”పనిలేకుండా డబ్బులిస్తార్రా ? సార్‌కి సేపల సెరువులు, కోళ్ళ ఫారాలు వున్నాయి. అక్కడ మందులెయ్యడం, క్లీనింగు సేస్సి, ఫీడింగు అందివ్వడం అంతే”.
”అంతేనా ? దానికి రోజుకి వందా ?”
”వందే, మనకి అరవై మిగుల్తాది, ఖర్చులు పోను.”
నువ్వూ ఎలిపొచ్చీరా ? అన్నాడు మేస్త్రి కిచ్చిన మాట కోసం. మేస్త్రి మనిషికింత అని డబ్బులిస్తాడు.
సినుకులేని కరువు గుర్తొచ్చిందో, గింజల్లేని గాది గుర్తొచ్చిందో… కొడుకు దేశమెలిపోయేడు.
అప్పుడప్పుడూ ఉత్తరాలొచ్చేవి. దిగవూరి పెసిడెంటుకి ఒకసారి ఫోను చేసేడని తెలిసింది. అంతే.
ఫీడింగు కలపడం, క్లీనింగు చెయ్యడంలోన ఆ వాసనకి జబ్బు పడ్డాడని, మందులు వాడుతున్నారని తెలిసింది. యీళని తీసికెల్లిన మేనేజరు కనపడక, డబ్బులు సెటిలవ్వక రాలేక పోయేనని మాత్రం కబురొచ్చింది. కొడుకు మాత్రం తిరిగి రాలేదు.
ఒక్కసారిగా మేఘం గర్జించింది. ఎక్కడో పిడుగు పడినట్టే వుంది. ఆ శబ్దంతోపాటు ‘గర్ గర్’ మని శబ్దం రావడంతో అటు చూసేడు ముసిలోడు. మనవడు రేడియోతో ఆడుకుంటున్నాడు. అప్పుడెప్పుడో కొన్న రేడియో, మొన్న సంతలో బేటరీలు కొని తెచ్చేరు. రాటకి వేలాడ దీసిన దాన్ని అందుకుని మరి ఆడుకుంటున్నాడు. వొద్దన్నా వినకుండా.
వాన కురుస్తూనే వుంది.
పాకముందు ‘పావకోళ్ళ’తో రెండు కాళ్ళు కనిపించేయి.
”ఓరె బాబు వున్నాల్రా ?” వినపడింది ఎజ్జోరు గొంతు.
”రా మామా” లోపలికి పిలిచింది కోడలు.
బద్దల గిడుగుతో లోపలికి దూరి పావకోలిప్పేడు, బద్దల గిడుగు పక్కన పెట్టేడు.
”ఏటీ వాన ? తల్లికి కోపమొచ్చింది గాల” అని గడపలో కుంపటి ముందు కూర్చున్నారు. ”ఎలాగుందిరా ?” అడిగేడు.
” లేదు” వణుకుతూ చెప్పేడు
”ఎలగ తగ్గుతాది రా… ? నేను ‘కానికు’ సూడకుండా ? తల్లికి దూపమెయ్యకుండా, మొక్కులు మొక్కకండా ఎలగ తగ్గుతాదిరా.. ?” అంటూ ముసిలోడి మంచం ముందు కూర్చున్నాడు. చేటతో బియ్యం తెచ్చింది కోడలు. సట్టంతో నిప్పులు తెచ్చింది. అడవి గుగ్గిలం అందించింది. దీర్ఘాలు తీస్తూ రాగాలు పాడుతూ ఊగిపోతూ మంత్రాలు చదువుతున్నాడు ఎజ్జోడు. నిప్పుల్లో గుగ్గిలం ధూపం పట్టేడు. అప్పుడప్పుడూ ‘తుఫ్ తుఫ్’ మని ముసిలోడి మీదికి వుమ్ముతూ వూగిపోతున్నాడు. కోడలు కోడిపిల్ల అందించింది.
”అమ్మా.. తల్లీ.. మేమేటి తప్పు చేసినాము ?….
కోపమవకుండా సల్లగ సూడు…
నీమొక్కులన్ని తీరుస్తాము…
తినమ్మా… తిను… ” అంటూ
కోడలు కోడి మేపించింది. ఎజ్జోడు చెయ్యితో బియ్యం అందిస్తూ రాగాలు తీస్తున్నాడు. దేవతల పేర్లన్నీ జపిస్తున్నారు.
పొగ, ఇంటి నిండా ఊపిరాడని పొగ. ఎజ్జోడు మొలలో దోపిన ఆకు పొట్లం విప్పేడు. పసర మందుని మంత్రించి ఇళ్ళంతా రాసేడు. కోడిపిల్ల పీకను కోసి తూర్పువైపు తలని, పడమరవైపు మొండేన్ని వుంచి…” పొద్దు ములిగే లోపు జొర్రమొగ్గి సల్లగై పోవాల” అని ముసిలోడి తలమీద చెయ్యి ఆనించేడు. బేటలోని బియ్యం గింజల్ని మూటకట్టి బద్దల గిడుగు క్రింద దూరి బురదలో అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయేడు.
వాన కురుస్తూనే వుంది. ముంజూరు కింద గడపే కాదు, కొయ్యగోడలూ నాని మెత్తబడ్డాయి. కొండమీద వరద రాళ్ళు అక్కడక్కడా జారుతున్నాయి. పాక ఎదురుగా శాల బురద, పశువుల విసర్జనాలతో రొచ్చుకంపు కొడుతోంది. అమ్మ తాత చుట్ట కాల్సి వుమ్మి వూసిన చోటనే నిలబడి ముత్ర విసర్జన చేసి అక్కడే ఆడుకుంటున్నాడు. ఆ దుర్ఘంధాన్ని పోగొట్టటానికి గుగ్గిలం పొగ విశ్వ ప్రయత్నం చేస్తోంది.
కోడలు గిన్నెతో టెంకపిండంబలి అందించింది ముసిలోడికి. నోట్లోని చుట్ట ఆర్పి ముంజూరు నీరుతో చెయ్యి కడిగేడు. కాళ్ళూ కడిగేడు. పాదం మీద రసి కారుతున్న పుండునీ కడిగేడు. పుండులోన కదులుతున్న పురుగునీ కడిగేడు. గిన్నెముందు సత్తు గ్లాసుతో నీళ్ళందించింది. ఆ నీళ్ళు చెలమ వూటలోనివి. అంత వానలో బురద అయిన నీల్ళని కునిడలో నీళ్ళుతెచ్చి ఇండిప్పిక్క అరగదీసి కలిపిన నీళ్ళు, బురదంతా అడుగుచేరి తేటగా మారిన నీళ్ళవి. అంబలి తాగి ముసిలోడు మంచమెక్కి దుప్పట్లో దూరిపోయేడు.
పింటుగాడు ఆడుకుంటూన్న రేడియోలోంచి ‘మంచి పోషక విలువలు గల ఆహారం’ అనే అంశం మీద డాక్టరుగారి ప్రసంగం వినవస్తోంది. ఈదురుగాలి రివ్వున వీచింది. బలిసిరికి చినుకులు విసురుగా గడపలోకి రాలేయి.
కొండమీద ఒంటరిపాక. చుట్టూ దట్టమైన అడవి, ఎటు చూసినా కొండలు అలలు అలలుగా.
ఎక్కడో దూరంగా వూరు. అక్కడికి అడవిదారి గుండా గంట నడిస్తేగాని రాని సంతవూరు. కొండమీద పంట, సంతరోజు అమ్మకపోతే తీరని అవసరాలు. ఇలాంటి వాన రోజైతే సంతే కూడదు.
పొద్దు ములిగి పోయిందేమో ఇంట్లోని వస్తువులు మసక మసకగా కనపడుతున్నాయి. రాతిరి కోసం కోడలు దుంపల్ని కడుగుతుండగా ముసిలోడు భళ్ళున వాంతి చేసుకున్నాడు. ఆపైన విసర్జనమూ చేసుకున్నాడు మంచంమ్మీదే. ఇల్లునీ, మంచాన్ని శుభ్రం చేసింది కోడలు.
వాన లాగే వాంతులూ.. విరేచనాలు.
కోడలు వెలిగించిన కిరసనాయిలు బుడ్డీ కొనఊపిరితో కొట్టుకుంటోంది. డోరి కట్టి ముసిలోడిని కొండ దించుతుండగా…
పింటుగాడి చేతిలోని రేడియోలోంచి వార్తలు ”చంద్రయాన్ శాస్త్రవేత్తల ఘన విజయం, మనం చంద్రుడి మీద నివసించే రోజు ఎంతో దూరం లేదని ప్రకటన”.
October 9th, 2010 at 5:58 am
గొప్ప ఆదివాసుల జీవిత చిత్రణ
October 10th, 2010 at 10:40 pm
జగదీష్ గారూ ! బాగున్నారా !
ఆదీవాసీల దైనందిన జీవితాన్ని ఈ కథలో చక్కగా చిత్రీకరించారు. అభినందనలు !!