Oct2010
వెలుగమ్మ
గస పోసుకుంటూ రోడ్డు పొంటి దబ్బదబ్బ నడుస్తున్నది వెలుగమ్మ.పెయ్యంతా చెమటతోని తానం చేసినట్ళట్లు అయ్యింది. ఆ డాక్టరమ్మ ఈపారన్న ఉంటదో ఉండదో, బిడ్డకు పొద్దులు. ఇగ ఏ నిమిసంలనన్న కనెటట్లె ఉన్నది. పీహెచ్సీ సెంటర్లగా కమల డాక్టారమ్మ ఉంటెగింటె బిడ్డకు దిలాస. లేకుంటే గా సిస్టరమ్మ గూడంగ మంచిగనే చేస్తది కాన్పు. గామె లేకుంటె ఊర్లె మంత్రసాని ఉండనే ఉన్నది ఏమొ ..మొన్నగా కుమ్మరోల్ల రాజయ్య బిడ్డకు మస్తు రక్తం పోయిందంట… గా పొల్లకు కుట్లెయ్యినీకి దవాఖానాకు కొంటబోయెటాల్లకు సచ్చేపోయిందంట. పెయిల రక్తం సానా పోయిందంట మల్ల గింత అయినంక తను జేపిత్తదా గా మంత్రాసానితోని? తనకు ఒక్తె బిడ్డ . ఏమన్నకానీ దవఖానాలనే చేపిచ్చాల కాన్పు. గని గా డాక్టరమ్మ ఉండాలె గదా? పంద్ర దినాలకు ఒక్కసారి వస్తది దవాఖానకు.. వచ్చి దస్తఖత్ చేస్తది. జీతం తీస్కుంటుంది. అక్కడున్నోల్ల నోర్లు మెదపకుంట ఒక్కోల్లకు వంద రూపాలిస్తది. తన జీతం ఇరవై వెయిలు తీస్కుంటుంది. మల్ల మహినల్ (నెలలో ) ఒగటి రెండుసార్లె ముఖం చూపిస్తది. కడ్మదినాలంత సిటీల ఆమె సంత దవాఖాన, ఇంద్రభవనం తీరుగ ఉంటది. అన్లనే కూసుంటది ఆమె పెన్మిటి గూడంగా డాక్టరే. కొడుకూ డాక్టరె అమెరికల సద్వుతడు. ఈ యాడాది సిటీ కచ్చేసి ఆల్ల దవఖాన చూస్కుంటడంట.
డాక్టరమ్మ అచ్చినపుడుల్ల పెద్ద కార్ల వస్తది. ఈడ నౌఖరి మానెయ్యది. గని జీతం కావాల ఆమెకు తన సంత దవఖాన తరక్కీనే ముక్కెం. ఈడ ఊర్లె జనం ఏమైన గానీ పట్టది ఆమెకు. దీనేశం పాడుగానూ… మొన్న రెన్నెలకింద గా సాలోల్ల కృష్ణ బిడ్డకు నీరంతపొయ్యి ఆప్రేషన్ అవసరమైతే గీ డాక్టరమ్మ రానేలేదు. కడ్పులబిడ్డ సచ్చె, తల్లీ సచ్చే పెద్దలొల్లి.ఊల్లె సంఘపోల్లు సచ్చిన పీన్గెలను తీస్కపోయి ధర్నా చేస్తే.. పోలీసులు ధర్న చేసినోల్లనే బగ్గ కొట్టి ఠాణాల ఏసిన్రు… నాయం అట్లుంది. ఏం కాలం? ఏం కాలం …ఈ కాలంకు అగ్గిదగల. ఊరంతా కరువు దాపరించి పైవేటుల కర్సుకు ఎరిసి, ఈ సర్కారు దవాఖానలకస్తే ఈడ ఇట్ల ఆ డాక్టరమ్మ అరెస్టే గాలే, రాణోలే ఇంటికిపోయ్యింది.
హమ్మఁ దవాఖాన వచ్చింది.అగొ సిస్టరమ్మ గూడ కానచ్చే “ఓ సిస్టరమ్మ డాక్టరమ్మేమన్న వచ్చిందా”? అని ఆడ్గింది వెలుగమ్మ , ఆగి నిలవడి దమ్ము తీస్కుంట . ” రాలే …. రేపొస్తది రేపు రాపో అన్నది అప్పడ్దంక కాంపౌండరుతోని ముచ్చట్లాడుతున్న సిస్టరమ్మ.
“సయీగ వస్తద? పోయినారం గూడ వస్తదనే అంటివి రాకనే పాయె. నీకెరుక గద బిడ్డ పొద్దుల్ల ఉన్నది. ‘పోనీ జర నువ్వన్న జూడరాదు నీ కాల్మొక్త ” అంటనే వెలుగమ్మ సిస్టరును బత్మలాడ బట్టింది.
“ఏ పో. గా డాక్టరమ్మకే లేంది నేనెందుకు సూడాల పో.. పో జర్రయితే సారొస్తడు ఏంది లొల్లి ఫో ” అన్నది సిస్టరు కసుర్కుంట.
” నీ, గీ డాక్టరమ్మ కంటే గీమె రెండింతలున్నది” అనుఉంట “ఒగ ఇరవై ఇచ్చుకుంట జర్ర రారాదు బిడ్డ ” అన్నది. వెలుగమ్మ ఆశతోని చూస్కొంట ” య్యెహె, పో ఇర్వై ఇస్తదంట మొఖానికి ” అన్నది సిస్టర్ కోపంతోని. ఓ సి దీనేశం పాడుగాను, పోతే మాయె ” అన్కుంట ముప్ఫై ఐదు ఇస్త రా బిడ్డ, జర్ర చూడు , గరీబు దాన్ని అన్నది వెలుగమ్మ బతిమిలాడుకుంటానే. సిస్టరమ్మ ఏదో కనికరించినట్లు వెలుగమ్మను పైనించి కిందకు జూస్త ” ఒస్త తియ్యి, డ్యూటీ కెల్లి వచ్చేటప్పుడు ఆడంగ వస్త ” అన్నది. ‘నీ బాంచెను జల్దిరా బిడ్డా’అనుకుంట వెలుగమ్మ వెనక్కి తిరిగి ఇంటి దారి పట్టింది..
లంజెలు మంది డబ్బుకి మస్తు ఆశ వీటికి అని పైకే తిట్టుకుంట మళ్ళీ నడుస్త నడుస్త గీ దవఖానలు ఊరికి గింత దూరం కట్టుడెందుకో అన్కుంది వెలుగమ్మ. అప్పన్దాంక ఇరామం లేకుండ నడ్చిందేమో – మస్తు దూప అయ్యింది వెలుగమ్మకు. ఎంత నడిచిన గని ఒగ బాయి కానస్త లేదు. ఒక కుంట లేదు అన్నెండి పోయినయ్ . ఇండ్ల పొంటి సిన్న పోరగాళ్ళు, ముసలోల్లె అగుపిస్తున్నరు. ఆల్లనేం అడ్గుతం నీల్లు. అయినగని దూపకు తాలక గౌండ్లోల్ల పొల్లను, “ఓ పోరీ గిన్ని నీల్లిస్తవ” అనడింగింది వెలుగమ్మ. గా పిల్ల సేతులు తిప్పకుంట, ” లెవ్వు మా యమ్మ ఇయ్యదన్నది” అన్నది.”అయ్యో’ అన్కున్నది వెలుగమ్మ. అవ్ మల్ల మూడు దినాలసంది తాగ నీల్లు రాలె.. ఈ దినమే అచ్చినయ్ ఎట్లిస్తరు ఎవరైన గని” అనుకున్నది.అట్లే నడువ బట్టింది మద్దెల మద్దెల చిన్న చిన్న దుక్నాలు వస్తన్నయ్, అన్ల ఐదు రూపాయల కోకోకోలాలు – పెప్సీల సీసాలు కానస్తున్నయ్. ఒక దుక్నం ముంగట నిలబడి ‘ ఓ పిలగా జరిన్ని నీల్లియ్యి దూప అయితున్నది’ అన్నది వెలుగమ్మ. నీల్లు లెవ్వు జరంత పెప్సీ తాగ రాదే పెద్దమ్మ దూపార్తది ” అన్నడు గా పిలగాడు ” నీల్లిమ్మంటే పెప్సి ఇస్తనంటవు మంచి పిలగానివే ” అనుకుంటా.. ఇగ ఇంటికి పొయ్యె నీల్లు తాగాల అన్కుంట సడక్ దాటింది. అక్కడ గమ్లోల్ల దుక్నం ఉన్నది ఆడికి పొయ్యి ” ఏమి సామి బువ్వ తిన్నవా… గిన్ని నీల్లుంటే ఇయ్యరాదు ” అన్నది వెలుగమ్మ ” ఒక రూపాయిచ్చి నీల పాకెటు తీసుకో పో “ అన్నడు గా గమ్లోల్ల పోరడు.
” ఏం జేత్తం తియ్యి మన చెర్వుల నీల్లు పాకెట్లు నింపి, ఐసు గడ్డల నడ్మ పెట్టి మాకే అమ్ముతావుర కొడక ఏం జేస్తం తియ్యి ఇదో నీ రూపా తీస్కో ” నీల్లు కొనుక్కుని తాగబడ్తిమి ఏం జేత్తం కరువుకాలం” అనుకుంట వెలుగమ్మ ఆత్రంగ నీల్లపాకెటు అందుకున్నది ఆమండు టెండల. ఆ నీల్లు చప్పగ, చేదుగ అన్పించినయ్. రెండు గుక్కలన్న తాగక ఊసేస్త గివ్వేం నీల్లు పిల్లగా పైసలిచ్చినగాని రూచొస్తలేవు”అనుకుంటా బిడ్డకు మందులు కొనాల్నని మందుల దుక్నం వైపు వెళ్ళింది వెలుగమ్మ. అది మందుల దుక్నమా? కిరాన షాపులనే కొన్ని మందులు పెడ్తడు. ” గీ మందులు సిటీలనే దొర్కుతయ్ ఈడలెవ్వు ఫో “ అన్నడు ఆ పిల్లగాడు. “పోరగా నీ దుక్నంల కూలుడింకులు,ఐసుడబ్బాలు,ఐసుఫ్రూటులు,సీన్మరేకులు దొర్కుతయ్ గని, పానం నిలిపే మందులు దొర్కవారా, ఇసిత్రం పోన్తియ్, రేపు రామునే దెమ్మంటే అయిపాయె ” అనుకుంట దబ్బ దబ్బ నడుస్త వెలుగమ్మ ఇంటికొచ్చి పడ్డది.
బిడ్డ మునుక్కుంట మంచంల పన్నది చూసి అయ్యో తల్లి అన్కుంట ” కళమ్మ, సిస్టరిస్తాందే జరలేచి కూచో బిడ్డా” అన్నది ముంతల నీళ్లు ముంచుకుని గుట గుట తాగుత. కళమ్మ అటు ఇటు మెసిలింది గని లెవ్వలేదు. కడుపుల నొస్తున్నదే అమ్మ ” అన్కుంట అట్లనే పన్నది, ఎట్లైన బిడ్డ కాన్పు మంచిగ చెయ్యాల. చేతిల కొడ్కుతోని పైలంగ అత్తోరింటికి పంపాలె. నా బిడ్డకు ఏ కష్టం రానియ్యకు పోచమ్మ తల్లి ” అంటు వెలుగమ్మ రెండు చేతులు గాలిల లేపి దండం పెట్టింది. ఇంతల వెలుగమ్మ పెన్మింటి రాజుగౌడు వచ్చిండు తాల్లు దీస్కుని. ” ఆకలైతాంది జర్ర బువ్వ పెట్టు . జొన్న రొట్టెలున్నయా లెవ్వా… కళమ్మా తిన్నదా లేదా” అన్నడు .” ఉన్నయ్ గని పోయి జర స్తానం జేసిరా తిందువు ” అన్నది వెలుగమ్మ పెద్దర్వాజ కెల్లి చూస్కుంటు. ” పిలగాడింక రాకపాయె.. ఏందో ఏమో ఈ మద్దెన వీని పోకడలు ఏం మంచిగ లెవ్వు. సిటీల ఈ యాడాది కాలేజీల షరీక్ జేస్తే గా సిటీ పోరెల్లెక్క తయారైతాండు. తన తీరు కొడ్కు తాళ్లెక్కద్దు, కల్లమ్మద్దని, కూల్నాలికి పోవద్దని తండ్రి ఒక్కతీరు కష్టపడుతున్నడు. ఎట్లైన కష్టం చేసి కాలేజీ చద్వులు చద్విపియ్యల్నని పైసలన్ని ఆనికే కర్సు పెడ్తాండు. ఏవేవో రంగు రంగుల అంగీలు, అవ్విట్ని టీ షర్టులంటరంట. పెద్ద గోనె సంచులసుంటి పైంటులు , పీకలకు ఏవో గొల్సుల్లాంటివి పిచ్చి దండలు, కుక్క బొచ్చు తీరంగా బాలు దువ్వుకొనుడు, కండ్లకు రంగుటద్దాలు చేత్లకు పెద్ద గడారం… ఏసమేసినా గంగి రెద్దు తీరంగనే పొతడు………. “పాడు బస్సుల ఎవలు పోతారు ? మా దోస్తులంతా హీరో ఓండా మీనస్తరు. నాక్కూడా బండి కొనియ్యి అని ఆల్ల నాయనను చంపుక తింటాండు దినాం. మొన్న కాల్లకు గవ్వేవో కాలేజీ పోరగాల్లేసే బూడ్సలంట జత పదిహేనొందలు కావాల్నని … ఇస్తర సస్తర ఇవ్వన్నీ ఇవ్వంది సద్వెందుకు సద్విస్తరంటడు. గట్లనే మూడు వెయిలు చేసే సెల్లు ఫోను భీ కావాలె అది అందరితాన ఉన్నది కాలీజీల నాతానే లేదని…. నిన్నటి కెల్లి అన్నమె ముడ్తలేడు. రోజూ గారెడ్డోల్ల దుక్నం పోవాల, గా కూలుడ్రింకులు దోస్తులతోని తాగాల, గా పిచ్చి పాటలు ఇనాల, గంటలు గంటలు, ” ఇంటికాడ టూషన్లు చెప్పర కొడక కొన్ని పైసలన్న చేత్ల పడ్తయ్ అంటే “ఛత్ నా దోస్తులముంగట నా ఇజ్జత్ ఖచేర్ అయితది” అంటడు. సీన్మలకు గూడంగ మస్తు మరిగిండు వచ్చిన సినిమా మొదటి ఆటకే పోయితీరాల. వెలుగమ్మ బుగులు తోని కొడుకు గురించిన ఆలోశనల్ల పడ్డది. ఇంతట్ల కొడుకొచ్చిన సపుడయ్యింది ‘పోన్తీయ్యు తండ్రి కొడూకులిద్దరు ఒక్కపారి తింటరు’ అనుకుంట తల్లెలు రెండు పెట్టింది. ” రార నాయ్న బువ్వ తిందువు అంది ” నాకేమద్దు నాకొక ఐదువేలిస్తేనే తింట లేకపోతే లేదు బూట్లు లేక, చెప్పులేస్కుని నా ఇజ్జత్ పోతున్నది… బూట్లు , సెల్లు కొనాల అంతే” అన్కుంట తన మిద్దెలకి(కమ్ర) ఎల్లిపోయిండు.
మొన్ననే ఎన్మిదొందలు పెట్టి గడారం కొంటివి. ఇంగప్పుడే బూడ్సులు – సెల్లు ఫోన్ అంటే ఏడి కెల్లి తెద్దును ? మనకు ఏమన్న ఆముసం (ఆస్థి) కుంటలకు కుంటలు భూములున్నయ్యా? యాపారం ఉన్నదా? రెక్కలకష్టం మీనే బత్కుతుంటిమి ఐదేళ్ళు సంది ఆనలే లేక యవసాయం బందైంది. అయినగని నీ కాలేజీ ఫీసులకు మీ నాయ్న ఒక ఎకరం అమ్మిండాలేదా ? అంత పెద్దోల్లు సద్వుకునే పైవేటు కాలేజీ ఒద్దనంగ ఇన్నవ ? ఆడికి వచ్చినోళ్ళు మస్తు పైసలున్నాలు. పెయ్యి మీదకు వేల రూపాల ఖర్చుతోనే వస్తరు. ఆల్లకు లచ్చలు – కోట్లుంటయ్ కొడకా- ఆల్ల కున్నయ్యన్ని నీకు కావాలంటే ఎట్లర ? మంచిగ సర్కారు కాలేజీల చద్వమంటే ఇనకపోతివి… అయిన గని అమ్మ – అయ్య కష్టం కన్పిస్తలేదారా రాము నీకు ? అక్కకు కాన్పు టైమయ్యింది. జర పైసల గురించి ఆలోసన చెయ్యవు గానీ. పైసల కోసానకు సంపుతాన్నవ్. లేర రాము నామాటిని బువ్వ తిను అక్కకు పానం బాగలేదు’ అని కొడుకుని బత్మిలాడబట్టింది గా కొడ్కు లెవ్వలె , రాలె.
” ఇగ రా.. నాకు ఒడ్డియ్యు తిన్నోల్లకు పెట్టాలె” రాజు గౌడు అర్వబట్టిండు. ‘ఇగొచ్చె’ ‘ ఇగొచ్చె ‘ అనుకుంట వెలుగమ్మ పొయ్యింట్లకు ఉర్కింది.
మర్సటి దినం గూడ రాము అన్నం తినకుండ తన పంతం నెగ్గించుకున్నడు రాజు గౌడు అక్కడిక్కడ అప్పు చేసి బూడ్సులకు వెయ్యి ఇచ్చిండు. సెల్లు ఫోను అచ్చేనెల ఇప్పిస్తాపో అన్నడు దీన్ని ఇరవై వెయిలు పొసి గా కాలీజీల చద్వించుడు తప్పే చేసిన అనుకున్నడు రాజు గౌడు . రాము బూడ్సులు కొనుక్కున్నడు. అటెన్క డిస్కోథెక్కుల మెంబరయ్యిండు. ఇక ఒక సెల్లు ఫోన్, హీరో హూండా చేతికస్తే తను కూడ కాలీజీ పోరగాండ్ల లెక్క పోరీలను ఎన్క కూసోబెట్కోనీ జామాయించి , సిటీల తరగొచ్చు అనుకున్నడు ఖుషీతోని . అవ్వి గూడస్తయ్ ఎట్లన్న జేసి సంపాయించాల అనుకున్నడు.
***********************************
కష్టం మీన సిటీకి తీస్కపోయి డాక్టరమ్మకు చూపిచ్చింది కళమ్మను వెలుగమ్మ.. ” కొంచెం పొట్టిగుంది కద, పెద్దాపరేషని అయ్యెటట్లే ఉన్నది వచ్చెనల జేస్తా ఒక ఇరవై వెయిలు జమ జేస్కొ వెలుగమ్మ ” అన్నది డాక్టరమ్మ ” అంతైతదా డాక్టరమ్మ చేతిల పైసలెవ్వు మరి మన ఊరిదవఖానాలనే కాన్పు చేస్తే ఏం పాయె నీకు? అన్నది వెలుగమ్మ. ఏమైతే అదైతది అడ్గుదం తియ్యి అనుకుంది.
అక్కడ బేహాస్ డాక్టరు ( మత్తిచ్చే దాక్టర్ ) రాడమ్మ టైముకు. మల్ల బిడ్డ అడ్డం తిర్గితే కష్టం కద. మా దవాఖానల ఎప్పుడంటే అప్పుడు కాన్పు చేయచ్చు సోంచాయించుకో మల్ల ” అన్నది డాక్టరమ్మ నవ్వుకుంట ఉన్న పైసలతోని కొన్ని మందులు కొని, మిగిలినయ్ అటెన్క కొందం అన్కుని బిడ్డను పట్కొని బయలెల్లింది ఊర్లెకుగని. వచ్చేనెల అంటే ఇంక ఇరవై రొజులే ఉన్నయ్ ఎట్లనో ఏమో అని పరేషానైతున్నది
****************************************
అక్కడిక్కడ అప్పులు చేసి ఒక ముప్ఫై వెయిలు జమ చేస్త్కున్నరు రాజు గౌడు – వెలుగమ్మలు. ఎండని జూడలే వానని జూడలె వెలుగమ్మ ఒక్క తీరుగ కల్లమ్మింది గుట్టలెంట పుట్టలెంట తిర్గి తిర్గి కల్లమ్ముడు, కైకులు పోవుడు, ఆపని, ఈ పని అని చూడకుండా అన్ని తీర్ణ పనులు చేస్త్కుంటచ్చిన్రు మొగుడు పెళ్ళాలు. ఆకర్ని పెయిమీదున్న బంగారం, ఎండి అమ్మింది , పోతే పోయే ఒక్కతే బిడ్ద అనుకుంట.
*********************************
“చూడు వెలుగమ్మ ఇరవై వేలదంక అయితయ్ అని నీకు ముందుగాల్నే సెప్పిన, మరిప్పుడూ లెవ్వంటే ఎట్ల?” డాక్టరమ్మ కోపంతోని అంటున్నది . ” అగో డాక్టరమ్మ ఇంట్ల పైసలు ఇంట్లనే మాయమయినయ్ .. దొంగతనం అయినయ్ కడ్పుల బిడ్డ అడ్డం పడ్డది అంటివి.. పైసలు ఎక్కడ పోవు తియ్యు ముందుగల్ల బిడ్డను బత్కియ్యు నీ పైసలు పువ్వుల్ల పెట్టిస్త ” నొప్పుల తోని ఆయాస పడ్తున్న కళమ్మను ఊకో , ఊకో బిడ్డ అన్కుంట కండ్ల పొంటి నీల్లు కార్తంటే అడిగింది వెలుగమ్మ – డాక్టరమ్మ కాల్లమీంద పడింది. రాజు గౌడు పైసల కోసం మల్ల ఊర్లేకు ఉరికిండు.
” లేదు నన్నింక సతాయించకు – పైన ధియేటర్ల ఆపరేషన్ చెయ్యాల పొయ్యి పైసలు తీస్కరా.. తీస్కస్తనే కళమ్మకు ఆపరేషను చేస్త లేకపొతే లేదు” అని డాక్టరమ్మ పైకెళ్ళిపోయింది.
” గీ టైం ల మన ఊరి దవాఖానల ఉండాలె గీమె ఇంతనీల్గుతున్నది ” వెలుగమ్మ అత్త ఎంకమ్మ ఒర్లింది కోపంతోని. ఒక గంట సేపు కళమ్మ నొప్పులు పడ్తనే ఉంది . డాక్టరమ్మ రాలేదు.
******************************************
ఈ లోపల కళమ్మకు నొప్పులెక్కువైనయ్. వెలుగమ్మ బిడ్డను చూస్తూ తాయిమాయి అయితున్నది . ఇంతట్లో అక్కడకు నర్సు వచ్చింది వెలుగమ్మ దగ్గరకు. ” నీ బిడ్డ మెళ్ళ ఉన్న పుస్తెల తాడు, కమ్మలు, కాళ్ల కడాలు తీసి డాక్టరమ్మకి ఇస్తివంటే ఆపరేషను చేస్తదంట.. నీకు చెప్పమన్నది…… పైన ఆపరేషన్ అయిపోయింది. జల్ది చెప్పు అన్నది నర్సు…. నొప్పులు పడతానే కళమ్మ ..”అమ్మో మా అత్త ఇంటికి రానియ్యదు నేనియ్య “అన్నది. భయంతోని మీ నాయన ఊర్లొకు పోయిండు బిడ్డ… వస్తనే ఉంటడు…ఈ లోపట గా సొమ్ములు ఇచ్చెయ్యి ముదనష్టపుది.. ఇంత బేదిల్ గయ్యింది మనిషి సచ్చిపోతాన్న గని.. కనికరంలేదు.. అస్సలు మీ డాక్టరమ్మ గీ టైం ల మా ఊర్ల సర్కారు దవాఖానల ఢ్యూటీ చేస్తుండాల గింత నీల్గుతున్నది – బిడ్డా సోంచాయించే .. కనీళ్ళతోని వెలుగమ్మ బిడ్డను వేడుకుంటుంది.
ఇంతట్ల డాక్టరమ్మ కిందకొచ్చి ” ఏం ఆలోచించినవు ? అన్కుంట సమాధానం కోసం కూడ చూడకుంట లోపల్కి పోయి బేహష్ డాక్టరుతోని మాట్లాడుతు నగులాడత చాయ్ తాగబట్టింది . అరుస్తా ఏడుస్తా ఇంతట్ల నొప్పులు మరింత ఎక్కయినాయి. కళమ్మ, “అమ్మ ఓపలేనే” అన్నది. ఇంక చాతకాలే. ” సొమ్ములిచ్చేయ్” అంట కళమ్మ కాళ్ళు చేతులు తప్పతప్ప నేలకేసి కొట్టబట్టింది . వెలుగమ్మ గాబరతొని డాక్టరమ్మని పిలువు అని నర్సుతోని అనుకుంట… పిల్ల సొమ్ములు ఒలిచి నర్సుకి ఇస్తనే ఉంది. కళమ్మ బిర్రున కట్టెతీరు ఒగిసి పోయ్యి, పెద్ద మూలుగు దీసి నోట్లకెల్లి నురగ వస్తనే ఉంది, పానాలు విడిచింది, అమ్మ ..అన్కుంటానే. వెలుగమ్మకు సమజయ్యింది బిడ్డ సచ్చిపోయిందని. నోట్ల మాట రాకుంట పిచ్చిదాని తీరు చూస్త చేరింది. నర్సు ….. డాక్టరు బయటకు వచ్చి .. పీన్గని తీస్కపొమ్మని చెప్తుంటె వెలుగమ్మ హోష్ లకొచ్చి ‘ నా బిడ్డను సంపినవ్ కదనే రాచ్ఛసి ” అన్కుంట డాక్టరమ్మ మీనకు ఉర్కింది. ఇంతట్ల నర్సు అడ్డంవచ్చి డాక్టరమ్మను లోపట్కి ఈడ్చుకుపొయ్యి తలుపేసింది. వెలుగమ్మ దబ్బున కూలబడి – బిడ్డను పట్కోని ఏడుస్తనే ఉన్నది. అక్కడ ఊర్లే రాజు గౌడ్ ఇంకా పైసల కోసం మందిని అడుగుతనే ఉన్నడు పిసోని తీరు…. తిర్గుతనె ఉన్నడు.
ఇక్కడ సిటీల రాము కొత్తగ కొనుక్కున్న హీరొ హూండాను బుర్రుమని చాల్ చేస్త పబ్ దిక్కు హూండాను ఉరికించిండు . వాని జేబుల సెల్ ఫోన్ ‘కాంటాలగే’ అన్కుంట మోగింది.
November 11th, 2010 at 11:43 am
వెలుగమ్మ కి్ పేరు లో తప్ప జీవితం లో రవ్వంత వెలుగు లేకపాయె!కధ చాలా బరువు గా ఉండి చెప్పలేనంత బాధని కలిగించింది.మంచి కధ ని అందించిన గీతాంజలి కి అభినందనలు!
November 28th, 2010 at 5:58 pm
Very nice and realistic story.. Many thanks to Geethanjali…
December 5th, 2010 at 11:17 am
ఎన్నొ చెప్పాలని,ఎమొ చెయ్యాలని వున్నా ఎమి చేతగాక ………..