Oct2010
యుద్ధ చిత్రాల ఎన్‌సైక్లోపీడియా – ఎనిమీ ఎట్ ది గేట్స్
ఒకే ఒక్క తూటా చరిత్రనే మార్చివేస్తుంది.
(A single bullet can change history.)
ఇదీ.. ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’ అనే సినిమా మనకు చెప్పే యుద్ధ సూత్రం. దీన్ని తెలుగులో మక్కీకి మక్కీగా చెప్పాలంటే ‘ముంగిట్లో శత్రువు’ అని అనువదించవచ్చు. రెండో ప్రవంచ యుద్ధ చరిత్రను మలుపు తిప్పిన చారిత్రక యుద్ద ఘటనల్లో ఒకటి స్టాలిన్‌గ్రాడ్ ముట్టడి. నాటి సోవియట్ అధినేత స్టాలిన్ పేరుమీద నిర్మించబడ్డ ఈ నగరంపై హిట్లర్ సైన్యం జరిపిన భీకర దాడి, రెండు మహా శక్తివంతమైన దేశాల ఆత్మగౌరవ పరిరక్షణకు నాంది పలికింది. స్టాలిన్ గ్రాడ్ నగరం ఇప్పడు ఓల్గా గ్రాడ్ అనే పాత పేరు తగిలించుకుంది.
ప్రతి ఘటననూ, ప్రతి చలనాన్ని తేలిగ్గా తీసుకునే పౌరజీవితానికి, కదిలే ఆకును కూడా అనుమానించవలసిన సైనిక జీవితానికి మధ్య గల వ్యత్యాసమేమిటో స్టాలిన్ గ్రాడ్ ముట్టడి అత్యద్భుతంగా చాటిచెప్పింది. పౌర జీవితంలో మనం ఎలా ఉన్నా ఫరవాలేదు. మన కళ్లముందు ఏం జరుగుతున్నా, పట్టించుకోకున్నా ఫరవాలేదు.
కాని సైనిక జీవితం అలాంటి ఏమరుపాటుకు, ఒకే ఒక క్షణకాలం పాటు నిర్లక్ష్యానికి గురయితే ఏమవుతుందో మనందరికీ తెలుసు, ఒక దంతేవాడ అవుతుంది. నెల క్రితం అక్కడేం జరిగిందో మనకందరికీ తెలుసు. ఇది ప్రభుత్వ సాయుధ బలగాలకు, తిరుగుబాటు శక్తులకూ కూడా వర్తించే సరిసమాన సూత్రం. సరిగ్గా ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’ సినిమా కూడా ఈ విషయాన్నే మరో విధంగా ప్రపంచానికి చూపించింది. ఒకే ఒక్క పొరపాటు వంద విజయాలను నీ నుంచి దూరం చేస్తుంది. ఒకే ఒక్క తూటా మొత్తం యుద్ద చరిత్రనే మార్చి వేస్తుంది.
దాదాపు 70 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనలను సైనిక జీవితం సాక్షిగా మహాద్భుతంగా చిత్రించిన సినిమా ఎనిమీ ఎట్ ద్ గేట్స్. -అలాగని హాలీవుడ్ పైత్యానికి ఈ సినిమా మినహాయింపు కాదు- ఈ విషయం తర్వాత చూద్దాం.
1973లో విలియం క్రెయిగ్ రాసిన ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’ పుస్తకం శీర్షికను ఈ సినిమా టైటిల్‌గా తీసుకున్నారు. 1942-43 సంవత్సరాల్లో స్టాలిన్ గ్రాడ్ యుద్దరంగంలో జరిగిన వివిధ ఘటనలను రచయిత ఈ పుస్తకంలో పొందుపర్చారు. ప్రపంచ యుద్ద కాలంలో సోవియట్ ఆత్మకు ప్రతీకగా నిలిచిన స్టాలిన్ గ్రాడ్ ముట్టడిలో ఇరుదేశాలకు చెందిన ఇద్దరు స్నైపర్ల -గురికాళ్లు- మధ్య జరిగిన పోరు ఈ నవల కథాంశం.
ప్రధానంగా క్రెయిగ్ రాసిన పుస్తకం,మరోవేపు పాక్షికంగా ‘వార్ ఆఫ్ ది రాట్స్’ అనే పుస్తకం ఈ సినిమాకు మూలం. మనందరికీ సినిమా పేరు ‘ఎనిమీ ఎట్ గేట్స్’ గానే తెలిసినా, పదేళ్ల క్రితం యూరప్‌లో తొలిసారిగా ఈ సినిమాను ‘స్టాలిన్ గ్రాడ్’ పేరుతో విడుదల చేశారు. యూరప్‌ను స్టాలిన్ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది మరి..!
మాతృదేశ పరిరక్షణకు బలిదానాలకు సిద్దం కమ్మంటూ నాటి మహానేత జోసెఫ్ స్టాలిన్ యుద్ద పిలుపును అందుకుని దేశం నలుమూలలనుంచి వచ్చిన సోవియట్ యువతీ యువకుల ధీరగాధకు ప్రతిరూపం వాసిలీ జైట్సెవ్. అతడి ప్రత్యర్థి జర్మన్ స్నైపర్ మేజర్ ఎర్విన్ కోనిగ్. మొత్తం సినిమా అంతా ఈ ఇద్దరు మేటి గురికాళ్ల మద్య అలుపెరుగని పోరు చుట్టూనే తిరిగింది.
స్టాలిన్ గ్రాడ్ నగరాన్ని పట్టుకుంటే సోవియట్ యూనియన్‌నే పట్టుకున్నట్లుగా ప్రచారం చేసి చరిత్రలో కనీవినీ ఎరుగని భీకరదాడికి పాల్పడిన నాజీ జర్మనీ, చివరకు సోవియట్ యువత మహా సంకల్పం ముందు తలవంచింది ఇక్కడే. ఈ ఉక్కునగరమే జర్మనీ అంతానికి నాందిపలికిన ఘటనలకు సాక్షీభూతంగా నిలిచింది.
21వ శతాబ్ది తొలి యుద్ధ చిత్రం
21వ శతాబ్దంలో హాలీవుడ్ తీసిన అతి గొప్ప యుద్ధసినిమాలలో తొలి చిత్రం ఎనిమీ ఎట్ ది గేట్స్. నటీనటుల అత్యద్భుత ప్రదర్శన, దానితో పోటీ పడిన స్క్రిప్ట్, ప్రపంచవ్యాప్తంగా సకల వర్గాల ప్రజలపై అది వేసిన ప్రభావం ఈ సినిమాను కొత్త శతాబ్దిలో చిత్రపరిశ్రమ తీసిన గొప్ప యుద్ధ చిత్రంగా నిలిపింది.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1942లో స్టాలిన్‌గ్రాడ్‌లో జరిగిన యుద్ధ ఘటనలను మళ్లీ మన ముందు ప్రదర్శించడంలో ఈ సినిమా పెరల్ హార్బర్‌తోనే పోటీ పడింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జూడ్ లా, జోసెఫ్ ఫెన్నిస్, రాచెల్ వేస్జ్, ఎడ్ హారిస్, బాబ్ హోస్కిన్స్ తదితర నటీనటులు నాటి ఘటనలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో నూటికి నూరు శాతం కృషి చేసారు.
ఒక యుద్ధ సినిమా మొదటి షాట్ నుంచి పతాక సన్నివేశం దాకా ఎక్కడా టెంపో కోల్పోకుండా ఉద్విగ్నభరితంగా రూపొందటం ఇటీవలి కాలంలో ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. సోవియట్ గురికాడు జూడ్ లా, జర్మనీ స్నైపర్ హారిస్ తెరపై అత్యద్బుతంగా పండించిన మానసిక యుద్ధ క్రీడా విన్యాసాలు, ఒకరిపై ఒకరు గెలుపు సాధించడానికి వేసిన ఎత్తులు యుద్ధచిత్రాలలోనే తలమానికంగా నిలిపాయి.
ప్రపంచ స్థాయి చదరంగ క్రీడాకారులు గ్రాండ్ ప్రైజ్ కోసం వేసే అమోఘమైన ఎత్తులను ఈ సినిమాలోని దృశ్యాలు తలపిస్తాయి. ఒకరిని ఒకరు దెబ్బతీయడంలో, అధిగమించడంలో ఈ ఇద్దరు గురికాళ్లు పన్నిన వ్యూహాలూ, ఎత్తుగడలు సినిమాల్లో ఉత్కంఠకు కొత్త నిర్వచనమిచ్చాయి. పైగా యుద్ద సినిమాలో త్రికోణ ప్రేమ. ఇది హాలీవుడ్ పైత్యానికి పరాకాష్టగా నిలిచినా చిత్రవిజయంలో తన వంతు పాత్ర పోషించింది.
ఏ సినిమా విజయానికైనా సంభాషణలు ఎంత ముఖ్యమో తెలియని విషయం కాదు. ఈ సినిమాలో డైలాగుల స్తానంలో మనం హావభావాలను చూసి ఉద్వేగానికి, ఉత్కంఠకు గురవుతాం. గురిచూసి కాల్చే ఇద్దరు స్నైపర్ల మధ్య మాటలేముంటాయి? ప్రత్యర్ధి కదలికలను కనిపెట్టడంలో వారి ముఖాలు వెలువరించే హావభావాలు తప్ప మాటలేం ఉంటాయి?
క్షణక్షణం రగులుతున్న కసితో వారి ముఖాల్లో వ్యక్తమయ్యే శిలాసదృశ హావభావాలే ఈ సినిమా, ప్రపంచానికి ఏం చెప్పదలుచు కుందో అత్యంత స్పష్టంగా చూపిస్తాయి. మనం సినిమా చూసి బయటకు వచ్చాక కూడా చాలా కాలం మనల్ని వెంటాడే దృశ్యాలు ఈ ఇద్దరు గురికాళ్ల మధ్య వెలువడే హావ భావాలే. విజయానికి, తలవంచడానికి మధ్య తేడా ఏమిటో మనం వీరి హావభావాలను చూసే తెలుసుకోవచ్చు. ఇరువర్గాల మధ్య, ఇరు దేశాల మధ్య వాస్తవ యుద్దంకంటే మానసిక యుద్దం ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందో ఎనిమీ ఎట్ ది గేట్స్ చూస్తే సులభంగా అర్థమవుతుంది మనకు.
ఈ సినిమాలోని కొన్ని అంశాలు, దర్శకుడి దృక్పధానికి అనుగుణంగా తీసిన దృశ్యాలు తీవ్ర వివాదాస్పదం కావచ్చు. సోవియట్ వ్యవస్థ కాఠిన్యాన్ని చూపించడంలో సినిమా ప్రదర్శించిన అతి దృశ్యాలు అభ్యంతరకరంగానే ఉండవచ్చు కానీ చరిత్రలో జరిగిన ఒక మహా యుద్ధ దృశ్యాలు, హీరోలు, స్నైపర్లు, యుద్ధవిమానాలు, శతఘ్నులు, భీకర దృశ్యాలు, నేరాలు, హింస, నాయకత్వ ప్రతిభ, త్యాగం, అంతిమంగా విజయం వంటి దృశ్యాల పరంపర మన కళ్లముందు ఒకటొకటిగా కదలిపోతున్నప్పుడు దీన్ని యుద్ధ సినిమాల ఎన్‌సైక్లోపీడియా అని చెప్పవచ్చు.
ఈ సినిమా ప్రధానంగా వస్సీలీ జైట్సెవ్ అనే రష్యా దేశపు నిరక్షరాస్యుడి సాహస గాథ చుట్టూ తిరుగుతుంది. ఇతడు రష్యాలోని ఓ పశువుల కాపరి కుటుంబానికి చెందినవాడు. తాత వద్ద పెరిగే జైట్సెవ్ మందుగుండుకు కొరత ఏర్పడిన నేపధ్యంలో గుండు వృధా కాకుండా ఒకే షాట్‌తో క్రూరజంతువులను చంపగిలిగే అమోఘమైన గురిని తాత వద్దనుంచి నేర్చుకుంటాడు. గ్రామీణ అవసరాలనుంచి నేర్చుకున్న ఆ గురి అతనికి ఎంత నిర్దిష్టంగా అలవడిందంటే స్వల్పకాలంలోనే అతడి పేరు యావత్ సోవియట్ యూనియన్ వ్యాప్తంగా మారుమోగిపోయింది.
ఆకస్మికంగా, అనూహ్యంగా సోవియట్లపై నాజీలు దాడి చేసి సగం దేశంలోకి దూసుకు వచ్చిన నేపథ్యంలో శత్రువును అడ్డుకోవడానికి దేశం నలుమూలలనుంచి లక్షలాది యువతీ యువకులు రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగబడ్డారు. వారిలో మన గొర్రెల కాపరి ఒకడు. ఇలా కొత్తగా రిక్రూట్ అయిన వారిలో అసంఖ్యాకులు స్టాలిన్ గ్రాడ నగరంలో నాజీల ముందంజను అడ్డుకోవడానికి రెడార్మీ పన్నిన వ్యూహంలో భాగమయ్యారు.
నెపోలియన్ నుంచి హిట్లర్ దాకా…
స్టాలిన్ గ్రాడ్ పట్టణం విముక్తికోసం ఏడునెలల పాటు కొనసాగిన భీకర యుద్ధంలో దాదాపు 15 లక్షల మంది సోవియట్ యువతీ యువకులు ఆహుతయ్యారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు మించి రక్తపాతం జరిగిన పోరాటం మరోటి లేదు. అంతవరకు రెండో ప్రపంచ యుద్దంలో నాజీ హిట్లర్ సైన్యం సాధించిన తిరుగులేని విజయాల పరంపరకు సోవియట్ యువత చేసిన ఈ బలిదానం చెక్ పెట్టింది.
అది హిట్లర్ సైన్యం రెండో ప్రపంచ యుద్దంలో ఎదుర్కొన్న తొలి పరాజయం. అంతేకాదు యూరప్ ఖండంలో నాజీల ముందంజను, పురోగమనాన్ని అడ్డుకున్న తొలి ఘటన స్టాలిన్ గ్రాడ్ ముట్టడే నాంది పలికింది. అంతవరకు అపజయమెరుగని నాజీలు స్టాలిన్ గ్రాడ్‌లో ఘోరఓటమితో తిరుగుబాట పట్టారు. సరిగ్గా అప్పటికి 140 ఏళ్ల క్రితం ప్రపంచ ప్రఖ్యాత యుద్ద వీరుడు నెపోలియన్ సేనలను మాస్కో వరకు రప్పించి ఎదురు దెబ్బకొట్టి అతడి విజయాల చరిత్రకు అంతం పలికిన చరిత్ర రష్యాకు ఉంది.
స్టాలిన్ గ్రాడ్ ముట్టడి ఈసారి హిట్లర్‌కు చెక్ పెట్టింది. గెరిల్లా యుద్ధవ్యూహంతో స్టాలిన్ గ్రాడ్ నుంచి నాజీసైన్యాలను పారదోలిన సోవియట్ యువత, ఎర్రసేన అచిరకాలంలోనే నాజీలను రష్యానుంచి తరిమివేయడమే కాక జర్మన్ రాజధాని బెర్లిన్ వరకు విజయయాత్రకు దారితీశాయి. దీంతో సరిగ్గా రెండేళ్ల వ్యవధిలో ప్రపంచ యుద్దం ముగిసింది. నాజీ నియంత హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అంతిమపరాజయానికి స్టాలిన్ గ్రాడ్ ముట్టడిలోనే బీజం పడటం విశేషం.
ఈ అద్వితీయ చరిత్రలో వస్సిలీ జైట్సేవ్ కూడా ఓ భాగస్వామి. ఎర్రసైన్యంలో అతి చిన్న స్థాయిలో పనిచేసే ఈ సామాన్యుడి సైనిక జీవితంలో అనూహ్యంగా జరిగిన ఓ ఘటనతో యావద్దేశం అతడి పేరు మారుమోగింది. నగరంలో నాజీలు ముందంజవేస్తున్న దశలో, సోవియట్ సైన్యం శత్రుసైన్యం దాడికి పిట్టలు పిట్టలుగా రాలిపోతున్న కాలంలో కేవలం ఐదు గుండ్లు మిగిలున్న రైఫిల్‌తో ఐదుమంది జర్మన్ సైన్యాధికారులను మాటువేసి క్షణాల్లో మట్టుబెట్టిన గురికాడు జైట్సేవ్.
స్నైపర్‌గా ఈ గొర్రెల కాపరి అద్భుత ప్రతిభను కళ్లారా గమనించి నివ్వెరపోయిన సోవియట్ అధికారి అతడి సాహసిక చర్య గురించి సోవియట్ సైనిక అధికారిక పత్రికల్లో విస్తృతంగా ప్రచురించడంతో జైత్సేవ్ ఒకే ఒక్క రాత్రిలో సోవియట్ హీరో అయిపోయాడు. అప్పటినుంచి అతడి జైత్రయాత్ర మొదలయ్యింది. స్టాలిన్ గ్రాడ్‌లో తిష్టవేసి ఉన్న జర్మన్ అధికారులను మట్టుబెట్టే బాధ్యతను తీసుకున్న జైత్సేవ్ 1942 నవంబర్ 10 నుండి డిసెంబర్ 17 మధ్యకాలంలో 225మంది జెర్మన్ సైనికులను మాటువేసి చంపాడు. యుద్దానంతరం సోవియట్ సైన్యం అత్యున్నత మెడల్ ఆర్డర్ ఆఫ్ లెనిన్ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇంత విధ్వంసానికి కారకుడైన ఈ మనకాలంవీరుడిని ఎదుర్కోవడానికి నాజీలు తమవంతుగా ఓ జర్మన్ స్నైపర్‌ని రంగంలోకి దింపుతారు. స్టాలిన్ గ్రాడ్‌లో విజయానికి, పరాజయానికి మధ్య వారధులు ఈ ఇద్దరు గురికాళ్లు. ఎర్రసేన, నాజీల సైనికాధిపత్యానికి, నైపుణ్యానికి ప్రతీకలుగా నిలిచారు వీళ్లు.
4 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు
November 16th, 2010 at 2:36 am
మీరు పొందుపరిచిన సమాచార0 నాకె0తొ
November 20th, 2010 at 2:29 am
అభినందనలు.
ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in
January 8th, 2011 at 10:49 am
చాలా బాగున్నది
February 7th, 2011 at 8:24 am
బాగుంది…… రాజుగారు.
—-వెన్నెలకంటి